అన్ని ఒత్తిడిలకు అదొక్కటే కారణం..!
న్యూయార్క్: చాలా సమస్యలకు నిద్ర ఒక్కటే కారణమని అధ్యయనకారులు తెలిపారు. యువకుల్లో నిద్రలేమి, సుధీర్ఘ నిద్రవంటి సమస్యలు వారిపై అమితమైన ఒత్తిడిని కలిగిస్తాయని ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ ఒత్తిడి ప్రవర్తనపైనే కాకుండా ఆరోగ్యంపైనా, రోజువారిగా నిర్వహించాల్సిన కార్యకలాపాలపైన కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని అధ్యయనం తేల్చింది. నిద్రలేమి, సుధీర్ఘ నిద్ర అనే రెండు సమస్యలపై అమెరికాలోని బర్మింగామ్ లోగల యూనివర్సిటీ ఆఫ్ అలబామా కు చెందిన మనోవిజ్ఞానశాస్త్ర ప్రొఫెసర్ సిల్వీ మ్రగ్ ఆయన సహచరులు ప్రత్యేక పరిశోధనలు నిర్వహించారు.
ఇందుకోసం మొత్తం 84 మంది యువకులను పరిశీలించారు. వీరిలో ఒత్తిడి స్థాయిలను పరిశీలించి ఆ ఒత్తిడిలో తారతమ్యాలు ఉండటానికి ప్రధాన కారణం నిద్రేనని తేల్చారు. సాధరణంగా నిద్రలేమి వారిలో కార్టిసోల్(అడ్రినలిన్ లో విడుదలయ్యే హార్మోన్) స్థాయిలు ఎంతైతే ఎక్కువగా ఉన్నాయో.. అంతే స్థాయి సుధీర్ఘంగా నిద్రపోయేవారిలో కూడా ఉన్నాయని, ఈ ఫలితాలు తమకు అమిత ఆశ్చర్యాన్ని కలిగించాయని చెప్పారు. ఒత్తిడి కారణంగానే ప్రతి చిన్న విషయం సమస్యగా కనిపిస్తుందని, ఆ ఒత్తిడి లేకుండా చూసుకుంటే పెద్ద సమస్యనైనా ఇట్టే పరిష్కరించుకోవచ్చని తెలిపారు.