2021లో బాగుండాలంటే.. ఈ 5 మార్చుకోండి! | 5 Habits Need to Change in 2021 for The Sake of Your Emotional Wellness | Sakshi
Sakshi News home page

మానసికంగా సంతోషంగా ఉండాలంటే..

Published Sat, Dec 12 2020 10:57 AM | Last Updated on Mon, Dec 21 2020 12:29 PM

5 Habits Need to Change in 2021 for The Sake of Your Emotional Wellness - Sakshi

2020 ప్రతి ఒక్కరి జీవితాల మీద ఎంతో ప్రభావాన్ని చూపించింది. ఊహించని మార్పులు తీసుకొచ్చింది. వేడుకలు దూరమయ్యాయి... ఇళ్లు ఆఫీసయ్యింది. సినిమాలు లేవు.. షికార్లు లేవు. మన జీవిన విధానంలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. చాలా వరకు బయటి తిండి తగ్గించాము. ఇంటి భోజనానికి అందులోనూ.. ఆరోగ్యకరమైన ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యత పెరిగింది. ఇవి మంచి విషయాలైతే.. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితం కావడం.. చాలా కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించడం వంటి సంఘటనలతో ఒత్తిడి, ఆందోళన పెరిగాయి. చాలా మందిలో మానసిక కుంగుబాటు ఎక్కువయ్యింది. మరి కొద్ది రోజుల్లో 2020కి ముగింపు పలకబోతున్నాం. ఇక 2021లో మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ ఐదు అలవాట్లను తప్పక మార్చుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు. అవేంటో చూడండి.. మీలో కూడా ఈ లక్షణాలు ఉంటే మార్చుకుని వచ్చే ఏడాదిని సంతోషంగా గడపండి...

ఫీలింగ్స్‌ని అణిచవేసుకుంటున్నాం..
దాదాపు ఈ ఏడాది ప్రతి ఒక్కరు ఈ పరిస్థితిని అనుభవించారు. మన ఎమోషన్స్‌ని కావాలని ఇగ్నోర్‌ చేసే పరిస్థితులను 2020లో ఎదుర్కొన్నాం. అయితే ఇలా ఫీలింగ్స్‌ని అణిచివేసుకోవడం మంచిదేనా అంటే.. కాదని అంటున్నారు నిపుణులు. అవసరానికి తగ్గట్లు ప్రస్తుతం మన భావాల్ని అణచివేసుకుంటూ పోతే భవిష్యత్తులో అది మన మానసిక ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతుంది అంటున్నారు. ఫీలింగ్స్‌ని అణిచి వేసుకోవడం వల్ల మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవడమే కాక మైగ్రేన్‌, హై బీపీ వంటి అనారోగ్యాల బారిన పడతామంటున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్‌, ఆల్కహాల్‌ వంటి చెడు వ్యసనాలకు బానిసవుతామని హెచ్చరిస్తున్నారు. కనుక దగ్గరి వాళ్లతో మన ఫీలింగ్స్‌ని షేర్‌ చేసుకోవడం.. లేదంటే ఓ పేపర్‌ మీద రాసుకుని.. ఆ పరిస్థితుల గురించి మనకు మనమే విశ్లేషించుకోవడం బెటర్‌ అంటున్నారు నిపుణులు. ఇవేవి కాదంటే థెరపిస్ట్‌ని కలవమని సూచిస్తున్నారు.  (చదవండి: న్యూ ఇయర్‌ నిర్ణయాలు కొనసాగాలంటే)

అధిక ఒత్తిడి భరిస్తున్నాం..
మనం ఎదుర్కొనే సగం అనారోగ్యాలకి మూల కారణం ఒత్తిడికి గురవ్వడం. ఆందోళనని బయటకు వెళ్లడించడం ఎంతో మంచిది. ఇక మన బుర్రలో నడిచే విషయాల గురించి పట్టించుకోకపోతే.. వాటిని విశ్లేషించి ఓ కొలిక్కి రాకపోతే.. ఒత్తిడి పీక్స్‌కి వెళ్తుంది. దాంతో మన మెదడు కార్టిసాల్‌ అనే ఒక స్టెరాయిడ్ హార్మోన్ విడుదల చేస్తుంది. సాధారణంగా కార్టిసాల్‌ పని ఏంటంటే ఇది మన జీవక్రియ రోగనిరోధక ప్రతిస్పందనతో సహా శరీరమంతా విస్తృతమైన ప్రక్రియలను నియంత్రిస్తుంది. ఈ హార్మోన్‌ ఎక్కువ మొత్తంలో విడుదల అయితే.. ఇది మెదడు పని తీరును అడ్డుకుంటుంది. దాంతో రోజువారి జీవిన విధానం పూర్తిగా దెబ్బ తింటుంది. కనుక ఒత్తిడి లేవల్స్‌ పెరిగినప్పుడు తప్పకుండా బ్రేక్‌ తీసుకొండి. దాన్ని జయించడానికి ప్రతిరోజు యోగా, ధ్యానం చేయడం అలవాటు చేసుకొండి. తీవ్రమైన ఆలోచనల నుంచి బయటపడేందుకు మీ మనసుకు నచ్చే పనులు చేయడం మంచిది అంటున్నారు నిపుణులు. 

తగినంత నిద్ర పోవడం లేదు...
దురదృష్టవశాత్తు.. గత కొద్దేళ్లుగా మన నిద్ర అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. ఇది అనారోగ్యకరమైన పద్ధతి అని తెలిసినప్పటికి మార్చుకోలేకపోతున్నాం. మంచి మానసిక ఆరోగ్యం కోసం ప్రతిరోజూ ఎనిమిది గంటల నిద్ర పొందడం చాలా ముఖ్యం. వాస్తవానికి, ది స్లీప్ హెల్త్ ఫౌండేషన్ చేసిన పరిశోధనలో 60 నుంచి 90 శాతం మంది రోగులు నిద్రలేమితో బాధపడుతున్నా వారే అని తెలిపింది. ఒక్క రోజు సరిగా నిద్రపోకపోతేనే.. ఆ రోజంతా ఏదోలా ఉంటుంది. గందరగోళంగా అనిపిస్తుంది. ఈ అలవాటు ఇలానే కొనసాగితే..  ఇది దీర్ఘకాలంలో మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కనుక రాబోయే సంవత్సరంలో నిద్రకు ప్రాధాన్యతనివ్వండి. మీరు బాగా విశ్రాంతి తీసుకోకపోతే, మీ మనస్సు సరిగా పనిచేయదు, ఇది అనేక ఇతర సమస్యలకు దారితీస్తుంది. (చదవండి: ఆనందారోగ్యాలకు పది సూత్రాలు)

తగినంత వ్యాయామం లేదు..
మన శారీరక ఆరోగ్యానికి వ్యాయామం ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. అయితే ఇది మన మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని మీకు తెలుసా. ఎక్సర్‌సైజ్‌ విషయంలో  2020 మమ్మల్ని మరింత బద్దకస్తులుగా మార్చింది. లేచిన దగ్గర నుంచి చాలా మంది మొబైల్‌ స్క్రీన్‌లు, కంప్యూటర్లకు అతుక్కుపోయారు. సామాజిక దూరం కారణంగా వ్యాయమాన్ని నిర్లక్ష్యం చేశాము. ఇక రాబోయే సంవత్సరంలో ఈ అలవాటును తప్పక మార్చాల్సిందే. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అనేది  ఎండార్ఫిన్‌లను విడుదల చేయడంలో సహాయపడుతుంది. మనకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. మయోక్లినిక్ విడుదల చేసిన ఒక కథనం ప్రకారం, వ్యాయామం “ఫీల్‌-గుడ్‌ ఎండార్ఫిన్లు, సహజ గంజాయి లాంటి మెదడు రసాయనాలు (ఎండోజెనస్ కానబినాయిడ్స్), ఇతర సహజ మెదడు రసాయనాలను విడుదల చేస్తుంది. ఇవి మనల్ని మానసికంగా సంతోషంగా ఉంచుతాయి”. జిమ్‌కు వెళ్లడం మరి కొద్ది రోజులు వీలుపడక పోవచ్చు. కానీ వాకింగ్‌ చేయడం ఒకే కదా. ప్రయత్నించండి.. 21 రోజుల తర్వాత ఎలా ఉందో పరిశీలించండి.

24 గంటలు సోషల్‌ మీడియానే లోకం..
2020 మనల్ని సోషల్ మీడియాకు మరింత బానిసల్ని చేసింది. లాక్‌డౌన్‌ కారణంగా చాలా రోజుల పాలు అందరూ ఇళ్లకే పరిమితం కావడంతో ఏం చేయాలో పాలుపోక స్క్రోలింగ్ చేయడం, సెల్ఫీలు పోస్ట్ చేయడం, రోజంతా మీమ్స్‌ను సర్చ్‌ చేయడం వంటివి చేస్తూ టైం పాస్‌ చేశారు.  సోషల్ ప్లాట్‌ఫామ్‌లపై కొంత సమయం గడపడం మంచిదే. కానీ ప్రతి ఐదు నిమిషాలకోసారి ఎఫ్‌బీ, ఇన్‌స్టాగ్రామ్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలనే కోరిక ఉంటే, మీ సమస్య తీవ్రమైనట్లే. ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుంది. మొబైల్‌కే అతుక్కపోవడం వల్ల శారీరక ఆతోగ్యం కూడా దెబ్బతింటుంది. కష్టమైనా సరే ఈ ఏడాది సోషల్‌ మీడియా వాడకాన్ని తగ్గిద్దాం అని నిర్ణయం తీసుకొండి. ఆ సమయాన్ని మీలోని సృజనాత్మకతకు మెరుగులు దిద్దుకునేందుకు.. కుటుంబంతో గడిపేందుకు.. ఇష్టమైన వ్యాపకాలను కొనసాగించడానికి వినియోగించండి. ఆ తర్వాత మీరే అద్భుతః అంటారు. (చదవండి: మోదీ ఎలా యాక్టివ్‌గా ఉంటున్నారు ?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement