► బడ్జెట్ వంటకం సిద్ధం
ఆర్థికమంత్రి... బడ్జెట్‌కు కర్త, కర్మ, క్రియ ఆయనే! బడ్జెట్‌పై విమర్శలైనా, మెచ్చుకోలు అయినా అన్నీ ఆయనకే చెందుతాయి. అయితే బడ్జెట్ రూపకల్పన ఈయన ఒక్కరే చేయరు. అనేక శాఖలు, అనేక మంది అధికారుల సుదీర్ఘ మథనం తర్వాత బడ్జెట్ వంటకం తయారవుతుంది. ఈసారి బడ్జెట్ వెనుక ఏయే శాఖలు, ఎవరెవరు అధికారులు ఉన్నారు? వారు ఎలాంటి పాత్ర పోషిస్తారు?
1.రెవెన్యూ కార్యదర్శి: డాక్టర్ హస్‌ముఖ్ అదియా. వివిధ శాఖల నుంచి ప్రభుత్వానికి ఆదాయం అందించడమే లక్ష్యంగా ఈయన పనిచేస్తారు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం(సీబీడీటీ), ఎక్సైజ్, కస్టమ్స్ విభాగం(సీబీఈసీ) కూడా ఈయన అధీనంలోనే ఉంటాయి. బడ్జెట్‌లో చాలామంది ఆసక్తిగా ఎదురుచూసే పన్ను (ట్యాక్స్) వ్యవహారాలన్నీ ఈయనే చూస్తారు. పన్నుల్లో ఎలాంటి మార్పుచేర్పులు చేయాలన్నా ఈయన నిర్ణయమే అత్యంత కీలకం.
2.ఆర్థిక శాఖ కార్యదర్శి: రతన్ పి వటల్. ఆర్థికశాఖలో వ్యయ విభాగానికి కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు. బడ్జెట్ తయారీలో మంత్రి, సహాయమంత్రి తర్వాత కీలకమైన వ్యక్తి. వాస్తవానికి బడ్జెట్ తయారీ ప్రక్రియ మొత్తం ఈయన కనుసన్నల్లోనే రూపుదిద్దుకుంటుంది. ఆదాయ, వ్యయాలు, శాఖలకు నిధుల కేటాయింపులు తదితర అంశాలను పర్యవేక్షిస్తారు.
3.ఆర్థిక సేవల కార్యదర్శి: అంజులి చిబ్ దుగ్గల్. బ్యాంకింగ్, బీమా రంగాల్లో విధానాలు, సంస్కరణల రూపకల్పన, వాటి అమలు బాధ్యతలను ఈమె చూస్తారు. బడ్జెట్‌లో ఈ రెండు రంగాలకు సంబంధించి వెలువడే విధానపర నిర్ణయాల వెనుక ఈమెదే ముఖ్య పాత్ర. వ్యవసాయ రుణాలు, బకాయిల వసూలు వంటి అంశాలను పర్యవేక్షిస్తారు.
4.ఆర్థిక శాఖ సహాయమంత్రి: జయంత్ సిన్హా. ఈయన ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి సాయంగా ఉంటూ ఆర్థికశాఖలోని వివిధ విభాగాల మధ్య సమన్వయ బాధ్యతలు చూస్తారు. బడ్జెట్ ప్రసంగం తయారీలో ఆర్థిక మంత్రికి తోడ్పడతారు.
5.ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి: శక్తికాంతదాస్. ఈయన వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమైన వారి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. ఆర్థికాభివృద్ధిని పరుగులు పెట్టించడానికి ఆర్‌బీఐతో సమన్వయం చేసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు పటిష్ట చర్యలు చేపడతారు.
6.పెట్టుబడుల ఉపసంహరణ కార్యదర్శి: నీరజ్ కుమార్ గు ప్తా. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల పరిస్థితులను దృష్టి లో ఉంచుకొని రా నున్న ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగాల్లో పెట్టుబడుల ఉపసంహరణల లక్ష్యాలను నిర్దేశిస్తారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సంస్థల్లో(సీపీఎస్‌ఈ) ప్రభుత్వ వాటాల ఉపసంహరణలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తారు.
7.ముఖ్య ఆర్థిక సలహాదారు: డాక్టర్ అరవింద్ సుబ్రమణియన్. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శితో కలిసి పనిచేస్తారు. దేశ ఆర్థిక పరిస్థితితోపాటు వ్యవసాయం నుంచి పారిశ్రామిక రంగం వరకు వివిధ రంగాల అభివృద్ధిపై ప్రభుత్వానికి కీలక నివేదిక ఇస్తారు. ప్రభుత్వ విధానాల అమలుకు పటిష్ట కార్యాచరణ రూపొందిస్తారు.
8.బడ్జెట్ సంయుక్త కార్యదర్శి: ప్రవీణ్ గోయల్. ఆర్థిక వ్యవహారాల విభాగం పరిధిలో పనిచేస్తారు. బడ్జెట్ తయారీ ప్రక్రియలో నోడల్ పాయింట్‌గా ఉంటారు. అన్ని విభాగాల కేటాయింపులు ఒక కొలిక్కి వచ్చాక కీలకమైన బడ్జెట్ పత్రాల ముద్రణ ఈయన పర్యవేక్షణలోనే జరుగుతుంది. అప్పుడప్పుడు ఆర్థికమంత్రి ప్రసంగం రూపకల్పనలో కూడా పాలుపంచుకుంటారు.
9.ముఖ్య సలహాదారు (కాస్ట్): అరుణా సేథి. దేశంలో ఇండియన్ కాస్ట్ అకౌంట్ సర్వీస్ విభాగానికి తొలి మహిళా అధినేత ఈమె. బడ్జెట్ తయారీలో తలెత్తే అనేక క్లిష్టమైన ఆర్థిక చిక్కుముడులకు ఈ విభాగమే పరి ష్కారం చూపుతుంది.
10.ఆర్థిక సలహాదారులు: వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు సంబంధించిన ప్రతినిధులుగా ఆర్థిక శాఖలో 34 మంది సలహాదారులుంటారు. ఆయా శాఖల బడ్జెట్ నిర్వహణపై సమీక్ష నిర్వహించి, మరింత మెరుగ్గా నిధులు వినియోగమయ్యేలా చూడటం వీరి బాధ్యత.