fetus baby
-
గర్భస్థ శిశువు మెదడుకు శస్త్రచికిత్స
బోస్టన్: అమెరికాలోని బోస్టన్ నగరంలో వైద్యులు అరుదైన ఘనత సాధించారు. వైద్య రంగంలోనే అద్భుతాన్ని సృష్టించారు. తల్లిగర్భంలో ఉన్న 34 వారాల శిశువు(పిండం)కు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. శిశువు మెదడులో అపసవ్యంగా ఉన్న రక్తనాళాన్ని సర్జరీతో సరిచేశారు. ప్రపంచంలో ఈ తరహా సర్జరీ చేయడం ఇదే ప్రథమం. బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్, బ్రిఘామ్, ఉమెన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ సర్జరీ జరిగింది. గర్భస్థ శిశువుల్లో అరుదుగా తలెత్తే ఈ వైకల్యాన్ని ‘వీనస్ ఆఫ్ గాలెన్ మాల్ఫార్మేషన్’ అంటారు. ఇలాంటి వైకల్యంతో జన్మించే శిశువులు మెదడులో గాయాలు, గుండె వైఫల్యం వంటి కారణాలతో మరణించే అవకాశం ఉంటుందని బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ రేడియాలజిస్ట్ డాక్టర్ డారెన్ ఒబ్రాచ్ చెప్పారు. మెదడు నుంచి గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళం అపసవ్యంగా ఏర్పడడమే గాలెన్ మాల్ఫార్మేషన్. దీనివల్ల రక్త ప్రవాహం నెమ్మదిస్తుంది. ఫలితంగా రక్త పీడనం ఎక్కువై సిరలపై తీవ్ర ప్రభావం పడుతుంది. సిరలలో ఒత్తిడి కారణంగా మెదడు పెరుగుదల మందగిస్తుంది. కణజాలాలు దెబ్బతింటాయి. అంతేకాకుండా గుండె పనితీరు కూడా దెబ్బతినవచ్చు. గాలెన్ మాల్ఫార్మేషన్తో బాధపడుతున్న గర్భస్థ శిశువుల్లో 50 నుంచి 60 శాతం మంది పుట్టిన వెంటనే ఆరోగ్యం విషమిస్తుందని, వారు బతికే అవకాశాలు కేవలం 40 శాతం ఉంటాయని డారెన్ ఒబ్రాచ్ వెల్లడించారు. -
రోడ్డుపై ఐదు నెలల పిండం
సాక్షి, అల్వాల్: నడి వీధిలో ఐదు నెలల పిండం పడేసిన ఘటన మచ్చబొల్లారం అంజనపూరి కాలనీలో గురువారం వెలుగు చూసింది. అంజనపురి కాలనీలోని రహదారి పక్కన పడిఉన్న పిండాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించినా ఎలాంటి ఆధారం లభించలేదు. రాత్రి సమయంలో వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. -
పుట్టకముందే పునర్జన్మ!
సాక్షి, హైదరాబాద్: తల్లి గర్భంలో ఉండగానే ఓ శిశువు గుండెకు కేర్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా చికిత్స చేశారు. మూసుకుపోయిన గుండె రక్తనాళాలను తెరిచి జన్మించకముందే పునర్జన్మ ప్ర సాదించారు. ఇలాంటి చికిత్స దేశంలోనే తొలిదని వైద్యులు తెలిపారు. బుధవారం హైదరాబాద్లోని బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో డాక్టర్ కె.నాగేశ్వరరావు, డాక్టర్ టీవీఎస్ గోపాల్, డాక్టర్ శ్వేతబాబు, డాక్టర్ జగదీశ్, డాక్టర్ రియాజ్ఖాన్, డాక్టర్ రాఘవరాజు వివరాలను మీడియాకు వెల్లడించారు. 25వ వారంలో బయటపడ్డ లోపం కడప జిల్లా చిన్నమడెంకు చెందిన కీర్తి క్రిస్టఫర్(31)కు ఏడాది కింద వివాహమైంది. ఆమె గర్భం దాల్చింది. రెగ్యులర్ చెకప్లో భాగంగా 25వ వారంలో ఆమెకు అల్ట్రాసౌండ్ పరీక్ష చేయగా, కడు పులో ఉన్న బిడ్డ గుండె (పల్మనరీ వాల్వ్)రక్తనాళం మూసుకుపోయినట్లు డాక్టర్లు గుర్తించారు. పరిష్కారం కోసం రాయచూర్, కడపలోని వైద్య నిపుణులను సంప్రదించారు. వారి సూచన మేరకు మే చివరిలో కేర్ వైద్యులను సంప్రదించారు. పీడియాట్రిక్ హృద్రోగ నిపుణుడు డాక్టర్ నాగేశ్వర్రావు వైద్య పరీక్షలు చేశారు. గుండె నుంచి ఊపిరితిత్తులకు రక్తం సరఫరా చేసే పల్మ నరీ వాల్వ్ మూసుకుపోవడంతో బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలలో లోపమున్నట్లు గుర్తించారు. చికిత్స అందించకుంటే కుడివైపు ఉన్న జఠరికం చిన్నగా మారుతుందని అన్నారు. శిశువు జన్మించాక ఊపిరితిత్తులకు రక్తం సరఫరా కాక, బిడ్డ శరీరం నీలం రంగులోకి మారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని, చికిత్స చేస్తే బతికించొచ్చని తెలి పారు. కీర్తి క్రిస్టఫర్ అంగీకరించడంతో జూన్ తొలివారంలో చికిత్స చేశారు. చికిత్స ఎలా చేశారంటే? చికిత్స సమయంలో బిడ్డ కదలికలతో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉండటంతో కడుపులోని బిడ్డ కదలికలను నియంత్రించేందుకు ముందు 18జీ సూదితో తల్లి ఉదరభాగం నుంచి బిడ్డ తొడభాగానికి ఇంజెక్షన్ ద్వారా అనస్థీషియా ఇచ్చారు. ఆ తర్వాత తల్లికి మత్తుమందు ఇచ్చారు. అల్ట్రాసౌండ్ సాయంతో తల్లి గర్భం నుంచి బిడ్డ గుండె వరకు సూదిని పంపారు. అదే సూది ద్వారా ఓ బెలూన్ను రక్త నాళంలోకి పంపి, మూసుకుపోయిన రక్తనాళాన్ని తెరిపించారు. ఈ ప్రక్రియ కు 48 నిమిషాల సమయం పట్టింది. ఇదే సమయంలో మరో బ్లాక్ ఉన్నట్లు గుర్తించారు. అప్పుడు కడుపులోని బిడ్డ వయసు ఇరవై ఆరున్నర వారాలు మాత్రమే. ఇటీవల కీర్తి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం బిడ్డ 3.2 కేజీల బరువు ఉంది. బిడ్డ పుట్టిన రెండోరోజే రెండో బ్లాక్నూ బెలూన్ సాయంతో తెరిపించారు. ప్రస్తుతం తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్ నాగేశ్వరరావు చెప్పారు. ఇప్పటి వరకు ఇలాంటి చికిత్సలు ఐదు చేయగా, మూసుకుపోయిన గుండె రక్తనాళం తెరిపించడం ఇదే మొదటి సారని వివరించారు. -
ఎవరిదీ ‘పాపం'!
♦ చెత్త కుప్పలో ఏడు నెలల గర్భస్థ శిశువు ♦ మంథన్దేవునిపల్లిలో ఘటన మాచారెడ్డి : ఎవరి ‘పాప’మో.. ఏమో! కళ్లైనా తెరవని పసిగుడ్డుపై కాఠిన్యం చూపిందో కఠినాత్మురాలు!! కన్నపేగు బంధానికే కళంకం తెచ్చింది. ఏడు నెలల గర్భస్థ శిశువును చెత్తకుప్పలో పడేసింది. మండలంలోని మంథన్దేవునిపల్లిలో శనివారం ఈ ఉదంతం వెలుగు చూసింది. ఏ తల్లి కడుపులో పెరుగుతున్న బిడ్డో.. కనికరం లేకుండా కడుపులోనే తుంచేశారు.. మృత శిశువును తీసుకొచ్చి గ్రామానికి చెందిన కామటి భూమయ్య ఇంటి వెనుక చెత్తకుప్పల్లో పడేశారు. శనివారం అటువైపు వచ్చిన గ్రామస్తులకు శిశువు మృతదేహం కనిపించడంతో షాక్కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. ప్రొబేషనరీ ఎస్సై హరీశ్రెడ్డి, ఐసీడీఎస్ సూపర్వైజర్ బుజ్జి అక్కడకు చేరుకున్నారు. మృత శిశువుకు కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం గ్రామానికి తీసుకొచి, ఖననం చేశారు. అవివాహిత లేక వివాహేతర సంబంధం ఉన్న మహిళే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దేవునిపల్లిలో మొత్తం 18 మంది గర్భిణులు ఉన్నారని, వారిలో ఎవరూ ప్రసవించలేదని తెలిపారు. ఈ శిశువు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నామని చెప్పారు.