పొందూరు చేనేతపై నిర్మలా సీతారామన్‌ ప్రశంసలు | Nirmala Sitharaman Comments On Ponduru Khadi | Sakshi
Sakshi News home page

Nirmala Sitharaman Ponduru Visit: పొందూరు ఖాదీ దేశంలోనే ప్రథమం: నిర్మల

Published Sun, Aug 8 2021 2:08 AM | Last Updated on Sun, Aug 8 2021 11:24 AM

Nirmala Sitharaman Comments On Ponduru Khadi - Sakshi

సభలో జ్వోతి ప్రజ్వలన చేస్తున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌. చిత్రంలో స్పీకర్‌ తమ్మినేని, డిప్యూటీ సీఎం కృష్ణదాస్‌ తదితరులు

పొందూరు/ఎచ్చెర్ల క్యాంపస్‌: శ్రీకాకుళం జిల్లాలోని పొందూరులో మెగా చేనేత, ఖద్దరు క్లస్టర్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. పొందూరు చేనేత, ఖాదీ వస్త్రాలు దేశానికే ఆదర్శమని ఆమె ప్రశంసించారు. శనివారం పొందూరులో జరిగిన జాతీయ చేనేత దినోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆంధ్ర ఫైన్‌ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘం భవన ప్రాంగణంలో ఖాదీ నేత ప్రక్రియ, వస్త్రాల తయారీ ప్రక్రియలను పరిశీలించారు. రూ.18 లక్షల చెక్కును ఆంధ్రా ఫైన్‌ ఖాదీ కార్మికాభివృద్ధి సంఘానికి అందజేశారు. భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖాదీ తయారీ విధానం తెలుసుకునేందుకు కొన్ని రోజులుగా ఆసక్తిగా ఉన్నానని చెప్పారు.

అనంతరం చేనేత వస్త్రాల స్టాళ్లు, బ్యాంక్‌ల స్టాళ్లను పరిశీలించారు. బ్యాంకు స్టాళ్ల వల్ల ప్రయోజనం లేదని, రుణాలు అర్హులందరికీ కచ్చితంగా ఇవ్వాలని సూచించారు. స్టాళ్ల ముందు లోన్ల వివరాలు ఉంచాలని ఆదేశించారు. చేనేత కార్మికుల కుటుంబాలకు ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద ఇళ్ల యూనిట్లు మంజూరు చేయనున్నట్లు వివరించారు. జేమ్‌–ప్రభుత్వ ఎలక్ట్రానిక్‌ మార్కెటింగ్‌ ద్వారా కొనుగోలు, అమ్మకాలకు ముందుకు రావాలన్నారు. తర్వాత నిర్వహించిన బహిరంగ సభలో ఆమె బ్యాంకులు అందించిన లోన్లను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం సభలో మాట్లాడుతూ, పొందూరు, చుట్టు పక్కల ప్రాంతాల్లో మగ్గం ఉన్న మూడు వేల మందితో మెగా ఖద్దరు, చేనేత క్లస్టర్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. అక్టోబర్‌ 2న గాంధీ జయంతి రోజుకి 50 శాతం పనులు పూర్తి కావాలని చెప్పారు. మళ్లీ ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తానని తెలిపారు. జాతీయ స్థాయిలో 2014లో రూ.9,400 కోట్లు ఉన్న ఖాదీ ఉత్పాదకత 2021 నాటికి రూ.18,000 కోట్లకు పెరిగిందని వివరించారు.

నేతన్న నేస్తంతో ఆదుకుంటున్నాం..
డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మగ్గం ఉన్న ప్రతి ఒక్కరికీ నేతన్న నేస్తం కింద ఏడాదికి రూ.24,000 అందజేస్తోందని తెలిపారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఖద్దరు.. మహాత్మా గాంధీ, మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ వంటి వారి దృష్టిని ఆకర్షించిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్, కింజరాపు రామ్మోహన్‌నాయుడు, జీవీఎల్‌ నరసింహారావు, ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్, కేంద్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్‌ కౌశిక్, రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లాఠకర్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement