తాళ్లరేవు(ముమ్మిడివరం) : ప్రతి మనిషిలో గుండె ఎడమవైపున ఉంటుంది. తాళ్లరేవు మండలం చొల్లంగిపేట గ్రామానికి చెందిన ఎనిమిది నెలల వయస్సుగల బాబుకి గుండె కుడివైపున ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.వివరాల్లోకి వెళితే.. చొల్లంగిపేట గ్రామానికి చెందిన కందెళ్ల శ్రీను వ్యవసాయం చేసుకుంటూ, ఆవులను మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి సొంత అక్క కూతురు దుర్గాదేవితో మూడేళ్ల క్రితం వివాహమైంది.
వీరికి ఎనిమిది నెలల క్రితం ఒక బాబు జన్మించాడు. ఇతడికి చిన్నప్పటి నుంచి ఊపిరి సరిగా అందకపోవడంతో తల్లిదండ్రులు ఇటీవల కాకినాడలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చూపించారు. అక్కడి వైద్యులు గుండె కుడివైపున ఉందని, సర్జరీకి లక్షలో ఖర్చవుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో సోమవారం చొల్లంగిపేట పంచాయతీలో జరిగిన జన్మభూమి–మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో బాలుడిని చూపించారు. తాళ్లరేవు సీహెచ్‌సీ జనరల్ సర్జన్ ఎల్.గోపాలరావు అతడిని పరీక్షించి గుండె కుడివైపున ఉన్నట్టు నిర్ధారించారు.
బాలుడి గుండెతోపాటు వెంట్రుకల్స్ సైతం సక్రమంగా లేకపోవడంతో భవిష్యత్‌లో రక్తం సరఫరా సక్రమంగా జరగకపోవచ్చని తెలిపారు.దీనికి హైదరాబాద్‌లోని నీలోఫర్, నిమ్స్, కామినేని, తిరుపతి రియా ఆస్పత్రులలో కార్డియాలజిస్ట్‌లు మాత్రమే శస్త్ర చికిత్సలు చేయగలరని, రూ.లక్షల్లో ఖర్చవుతుందన్నారు. తాళ్లరేవు సీహెచ్‌సీ ద్వారా కాకినాడ పిడియాట్రిక్ సర్జన్‌కు రిఫర్ చేయనున్నట్టు తెలిపారు. ఒకట్రెండు లక్షల మందిలో ఒకరికి ఇలా జరుగుతుందని, దీనికి మేనరికమే కారణంగా తెలుస్తోందని గోపాలరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment