ఉద్దానంపై లోతుగా అధ్యయనం
- హార్వర్డ్ వర్సిటీ వైద్య నిపుణుల రాక
- త్వరలో రానున్న150 మంది వైద్యుల బృందం
పాత పోస్టాఫీసు (విశాఖ దక్షిణ): ఉద్దానం కిడ్నీ వ్యాధుల నివారణకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు శనివారం హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు అంతర్జాతీయ వైద్య నిపుణులు విశాఖకు వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు హార్వర్డ్ యూనివర్సిటీ నెఫ్రాలజీ విభాగంలో సేవలు అందిస్తున్న డాక్టర్ జోసెఫ్ బాస్‌వెంట్రీ, తెలుగు వ్యక్తి డాక్టర్ వెంకట్ సబ్బిశెట్టి వచ్చారు. గతంలో ఉద్దానం సమస్యపై పరిశోధనలు చేసిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉపకులపతి, కిడ్నీ వ్యాధుల నిపుణుడు డాక్టర్ టి.రవిరాజ్‌తో ఆంధ్ర వైద్య కళాశాలలో సమావేశమై ఉద్దానం కిడ్నీ వ్యాధుల సమస్యపై సుదీర్ఘంగా చర్చించారు.
అనంతరం ఆంధ్రవైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వి.సుధాకర్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో డాక్టర్ జోసెఫ్ మాట్లాడుతూ... ఉద్దానం ప్రాంతంలో ప్రజలు తాగే నీరు, తినే ఆహారం, జీవన విధానం, వాతావరణం, అధిక మోతాదులో ఉండే ఖనిజాల వివరాలను సేకరించి, అధ్యయనం చేయడంతో పాటు పూర్తి స్థాయిలో పరిశోధనలు చేపడతామని చెప్పారు. 150 మంది వైద్యుల బృందం ఉద్దానంలో పర్యటించి కిడ్నీ వ్యాధులకు మూలాలను కనిపెట్టి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని డాక్టర్ వెంకట్ సబ్బిశెట్టి చెప్పారు.