
అనంతపురంలో మెడల్స్, ప్రశంస పత్రాలతో లావణ్య, కూతురు అపర్ణ
ఆటలంటే బలం. కుటుంబం అంటే అమోఘ బలం. ఫ్యామిలీకి ఆటలు తోడైతే... ఆ బలం చెప్పలేనంత! 63 సంవత్సరాల కందుకూరి లావణ్య, ఆమె భర్త 69 సంవత్సరాల నాగేశ్వరరావు అథ్లెటిక్స్‌లో రాణిస్తూ ‘ఆహా’ అనిపిస్తున్నారు. తల్లిదండ్రుల బాటలోకి వచ్చిన 35 సంవత్సరాల అపర్ణ ఆటల్లో విజయకేతనం ఎగరేస్తోంది. ‘ఆటలకు వయసు అడ్డు కాదు’ అంటూ ఎంతోమందికి స్ఫూర్తి ఇస్తున్న కందుకూరి కుటుంబం గురించి..
విశాఖ జిల్లా భీమిలికి చెందిన లావణ్య చిన్నప్పటి నుంచే పరుగు పందేలలో పాల్గొనేది. షటిల్, రింగ్‌టెన్నిస్ బాగా ఆడేది. నాగేశ్వరరావుకు కూడా ఆటలంటే ఇష్టం. కబడ్డీ నుంచి షటిల్ వరకు ఎన్నో ఆటల్లోప్రావీణ్యం సంపాదించాడు. భార్యాభర్తలిద్దరికీ ఆటలంటేప్రాణం కావడంతో ఇంటినిండా ఆటల కబుర్లే!
ఆటలకు సంబంధించి తమ చిన్ననాటి విశేషాలను ఒకరితో ఒకరు పంచుకునేవారు. ‘ఆరోజులు మళ్లీ వస్తే బాగుణ్ణు’ అనుకునేవారు. ‘చరిత్ర పునరావృతమవుతుంది’ అంటారు కదా! ‘ఆంజనేయా వెటరన్స్ అసోసియేషన్’ పుణ్యమా అని అలాగే జరిగింది. భీమిలిలో కోనాడ జయరాముడు అనే వెటరన్ క్రీడాకారుడు ఏర్పాటు చేసిన ‘ఆంజనేయా వెటరన్స్ అథ్లెట్ అసోసియేషన్ ’లో లావణ్య, నాగేశ్వరరావు సభ్యులుగా చేరారు. విశాఖలోని ‘మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ’లో సభ్యత్వం తీసుకున్నారు. అలా... మళ్లీ ఆటల ప్రపంచంలోకి అడుగు పెట్టే అపూర్వ అవకాశం వచ్చింది. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనడం మొదలైంది.
విజయపరంపర
కరీంనగర్‌లో జరిగిన 800,1500 మీటర్ల పరుగు పందెంలో లావణ్య ప్రథమ స్థానంలో, నాగేశ్వరరావు ద్వితీయ స్థానంలో నిలిచారు. మహబూబ్‌నగర్, గుంటూరులో జరిగిన పోటీల్లో ప్రథమ స్థానాల్లో నిలిచారు. చెన్నైలో జరిగిన జాతీయ పోటీల్లో 800, 1500 మీటర్ల పరుగులో ప్రథమ, 5 కిలోమీటర్ల పరుగులో ద్వితీయ స్థానంలో నిలిచింది లావణ్య. బెంగళూరులో జరిగిన 800, 1500 మీటర్ల పరుగులో భార్యాభర్తలిద్దరూ ప్రథమ స్థానంలో నిలిచారు. 200 మీటర్ల హర్డిల్స్‌లో ద్వితీయస్థానంలో నిలిచారు. చండీగఢ్, భోపాల్, హరియాణా కురుక్షేత్రలో జరిగిన పోటీల్లోనూ విజయకేతనం ఎగరేశారు.
అంతర్జాతీయ స్థాయిలో...
లావణ్య మరో అడుగు ముందుకు వేసి అంతర్జాతీయ పోటీల్లోనూ సత్తా చాటుతోంది. చైనాలో జరిగిన పోటీలతో అంతర్జాతీయ పోటీల్లోకి అడుగుపెట్టింది. 800 మీటర్ల పరుగులో ద్వితీయ స్థానంలో నిలిచింది. శ్రీలంకలో 400, 800, 1500 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఫిలిప్పీన్స్‌లో పది వేల మీటర్ల పరుగులో ప్రథమ స్థానంలో నిలిచింది, సింగపూర్, థాయ్‌లాండ్‌లో జరిగిన పోటీల్లోనూ పాల్గొంది.
కూతురు కూడా...
లావణ్య కుమార్తె అపర్ణకు చిన్నప్పటి నుంచి ఆటలంటే ఇష్టం. రన్నింగ్‌తో పాటు వాలీబాల్‌లో ప్రతిభ చూపేది. పెళ్లి తరువాత ఆటలకు దూరమైంది. అయితే తల్లిదండ్రుల స్ఫూర్తితో 35 సంవత్సరాల అపర్ణ ‘విశాఖ అథ్లెటిక్స్ అసోసియేషన్ ’లో సభ్యత్వం తీసుకుంది. తల్లి,కూతుళ్లు కలిసి తొలిసారిగా గత నెలలో అనంతపురంలో జరిగిన రాష్ట్రస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్‌లో పాల్గొన్నారు.
లావణ్య 100, 800మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానంలో, 200 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానంలో నిలిచింది. అయిదు కిలోమీటర్ల పరుగు పందెంలో అపర్ణ ప్రథమ స్థానం, 100 మీటర్ల పరుగులో ద్వితీయ స్థానంలో నిలిచింది. ఇకపై తల్లితండ్రులతో కలిసి పోటీల్లో పాల్గొనాలని నిర్ణయించుకుంది అపర్ణ. – సింగారెడ్డి రమణ ప్రసాద్, సాక్షి, భీమిలి
అమ్మతో పాటు...
అమ్మానాన్నలు ఒకరికొకరు స్ఫూర్తి. వారి నుంచి నేను స్ఫూర్తి పొంది 35 సంవత్సరాల వయసులో ఆటల ప్రపంచంలోకి అడుగుపెట్టాను. అమ్మతో పాటు పోటీల్లో పాల్గొనడం, విజయం సాధించడం సంతోషంగా ఉంది. ఉత్సాహం ఉండాలేగానీ ఆటలకు వయసు ఎప్పుడూ అడ్డు కాదు. – అపర్ణ
కొత్త ప్రపంచంలోకి...
ఆటల వల్ల కొత్త ప్రపంచాన్ని చూడగలుగుతున్నాను. దేశంలోని ఎన్నోప్రాంతాలతోపాటు విదేశాలకు వెళ్లగలిగాను. ‘ఈ వయసులో ఆటలు ఎందుకు?’ అని నా భర్త నాగేశ్వరరావు అని ఉంటే నేను ఇంటికే పరిమితమయ్యేదాన్ని. ఆయన నన్ను ఎంతో ఉంది. – కందుకూరి లావణ్య
Comments
Please login to add a commentAdd a comment