కేజీహెచ్ ‘గుండె’ ప్రైవేటుపరం
గుండె శస్త్ర చికిత్సల విభాగంపై కార్పొరేట్ కన్ను
* సిబ్బందిని, వైద్యపరికరాలను సమకూర్చని ప్రభుత్వ పెద్దలు
* వ్యూహాత్మకంగా నిర్వీర్యం చేసిన అధికారులు
* ఆగస్టునుంచి కేజీహెచ్‌లో కార్పొరేట్ రాజ్యం
* పేదలకు వైద్యం సహాయంపై కొరవడిన స్పష్టత
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కింగ్ జార్జ్ ఆసుపత్రి (కేజీహెచ్)... ఉత్తరాంధ్ర పేద, మధ్యతరగతి రోగులపాలిట సంజీవని.
అందులో కీలకమైన గుండె శస్త్రచికిత్సల విభాగం ఇప్పుడు ప్రైవేటుపరం కానుంది. సిబ్బంది లేరన్నదాన్ని సాకుగా చూపి ఆ విభాగాన్ని ఓ కార్పొరేట్ అస్పత్రికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత వైద్య పరికరాలు కొనుగోలు చేసేందుకు భారీగా నిధులు కేటాయించారు. దీంతో ఇప్పుడు సొమ్మొకడిది... సోకొకడిది అన్నట్లుగా కేజీహెచ్ ఆస్పత్రిలో కార్పొరేట్ డాక్టర్లు రాజ్యమేలనున్నారు.
వ్యూహాత్మకంగానే నిర్వీర్యం...
విశాఖ కేజీహెచ్‌లోని గుండె శస్త్రచికిత్సల విభాగం కొన్ని నెలల కిందటి వరకూ బాగానే పనిచేసింది. నెలకు ఏడెనిమిది ఆపరేషన్లు చేస్తుండటంతో ఉత్తరాంధ్ర నుంచి ఎంతోమంది పేద, మధ్యతరగతి రోగులు కేజీహెచ్‌కు వస్తుండేవారు. కానీ కార్పొరేట్ ఆసుపత్రుల ప్రయోజనాల కోసం ప్రభుత్వ పెద్దలు, వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఓ పథకం ప్రకారం ఈ విభాగాన్ని నిర్వీర్యం చేశారు. అవసరమైన పరికరాలుగానీ సిబ్బందినిగానీ కేటాయించకుండా ఇబ్బంది పెట్టారు.
హార్ట్‌లంగ్ మెషిన్ పాడైతే ఆరునెలలుగా మరమ్మతులు చేయించలేదు. కీలకమైన పెర్ఫ్యూజనిస్ట్ పోస్టు ఖాళీ అయితే భర్తీ చేయలేదు. దాంతో ఐదారు నెలలుగా ఆ విభాగంలో శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. ఆ విభాగానికి చెందిన వైద్య అధికారి కేజీహెచ్ ఉన్నతాధికారుల దృష్టికి ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోయింది. ఇక లాభం లేదని తెలుసుకున్న ఆయన బదిలీ చేయించుకుని వెళ్లిపోయారు.ఈ నేపథ్యంలోనే ఆ విభాగాన్ని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి అప్పగిస్తూ తాజాగా నిర్ణయించారు.
సొమ్ములు ప్రభుత్వానివే
కార్పొరేట్ ఆసుపత్రికి అప్పగించాలని నిర్ణయించిన తరువాత ఆ విభాగానికి వైద్య, ఆరోగ్య శాఖ నిధులు కేటాయించడం విస్మయపరుస్తోంది. హార్ట్‌లంగ్ మెషిన్‌తోపాటు పలు మోనిటర్లు, వెంటిలేటర్లు, ఇతర పరికరాలను దాదాపు రూ.6కోట్లతో కొనుగోలు చేయాలని నిర్ణయించింది. కార్పొరేట్ ఆసుపత్రి వైద్యులు వచ్చి ఈ విభాగంలో శస్త్రచికిత్సలు మాత్రం చే సి వెళ్లిపోతారు. వారికి కేజీహెచ్‌లోని అసిస్టెం ట్ ప్రొఫెసర్లు, ఇతర పీజీ వైద్య విద్యార్థులు సహకరించాలి. పోస్టు ఆపరేటివ్ సేవలతోపాటు రోగులకు అవసరమైన ఇతరత్రా వైద్య సేవలన్నీ కూడా కేజీహెచ్ సిబ్బందే చేయాలి.
పేద రోగులపై వేటే
ఇప్పటివరకూ కేజీహెచ్‌లోని అన్ని విభాగాల్లోనూ ఉచితంగానే వైద్యసేవలు అందిస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు/ తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారు, లేనివారు కూడా ప్రస్తుతం కేజీహెచ్‌లో ఉచితంగా వైద్యసేవలు పొందుతున్నారు. గుండె శస్త్రచికిత్సల విభాగాన్ని కార్పొరేట్ సంస్థకు అప్పగించిన తరువాత పరిస్థితి ఏమిటన్నది మాత్రం అంతుచిక్కడం లేదు. ఈ అంశంపై కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.మధుసూదన్ బాబును సంప్రదించగా... గుండె శస్త్రచికిత్సల విభాగాన్ని ఆగస్టు 1 నుంచి తెరుస్తామన్నారు. కార్పొరేట్ ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్సలు చేస్తారని తెలిపారు.