Harvard University Study: Know What Makes Us Happy In Life Whcih Helps Us Live Longer - Sakshi
Sakshi News home page

Happy & Long Life Secret: మనిషికి నిత్యం సంతోషాన్నిచ్చేది ఏంటి? ఆ సంబంధాలతోనే ఆనందకరమైన జీవితం

Published Thu, Jul 13 2023 9:56 AM | Last Updated on Thu, Jul 13 2023 11:20 AM

Harvard University Study: Know What Makes Us Happy In Life Whcih Helps Us Live Longer - Sakshi

-దొడ్డ శ్రీనివాస్‌రెడ్డి 
మనిషి సంతోషదాయకమైన జీవితం గడిపేందుకు కారణమయ్యే అంశం ఏమై ఉంటుందనే మీమాంసకు సమాధానం వెదికేందుకు 1938లో హార్వర్డ్‌ యూనివర్సిటీ ‘హర్వర్డ్‌ స్టడీ ఆఫ్‌ అడల్ట్‌ డెవలప్‌మెంట్‌’ పేరిట పరిశోధనా ప్రాజెక్టు మొదలుపెట్టింది. వందలాది మంది జీవితాలను దశాబ్దాలు పరిశీలిస్తూనే ఉంది. మనిషి జీవన విధానంపై ప్రపంచంలో అత్యంత సుదీర్ఘకాలం సాగిన ఈ పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే.. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో మనకు ఉన్న సంబంధాలే మన మానసిక ఆరోగ్యానికి, తద్వారా శారీరక ఆరోగ్యానికి దోహదపడుతుంది. 

మనిషికి నిత్యంసంతోషాన్నిచ్చేది ఏంటి?
ఈ ప్రశ్నకు సమాధానం కోసం తరతరాలుగా అన్వేషణ సాగుతూనే ఉంది. మనిషికి నిత్యం సంతోషాన్నిచ్చేది ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం కోసం తరతరాలుగా అన్వేషణ సాగుతూనే ఉంది. తత్వవేత్తల నుంచి యోగుల వరకూ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ప్రయత్నించారు. యోగం, భోగం నిరంతరంగా ఆనందాన్ని ఇవ్వలేవు. ధనం, పదవి, హోదా వంటివి కూడా ఎప్పటికీ మనిషిని ఆనందదాయకంగా ఉంచలేవనేది అందరూ అంగీకరించే విషయమే.

మరి ఏ అంశం మనిషిని నిత్య సంతోషిగా మార్చగలదు? దీనికి సమాధానం కనుగొనేందుకు హార్వర్డ్‌ యూనివర్సిటీ దశాబ్దాలుగా పరిశోధన చేస్తోంది. ఒకప్పుడు ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక సంక్షోభం–గ్రేట్‌ డిప్రెషన్‌ కాలంలో మొదలై, ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి తర్వాతి కాలం దాకా కొనసాగిన ఈ పరిశోధన.. తమ చుట్టూ ఉన్నవారితో కొనసాగే ఆరోగ్యకరమైన సంబంధాలే మనిషి ఆనందకరమైన జీవితం సాగించడానికి దోహదపడుతుందని తేల్చింది.  

సత్సంబంధాలే కొలమానం 
ఒంటరితనం మనిషిని కుంగదీస్తుందని.. ఆరోగ్యకరమైన సంఘ జీవనం మానసిక, శారీరక ఆరోగ్యాన్నిస్తుందని అధ్యయనానికి నేతృత్వం వహిస్తున్న హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ మానసిక శాస్త్రం ప్రొఫెసర్‌ రాబర్ట్‌ వాల్డింగర్‌ అంటున్నారు. మనిషి తన చుట్టూ అల్లుకున్న ఆరోగ్యకర బంధాల ఫలితంగా సంతోషకరమైన జీవితాన్ని నిరంతరంగా కొనసాగిస్తాడని పేర్కొన్నారు. తమ పరిశోధన ఫలితాలపై 2015లో వాల్టింగర్‌ చేసిన ‘టెడ్‌ టాక్‌’ ప్రసంగాన్ని ఇప్పటివరకు నాలుగున్నర కోట్ల మంది వీక్షించడం గమనార్హం. హార్వర్డ్‌ మాత్రమే కాకుండా ఐక్యరాజ్యసమితి సహా అనేక సంస్థలు నిర్వహించిన పరిశోధనల్లో కూడా మనిషికి తన కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో ఉన్న సత్సంబంధాలే మానసిక, శారీరక ఆరోగ్యానికి కొలమానాలు కాగలవని తేలింది.

మనిషి తన 50వ ప్రాయంలో చుట్టూ ఉన్న అనుబంధాల పట్ల ఎంత సంతృప్తితో ఉన్నాడనేదే అతడి శారీరక ఆరోగ్యానికి కూడా కొలమానం కాగలదని, కొలెస్టాల్‌ స్థాయి కాదని పరిశోధకులు అంటున్నారు. కోవిడ్‌ తదనంతర కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ఇతరులపట్ల సహానుభూతి స్థాయి పెరగడం సంతోషకర పరిణామమని ఐక్యరాజ్యసమితి సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ సొల్యూషన్స్‌ నెట్‌వర్క్‌ తాజా నివేదిక పేర్కొంది. ఇతరుల పట్ల సహానుభూతి, అపరిచితులపట్ల సానుభూతి స్థాయి ప్రపంచవ్యాప్తంగా 2021 నుంచీ పెరుగుతూ వస్తోందని వరల్డ్‌ హ్యాపీనెస్‌ రిపోర్టుకు రూపకల్పన చేసినవారిలో ఒకరైన జాన్‌ హెల్లీవెల్‌ అన్నారు. 
చదవండి: చైనాను అధిగమించి.. దూసుకెళ్తున్నారు..

మిస్టర్‌ సంతోషి!
ప్రపంచం మొత్తంలో అత్యంత సంతోషకర జీవితం గడుపుతున్న వ్యక్తి ఎవరనే విషయం తేల్చడానికి విస్కాన్‌సిన్‌ యూనివర్సిటీ 12 ఏళ్లపాటు పరిశోధించి మాథ్యూ రికార్ట్‌ అనే బౌద్ధ భిక్షువును ఎంపిక చేసింది. మాలిక్యులర్‌ జెనెటిక్స్‌లో పీహెచ్‌డీ చేసిన మాథ్యూ తదనంతరం బౌద్ధ భిక్షువుగా మారారు. వర్సిటీ శాస్త్రవేత్తలు మాథ్యూ రికార్ట్‌ తలకు 256 సెన్సర్లను తగిలించి వివిధ అంశాలపై పరిశోధన చేశారు. ఆయన మెదడు అధిక స్థాయిలో గామా తరంగాలను ఉత్పత్తి చేస్తోందని కనుగొన్నారు.

మాథ్యూ మెదడు ఎటువంటి ప్రతికూల భావనలకు చోటు ఇవ్వకుండా ఎల్లప్పుడూ సానుకూల ధోరణిలో ఉండేట్టు చేస్తోందని వెల్లడించారు. ‘‘ఎల్లప్పుడూ నేనే, నాదే అనే భావన.. ప్రపంచంలో ఇతర అంశాలన్నింటి పట్లా శత్రు భావనను రేకెత్తిస్తుంది. మనిషిని నిత్యం అలజడిలో ఉంచుతుంది. అదే ఇతరుల పట్ల సహానుభూతి పెంచుకుంటూ ఉంటే మానసిక ఆరోగ్యం తద్వారా శారీరక ఆరోగ్యం ఇనుమడిస్తుంది.’’ అని మాథ్యూ రికార్ట్‌ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 

ఆనంద నిలయం ఫిన్‌లాండ్‌ 
ఫిన్‌లాండ్‌ ప్రపంచంలో అత్యంత సంతోషకర దేశంగా వరుసగా ఆరోసారి ఎంపికైంది. పౌరుల జీవన విధానం ఆధారంగా అమెరికాకు చెందిన గాలప్‌ సంస్థ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఫిన్‌లాండ్‌ మొదటిస్థానంలో నిలవగా.. దాని పొరుగు దేశాలు డెన్మార్క్, ఐస్‌లాండ్, స్వీడన్, నార్వే తదుపరి స్థానాల్లో ఉన్నాయి. ఆరోగ్యకర జీవితం, సగటు ఆదాయం, సామాజిక భద్రత, అవినీతి రహితం, సహానుభూతి, తమ జీవితానికి సంబంధించి నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ పౌరులకు ఉండటం వంటి అంశాలు/లక్షణాల ఆధారంగా దేశాలకు ర్యాంకులు ఇచ్చినట్టు గాలప్‌ సంస్థ వెల్లడించింది.

ఐక్యరాజ్యసమితి ఏటా విడుదల చేసే హ్యపీనెస్‌ ఇండెక్స్‌ కూడా ఫిన్‌లాండ్‌ను అత్యంత సంతోషకర దేశంగా పేర్కొంది. ఫిన్‌లాండ్‌ పౌరుల మధ్య ఆర్థిక అసమానతలు అతి తక్కువ స్థాయిలో ఉండటం, ప్రభుత్వం పట్ల విశ్వాసం ఉండటం కూడా ప్రజల మధ్య సయోధ్య ఎక్కువ స్థాయిలో ఉందని పేర్కొంది.
చదవండి: టాపర్లంతా క్యాంపస్‌ కాలేజీలకే..

ఆనందాల హార్మోన్లు 
మనిషి ఆనందాన్ని మరింత ఇనుమడింపజేయడానికి శరీరం పలు రకాల హార్మోన్లను (రసాయనాలను) విడుదల చేస్తుంది. వాటిలో నాలుగు ముఖ్యమైన హారోన్ల గురించి తెలుసుకుందాం. 

డోపమైన్‌: మెదడులో ఉత్పత్తి అయి శరీరమంతా వ్యాపించే డోపమైన్‌ హార్మోన్‌ గుండె కొట్టుకోవడాన్ని, రక్తపోటును నియంత్రించడంతోపాటు మూత్రపిండాల పనితీరునూ మెరుగుపరుస్తుంది. మంచి భోజనం చేసిన తరువాత, ఏదైనా లక్ష్యాన్ని సాధించినప్పుడు, గమ్యాన్ని చేరుకున్నప్పుడు మనలో కలిగే ఆనందం, సంతృప్తికి ఈ డోపమైనే కారణం. 

సెరటోనిన్‌: శాస్త్రవేత్తలు ‘హ్యాపీనెస్‌ కెమికల్‌’గా పిలిచే ఈ హార్మోన్‌ మనిషి మెదడు, పేగులలో ఉత్పత్తి అవుతుంది. కేంద్ర నాడీ మండలమంతా వ్యాపిస్తుంది. సంఘజీవి అయిన మనిషి నలుగురి మధ్య సంతోషంగా సమయం గడుపుతున్న వేళ ఈ సెరటోనిన్‌ ఉత్పత్తి పెరిగి సంతోషకర అనుభూతిని మరింత పెంచుతుంది. దీని స్థాయి పెరిగే కొద్దీ మనిషిలో సంతృప్తి, ఆనందం, ఆత్మ నిర్భరత స్థాయి కూడా పెరుగుతూ ఉంటుంది. 

ఆక్సిటోసిన్‌: మనిషిలో ప్రశాంతతను, భద్రతను విశ్వాసాన్ని కలిగించడంలో ప్రేరకంగా పనిచేసే ఆక్సిటోసిన్‌.. ఆత్మీయత, అనుబంధాలనూ పెంపొందించేందుకు దోహదపడుతుంది. అయినవారిని ఆలింగనం చేసుకున్నప్పుడు, ఆత్మీయులతో అనుబంధాలు పంచుకునేప్పుడు విడుదలయ్యే ఈ ఆక్సిటోసిన్‌ దీర్ఘకాలంపాటు మనిషిని సంతోషంగా ఉండేలా చేస్తుంది. 

ఎండార్ఫిన్‌: మత్తు మందులా పనిచేసే ఎండార్ఫిన్‌ శరీరంలోని నాడీ మండలం, పిట్యుటరీ గ్రంథిలో ఉత్పత్తి అవుతుంది. ప్రధానంగా నొప్పి నుంచి ఉపశమనం కోసం తయారయ్యే ఈ హార్మోన్‌ సంతోషం, సంతృప్తికి కూడా కారణమవుతుంది. ఆహారం తీసుకున్నాక, వ్యాయామం చేశాక, ఇష్టమైన పానీయాలు తీసుకున్నప్పుడు విడుదలయ్యే ఎండార్ఫిన్‌.. మనిషిలో ఆత్మ నిర్భరతను పెంచడం, ఒత్తిడిని తగ్గించడం, బరువును తగ్గించడానికీ తోడ్పడుతుంది. ఎండారి్ఫన్‌ హార్మోన్‌ స్థాయి పెంచుకోవాలంటే.. ఇష్టమైన పాటకు డ్యాన్స్‌ చేయడం, సుగంధాలను ఆస్వాదించడం, ఇష్టమైన ఆహారాన్ని తీసుకోవడం వంటివి చేయాలి.  

నవ్వుల క్వాకా.. టెడ్డీ బేర్‌ వంటి మొహంతో ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉన్నట్టు కనిపించే క్వాకాకు ప్రపంచ పౌరులు అత్యంత సంతోషకర జీవిగా ముద్రవేశారు. సాధారణ పిల్లి పరిమాణంలో ఎలుకను పోలినట్టుగా ఉండే ఈ క్వాకా నిజానికి కంగారూల జాతికి చెందినది. ఆ్రస్టేలియా పశి్చమ తీరానికి దగ్గరగా ఉండే రెండు దీవులు రాట్‌నెస్ట్, బాల్ట్‌ ఐలాండ్‌లలో మాత్రమే ఈ క్వాకాలు జీవిస్తున్నాయి. మనుషులతో సన్నిహితంగా మెదిలే ఈ జీవి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులకు ప్రీతిపాత్రమైంది. క్వాకాతో సెల్ఫీ దిగేందుకు వేలాదిమంది పర్యాటకులు ఏటా ఈ దీవులను సందర్శిస్తుంటారు. ‘#సెల్ఫీ విత్‌ క్వాకా’ అనేది ట్రెండ్‌గా మారింది. క్వాకాల సంఖ్య పదివేలలోపే ఉండటంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం వాటి సంరక్షణకు చర్యలు చేపట్టింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement