
హార్వర్డ్ యూనివర్సిటీ @ 380 ఏళ్లు
ప్రపంచంలోనే ప్రఖ్యాత విద్యా సంస్థ.. హార్వర్డ్ యూనివర్సిటీ. అమెరికాలో విద్యనభ్యసించాలని ఆశించే ప్రతి విద్యార్థి ప్రాధాన్య జాబితాలో మొదటి స్థానం హార్వర్డ్ యూనివర్సిటీదే అంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలోని అత్యున్నత విద్యా సంస్థలకు వివిధ సంస్థలు ఇచ్చే ర్యాంకింగ్స్‌లోనూ టాప్-5లో నిలుస్తోంది. హార్వర్డ్ యూనివర్సిటీ సెప్టెంబర్ 8, 1636లో ఏర్పడి ఇప్పటికి 380 ఏళ్లు పూర్తై నేపథ్యంలో యూనివర్సిటీ ప్రత్యేకతలు..
1636లోనే..
అమెరికాలో 1636లో కేంబ్రిడ్జ్ (మసాచుసెట్స్, యూఎస్)లో హార్వర్డ్ యూనివర్సిటీ ఏర్పడింది. ఉన్నత విద్యను అందించే యూనివర్సిటీల్లో అమెరికాలోనే ప్రాచీన యూ నివర్సిటీగా పేరు పొందింది. పుర్టియన్ మినిస్టర్.. జాన్ హార్వర్డ్.. యూనివర్సిటీ కోసం తన పుస్తకాలను, ఎస్టేట్‌లో సగ భాగాన్ని దానం చేశారు. ఆయన కృషికి గుర్తుగా హార్వర్డ్ యూనివర్సిటీ అని నామకరణం చేశారు.
20 వేలకు పైగా విద్యార్థులు
హార్వర్డ్ కాలేజీలో ప్రస్తుతం 6700 మంది వివిధ కోర్సులు అభ్యసిస్తున్నారు. వీరు కాకుండా గ్రాడ్యుయేషన్, ప్రొఫెషనల్ కోర్సులు చదివే విద్యార్థుల సంఖ్య 14,500. వివిధ విభాగాల్లో.. 2,400 మంది ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు.
కోర్సులెన్నో
హార్వర్డ్ యూనివర్సిటీలో 11 ప్రిన్సిపల్ అకడమిక్ యూనిట్స్, పది ఫ్యాకల్టీలు, రాడ్‌క్లిఫ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ ఉన్నాయి. పది ఫ్యాకల్టీల పరిధిలో ఓవర్‌సీస్ స్కూల్స్, డివిజన్స్ ఉన్నాయి. ఇవి యూజీ, పీజీ, డాక్టోరల్ స్టడీస్ కోర్సులను అందిస్తున్నాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీ..
హార్వర్డ్ యూనివర్సిటీ గ్రంథాలయం.. ప్రపంచంలోనే అతిపెద్దది. ఇక్కడ 2 కోట్లకు పైగా వ్యాల్యూమ్స్, 400 మిలియన్ల మ్యానుస్క్రిప్ట్స్, 10 మిలియన్ల ఫొటోగ్రాఫ్స్, 124 మిలియన్ల ఆర్కైవ్స్ వెబ్ పేజీలు, 5.4 టెరా బైట్స్.. డిజిటల్ ఆర్కైవ్స్ ఉన్నాయి. అందుకే హార్వర్డ్ విజ్ఞాన భాండాగారంగా విరాజిల్లుతోంది. లైబ్రరీ పర్యవేక్షణకే 800 మంది సిబ్బంది పనిచేస్తుండటం విశేషం.
విద్యనభ్యసించిన ప్రముఖులెందరో..
ప్రపంచంలో 201 దేశాల విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసించారు. ఇక్కడ చదువుకున్నవాళ్లలో 47 మంది ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతులు పొందారు. 32 మంది వివిధ దేశాలకు ప్రధానమంత్రులుగా, అధ్యక్షులుగా పనిచేశారు. 48 మంది పులిట్జర్ బహుమతులు అందుకున్నారు.
ర్యాంకుల్లోనూ హవా..
క్వాకరెల్లీ సైమండ్స్- 2016- 17 ర్యాంకుల్లో ప్రపంచంలోనే మూడో స్థానంలో హార్వర్‌డ నిలిచింది. 2015-16కు సంబంధించి ది టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్‌లో హార్వర్డ్‌కు ఆరో స్థానం లభించింది. సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో 2016కు మొదటి స్థానంలో నిలిచింది. అకడమిక్ ర్యాంకింగ్ ఆఫ్ వరల్డ్ యూనివర్సిటీస్ ర్యాంకుల్లోనూ మొదటి స్థానాన్ని దక్కించుకుంది.
వెబ్‌సైట్: www.harvard.edu