ఆమెను అందరూ టోనీ అని పిలుస్తారు. తల్లులు తమ పిల్లల్ని పక్కన నిలబెట్టుకుని, ఆమెతో సెల్ఫీలు తీసుకుంటారు. హాకర్లు ఆమె చేతికి బ్రేస్‌లెట్స్ బహుమానంగా తొడుగుతారు. చిత్రకారులు ఆమెను తమ కుంచెలతో గీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. ఆమే.. మారియా ఆంటోనియేటా ఆల్వా. పెరూ దేశపు 35 ఏళ్ల ఆర్థికమంత్రి.
ప్రపంచాన్ని కరోనా మహమ్మారి కబళిస్తున్న ప్రస్తుత విపత్కర సమయంలో పెరూలో చిరు వ్యాపారులకు, సాధారణ పౌరులకు ఆర్థికంగా ఎంతో చేయూతనిచ్చారు ఆల్వా. కిందటి అక్టోబర్‌లో పెరూ ఆర్థికమంత్రి అయ్యారు ఆల్వా. ఆ తర్వాత కొద్ది నెలలకే మిగతా దేశాలతో పాటు పెరూ కూడా లాక్‌డౌన్ ప్రకటించవలసి వచ్చింది. దాంతో లక్షల మంది దుకాణదారులు, రైతులు, తోపుడు బండ్ల వ్యాపారులు, ఏ పూటకు ఆ పూట సంపాదిస్తేనే కానీ కడుపు నిండని కూలీలపై ఆ ప్రభావం పడింది. పెరూలోని ఆర్థికవేత్తలతో చర్చించిన ఆల్వా, ‘పేదలకు ఆర్థిక సహాయం చేయటం, సబ్సిడీలు ఇవ్వటం, బ్యాంకు లోన్లు మాఫీ చేయటం’ వంటివి వెంట వెంటనే ఆచరణలో పెట్టారు. పెరూ చరిత్రలో ఇటువంటి సంస్కరణలు ఇంతవరకూ ఎన్నడూ జరగలేదు.
అయితే ఈ సంస్కరణల వల్ల ఆమె కుటుంబం ఆర్థికంగా లాభపడినట్లు సోషల్ మీడియాలో అనుమాన కథనాలు వచ్చాయి. అందుకు సమాధానంగా ఆల్వా, తన ఆర్థిక లావాదేవీలన్నీ ఆన్‌లైన్‌లో అందరికీ అందుబాటులో ఉన్నాయని ప్రకటించారు. విద్యార్థిగా ఉన్నప్పుడే సమాజంలోని పేదరికం, అసమానత్వం ఆల్వాను కలచివేశాయి. ఒక చారిటీ సంస్థను ప్రారంభించి, పేద విద్యార్థులు విశ్వవిద్యాలయంలో చదువుకునేందుకు ఆర్థికంగా సహాయపడ్డారు. ఆల్వా 2014లో పెరూవియన్ విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు. హార్వర్డ్ నుంచి స్కాలర్‌షిప్‌తో భారతదేశం వచ్చి రెండు నెలల పాటు ఇక్కడ బాలికలకు విద్యావకాశాలు ఎలా ఉన్నాయో ఒక పరిశోధన చేశారు. పెరూ తిరిగి వచ్చాక, విద్యాశాఖలో పనిచేశారు. ప్లానింగ్, బడ్జెట్ విభాగానికి నాయకత్వం వహించారు. ఆ క్రమంలోనే పెరూ ఆర్థికమంత్రి అయ్యారు. ‘‘నువ్వు ఎప్పటికైనా పెరూ అధ్యక్షురాలివి అవుతావు’’ అన్నారు ఆమె చదువుకున్న హార్వర్డ్ యూనివర్సిటీలోని ప్రొఫెసర్. అయితే ముందుగా ఆల్వా ఆర్థికమంత్రి అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment