నేడు పార్లమెంట్‌లో కొత్త ఆదాయపన్ను బిల్లు | Finance Minister Nirmala Sitharaman set to introduce the new Income Tax Bill 2025 in the Lok Sabha | Sakshi
Sakshi News home page

నేడు పార్లమెంట్‌లో కొత్త ఆదాయపన్ను బిల్లు

Published Thu, Feb 13 2025 10:10 AM | Last Updated on Thu, Feb 13 2025 10:27 AM

Finance Minister Nirmala Sitharaman set to introduce the new Income Tax Bill 2025 in the Lok Sabha

కేంద్ర ప్రభుత్వం గురువారం కొత్త ఆదాయపన్ను బిల్లును (ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ బిల్లు, 2025) లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ బిల్లును సమర్పించనున్నారు. ఇందులో ఎలాంటి కొత్త పన్నుల్లేవని ఇదివరకే స్పష్టం చేశారు. ఇది వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్‌), ఇతరులకు సంబంధించిన ఆదాయపన్ను ముసాయిదా చట్టం అని తెలిపారు. ఈ బిల్లు అర్థం చేసుకునేందుకు, ఆచరణకు సులభతరంగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.

కొత్త బిల్లు పన్ను చట్టాలను ఎలా సులభతరం చేస్తుంది?

  • కొత్త బిల్లులో ట్యాక్స్‌ ఇయర్‌ అనే పదాన్ని తీసుకొచ్చారు. టాక్స్ ఇయర్ అనేది నిర్దిష్ట ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను ప్రయోజనాల కోసం పరిగణించే 12 నెలల వ్యవధి. కొత్త ఆదాయపు పన్ను బిల్లు ప్రకారం ట్యాక్స్‌ ఇయర్‌ గతంలోలాగే ఏప్రిల్ 1న ప్రారంభమై మరుసటి ఏడాది మార్చి 31న ముగుస్తుంది. 1961 ఆదాయపు పన్ను చట్టంలో ఉపయోగించిన ‘ప్రివియస్‌ ఇయర్‌’, ‘అసెస్‌మెంట్‌ ఇయర్‌(మదింపు సంవత్సరం)’ స్థానంలో ఈ ట్యాక్స్‌ ఇయర్‌ను వాడనున్నారు.

  • స్థిరమైన ట్యాక్స్‌ ఇయర్‌ను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా పన్ను చెల్లింపుదారులు ఆదాయాన్ని నివేదించడానికి, పన్నులు చెల్లించడానికి నిర్దిష్ట వ్యవధిని కలిగి ఉంటారు. ఇది విభిన్న ఆర్థిక సంవత్సరాలకు వేర్వేరు అసెస్‌మెంట్‌ ఇయర్‌(మదింపు సంవత్సరం-వచ్చే ఆర్థిక సంవత్సరం)లను కలిగి ఉండటం వల్ల తలెత్తే గందరగోళాన్ని తొలగిస్తుంది.

  • పన్ను చెల్లింపుదారులు తమ బాధ్యతలను అర్థం చేసుకోవడానికి సులభమైన, స్పష్టమైన భాషను ఉపయోగించాలని కొత్త బిల్లు లక్ష్యంగా పెట్టుకుంది. ఏళ్ల తరబడి పేరుకుపోయిన కాలం చెల్లిన నిబంధనలు, వివరణలను తొలగించాలని నిర్ణయించారు.

  • పన్ను విధానాలకు సంబంధించి స్పష్టమైన నిర్వచనాలు, క్రమబద్ధమైన విధానాలతో కొత్త పన్ను చట్టాలు వివాదాలు, లిటిగేషన్లను తగ్గిస్తాయని భావిస్తున్నారు. దీనివల్ల మరింత పన్ను వసూలుకు వీలవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పన్నుకు సంబంధించి వివాదాలు తగ్గడం వల్ల న్యాయవ్యవస్థపై భారం తగ్గుతుందని చెబుతున్నారు.

  • తరచూ శాసన పరమైన సవరణలు అవసరం లేకుండా పన్ను పథకాలను ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ)కి ఎక్కువ అధికారాన్ని ఈ బిల్లు కల్పిస్తుంది.

ఇదీ చదవండి: హార్వర్డ్ యూనివర్సిటీలో నీతా అంబానీ ప్రసంగం

1961 నాటి చట్టం 880 పేజీలు, 298 సెక్షన్లు, 23 చాప్టర్లు, 14 షెడ్యూళ్లతో ఉంది. కొత్త బిల్లును 622 పేజీలకు కుదించారు. అదే సమయంలో సెక్షన్లను 526కు, షెడ్యూళ్లను 16కు పెంచారు. చాప్టర్లు 23గానే ఉన్నాయి.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement