మీడియా సమావేశంలో బాబుతో తల్లిదండ్రులు. చిత్రంలో కేర్ ఆస్పత్రి వైద్యులు
సాక్షి, హైదరాబాద్: తల్లి గర్భంలో ఉండగానే ఓ శిశువు గుండెకు కేర్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా చికిత్స చేశారు. మూసుకుపోయిన గుండె రక్తనాళాలను తెరిచి జన్మించకముందే పునర్జన్మ ప్ర సాదించారు. ఇలాంటి చికిత్స దేశంలోనే తొలిదని వైద్యులు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో డాక్టర్ కె.నాగేశ్వరరావు, డాక్టర్ టీవీఎస్ గోపాల్, డాక్టర్ శ్వేతబాబు, డాక్టర్ జగదీశ్, డాక్టర్ రియాజ్‌ఖాన్, డాక్టర్ రాఘవరాజు వివరాలను మీడియాకు వెల్లడించారు.
25వ వారంలో బయటపడ్డ లోపం
కడప జిల్లా చిన్నమడెంకు చెందిన కీర్తి క్రిస్టఫర్(31)కు ఏడాది కింద వివాహమైంది. ఆమె గర్భం దాల్చింది. రెగ్యులర్ చెకప్‌లో భాగంగా 25వ వారంలో ఆమెకు అల్ట్రాసౌండ్ పరీక్ష చేయగా, కడు పులో ఉన్న బిడ్డ గుండె (పల్మనరీ వాల్వ్)రక్తనాళం మూసుకుపోయినట్లు డాక్టర్లు గుర్తించారు. పరిష్కారం కోసం రాయచూర్, కడపలోని వైద్య నిపుణులను సంప్రదించారు. వారి సూచన మేరకు మే చివరిలో కేర్ వైద్యులను సంప్రదించారు. పీడియాట్రిక్ హృద్రోగ నిపుణుడు డాక్టర్ నాగేశ్వర్‌రావు వైద్య పరీక్షలు చేశారు. గుండె నుంచి ఊపిరితిత్తులకు రక్తం సరఫరా చేసే పల్మ నరీ వాల్వ్ మూసుకుపోవడంతో బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలలో లోపమున్నట్లు గుర్తించారు. చికిత్స అందించకుంటే కుడివైపు ఉన్న జఠరికం చిన్నగా మారుతుందని అన్నారు. శిశువు జన్మించాక ఊపిరితిత్తులకు రక్తం సరఫరా కాక, బిడ్డ శరీరం నీలం రంగులోకి మారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని, చికిత్స చేస్తే బతికించొచ్చని తెలి పారు. కీర్తి క్రిస్టఫర్ అంగీకరించడంతో జూన్ తొలివారంలో చికిత్స చేశారు.
చికిత్స ఎలా చేశారంటే?
చికిత్స సమయంలో బిడ్డ కదలికలతో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉండటంతో కడుపులోని బిడ్డ కదలికలను నియంత్రించేందుకు ముందు 18జీ సూదితో తల్లి ఉదరభాగం నుంచి బిడ్డ తొడభాగానికి ఇంజెక్షన్ ద్వారా అనస్థీషియా ఇచ్చారు. ఆ తర్వాత తల్లికి మత్తుమందు ఇచ్చారు. అల్ట్రాసౌండ్ సాయంతో తల్లి గర్భం నుంచి బిడ్డ గుండె వరకు సూదిని పంపారు. అదే సూది ద్వారా ఓ బెలూన్‌ను రక్త నాళంలోకి పంపి, మూసుకుపోయిన రక్తనాళాన్ని తెరిపించారు.
ఈ ప్రక్రియ కు 48 నిమిషాల సమయం పట్టింది. ఇదే సమయంలో మరో బ్లాక్ ఉన్నట్లు గుర్తించారు. అప్పుడు కడుపులోని బిడ్డ వయసు ఇరవై ఆరున్నర వారాలు మాత్రమే. ఇటీవల కీర్తి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం బిడ్డ 3.2 కేజీల బరువు ఉంది. బిడ్డ పుట్టిన రెండోరోజే రెండో బ్లాక్‌నూ బెలూన్ సాయంతో తెరిపించారు. ప్రస్తుతం తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్ నాగేశ్వరరావు చెప్పారు. ఇప్పటి వరకు ఇలాంటి చికిత్సలు ఐదు చేయగా, మూసుకుపోయిన గుండె రక్తనాళం తెరిపించడం ఇదే మొదటి సారని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment