Heart stent surgery: స్టెంటేశాక రెస్టెంత? బెస్టెంత? | Recovering After A Heart Stent Procedure | Sakshi
Sakshi News home page

Heart stent surgery: స్టెంటేశాక రెస్టెంత? బెస్టెంత?

Published Tue, Oct 22 2024 10:23 AM | Last Updated on Tue, Oct 22 2024 10:54 AM

Recovering After A Heart Stent Procedure

ఇటీవలగుండె జబ్బుల తర్వాత చాలామందికి స్టెంట్‌ వేయడం, ఇక కొందరిలోనైతే బైపాస్‌ అని పిలిచే సీఏబీజీ సర్జరీ చేయాల్సి రావడం మామూలే. గుండెకు నిర్వహించే ఇలాంటి ప్రోసిజర్‌ తర్వాత, ఆ బాధితుల్ని ఎప్పట్నుంచి నార్మల్‌గా పరిగణించ వచ్చు, లేదా ఎప్నట్నుంచి వారు తమ రోజువారీ పనులు చేసుకోవచ్చు అన్న విషయాలు తెలుసుకుందాం...

నిజానికి ఓ ప్రోసిజర్‌ తర్వాత నార్మల్‌ కావడం అన్నది వారివారి శరీర ధర్మం, ఫిట్‌నెస్, గాయం పూర్తిగా తగ్గేందుకు పట్టే సమయం... ఇలా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. కానీ సగటు కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే... తమ ఫిట్‌నెస్, తమ పనులు ఇక తాము చేసుకోగలమనే ఆత్మవిశ్వాసాన్ని బట్టి ఈ సమయం కాస్త అటు ఇటుగా ఉంటుందని తెలుసుకోవాల్సి ఉంటుంది. 

సాధారణంగా సర్జరీ జరిగినప్పుడు వీలైనంత తర్వాత సాధారణ స్థితికి రావాలని బాధితులందరికీ ఉంటుంది. అంతేకాదు... గాయమంతా పూర్తిగా మానేవరకు అందరూ విశ్రాంతి తీసుకుంటూ ఉండరు. అంతకంటే చాలా ముందుగానే... అంటే 80 శాతం తగ్గేనాటికే తమతమ మామూలు పనులు మొదలుపెట్టేస్తుంటారు. బాధితులు తమ ్రపోసీజర్‌ అయిన ఆరు వారాల తర్వాత నుంచి నిరభ్యంతరంగా పనులు మొదలు పెట్టవచ్చు. అయితే అప్పటికి తగ్గింది కేవలం 80శాతం మాత్రమే కావడం వల్ల  కొన్ని బరువైన పనులు చేయడం మాత్రం అంత మంచిది కాకపోవచ్చు.

డిశ్చార్జీ అయిన ఆరువారాల తర్వాతి నుంచి...  
చేయదగిన పనులు : 🔸తేలికపాటి నడక / (వాకింగ్‌) బట్టలు ఉతకడం (మెషిన్‌ ఉపయోగించి మాత్రమే) 🔸శ్రమలేనంతవరకు అంట్లు తోముకోవడం / పాత్రలు శుభ్రం చేసుకోవడం 🔸శ్రమలేనంతవరకు వంట చేసుకోవడం 🔸శ్రమ లేనంతవరకు / తేలికపాటి శారీరక శ్రమతో ఇల్లు శుభ్రం చేసుకోవడం ▶️శ్రమ లేనంతవరకు మెట్లు ఎక్కడం (ఈ ప్రక్రియలో శ్రమగా అనిపించినా / ఆయాసం వచ్చినా మళ్లీ ఈ పని చేయకూడదు. ఆమాటకొస్తే... శ్రమ అనిపించిన  లేదా ఆయాసంగా అనిపించిన ఏ పనినైనా బలవంతంగా చేయకూడదని గుర్తుంచుకోవాలి).

చేయకూడని పనులు : 🔸బరువైనవి ఎత్తడం (ప్రధానంగా 5 కిలోలకు మించినవేవీ ఎత్తడం సరికాదు) 🔸బరువైన వాటిని అటు ఇటు లాగడం లేదా తోయడం 🔸వాహనం నడపడం.

ఎనిమిది వారాల తర్వాత :🔸మనకు జరిగిన ప్రోసిజర్‌లో... శస్త్రచికిత్సలో భాగంగా ఎదుర్రొమ్ము ఎముకకు గాటు పెట్టి విడదీసి ఉంటే... అది ఆరు నుంచి ఎనిమిది వారాల నాటికి 80 శాతం తగ్గుతుంది. ఆరు / ఎనిమిది వారాలు దాటాక వాహనాన్ని నడపడం (డ్రైవింగ్‌) మొదలుపెట్టవచ్చు. 

మనం చేసే పని భౌతికమైన శ్రమతో కూడుకున్నది కాకపోతే మన వృత్తులకు / కార్యాలయానికి వెళ్లవచ్చు. ఆరు వారాలు దాటాక మళ్లీ యథాతథ స్థితిలోకి వచ్చేందుకు అవసరమైన కార్యకలాపాలు చేయడానికి (కార్డియాక్‌ రీహ్యాబిలిటీషన్‌కు) ఇది అనువైన సమయమని తెలుసుకోవాలి. ఈ సమయంలో గుండెపై ఒత్తిడి పడకుండానే... దాని పనితీరు / సామర్థ్యం (ఎండ్యూరెన్స్‌) పెంచుకునే వ్యాయామాలు మొదలుపెట్టాలి. అలా తేలిగ్గా మొదలుపెట్టి శ్రమతెలియనంత వరకు ఆ వ్యాయామాల తీవ్రతను పెంచుకుంటూ పోవచ్చు. శ్రమ అనిపించగానే మళ్లీ తగ్గిస్తూ... అలా క్రమంగా మీ యథాపూర్వక స్థితిలోకి వెళ్లడం మంచిది. ఇది చేస్తున్న క్రమంలో మనకు ఏ శ్రమ తెలియకపోతే... మనం అన్ని పనులూ ఎప్పుడెప్పుడు చేయవచ్చో మనకే క్రమంగా అర్థమవుతూ ఉంటుంది.

పది, పన్నెండు వారాల తర్వాత 
అది శస్త్రచికిత్సా / మరో ప్రక్రియా... అది ఏదైనప్పటికీ... పది, పన్నెండు వారాలు గడిచాక... అంతకు మునుపు చేసిన పనులన్నీ ఎలాంటి శ్రమ లేకుండా చేయగలుగుతుంటే... ఆపై ఇక నిర్భయంగా... తేలికపాటి పరుగు (జాగింగ్‌),  టెన్నిస్‌లాంటి ఇతరత్రా ఆటలు ఆడుకోవచ్చు. (అయితే ఆడే సమయంలో శ్రమ ఫీల్‌ అవ్వకుండా తేలిగ్గా చేయగలిగితేనే ఆ పనులు కొనసాగించాలి). రోజూ 30 నిమిషాల చొప్పున కనీసం వారంలో ఐదు రోజులు వ్యాయామాలు చేయాలి. దాని గుండెకు తగినంత బలం చేకూరి... దీర్ఘకాలంలో మేలు జరుగుతుంది.

మానడానికి టైమ్‌ ఇవ్వండి : 
ఏదైనా గాయం మానడానికి పట్టే సమయం... ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. అందుకే ఏ కొద్దిపాటి శ్రమ అనిపించినా మళ్లీ తేలికపనులకు వచ్చేసి మళ్లీ శ్రమ కలిగించే పనులవైపునకు మెల్లగా క్రమక్రమంగా వెళ్తుండాలి. బాధితులకు  డయాబెటిస్‌ లేదా ఇతరత్రా ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే గాయం మానడం  మరింత ఆలస్యమవుతుంది. అందుకే ఆరువారాల సమయాన్ని ఒక సాధారణ ్రపామాణిక సమయంగా మాత్రమే పరిగణించాలి. ఎవరిలోనైనా ఏదైనా గాయం పూర్తిగా అంటే 100 శాతం మానడానికి కనీసం ఏడాది సమయం తీసుకుంటుందని గుర్తుంచుకోవాలి. అందుకే ఏదైనా పనిని చేయడచ్చా లేదా అన్న విషయాన్ని ఎవరికి వారు తెలుసుకోడానికి ఉన్న ఒకే ఒక మార్గం... ‘ఆ పనిని తేలిగ్గానే చేయడానికి సాధ్యమవుతోందా, లేదా’ అనే విషయాన్ని చూసుకోవాలి. అలా ఏదైనా పని చేస్తునప్పుడు నొప్పి అనిపించినా, ఆయానం వచ్చినా లేదా గాయం వద్ద అసౌకర్యంగా ఉన్నా ఆ పనిని వెంటనే ఆపేయాలి.

ఏదైనా పని సరికాదని గుర్తుపట్టడం ఎలా? 
▶️అసాధారణమైన / తట్టుకోలేనంతగా నొప్పి వచ్చినప్పుడు ▶️ఏదైనా పనిచేస్తున్నప్పుడు ఎదుర్మొమ్ము వద్ద ‘కలుక్కు’మని అనిపించినా లేదా అలాంటి శబ్దం వచ్చినా ▶️ఏదైనా పనిచేస్తున్నప్పుడు ఎదుర్రొమ్ము గాయం ఎర్రబారినా లేదా ఆ గాయం నుంచి స్వల్పంగానైనా రక్తం / చీము లాంటి స్రావాలు వస్తున్నా ▶️దగ్గినప్పుడు ‘కలుక్కు’మన్నా ▶️సుదీర్ఘంగా శ్వాస తీసుకున్నప్పుడు ‘కలుక్కు’మన్నా. 

(ఇలా జరిగినప్పుడు ఎదుర్రొమ్ముకు వేసిన కుట్లు తెగాయేమోనని అనుమానించి, వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షింపజేసుకోవాలి). 
ఈ విషయాలన్నింటినీ ఎవరికి వారు గమనించుకుంటూ స్వీయ పరిశీలన ద్వారా  రొటీన్‌ పనుల్లోకి క్రమక్రమంగా ప్రవేశించాలి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement