అమెరికా మహిళ అరుదైన రికార్డు అద్భుతాలకే అద్భుతంగా చెప్పదగ్గ ఈ ఉదంతం అమెరికాలో జరిగింది. అలబామాకు చెందిన కెల్సీ హాచర్ అనే 32 ఏళ్ల మహిళ పురిటి నొప్పులతో డిసెంబర్ 19న యూనివర్సిటీ ఆఫ్ అలబామాలోని బర్మింగ్‌హాం ఆస్పత్రి (యూఏబీ)లో చేరింది. 10 గంటల పురిటి నొప్పుల తర్వాత సాధారణ కాన్పులో పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. కానీ పురిటి నొప్పులు మాత్రం అలాగే కొనసాగాయి.
మరో 10 గంటల తర్వాత సిజేరియన్ ద్వారా మరో ఆడపిల్లకు జన్మనిచ్చి అబ్బురపరిచింది. కెల్సీకి రెండు గర్భసంచులుండటం, రెండింట్లోనూ ఒకేసారి గర్భధారణ జరగడం వల్ల ఈ అద్భుతం సాధ్యమైంది. మహిళల్లో ఇలా రెండు గర్భసంచులుండే ఆస్కారమే కేవలం 0.3 శాతమట! వారిలోనూ రెండింట్లోనూ ఒకేసారి గర్భం ధరించే ఆస్కారమైతే 10 లక్షల్లో ఒక్క వంతు మాత్రమేనట! అరుదైన ఈ జంట అద్భుతాలు రెండూ కలిసి రావడంతో కెల్సీ ఇలా అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకుంది!!
తొలి మూడు కాన్పులు సాధారణమే...
కెల్సీకి రెండు గర్భసంచులు ఉన్నట్టు 17వ ఏట బయట పడింది. కానీ పెళ్లి తర్వాత తొలి కాన్పుల్లోనూ సాధారణంగా ఒక్కొక్కరే పుట్టారు. ఈసారీ అలాగే జరగనుందని నెల తప్పినప్పుడు కెల్సీ అనుకుందట. ‘‘కానీ అల్ట్రా సౌండ్ చేయిస్తే రెండు గర్భసంచుల్లోనూ పిండాలున్నట్టు తెలిసి చెప్పలేనంత థ్రిల్‌కు లోనయ్యా. అసలలాంటిది సాధ్యమని మొదట నమ్మకమే కుదర్లేదు’’ అని సంబరంగా చెప్పుకొచ్చిందామె!
అక్కణ్నుంచి కెల్సీ తన అసాధారణ జంట గర్భధారణ గాథను ఇన్‌స్టాగ్రాంలో రెగ్యులర్‌గా ఎప్పటికప్పుడు పంచుకుంటూ వచి్చంది. చూస్తుండగానే నెలలు నిండటం, ఆస్పత్రిలో చేరడం, వరుసగా రెండు రోజుల్లో ఇద్దరు పాపాయిలకు జన్మనిచ్చి రికార్డులకెక్కడం చకచకా జరిగిపోయాయి. ఈ అరుదైన కాన్పుల కోసం ఆస్పత్రి డబుల్ ఏర్పాట్లు చేయడం విశేషం! డబుల్ మానిటరింగ్, డబుల్ చారి్టంగ్ మొదలుకుని కాన్పు కోసం రెండింతల సిబ్బందిని నియమించడం దాకా అన్నీ ‘రెట్టింపు స్పీడు’తో జరిగాయి.
ఇద్దరు పాపాయిలూ గర్భంలో ఆరోగ్యంగా పెరిగినట్టు కాన్పు చేసిన వైద్య బృందానికి సహ సారథ్యం వహించిన ప్రొఫెసర్ రిచర్డ్ డేవిస్ తెలిపారు. ‘‘ఒకే గర్భసంచిలో రెండు పిండాలు పెరిగిన బాపతు సాధారణ గర్భధారణ కాదిది. పిల్లలిద్దరూ ఒకే అపార్ట్‌మెంట్‌లో వేర్వేరు ఫ్లాట్లలో మాదిరిగా ఎవరి గర్భసంచిలో వారు స్వేచ్ఛగా ఎదిగారు’’ అని చెప్పుకొచ్చారు. ‘‘డిసెంబర్ 19న రాత్రి 7.45 గంటలకు తొలి పాప పుట్టింది. 10 గంటల పై చిలుకు పురిటి నొప్పుల తర్వాత డిసెంబర్ 20న ఉదయం 6.10 గంటలకు సిజేరియన్ చేసి రెండో పాపను బయటికి తీశాం. ఇంతటి అరుదైన ఘటనకు సాక్షులుగా నిలిచామంటూ మా వైద్య బృందమంతా కేరింతలు కొట్టాం’’ అని వివరించారు.
పిల్లల బుల్లి రికార్డు...!
నవజాత శిశువులు కూడా రికార్డుల విషయంలో తమ తల్లికి ఏ మాత్రమూ తీసిపోలేదు. వేర్వేరు గర్భసంచుల్లో పెరగడమే గాక ఏకంగా వేర్వేరు పుట్టిన రోజులున్న అత్యంత అరుదైన కవలలుగా రికార్డులకెక్కారు. అంతేకాదు, వీరు ఎవరికి వారు వేర్వేరు అండం, వీర్య కణాల ఫలదీకరణ ద్వారా కడుపులో పడటం మరో విశేషం! ఇలాంటి కవలలను ఫ్రాటర్నల్ ట్విన్స్‌గా పిలుస్తారని ప్రొఫెసర్ రిచర్డ్ తెలిపారు. మొత్తానికి రికార్డులు సృష్టించడంలో తల్లికి తీసిపోమని పుట్టీ పుట్టగానే నిరూపించుకున్నారంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు!
బంగ్లా మహిళ బంపర్ రికార్డు!
ఇలాంటి అరుదైన ‘జంట జననాలు’ అత్యంత అరుదే అయినా అసలు జరగకుండా పోలేదు. 2019లో బంగ్లాదేశ్‌లో జరిగిన ఇలాంటి ఘటన దీన్ని తలదన్నేలా ఉండటం విశేషం! రెండు గర్భసంచుల్లోనూ గర్భం దాలి్చన ఓ మహిళ తొలి కాన్పు తర్వాత ఏకంగా నెల రోజుల తర్వాత రెండో పాపాయికి జన్మనిచ్చిందట! ఆ పురుళ్లు పోసిన వైద్యుడు అప్పట్లో ఈ వింతను
బీబీసీతో పంచుకున్నాడు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment