నాన్న పోలీస్.. కుమార్తె షూటర్
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): తండ్రి పోలీస్‌శాఖలో అత్యుత్తమ పనితీరుతో ప్రతిష్టాత్మక పతకాలు అందుకున్న అధికారి.. ఆ కుమార్తె తండ్రికి తగ్గ తనయ. షూటింగ్లో దిట్ట.. నాన్న స్ఫూర్తి, ప్రోత్సాహంతో ముందుకు సాగుతూ జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. తన తండ్రితోపాటు గుంటూరు కీర్తిని చాటేందుకు సిద్ధమైంది. ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఈ తండ్రీకూతుళ్ల విజయగాధ..
అత్యున్నత గ్యాలంటరీ అవార్డు కై వసం
సీఐ డి.నరేష్.. ప్రస్తుతం గుంటూరు దిశ పోలీసుస్టేషన్ సీఐగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 1998లో ఎస్ఐగా ఉద్యోగజీవితం ప్రారంభించిన ఆయన గుంటూరు రేంజ్ పరిధిలోనే వివిధ విభాగాల్లో పనిచేశారు. అనంతరం సీఐగా ఉద్యోగోన్నతి పొందారు. సుమారు ఆరున్నరేళ్లపాటు నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసి 2010 సంవత్సరంలో పోలీసు శాఖలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి ఎంపిక చేసే గ్యాలంటరీ అవార్డును అప్పటి ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య చేతుల మీదుగా అందుకున్నారు. 2006లో రాష్ట్ర ప్రభుత్వ సేవా పతకం, 2018లో ఉత్కృష్ట సేవా పతకం, 2022లో ఉత్తమ సేవా పతకం అందుకున్నారు. విశ్రాంత డీజీపీలు పేర్వారం రాములు, స్వర్ణజిత్‌సేన్, అప్పా డైరెక్టర్ గోపినాథ్రెడ్డితోపాటు అనేక మంది ఉన్నతాధికారుల చేతుల మీదుగా అనేక అవార్డులను పొందారు. విధుల్లో చేరిన నాటి నుంచి ఇప్పటి వరకు కనీసం ఒక్క పనిష్మెంట్ కూడా లేదంటే.. ఆయన విధుల్లో ఎంత బాధ్యతగా ఉంటారో అర్థమవుతోంది.
పుత్రికోత్సాహంతో ఉప్పొంగే..
సీఐ నరేష్ కుమార్తె సన్వితాషారోన్. ఇంటర్మీయెట్ పూర్తి చేశారు. ప్రస్తుతం లా చదవించేందుకు సిద్ధమవుతున్నారు. ఈమె షూటింగ్‌లోనూ దిట్ట. ఇప్పటికే అనేక పతకాలు కైవసం చేసుకున్నారు. ఇటీవల నేషనల్స్‌కు ఎంపికయ్యారు. చిన్ననాటి నుంచి కూతురు షూటింగ్‌పై ఆసక్తి కనబరచడంతో సీఐ నరేష్ ప్రోత్సహించారు. శిక్షణ ఇప్పించి మెళకువలు నేర్పించారు. రాష్ట్ర స్థాయిలో ఎయిర్ పిస్టల్ రేంజ్–10 జూనియర్, ఉమెన్ విభాగాల్లో సన్విత స్వర్ణ, వెండి పతకాలను సాధించారు. ఫైర్ఆమ్–25 రేంజ్ విభాగంలో భూపాల్, కేరళ, ఢిల్లీలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన కర్మీసింగ్ షూటింగ్ రేంజ్, అహ్మదాబాద్, గుజరాత్ పోటీల్లో పాల్గొని రెండు గోల్డ్ మెడల్స్, నాలుగు సిల్వర్ మెడల్స్ సాధించారు. గత ఆగస్టులో త్రివేండ్రంలో జరిగిన సౌత్‌జోన్ షూటింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన సన్వితా.. త్వరలో జరగబోయే ఆలిండియా షూటింగ్ కాంపిటేషన్‌కు ఎంపికయ్యారు.
సంతోషంగా ఉంది
నాకు క్రీడలపై ఆసక్తి ఉంది. నేను 1998లో స్పోర్ట్స్ కోటాలో పోలీసుశాఖలో ఉద్యోగం సంపాదించా. నా కుమార్తె సన్వితషారోన్కు షూటింగ్ అంటే మక్కువ. తన కోరిక కాదనకుండా.. శిక్షణ ఇప్పించా. రాష్ట్ర, జోన్ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించింది. ఇటీవల త్రివేండ్రంలో జరిగిన షూటింగ్ కాంపిటేషన్‌లో పాల్గొని నేషనల్స్‌కు ఎంపికై ంది. ఎంతో సంతోషంగా ఉంది.
– డి.నరేష్ (దిశ పీఎస్ సీఐ)
అంతర్జాతీయ స్థాయికి వెళ్లడమే లక్ష్యం
షూటింగ్ అంటే నాకు ఇష్టం. ఇప్పటి వరకు చాలా కష్టపడ్డాను. నేషనల్స్‌కు ఎంపికయ్యాను. నా తల్లిదండ్రులు, విద్య నేర్పిన గురువుల రుణం తీర్చుకోలేనిది. వారి ప్రోత్సాహం మరువలేనిది. ఎప్పటికై నా దేశం తరఫున అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాలనేది నా కల. అది సాధించి తీరతాను.
– డి.సన్వితాషారోన్