బోస్టన్: అమెరికాలోని బోస్టన్ నగరంలో వైద్యులు అరుదైన ఘనత సాధించారు. వైద్య రంగంలోనే అద్భుతాన్ని సృష్టించారు. తల్లిగర్భంలో ఉన్న 34 వారాల శిశువు(పిండం)కు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. శిశువు మెదడులో అపసవ్యంగా ఉన్న రక్తనాళాన్ని సర్జరీతో సరిచేశారు. ప్రపంచంలో ఈ తరహా సర్జరీ చేయడం ఇదే ప్రథమం. బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్, బ్రిఘామ్, ఉమెన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ సర్జరీ జరిగింది.
గర్భస్థ శిశువుల్లో అరుదుగా తలెత్తే ఈ వైకల్యాన్ని ‘వీనస్ ఆఫ్ గాలెన్ మాల్‌ఫార్మేషన్’ అంటారు. ఇలాంటి వైకల్యంతో జన్మించే శిశువులు మెదడులో గాయాలు, గుండె వైఫల్యం వంటి కారణాలతో మరణించే అవకాశం ఉంటుందని బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ రేడియాలజిస్ట్ డాక్టర్ డారెన్ ఒబ్రాచ్ చెప్పారు. మెదడు నుంచి గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళం అపసవ్యంగా ఏర్పడడమే గాలెన్ మాల్‌ఫార్మేషన్. దీనివల్ల రక్త ప్రవాహం నెమ్మదిస్తుంది.
ఫలితంగా రక్త పీడనం ఎక్కువై సిరలపై తీవ్ర ప్రభావం పడుతుంది. సిరలలో ఒత్తిడి కారణంగా మెదడు పెరుగుదల మందగిస్తుంది. కణజాలాలు దెబ్బతింటాయి. అంతేకాకుండా గుండె పనితీరు కూడా దెబ్బతినవచ్చు. గాలెన్ మాల్‌ఫార్మేషన్‌తో బాధపడుతున్న గర్భస్థ శిశువుల్లో 50 నుంచి 60 శాతం మంది పుట్టిన వెంటనే ఆరోగ్యం విషమిస్తుందని, వారు బతికే అవకాశాలు కేవలం 40 శాతం ఉంటాయని డారెన్ ఒబ్రాచ్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment