Heart surgery Treatment
-
Heart stent surgery: స్టెంటేశాక రెస్టెంత? బెస్టెంత?
ఇటీవలగుండె జబ్బుల తర్వాత చాలామందికి స్టెంట్ వేయడం, ఇక కొందరిలోనైతే బైపాస్ అని పిలిచే సీఏబీజీ సర్జరీ చేయాల్సి రావడం మామూలే. గుండెకు నిర్వహించే ఇలాంటి ప్రోసిజర్ తర్వాత, ఆ బాధితుల్ని ఎప్పట్నుంచి నార్మల్‌గా పరిగణించ వచ్చు, లేదా ఎప్నట్నుంచి వారు తమ రోజువారీ పనులు చేసుకోవచ్చు అన్న విషయాలు తెలుసుకుందాం...నిజానికి ఓ ప్రోసిజర్ తర్వాత నార్మల్ కావడం అన్నది వారివారి శరీర ధర్మం, ఫిట్నెస్, గాయం పూర్తిగా తగ్గేందుకు పట్టే సమయం... ఇలా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. కానీ సగటు కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే... తమ ఫిట్నెస్, తమ పనులు ఇక తాము చేసుకోగలమనే ఆత్మవిశ్వాసాన్ని బట్టి ఈ సమయం కాస్త అటు ఇటుగా ఉంటుందని తెలుసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా సర్జరీ జరిగినప్పుడు వీలైనంత తర్వాత సాధారణ స్థితికి రావాలని బాధితులందరికీ ఉంటుంది. అంతేకాదు... గాయమంతా పూర్తిగా మానేవరకు అందరూ విశ్రాంతి తీసుకుంటూ ఉండరు. అంతకంటే చాలా ముందుగానే... అంటే 80 శాతం తగ్గేనాటికే తమతమ మామూలు పనులు మొదలుపెట్టేస్తుంటారు. బాధితులు తమ ్రపోసీజర్ అయిన ఆరు వారాల తర్వాత నుంచి నిరభ్యంతరంగా పనులు మొదలు పెట్టవచ్చు. అయితే అప్పటికి తగ్గింది కేవలం 80శాతం మాత్రమే కావడం వల్ల కొన్ని బరువైన పనులు చేయడం మాత్రం అంత మంచిది కాకపోవచ్చు.డిశ్చార్జీ అయిన ఆరువారాల తర్వాతి నుంచి... చేయదగిన పనులు : 🔸తేలికపాటి నడక / (వాకింగ్) బట్టలు ఉతకడం (మెషిన్ ఉపయోగించి మాత్రమే) 🔸శ్రమలేనంతవరకు అంట్లు తోముకోవడం / పాత్రలు శుభ్రం చేసుకోవడం 🔸శ్రమలేనంతవరకు వంట చేసుకోవడం 🔸శ్రమ లేనంతవరకు / తేలికపాటి శారీరక శ్రమతో ఇల్లు శుభ్రం చేసుకోవడం ▶️శ్రమ లేనంతవరకు మెట్లు ఎక్కడం (ఈ ప్రక్రియలో శ్రమగా అనిపించినా / ఆయాసం వచ్చినా మళ్లీ ఈ పని చేయకూడదు. ఆమాటకొస్తే... శ్రమ అనిపించిన లేదా ఆయాసంగా అనిపించిన ఏ పనినైనా బలవంతంగా చేయకూడదని గుర్తుంచుకోవాలి).చేయకూడని పనులు : 🔸బరువైనవి ఎత్తడం (ప్రధానంగా 5 కిలోలకు మించినవేవీ ఎత్తడం సరికాదు) 🔸బరువైన వాటిని అటు ఇటు లాగడం లేదా తోయడం 🔸వాహనం నడపడం.ఎనిమిది వారాల తర్వాత :🔸మనకు జరిగిన ప్రోసిజర్‌లో... శస్త్రచికిత్సలో భాగంగా ఎదుర్రొమ్ము ఎముకకు గాటు పెట్టి విడదీసి ఉంటే... అది ఆరు నుంచి ఎనిమిది వారాల నాటికి 80 శాతం తగ్గుతుంది. ఆరు / ఎనిమిది వారాలు దాటాక వాహనాన్ని నడపడం (డ్రైవింగ్) మొదలుపెట్టవచ్చు. మనం చేసే పని భౌతికమైన శ్రమతో కూడుకున్నది కాకపోతే మన వృత్తులకు / కార్యాలయానికి వెళ్లవచ్చు. ఆరు వారాలు దాటాక మళ్లీ యథాతథ స్థితిలోకి వచ్చేందుకు అవసరమైన కార్యకలాపాలు చేయడానికి (కార్డియాక్ రీహ్యాబిలిటీషన్కు) ఇది అనువైన సమయమని తెలుసుకోవాలి. ఈ సమయంలో గుండెపై ఒత్తిడి పడకుండానే... దాని పనితీరు / సామర్థ్యం (ఎండ్యూరెన్స్) పెంచుకునే వ్యాయామాలు మొదలుపెట్టాలి. అలా తేలిగ్గా మొదలుపెట్టి శ్రమతెలియనంత వరకు ఆ వ్యాయామాల తీవ్రతను పెంచుకుంటూ పోవచ్చు. శ్రమ అనిపించగానే మళ్లీ తగ్గిస్తూ... అలా క్రమంగా మీ యథాపూర్వక స్థితిలోకి వెళ్లడం మంచిది. ఇది చేస్తున్న క్రమంలో మనకు ఏ శ్రమ తెలియకపోతే... మనం అన్ని పనులూ ఎప్పుడెప్పుడు చేయవచ్చో మనకే క్రమంగా అర్థమవుతూ ఉంటుంది.పది, పన్నెండు వారాల తర్వాత అది శస్త్రచికిత్సా / మరో ప్రక్రియా... అది ఏదైనప్పటికీ... పది, పన్నెండు వారాలు గడిచాక... అంతకు మునుపు చేసిన పనులన్నీ ఎలాంటి శ్రమ లేకుండా చేయగలుగుతుంటే... ఆపై ఇక నిర్భయంగా... తేలికపాటి పరుగు (జాగింగ్), టెన్నిస్‌లాంటి ఇతరత్రా ఆటలు ఆడుకోవచ్చు. (అయితే ఆడే సమయంలో శ్రమ ఫీల్ అవ్వకుండా తేలిగ్గా చేయగలిగితేనే ఆ పనులు కొనసాగించాలి). రోజూ 30 నిమిషాల చొప్పున కనీసం వారంలో ఐదు రోజులు వ్యాయామాలు చేయాలి. దాని గుండెకు తగినంత బలం చేకూరి... దీర్ఘకాలంలో మేలు జరుగుతుంది.మానడానికి టైమ్ ఇవ్వండి : ఏదైనా గాయం మానడానికి పట్టే సమయం... ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. అందుకే ఏ కొద్దిపాటి శ్రమ అనిపించినా మళ్లీ తేలికపనులకు వచ్చేసి మళ్లీ శ్రమ కలిగించే పనులవైపునకు మెల్లగా క్రమక్రమంగా వెళ్తుండాలి. బాధితులకు డయాబెటిస్ లేదా ఇతరత్రా ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే గాయం మానడం మరింత ఆలస్యమవుతుంది. అందుకే ఆరువారాల సమయాన్ని ఒక సాధారణ ్రపామాణిక సమయంగా మాత్రమే పరిగణించాలి. ఎవరిలోనైనా ఏదైనా గాయం పూర్తిగా అంటే 100 శాతం మానడానికి కనీసం ఏడాది సమయం తీసుకుంటుందని గుర్తుంచుకోవాలి. అందుకే ఏదైనా పనిని చేయడచ్చా లేదా అన్న విషయాన్ని ఎవరికి వారు తెలుసుకోడానికి ఉన్న ఒకే ఒక మార్గం... ‘ఆ పనిని తేలిగ్గానే చేయడానికి సాధ్యమవుతోందా, లేదా’ అనే విషయాన్ని చూసుకోవాలి. అలా ఏదైనా పని చేస్తునప్పుడు నొప్పి అనిపించినా, ఆయానం వచ్చినా లేదా గాయం వద్ద అసౌకర్యంగా ఉన్నా ఆ పనిని వెంటనే ఆపేయాలి.ఏదైనా పని సరికాదని గుర్తుపట్టడం ఎలా? ▶️అసాధారణమైన / తట్టుకోలేనంతగా నొప్పి వచ్చినప్పుడు ▶️ఏదైనా పనిచేస్తున్నప్పుడు ఎదుర్మొమ్ము వద్ద ‘కలుక్కు’మని అనిపించినా లేదా అలాంటి శబ్దం వచ్చినా ▶️ఏదైనా పనిచేస్తున్నప్పుడు ఎదుర్రొమ్ము గాయం ఎర్రబారినా లేదా ఆ గాయం నుంచి స్వల్పంగానైనా రక్తం / చీము లాంటి స్రావాలు వస్తున్నా ▶️దగ్గినప్పుడు ‘కలుక్కు’మన్నా ▶️సుదీర్ఘంగా శ్వాస తీసుకున్నప్పుడు ‘కలుక్కు’మన్నా. (ఇలా జరిగినప్పుడు ఎదుర్రొమ్ముకు వేసిన కుట్లు తెగాయేమోనని అనుమానించి, వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షింపజేసుకోవాలి). ఈ విషయాలన్నింటినీ ఎవరికి వారు గమనించుకుంటూ స్వీయ పరిశీలన ద్వారా రొటీన్ పనుల్లోకి క్రమక్రమంగా ప్రవేశించాలి. -
మంత్రి విశ్వరూప్‌కు సీఎం జగన్ పరామర్శ
సాక్షి, కోనసీమ జిల్లా(అమలాపురం టౌన్): గుండె శస్త్రచికిత్స కోసం ముంబైలోని ఏషియన్ హార్ట్ సెంటర్లో చేరిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ఫోన్‌చేసి పరామర్శించారు. మంత్రి విశ్వరూప్‌కు సోమవారం గుండె శస్త్రచికిత్స చేయనున్నారు. ఈ క్రమంలో శస్త్రచికిత్స విజయవంతం అవుతుందని ఆయనకు సీఎం జగన్ ధైర్యం చెప్పారు. మంత్రి సతీమణి బేబీమీనాక్షి, కుమారుడు కృష్ణారెడ్డిలతో కూడా సీఎం మాట్లాడారు. తాను అన్నివేళలా అందుబాటులో ఉంటానని, విశ్వరూప్ ఆరోగ్యం పూర్తిగా మెరుగు పడుతుందని అన్నారు. సీఎం జగన్ తమతో మాట్లాడారని మంత్రి విశ్వరూప్ కుమారుడు కృష్ణారెడ్డి అమలాపురం ‘సాక్షి’కి ఫోన్లో తెలిపారు. చదవండి: (Chakradhar Goud: వంద రైతు కుటుంబాలకు రూ.కోటి సాయం) -
మహేశ్ బాబుపై ఎమ్మెల్యే రోజా ప్రశంసలు.. హ్యాట్సాఫ్ అంటూ పోస్ట్
Roja Selvamani Said Hatsoff To Mahesh Babu For Helping Childrens: సూపర్‌స్టార్ మహేశ్ బాబు పలు సేవా కార్యక్రమాలతో రియల్ లైఫ్ శ్రీమంతుడు అనిపించుకుంటారు. చిన్నారులకు సహాయం చేసేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ఆర్థికంగా స్థోమత లేని కుటుంబాలకు తన సొంత ఖర్చులతో వైద్య సేవలు అందిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. అలా ఇప్పటికే పలువురు చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించిన మహేశ్ తాజాగా 'ప్యూర్ లిటిల్ హార్ట్స్' ఫౌండేషన్‌కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. దీంతో మహేశ్ బాబుపై పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ సీనియర్ నటి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా సెల్వమణి మహేశ్ బాబును పొగడ్తలతో ముంచేత్తారు. మహేశ్ చేసిన కొత్త పనికి ట్విటర్లో ప్రశంసలు కురిపించారు. 'చిన్నారుల గుండె చప్పుడు వింటున్న మహేశ్ బాబుకు హ్యాట్సాఫ్ చెబుతున్నాను' అని ఓ వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే పరశురామ్ డైరెక్షన్లో మహేశ్ బాబు నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట. కీర్తి సురేష్ హీరోయిన్గా అలరిస్తోన్న ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ❤️చిన్నారుల గుండె చప్పుడు వింటున్న @urstrulyMahesh హ్యాట్సాఫ్. 🙏🙏🙏 pic.twitter.com/OwXtyz33GD — Roja Selvamani (@RojaSelvamaniRK) March 6, 2022 -
మహేశ్ బాబు మంచి మనసు.. చిన్నారుల కోసం ప్రత్యేకంగా
సూపర్‌స్టార్ మహేశ్ బాబు సామాజిక సేవా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పలు సేవా కార్యక్రమాలతో రియల్ లైఫ్‌లోనూ హీరో అనిపించుకుంటున్న మహేశ్ చిన్నారులకు సహాయం చేసేందుకు ఎప్పుడూ ముందుంటారు. ఆర్ధికంగా స్థోమత లేని కుటుంబాలకు తన సొంత ఖర్చులతో వైద్య సేవలు అందిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. అలా ఇప్పటికే పలువురు చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించిన మహేష్ ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. ఇప్పటికే చిన్నారుల హాస్ట్ సర్జరీల కోసం రెయిన్బో, ఆంధ్రా హాస్పిటల్స్‌తో కలిసి పనిచేస్తున్న మహేశ్ బాబు ఫౌండేషన్ తాజాగా రెయిన్బో హాస్పిటల్స్‌కి చెందిన ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్‌తో కలసి పనిచేయనుంది. ఇందుకోసం RCHIలో ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ (PLHF)ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేశ్ మాట్లాడుతూ.. ఈ ఫౌండేషన్‌ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది. పిల్లలు నా హృదయానికి ఎప్పుడూ దగ్గరగా ఉంటారు. కార్డియాక్ కేర్ అవసరమైన చిన్నారులకు మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా సహాయం చేయడం ఆనందంగా ఉంది అని అన్నారు.. కాగా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు మహేష్ ఆపద్భాందవుడిగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఏకంగా వెయ్యికి పైగా చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించి గొప్ప మనసు చాటుకున్నారు. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని తన తండ్రి స్వగ్రామమైన బుర్రిపాలెం, తెలంగాణ రాష్ట్రంలోని సిద్దాపురం గ్రామాలను దత్తత తీసుకొని నిజమైన శ్రీమంతుడు అనిపించుకున్నారు. -
అందుకే మహేశ్‌బాబు మా దేవుడు..
పిల్లలను ప్రేమించేవాళ్లు చాలామందే ఉంటారు. కానీ వారికి ఆపద వాటిల్లితే ముందుకొచ్చి సాయం చేసే వాళ్లు అతి కొద్దిమందే ఉంటారు. ఆ లిస్టులో సూపర్ స్టార్ మహేశ్‌బాబు మొట్టమొదటి స్థానంలో ఉంటారు. ఆయన తాజాగా మరో ఇద్దరు చిన్నారులకు ప్రాణదానం చేసి రియల్ హీరో అనిపించుకున్నారు. ఈ విషయాన్ని మహేశ్ సతీమణి నమ్రతా శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియజేశారు. "మరో రెండు గుండెలు మాతో కలిశాయి. ఇటీవలే గుండె శస్త్రచికిత్స చేయించుకున్న ఇద్దరు చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అందుకు సంతోషంగా ఉంది. ఇందుకు సహకారం అందించిన ఆంధ్రా హాస్పిటల్స్‌కు ధన్యవాదాలు" అని రాసుకొచ్చారు. దీనిపై మహేశ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ.. "దేవుడు మా మహేశ్" అంటూ కామెంట్లు చేస్తున్నారు. (చదవండి: దీపికా పదుకొణె ఒక వలస కూలీ!) కాగా మహేశ్‌బాబు ఇలా సాయం చేసింది.. ఒక్కరికో, ఇద్దరికో కాదు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వెయ్యి మందికి పైగా చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపారు. భవిష్యత్తుపై ఆశను వదిలేసుకున్న చిన్నారులను కాపాడి ఆ పేద కుటుంబాల్లో ఆశాజ్యోతిని వెలిగిస్తున్నారు. ఈ మంచి పని కోసం మహేశ్ కొన్ని ప్రైవేటు ఆస్పత్రులతో కలిసి పని చేస్తున్నారు. సోషల్ మీడియా విన్నపాలతో పాటు, వివిధ గ్రామాల్లో క్యాంపులు నిర్వహించి అవసరం ఉన్నవాళ్లను గుర్తించి వైద్య సహాయం అందిస్తున్నారు. (చదవండి: ప్రియ బర్త్‌డే: మహేశ్ ఫ్యామిలీ సందడి) View this post on Instagram Two more beating hearts added to our extended family ❤️❤️ Extremely happy to know that the kids who recently underwent heart surgery are in a stable condition and have been discharged. Thanks to Andhra Hospitals for delivering the best possible healthcare, even during such difficult times! Many blessings to the children and the family!! Stay healthy and stay safe 🙏🙏 #MBforSavingHearts❤️ A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on Oct 17, 2020 at 10:25pm PDT -
కిమ్స్ సవీరాలో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం
సాక్షి, అనంతపురం: రాయలసీమలో అందులోనూ అనంతపురం ప్రాంతంలో అత్యున్నత వైద్యసేవలు అందిస్తామన్న తమ హామీని నిలబెట్టుకుంటూ.. కిమ్స్ సవీరాలోని వైద్యులు సమీప గ్రామం నుంచి వచ్చిన 58 ఏళ్ల హృద్రోగికి ఇంట్రా కార్డియాక్ డీఫిబ్రిలేటర్ (ఐసీడీ)ని అమర్చి, అతడికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఇది ఈ ప్రాంతంలో అమర్చిన మొట్టమొదటి ఐసీడీ కావడం విశేషం. వెంట్రిక్యులర్ అరిథమియాస్ అనే ప్రాణాంతకమైన వ్యాధి కారణంగా ఉన్నట్టుండి గుండె ఆగిపోయే ముప్పు ఉన్న రోగుల ప్రాణాలు కాపాడేందుకు ఇంట్రా కార్డియాక్ డీఫిబ్రిలేటర్ పరికరాన్ని ఉపయోగిస్తారు. కిమ్స్ సవీరాలోని గుండె వైద్యుల బృందంలోని కన్సల్టెంట్ ఇన్వేజివ్ కార్డియాలజిస్టు డాక్టర్ వి.రాకేష్ నాయక్, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి కలిసి ఈ పరికరాన్ని తమ నైపుణ్యం, అత్యంత కచ్చితత్వంతో అమర్చారు. కుమార్(58) అనే బాధితుడు తరచు తనకు మైకం కమ్ముతోందని చూపించుకోడానికి కిమ్స్ సవీరా ఆసుపత్రికి వచ్చారు. గతంలో అనేక చోట్ల వైద్యం చేయించుకున్నా.. మెదడుకు ఎంఆర్ఐ, ఈఈజీ వంటి పరీక్షలు చేసినా ఏమీ తేలలేదు. దాంతో చివరకు కిమ్స్ సవీరా ఆసుపత్రిని సంప్రదించగా.. ఆయనకు హైపర్ ట్రాఫిక్ అబ్ స్ట్రక్టివ్ కార్డియోమయోపతీ అనే వ్యాధి వల్ల గుండె కండరాలు (మయోకార్డియమ్) బాగా మందంగా అయిపోయినట్లు తేలింది. దానివల్ల గుండె రక్తాన్ని సరఫరా చేయడం కష్టం అయిపోతుంది. దీనివల్ల ఉన్నట్టుండి మరణం సంభవించే ప్రమాదం ఉండటంతో దాన్ని అరికట్టేందుకు ఐసీడీ అమర్చాలన్న నిర్ణయం తీసుకున్నారు. దీనిపై కిమ్స్ సవీరా ఆసుపత్రిలోని కన్సల్టెంట్ ఇన్వేజివ్ కార్డియాలజిస్టు డాక్టర్ వి.రమేష్ నాయక్ మాట్లాడుతూ.. గుండెవైద్యంలో కిమ్స్ సవీరా ఆసుపత్రి మంచి పురోగతిని సాధిస్తోంది. అనంతపురంలో ఐసీడీ అమర్చడం ఇదే తొలిసారి కావడంతో, ఇలా ఉన్నట్టుండి మరణం సంభవించే ప్రమాదమున్న చాలామంది రోగులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. భారతదేశంలో ఇలా ఉన్నట్టుండి గుండె ఆగి మరణించడం చాలా పెద్ద ప్రజారోగ్య సమస్య. పరుగు తీసేటప్పుడు, ఫుట్ బాల్ ఆడేటప్పుడు కూడా కొందరు ఉన్నట్టుండి మరణించడానికి ఇదే కారణం. ఇలాంటి రోగులకు డీఫిబ్రిలేటర్లను అమర్చడమే సరైన పరిష్కారం. ఇలాంటి మరణాలను అది చాలా సమర్థంగా తగ్గిస్తుంది' అని ఆయన వివరించారు. ఇదే కేసు గురించి కిమ్స్ సవీరా ఆసుపత్రిలోని కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. 'ఈ సమస్యను గుర్తించగానే రోగిని ముందుగా లూప్ ఈసీజీ పర్యవేక్షణలో ఉంచాం. అక్కడ 5 రోజుల పాటు ఆయన ఈసీజీని రికార్డు చేశాం. ఈ రోజుల్లో ఆయన తన రోజువారీ పనులు మామూలుగానే చేసుకున్నారు. ఈ పరీక్ష ఫలితాల్లో ఆయనకు వెంట్రిక్యులర్ టాకీకార్డియా (గుండె వేగంగా కొట్టుకోవడం - నిమిషానికి 280 సార్లు) 12 సెకండ్లపాటు ఉంటోందని గుర్తించాం. అందుకే ఆయనకు ఇంట్రా కార్డియాక్ డీఫిబ్రిలేటర్ అమర్చాలని నిర్ణయించాం. ఈ రోగికి డ్యూయల్ ఛాంబర్ ఐసీడీ అమరికను విజయవంతంగా పూర్తిచేశాం' అని తెలిపారు. కుటుంబ సభ్యుల ధన్యవాదాలు: రోగి కోలుకోవడంతో ఆయన కుటుంబసభ్యులు చాలా సంతోషించారు. మా నాన్నకి కొత్త జీవితాన్ని అందించినందుకు కిమ్స్ సవీరా వైద్య బృందానికి ధన్యవాదాలు. ఇంతకుముందు ఇలాంటి చికిత్స బెంగళూరు లేదా హైదరాబాద్ లాంటి నగరాల్లోనే ఉండేది. ఇప్పుడు అనంతపురంలోనూ ఈ చికిత్స అందుబాటులోకి రావడంతో, విలువైన కాలంతో పాటు బోలెడంత ఖర్చు కూడా రోగులకు ఆదా అవుతుంది అని బాధితుని కుమారుడు చెప్పారు. చికిత్సకు సంబంధించిన వివరాలకు 9963445785 మొబైల్ నెంబర్లో సంప్రదించవచ్చని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. -
'హృదయ' విదారకం
తాళ్లరేవు(ముమ్మిడివరం) : ప్రతి మనిషిలో గుండె ఎడమవైపున ఉంటుంది. తాళ్లరేవు మండలం చొల్లంగిపేట గ్రామానికి చెందిన ఎనిమిది నెలల వయస్సుగల బాబుకి గుండె కుడివైపున ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.వివరాల్లోకి వెళితే.. చొల్లంగిపేట గ్రామానికి చెందిన కందెళ్ల శ్రీను వ్యవసాయం చేసుకుంటూ, ఆవులను మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి సొంత అక్క కూతురు దుర్గాదేవితో మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఎనిమిది నెలల క్రితం ఒక బాబు జన్మించాడు. ఇతడికి చిన్నప్పటి నుంచి ఊపిరి సరిగా అందకపోవడంతో తల్లిదండ్రులు ఇటీవల కాకినాడలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చూపించారు. అక్కడి వైద్యులు గుండె కుడివైపున ఉందని, సర్జరీకి లక్షలో ఖర్చవుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో సోమవారం చొల్లంగిపేట పంచాయతీలో జరిగిన జన్మభూమి–మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో బాలుడిని చూపించారు. తాళ్లరేవు సీహెచ్‌సీ జనరల్ సర్జన్ ఎల్.గోపాలరావు అతడిని పరీక్షించి గుండె కుడివైపున ఉన్నట్టు నిర్ధారించారు. బాలుడి గుండెతోపాటు వెంట్రుకల్స్ సైతం సక్రమంగా లేకపోవడంతో భవిష్యత్‌లో రక్తం సరఫరా సక్రమంగా జరగకపోవచ్చని తెలిపారు.దీనికి హైదరాబాద్‌లోని నీలోఫర్, నిమ్స్, కామినేని, తిరుపతి రియా ఆస్పత్రులలో కార్డియాలజిస్ట్‌లు మాత్రమే శస్త్ర చికిత్సలు చేయగలరని, రూ.లక్షల్లో ఖర్చవుతుందన్నారు. తాళ్లరేవు సీహెచ్‌సీ ద్వారా కాకినాడ పిడియాట్రిక్ సర్జన్‌కు రిఫర్ చేయనున్నట్టు తెలిపారు. ఒకట్రెండు లక్షల మందిలో ఒకరికి ఇలా జరుగుతుందని, దీనికి మేనరికమే కారణంగా తెలుస్తోందని గోపాలరావు తెలిపారు. -
కేజీహెచ్ ‘గుండె’ ప్రైవేటుపరం
గుండె శస్త్ర చికిత్సల విభాగంపై కార్పొరేట్ కన్ను * సిబ్బందిని, వైద్యపరికరాలను సమకూర్చని ప్రభుత్వ పెద్దలు * వ్యూహాత్మకంగా నిర్వీర్యం చేసిన అధికారులు * ఆగస్టునుంచి కేజీహెచ్‌లో కార్పొరేట్ రాజ్యం * పేదలకు వైద్యం సహాయంపై కొరవడిన స్పష్టత సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కింగ్ జార్జ్ ఆసుపత్రి (కేజీహెచ్)... ఉత్తరాంధ్ర పేద, మధ్యతరగతి రోగులపాలిట సంజీవని. అందులో కీలకమైన గుండె శస్త్రచికిత్సల విభాగం ఇప్పుడు ప్రైవేటుపరం కానుంది. సిబ్బంది లేరన్నదాన్ని సాకుగా చూపి ఆ విభాగాన్ని ఓ కార్పొరేట్ అస్పత్రికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత వైద్య పరికరాలు కొనుగోలు చేసేందుకు భారీగా నిధులు కేటాయించారు. దీంతో ఇప్పుడు సొమ్మొకడిది... సోకొకడిది అన్నట్లుగా కేజీహెచ్ ఆస్పత్రిలో కార్పొరేట్ డాక్టర్లు రాజ్యమేలనున్నారు. వ్యూహాత్మకంగానే నిర్వీర్యం... విశాఖ కేజీహెచ్‌లోని గుండె శస్త్రచికిత్సల విభాగం కొన్ని నెలల కిందటి వరకూ బాగానే పనిచేసింది. నెలకు ఏడెనిమిది ఆపరేషన్లు చేస్తుండటంతో ఉత్తరాంధ్ర నుంచి ఎంతోమంది పేద, మధ్యతరగతి రోగులు కేజీహెచ్‌కు వస్తుండేవారు. కానీ కార్పొరేట్ ఆసుపత్రుల ప్రయోజనాల కోసం ప్రభుత్వ పెద్దలు, వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఓ పథకం ప్రకారం ఈ విభాగాన్ని నిర్వీర్యం చేశారు. అవసరమైన పరికరాలుగానీ సిబ్బందినిగానీ కేటాయించకుండా ఇబ్బంది పెట్టారు. హార్ట్‌లంగ్ మెషిన్ పాడైతే ఆరునెలలుగా మరమ్మతులు చేయించలేదు. కీలకమైన పెర్ఫ్యూజనిస్ట్ పోస్టు ఖాళీ అయితే భర్తీ చేయలేదు. దాంతో ఐదారు నెలలుగా ఆ విభాగంలో శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. ఆ విభాగానికి చెందిన వైద్య అధికారి కేజీహెచ్ ఉన్నతాధికారుల దృష్టికి ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోయింది. ఇక లాభం లేదని తెలుసుకున్న ఆయన బదిలీ చేయించుకుని వెళ్లిపోయారు.ఈ నేపథ్యంలోనే ఆ విభాగాన్ని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి అప్పగిస్తూ తాజాగా నిర్ణయించారు. సొమ్ములు ప్రభుత్వానివే కార్పొరేట్ ఆసుపత్రికి అప్పగించాలని నిర్ణయించిన తరువాత ఆ విభాగానికి వైద్య, ఆరోగ్య శాఖ నిధులు కేటాయించడం విస్మయపరుస్తోంది. హార్ట్‌లంగ్ మెషిన్‌తోపాటు పలు మోనిటర్లు, వెంటిలేటర్లు, ఇతర పరికరాలను దాదాపు రూ.6కోట్లతో కొనుగోలు చేయాలని నిర్ణయించింది. కార్పొరేట్ ఆసుపత్రి వైద్యులు వచ్చి ఈ విభాగంలో శస్త్రచికిత్సలు మాత్రం చే సి వెళ్లిపోతారు. వారికి కేజీహెచ్‌లోని అసిస్టెం ట్ ప్రొఫెసర్లు, ఇతర పీజీ వైద్య విద్యార్థులు సహకరించాలి. పోస్టు ఆపరేటివ్ సేవలతోపాటు రోగులకు అవసరమైన ఇతరత్రా వైద్య సేవలన్నీ కూడా కేజీహెచ్ సిబ్బందే చేయాలి. పేద రోగులపై వేటే ఇప్పటివరకూ కేజీహెచ్‌లోని అన్ని విభాగాల్లోనూ ఉచితంగానే వైద్యసేవలు అందిస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు/ తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారు, లేనివారు కూడా ప్రస్తుతం కేజీహెచ్‌లో ఉచితంగా వైద్యసేవలు పొందుతున్నారు. గుండె శస్త్రచికిత్సల విభాగాన్ని కార్పొరేట్ సంస్థకు అప్పగించిన తరువాత పరిస్థితి ఏమిటన్నది మాత్రం అంతుచిక్కడం లేదు. ఈ అంశంపై కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.మధుసూదన్ బాబును సంప్రదించగా... గుండె శస్త్రచికిత్సల విభాగాన్ని ఆగస్టు 1 నుంచి తెరుస్తామన్నారు. కార్పొరేట్ ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్సలు చేస్తారని తెలిపారు.