ఏడేళ్ల శునకానికి విజయవంతంగా గుండె ఆపరేషన్
ఆసియాలో ఇదే తొలిసారి
న్యూఢిల్లీ: హుషారుగా గెంతుతూ చలాకీగా తిరుగుతూ తమ కుటుంబంలో భాగమైపోయిన ఏడేళ్ల శునకం గుండె జబ్బుతో బాధపడటం చూసి ఆ కుటుంబం అల్లాడిపోయింది. ఎలాగైనా అది మళ్లీ హుషారుగా తిరిగితే చాలు అని మనసులోనే మొక్కుకున్నారు. వారి బాధను అధునాతన చికిత్సవిధానంతో పోగొట్టారు ఢిల్లీలోని ఒక మూగజీవాల వైద్యుడు. రెండేళ్ల క్రితం అమెరికాలో అందుబాటులోకి వచ్చిన ఒక నూతన వైద్యవిధానంతో డాక్టర్ భానుదేవ్ శర్మ నేతృత్వంలోని వైద్యబృందం ఆ శునకానికి కొత్త జీవితం ప్రసాదించింది.
ఏమిటీ సమస్య?
ఏడేళ్ల బీగల్ జాతి శునకం జూలియట్ రెండేళ్లుగా మైట్రల్ వాల్వ్ సమస్యతో బాధపడుతోంది. గుండెలో ఎడమ ఎగువ కరి్ణక నుంచి జఠరికకు వెళ్లాల్సిన రక్తం తిరిగి కరి్ణకలోకి లీక్ అవుతోంది. దీంతో గుండె కొద్దికొద్దిగా కుంచించుకుపోయి, ఊపిరితిత్తుల్లో నీరు చేరి మృత్యువు ఒడికి చేరే ప్రమాదముంది. దీంతో విషయం తెల్సుకున్న ఢిల్లీలోని ఈస్ట్ కైలాశ్ ప్రాంతంలోని మ్యాక్స్ పెట్జ్ ఆస్పత్రిలోని డాక్టర్ భానుదేవ్ శర్మ నేతృత్వంలోని వైద్య బృందం ఆపరేషన్ చేసేందుకు ముందుకొచి్చంది.
చిన్న జీవాలకు గుండె ఆపరేషన్‌లు చేయడంలో శర్మ నిష్ణాతునిగా పేరొందారు. ‘‘ అమెరికాలోని కొలర్యాడో స్టేట్ యూనివర్సిటీలో రెండేళ్ల క్రితమే ఈ కొత్త ఆపరేషన్ విధానం అమల్లోకి వచి్చంది. ట్రాన్స్‌క్యాథటర్ ఎడ్జ్ టు ఎడ్జ్ రిపేర్(టీఈఈఆర్) విధానంలో మే 30న జూలియట్‌కు గుండె ఆపరేషన్ చేశాం. ఓపెన్ హార్ట్ సర్జరీలాగా దీనికి పెద్ద కోత అక్కర్లేదు. చాలా చిన్న కోత సరిపోతుంది. గుండె ఊపిరితిత్తుల బైపాస్ మెషీన్‌తో పని ఉండదు. గుండె కొట్టుకుంటుండగానే ఆపరేషన్ చేసేయొచ్చు. ఛాతీ వద్ద అత్యల్ప రంధ్రం చేసి మెషీన్‌ను పంపి గుండె కవాటం ద్వారాన్ని సరిచేస్తాం’’ అని శర్మ వివరించారు. ఆపరేషన్ చేసి రెండు రోజులకే జూలియట్‌ను డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం అది ఆరోగ్యంగా ఆటుకుంటూ కుటుంబంలో మళ్లీ సంతోషాన్ని నింపింది.
ఈ తరహాలో 80 శాతం మరణాలు
భారత్‌సహా ప్రపంచవ్యాప్తంగా శునకాలు ఎదుర్కొంటున్న హృద్రోగ సమస్యల్లో ఈ తరహావే 80 శాతం ఉండటం గమనార్హం.శునకాల మరణాలకు ప్రధాన కారణాల్లో ఈ సమస్య కూడా ఒకటి. ఆసియా ఖండంలో శునకాలకు ఈ తరహా ఆపరేషన్ చేయడం ఇదే తొలిసారి అని ఆ వెటర్నరీ ఆస్పత్రి తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తిచేసిన రెండో ప్రైవేట్ వైద్య బృందం వీళ్లదేనని ఆస్పత్రి పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment