University of Alabama
-
2 గర్భసంచులు.. 2 రోజులు..2 ప్రసవాలు
అమెరికా మహిళ అరుదైన రికార్డు అద్భుతాలకే అద్భుతంగా చెప్పదగ్గ ఈ ఉదంతం అమెరికాలో జరిగింది. అలబామాకు చెందిన కెల్సీ హాచర్ అనే 32 ఏళ్ల మహిళ పురిటి నొప్పులతో డిసెంబర్ 19న యూనివర్సిటీ ఆఫ్ అలబామాలోని బర్మింగ్‌హాం ఆస్పత్రి (యూఏబీ)లో చేరింది. 10 గంటల పురిటి నొప్పుల తర్వాత సాధారణ కాన్పులో పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. కానీ పురిటి నొప్పులు మాత్రం అలాగే కొనసాగాయి. మరో 10 గంటల తర్వాత సిజేరియన్ ద్వారా మరో ఆడపిల్లకు జన్మనిచ్చి అబ్బురపరిచింది. కెల్సీకి రెండు గర్భసంచులుండటం, రెండింట్లోనూ ఒకేసారి గర్భధారణ జరగడం వల్ల ఈ అద్భుతం సాధ్యమైంది. మహిళల్లో ఇలా రెండు గర్భసంచులుండే ఆస్కారమే కేవలం 0.3 శాతమట! వారిలోనూ రెండింట్లోనూ ఒకేసారి గర్భం ధరించే ఆస్కారమైతే 10 లక్షల్లో ఒక్క వంతు మాత్రమేనట! అరుదైన ఈ జంట అద్భుతాలు రెండూ కలిసి రావడంతో కెల్సీ ఇలా అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకుంది!! తొలి మూడు కాన్పులు సాధారణమే... కెల్సీకి రెండు గర్భసంచులు ఉన్నట్టు 17వ ఏట బయట పడింది. కానీ పెళ్లి తర్వాత తొలి కాన్పుల్లోనూ సాధారణంగా ఒక్కొక్కరే పుట్టారు. ఈసారీ అలాగే జరగనుందని నెల తప్పినప్పుడు కెల్సీ అనుకుందట. ‘‘కానీ అల్ట్రా సౌండ్ చేయిస్తే రెండు గర్భసంచుల్లోనూ పిండాలున్నట్టు తెలిసి చెప్పలేనంత థ్రిల్‌కు లోనయ్యా. అసలలాంటిది సాధ్యమని మొదట నమ్మకమే కుదర్లేదు’’ అని సంబరంగా చెప్పుకొచ్చిందామె! అక్కణ్నుంచి కెల్సీ తన అసాధారణ జంట గర్భధారణ గాథను ఇన్‌స్టాగ్రాంలో రెగ్యులర్‌గా ఎప్పటికప్పుడు పంచుకుంటూ వచి్చంది. చూస్తుండగానే నెలలు నిండటం, ఆస్పత్రిలో చేరడం, వరుసగా రెండు రోజుల్లో ఇద్దరు పాపాయిలకు జన్మనిచ్చి రికార్డులకెక్కడం చకచకా జరిగిపోయాయి. ఈ అరుదైన కాన్పుల కోసం ఆస్పత్రి డబుల్ ఏర్పాట్లు చేయడం విశేషం! డబుల్ మానిటరింగ్, డబుల్ చారి్టంగ్ మొదలుకుని కాన్పు కోసం రెండింతల సిబ్బందిని నియమించడం దాకా అన్నీ ‘రెట్టింపు స్పీడు’తో జరిగాయి. ఇద్దరు పాపాయిలూ గర్భంలో ఆరోగ్యంగా పెరిగినట్టు కాన్పు చేసిన వైద్య బృందానికి సహ సారథ్యం వహించిన ప్రొఫెసర్ రిచర్డ్ డేవిస్ తెలిపారు. ‘‘ఒకే గర్భసంచిలో రెండు పిండాలు పెరిగిన బాపతు సాధారణ గర్భధారణ కాదిది. పిల్లలిద్దరూ ఒకే అపార్ట్మెంట్లో వేర్వేరు ఫ్లాట్లలో మాదిరిగా ఎవరి గర్భసంచిలో వారు స్వేచ్ఛగా ఎదిగారు’’ అని చెప్పుకొచ్చారు. ‘‘డిసెంబర్ 19న రాత్రి 7.45 గంటలకు తొలి పాప పుట్టింది. 10 గంటల పై చిలుకు పురిటి నొప్పుల తర్వాత డిసెంబర్ 20న ఉదయం 6.10 గంటలకు సిజేరియన్ చేసి రెండో పాపను బయటికి తీశాం. ఇంతటి అరుదైన ఘటనకు సాక్షులుగా నిలిచామంటూ మా వైద్య బృందమంతా కేరింతలు కొట్టాం’’ అని వివరించారు. పిల్లల బుల్లి రికార్డు...! నవజాత శిశువులు కూడా రికార్డుల విషయంలో తమ తల్లికి ఏ మాత్రమూ తీసిపోలేదు. వేర్వేరు గర్భసంచుల్లో పెరగడమే గాక ఏకంగా వేర్వేరు పుట్టిన రోజులున్న అత్యంత అరుదైన కవలలుగా రికార్డులకెక్కారు. అంతేకాదు, వీరు ఎవరికి వారు వేర్వేరు అండం, వీర్య కణాల ఫలదీకరణ ద్వారా కడుపులో పడటం మరో విశేషం! ఇలాంటి కవలలను ఫ్రాటర్నల్ ట్విన్స్‌గా పిలుస్తారని ప్రొఫెసర్ రిచర్డ్ తెలిపారు. మొత్తానికి రికార్డులు సృష్టించడంలో తల్లికి తీసిపోమని పుట్టీ పుట్టగానే నిరూపించుకున్నారంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు! బంగ్లా మహిళ బంపర్ రికార్డు! ఇలాంటి అరుదైన ‘జంట జననాలు’ అత్యంత అరుదే అయినా అసలు జరగకుండా పోలేదు. 2019లో బంగ్లాదేశ్‌లో జరిగిన ఇలాంటి ఘటన దీన్ని తలదన్నేలా ఉండటం విశేషం! రెండు గర్భసంచుల్లోనూ గర్భం దాలి్చన ఓ మహిళ తొలి కాన్పు తర్వాత ఏకంగా నెల రోజుల తర్వాత రెండో పాపాయికి జన్మనిచ్చిందట! ఆ పురుళ్లు పోసిన వైద్యుడు అప్పట్లో ఈ వింతను బీబీసీతో పంచుకున్నాడు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఫాస్ట్‌పుడ్ తింటున్నారా.. జర జాగ్రత్త!
ఫాస్ట్‌ఫుడ్ సెంటర్.. ఏ గల్లీలో చూసినా ఇవే దర్శనమిస్తుంటాయి. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా పుట్టగొడుగుల్లా ఫాస్ట్‌పుడ్ సెంటర్లు పుట్టుకొచ్చాయి. ప్రతి ఏరియాలోనూ నాలుగైదు జంక్‌పుడ్ సెంటర్లు కనిపిస్తాయి. దీంతో యువత వీటిపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. స్కూల్ పిల్లలు, యువతీ, యువకులు.. ఇలా అన్ని వర్గాలకు చెందిన వారు ఫాస్ట్‌ఫుడ్‌ను ఆశ్రయిస్తున్నారు. బ్యాచిలర్స్ వీటికి ఎక్కువగా అలవాటు పడుతున్నారు. యువ ఉద్యోగులు రాత్రివేళల్లోనూ పనిచేయాల్సి రావడంతో ఫాస్ట్‌ఫుడ్‌కు పట్టణాలలో బాగా ఆదరణ లభిస్తున్నది. ఇదే సంస్కృతి ఇప్పుడు పల్లెలలో కూడా వ్యాపించింది. జంక్ పుడ్ పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇవి తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిసి కూడా యువత జంక్‌పుడ్‌పై మోజు చూపుతుంది. ఫాస్ట్‌ఫుడ్‌కు ఎక్కువగా అలవాటు పడితే డయాబెటిస్, రక్తపోటు, స్థూలకాయం, గుండెజబ్బులు, కేన్సర్ వంటి వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉన్నట్లు ఇప్పటికే పలు పరిశోధనల్లో తేలిన సంగతి తెలిసిందే. అయితే, ఫాస్ట్‌ఫుడ్ భావోద్వేగాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఫాస్ట్‌ఫుడ్ ఎక్కువగా తీసుకునేవారు డిప్రెషన్‌తో బాధపడుతున్నారని చెబుతున్నారు బర్మింగామ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ అలబామాకు చెందిన పరిశోధకులు. కొంతమంది పాఠశాల విద్యార్థుల ఆహారపు అలవాట్లను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత ఫాస్ట్‌ఫుడ్ వల్ల వ్యాకులతకు లోనవుతారని నిర్ధారించారు. పరిశోధన జరిగిందిలా.. పరిశీలన కోసం ఫాస్ట్‌పుడ్ ఎక్కువగా తీసుకునే 84 మంది పాఠశాల వయసు గల బాల, బాలికలను తీసుకున్నారు. వీరిలో 95 శాతం మంది తక్కువ ఆదాయ గృహాలకు చెందిన ఆఫ్రికన్ అమెరికన్లు. సోడియం,పోటాషియంల శాతాన్ని పరీక్షించడం కోసం ప్రతి రోజు రాత్రిపూట వారి మూత్ర నమూనాలు సేకరించారు. ఇలా ఏడాదిన్నర కాలంపాటు అధ్యయనం చేసి తర్వాత ఈ విషయాన్ని వెల్లడించారు. జంక్‌పుడ్ తీసుకునేవారిలో సోడియం శాతం పెరిగి, పోటాషియం తగ్గుతుందని పరిశోధనలో తేలిందని యూనివర్సీటీ నిపుణులు పేర్కొన్నారు. సోడియం శాతం పెరగడానికి కారణం ఇవే ‘ఫాస్ట్‌ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్లే శరీరంలో సోడియం శాతం పెరుగుతుంది. దీని వల్ల కుంగుబాటుకి లోనవుతారు’ అని యూనివర్సిటీ ఆఫ్ అలబామా కు చెందిన మనోవిజ్ఞాన శాస్త్ర ప్రొఫెసర్ సిల్వీ మ్రగ్ తెలిపారు. జంక్పుడ్లో ఎక్కువ మొత్తం కొవ్వు, చక్కెర, ఉప్పు వుంటాయి. శరీరానికి ఉపయోగపడే ప్రొటీన్స్, విటమిన్స్, ఇతర పోషక పదార్థాలు వుండవు. మనకు అవసరమైన పీచు పదార్థాలు లభించవని చెప్పారు. బీన్స్, చిలగడ దుంపలు, బచ్చలికూర, టమోటాలు, అరటిపండ్లు, నారింజ, పెరుగు, కూరగాయలు వంటి ఆహారాన్ని తీసుకోకపోవడం వల్లే పోటాషియం శాతం తగ్గుతుందని చెప్పారు. ఈ అధ్యయనం సోడియం, డిప్రెషన్‌పై మాత్రమే జరిగిందన్నారు. అయితే జంక్పుడ్తో డిప్రెషన్‌కు ఎందుకు లోనవుతారనే దానిపై మరిన్ని పరిశోధనలు చేస్తున్నామని వెల్లడించారు. డిప్రెషన్‌కు లోనయ్యేవారిలో అధికులు వీరే వ్యాకులత గురయ్యే వారిలో ఎక్కువమంది పాఠశాల వయసువారే ఉంటున్నారు. 12 నుంచి 17 ఏళ్ల పిల్లలలో ఎక్కువ మంది డిప్రెషన్‌కు లోనవుతున్నారని జాతీయ డేటా విశ్లేషణలో తేలింది. 2005-2017 మధ్య కాలంలో ఇది 52 శాతం పెరిగింది. ఇక యువకుల్లో ఇది 63 శాతంగా ఉంది. డిప్రెషన్, మానసిక క్షోభకు గురికావడం, ఆత్మహత్య ఆలోచనలు రావడం యువకుల్లో ఎక్కువగా పెరుగుతోంది. ఆహారానికి, డిప్రెషన్‌కి మధ్య బలమైన అనుబంధం ఫాస్ట్‌పుడ్ వల్ల యువకులు కూడా డిప్రెషన్‌కు గురవుతున్నారని ఎన్నో అధ్యయనాల్లో తేలింది. స్పెయిన్‌లో వెలువడిన ఓ అధ్యయనం ప్రకారం.. ప్రాసెస్ చేసిన ఆహారం ఎక్కువగా తీసుకునే వారిలో 48 శాతం మంది డిప్రెషన్‌కు లోనవుతున్నారని తేలింది. దాదాపు 9000 మందిని ఆరేళ్లు పరిశీలించి ఈ విషయాన్ని ప్రకటించారు. మనం తీసుకునే ఆహారానికి, డిప్రెషన్‌కి మధ్య బలమైన అనుబంధం ఉందని పలు పరిశోధనల్లో తేలింది. అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, గ్రీస్ మరియు ఇరాన్ పరిశోధనల యొక్క మెటా విశ్లేషణ ప్రకారం.. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల అనారోగ్యంతో పాటు డిప్రెషన్‌కు లోనవుతారని తేలింది. తాజా పండ్లు, కూరగాయలు, ఆకు కూరలతో పాటు కొద్ది మోతాదులో ఫాస్ట్‌పుడ్ తీసుకుంటే డిప్రెషన్ ప్రమాదాన్ని అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి తగ్గాలంటే.. ► ఫాస్ట్‌ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెరలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినకూడదు. ఇవి మెదడులో ఒత్తిడిని కలగజేసే కెమికల్స్‌పై ఏమాత్రం ప్రభావం చూపవు. ఈ క్రమంలో సరైన విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు కలిగిన ఆహారాన్ని నిత్యం తగిన మోతాదులో సరైన వేళకు తీసుకోవాలి. దీని వల్ల కూడా మనకు కలిగే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ►తాజా పండ్లు, కూరగాయలు, పీచు పదార్థాలు కలిగి ఉండే ఆహారాన్ని తీసుకోవాలి ►నిత్యం వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. కష్టతరమైన ఎక్సర్సైజ్లు చేయకున్నా కనీసం ఒక అరగంట పాటు వాకింగ్ చేసినా చాలు. దీంతో శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. అంతేకాదు ఇది బరువు తగ్గడం కోసం, మానసిక ఉల్లాసం కోసం కూడా ఉపయోగపడుతుంది. ►ఆరోగ్యవంతమైన వ్యక్తులు రోజుకు కనీసం 6 నుంచి 8 గంటల పాటు తప్పనిసరిగా నిద్రపోవాలి. లేదంటే ఒత్తిడిని కలిగించే హార్మోన్లు వివిధ రసాయనాలను ఎక్కువగా విడుదల చేస్తాయి. దీంతో ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి. కనుక వీటిని తగ్గించుకోవాలంటే నిత్యం తగినంత సమయం పాటు నిద్రపోవడం తప్పనిసరి. ►నిత్యం పని ఒత్తిడితో బిజీగా ఉన్నా ఏదో ఒక సమయంలో వినోదం అందేలా చూసుకోవాలి. దీంతో ఒత్తిడి కొంత మేర తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అందరితో ఫన్నీగా మాట్లాడడం, జోక్స్ వినడం వంటివి చేస్తే ఒత్తిడి దూరమవుతుంది. ►ఒత్తిడి అధికంగా ఉన్నట్టు భావిస్తే చేసే పనినంతా పక్కన పెట్టి కొన్ని నిమిషాల పాటు కళ్లు మూసుకుని గట్టిగా శ్వాస తీసుకోండి. గాలి పీల్చేటప్పుడు, వదిలేటప్పుడు శ్వాసను గమనించండి. దీంతో ఒత్తిడి కొద్దిగా తగ్గుతుంది. -శెట్టె అంజి, సాక్షి వెబ్ డెస్క్. -
ఇకపై పార్కింగ్ సమస్య ఉండదు!
హూస్టన్: ఆఫీస్, షాపింగ్ మాల్‌కు వెళ్లినప్పుడు కారు లేదా బైక్‌ను పార్క్ చేయడానికి ఎక్కడ ఖాళీగా ఉందా.. అని వెతకాడనికే సమయం వృథాకావటం చూస్తుంటాం. అమెరికాలోని అలబామా వర్సిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థి మెట్టుపల్లి సాయినిఖిల్రెడ్డి ఈ సమస్యకు పరిష్కారం కనుగొన్నాడు. ఇప్పటికే మార్కెట్లో ఉన్న సంక్లిష్టమైన, ఖర్చుతో కూడిన పార్కింగ్ యాప్స్ కంటే భిన్నంగా స్పేస్ డిటెక్టింగ్ పద్ధతిలో దీనిని అభివృద్ధి చేశారు. బిగ్‌డేటా ఎనలిటిక్స్, డీప్ లెర్నింగ్ టెక్నిక్స్ సాయంతో డేటాను విశ్లేషించి డ్రైవర్లు నేరుగా పార్కింగ్‌లో ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉంటుందో చెబుతుంది. ఈ ఆవిష్కరణకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఓపెన్ హౌస్ పోటీ (2018)ల్లో రెండో బహుమతి వచ్చింది. -
అన్ని ఒత్తిడిలకు అదొక్కటే కారణం..!
న్యూయార్క్: చాలా సమస్యలకు నిద్ర ఒక్కటే కారణమని అధ్యయనకారులు తెలిపారు. యువకుల్లో నిద్రలేమి, సుధీర్ఘ నిద్రవంటి సమస్యలు వారిపై అమితమైన ఒత్తిడిని కలిగిస్తాయని ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ ఒత్తిడి ప్రవర్తనపైనే కాకుండా ఆరోగ్యంపైనా, రోజువారిగా నిర్వహించాల్సిన కార్యకలాపాలపైన కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని అధ్యయనం తేల్చింది. నిద్రలేమి, సుధీర్ఘ నిద్ర అనే రెండు సమస్యలపై అమెరికాలోని బర్మింగామ్ లోగల యూనివర్సిటీ ఆఫ్ అలబామా కు చెందిన మనోవిజ్ఞానశాస్త్ర ప్రొఫెసర్ సిల్వీ మ్రగ్ ఆయన సహచరులు ప్రత్యేక పరిశోధనలు నిర్వహించారు. ఇందుకోసం మొత్తం 84 మంది యువకులను పరిశీలించారు. వీరిలో ఒత్తిడి స్థాయిలను పరిశీలించి ఆ ఒత్తిడిలో తారతమ్యాలు ఉండటానికి ప్రధాన కారణం నిద్రేనని తేల్చారు. సాధరణంగా నిద్రలేమి వారిలో కార్టిసోల్(అడ్రినలిన్ లో విడుదలయ్యే హార్మోన్) స్థాయిలు ఎంతైతే ఎక్కువగా ఉన్నాయో.. అంతే స్థాయి సుధీర్ఘంగా నిద్రపోయేవారిలో కూడా ఉన్నాయని, ఈ ఫలితాలు తమకు అమిత ఆశ్చర్యాన్ని కలిగించాయని చెప్పారు. ఒత్తిడి కారణంగానే ప్రతి చిన్న విషయం సమస్యగా కనిపిస్తుందని, ఆ ఒత్తిడి లేకుండా చూసుకుంటే పెద్ద సమస్యనైనా ఇట్టే పరిష్కరించుకోవచ్చని తెలిపారు.