Khaddaru
-
ఫ్యాషన్ అంటే ఇదీ.. వస్త్ర వ్యాపారంలోకి లోకనాయకుడు
Kamal Haasan to launch 'KH House of Khaddar' Business: నటనలో మేరునగధీరుడు కమల్‌హాసన్ వస్త్ర వ్యాపారంలోకి అడుగు పెట్టబోతున్నారు. భారతీయ ఖద్దరుని పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నారు. కేహెచ్ హౌజ్ ఆఫ్ ఖద్దర్ బ్రాండ్‌తో ఈ వస్త్రాలు మార్కెట్లోకి తేనున్నారు. బ్రాండ్ ప్రమోషన్లో భాగంగా రెడీ చేసిన ప్రోమోను ట్విట్టర్లో ఆయన షేర్ చేశారు. కమల్‌తో గుర్తింపు కమల్‌హాసన్ ఖద్దరు దుస్తుల వ్యాపారంలోకి రావడం వల్ల ఖద్దరుకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వస్తుందని. తద్వారా చేనేత కార్మికులకు మేలు జరుగుతుందంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు ఎఫెక్ట్ ప్రస్తుతం కమల్‌హాసన్ విక్రమ్, ఇండియన్ 2 చిత్రాల్లో నటిస్తున్నారు. ఇందులో ఇండియన్ 2 చిత్రానికి మన చిత్తూరుకి చెందిన అమృత కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలో ఖద్దరు దుస్తులకు డిమాండ్ ఎక్కువ. అమృత ద్వారా ఇండియన్ 2 చిత్రాల్లో ఖద్దరుతో కమల్‌కి అనుబంధం ఎక్కువైంది. ఎన్నికల హామీ మరోవైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంచీపురంలో చేనేత కార్మికులను ఆదుకునేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానంటూ కమల్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వెస్ట్రన్ వరల్డ్‌కి ఖద్దరుని పరిచయం చేయాలని కమల్ డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా కేహెచ్ బ్రాండ్‌ని తెర మీదకు తీసుకొచ్చారు. ఖద్దరు ఫ్యాషన్ ప్రస్తుతం ఖద్దరు దుస్తులంటే రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులే ఎక్కువ ధరిస్తారనే ముద్ర పడిపోయింది. ఈ ట్రెండ్‌ని కమల్ బ్రేక్ చేసేలా ఉన్నారు. ఖద్దరుతో పూర్తిగా సూటుబూటులో జేమ్స్‌బాండ్ కనిపిస్తూ ప్రమోషన్ ప్రారంభించారు. అందుకు తగ్గట్టుగానే ప్రమోషన్ యాడ్ చివర్లో ‘ఫ్యాషన్ ఈజ్ సివిల్, యేట్ డిస్ఒబీడియెంట్’ అంటూ మీసం మెలేశారు. ఇండియన్ యూత్ వెస్ట్రన్ మెన్ టార్గెట్‌గా ఆయన ఖద్దరు తేబోతున్నట్టు తెలుస్తోంది. Our weavers chance to loom large. Dear West, follow the thread it will reach you to our history. Bravo khaddar says KHHK !! https://t.co/qrxpSE72Yq#KHHouseofKhaddar #BravoKhaddar pic.twitter.com/jMSNv6jR3W — Kamal Haasan (@ikamalhaasan) November 16, 2021 చదవండి: ఆ నమ్మకమే.. ఆయన్ని ఈ వయసులోనూ ‘కింగ్’గా నిలబెట్టింది -
కొత్త బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న కమల్‌హాసన్
విలక్షణ నటుడు కమల్‌హాసన్ ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. ఒక మంచి ఉద్దేశ్యంతోనే ఆయన ఈ ప్రయాణం ఆరంభిస్తున్నారు. యువతకు ఖాదీని దగ్గర చేయాలని, నేత కార్మికులకు చేయూత అందించాలని ‘హౌస్ ఆఫ్ ఖద్దర్’ ఫ్యాషన్ బ్రాండ్‌ను లాంచ్ చేయనున్నారు. ‘‘మన దేశానికి ఖాదీ ఓ గర్వకారణం. అన్ని వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉంటుంది. చలికాలంలో ఉండే అసౌకర్యాన్ని, వేసవి కాలంలో ఉండే వేడి నుంచి మనకు ఉపశమనం ఇస్తుంది. యువతకు ఖాదీని మరింత చేరువ చేయాలని, చేనేత కళాకారుల స్థితిగతులను మెరుగుపరచాలన్నది నా ఆలోచన’’ అన్నారు కమల్‌హాసన్. కాగా వచ్చే నెల కమల్ అమెరికా వెళ్లాలనుకుంటున్నారట. అక్కడి చికాగో నగరంలో తన బ్రాండ్‌ని ఆవిష్కరించాలనుకుంటున్నారని సమాచారం. నవంబరు 7న కమల్ పుట్టినరోజు. ఆ రోజే ‘హౌస్ ఆఫ్ ఖద్దర్’ ఆవిష్కరణ ఉంటుందని టాక్. కమల్, ఆయన కుమార్తె శ్రుతీహాసన్‌కి కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న అమృతా రామ్ ఆధ్వర్యంలో ఈ ఫ్యాషన్ బ్రాండ్ దుస్తుల డిజైనింగ్ జరుగుతోందని తెలిసింది. -
పొందూరు చేనేతపై నిర్మలా సీతారామన్ ప్రశంసలు
పొందూరు/ఎచ్చెర్ల క్యాంపస్: శ్రీకాకుళం జిల్లాలోని పొందూరులో మెగా చేనేత, ఖద్దరు క్లస్టర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పొందూరు చేనేత, ఖాదీ వస్త్రాలు దేశానికే ఆదర్శమని ఆమె ప్రశంసించారు. శనివారం పొందూరులో జరిగిన జాతీయ చేనేత దినోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘం భవన ప్రాంగణంలో ఖాదీ నేత ప్రక్రియ, వస్త్రాల తయారీ ప్రక్రియలను పరిశీలించారు. రూ.18 లక్షల చెక్కును ఆంధ్రా ఫైన్ ఖాదీ కార్మికాభివృద్ధి సంఘానికి అందజేశారు. భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖాదీ తయారీ విధానం తెలుసుకునేందుకు కొన్ని రోజులుగా ఆసక్తిగా ఉన్నానని చెప్పారు. అనంతరం చేనేత వస్త్రాల స్టాళ్లు, బ్యాంక్‌ల స్టాళ్లను పరిశీలించారు. బ్యాంకు స్టాళ్ల వల్ల ప్రయోజనం లేదని, రుణాలు అర్హులందరికీ కచ్చితంగా ఇవ్వాలని సూచించారు. స్టాళ్ల ముందు లోన్ల వివరాలు ఉంచాలని ఆదేశించారు. చేనేత కార్మికుల కుటుంబాలకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల యూనిట్లు మంజూరు చేయనున్నట్లు వివరించారు. జేమ్–ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ ద్వారా కొనుగోలు, అమ్మకాలకు ముందుకు రావాలన్నారు. తర్వాత నిర్వహించిన బహిరంగ సభలో ఆమె బ్యాంకులు అందించిన లోన్లను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం సభలో మాట్లాడుతూ, పొందూరు, చుట్టు పక్కల ప్రాంతాల్లో మగ్గం ఉన్న మూడు వేల మందితో మెగా ఖద్దరు, చేనేత క్లస్టర్ ఏర్పాటు చేయాలని సూచించారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజుకి 50 శాతం పనులు పూర్తి కావాలని చెప్పారు. మళ్లీ ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తానని తెలిపారు. జాతీయ స్థాయిలో 2014లో రూ.9,400 కోట్లు ఉన్న ఖాదీ ఉత్పాదకత 2021 నాటికి రూ.18,000 కోట్లకు పెరిగిందని వివరించారు. నేతన్న నేస్తంతో ఆదుకుంటున్నాం.. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మగ్గం ఉన్న ప్రతి ఒక్కరికీ నేతన్న నేస్తం కింద ఏడాదికి రూ.24,000 అందజేస్తోందని తెలిపారు. స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఖద్దరు.. మహాత్మా గాంధీ, మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ వంటి వారి దృష్టిని ఆకర్షించిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్, కింజరాపు రామ్మోహన్నాయుడు, జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్, కేంద్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కౌశిక్, రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్ఎస్ రావత్, కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ పాల్గొన్నారు. -
పొందూరు చేనేతలు.. అద్భుతాల ఆనవాళ్లు!
చుట్టుకుంటే సోయగం.. కట్టుకుంటే సౌందర్యం.. చేతపట్టుకుంటే చేజారిపోయే గుణం. మదిలో పెట్టుకుంటే మరిచిపోలేని మనోహర లావణ్యం. ఇవేవీ పూలమాలల వర్ణనలు కావు. వస్త్ర విశేషాల ప్రత్యేకతలు! అవును నిజం. ఈరోజున ప్రత్యేకించి పరిచయం అవసరం లేని మధురానుభూతులు. అవి పొందూరు చేనేతలు. తరతరాలుగా మాన్యుల, సామాన్యులను అలరించి.. నేతల నుంచి జీతగాళ్ల వరకు అందరి శరీరాలను మెరిపించే అసలు సిసలు అందాల ఇంద్రధనసులు.. నిపుణులైన నేతగాళ్లు సృజించిన అద్భుతాల ఆనవాళ్లు. మామూలు పత్తిదారాలు అద్భుతాల తారాహారాల్లా పెనవేసుకుని ఎవరి దేహానికైనా కొత్తకాంతులు ఇచ్చే ఇంద్రజాల విశేషాలు.. పొందూరు ఖద్దరు సిత్రాలు. కాలానికి తగ్గట్టు శరీరానికి సౌకర్యమిచ్చే.. తరాలకు తగ్గట్టు అందరినీ ఆకట్టుకునే ఈ ఖద్దరు అద్భుతాలు.. మన ఒంటిపై చేనేతల గిలిగింతలు. స్థాయితో సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో ఉన్న పొందూరు వస్త్రాలు ఔరా అనిపించే హస్తకళా చిత్రాలు. పొందూరు (శ్రీకాకుళం జిల్లా): వేసవిలో చల్లగా.. శీతాకాలంలో వెచ్చగా ఇదీ పొందూరు ఖాదీ వస్త్రాల ప్రత్యేకత. ఈ వస్త్రాలను ధరిస్తే ఎంతో హుందాగా, సౌకర్యవంతంగా ఉంటాయి. అతి సామాన్యుల నుంచి అసామాన్యుల వరకు ధరించేందుకు వీలుగా వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి. మహాత్మా గాంధీ నుంచి ప్రస్తుత రాజకీయ నాయకులు వరకు పొందూరు ఖాదీకి అభిమానులే. ఇదీ పొందూరు ఏఎఫ్‌కేకే సంఘంలో తయారవుతున్న ఖాదీ ప్రత్యేకత. అందుబాటు ధరల్లోనే... ఖాదీలో షర్టులు, పంచెలు, లుంగీలు, తువ్వాళ్లు, రుమాల్లు, చీరలు లభ్యమవుతున్నాయి. ఖాదీ షర్టు క్లాతు మీటరు ఖరీదు రూ. 216 నుంచి రూ. 1585 వరకు పలుకుతోంది. ఖాదీ రడీమేడ్ షర్టులు రూ. 550 నుంచి రూ.1000 వరకు ధరలు ఉన్నాయి. పంచెలు రూ.1300 నుంచి రూ.10 వేలు(ఏఎన్ఆర్ అంచు), లుంగీలు రూ.250 నుంచి రూ.400, టవల్స్ రూ.200 నుంచి రూ.350 వరకు, చీరలు రూ. 3వేలు నుంచి రూ.12 వేలు వరకు ధర పలుకుతున్నాయి. ఇక్కడ లభిస్తున్న ఫ్యాంట్ క్లాత్ వావిలాలలో తయారవుతుంది. పొందూరు ఏఎఫ్కెకె సంఘం కేవీఐసీ(ముంబై) పరిధిలో పనిచేస్తుంది. ఇక్కడ తయారవుతున్న వస్త్రాలు గుంటూరు, వావిలాల, మెట్టుపల్లి, తుని తదితర ప్రాంతాలకు పంపుతున్నారు. బెంగుళూరు, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, మచిలిపట్నం తదితర ప్రాంతాల నుంచి వచ్చి కొనుగోలు చేస్తున్నారు. సౌకర్యవంతంగా ఉంటాయి... చాలా ఏళ్లుగా ఖాదీ వస్త్రాలను ధరిస్తున్నాను. వీటిని ధరిస్తే ఎంతో సుఖంగా, సౌకర్యవంతంగా ఉంటాయి. హుందాతనం ఉట్టిపడుతుంది. వేసవిలో చల్లగా.. శీతాకాలంలో వెచ్చగా ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో మంచిది. – వాండ్రంగి కొండలరావు, ఖాదీ వస్త్ర ప్రేమికుడు, పొందూరు ఊహ తెలిసినప్పటి నుంచీ... నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇదే వృత్తిని నమ్మి జీవిస్తున్నాం. నలుగురు పిల్లలకు పెళ్లిళ్లు చేశాను. ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ ఎంతో మక్కువగా పని చేస్తున్నాం. గత రెండేళ్లుగా నేతన్న నేస్తం రూ. 48 వేలు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించారు. దీంతో ఎంతో ఊరటగా ఉంది. – బస్వా మోహనరావు, ఖాదీ కార్మికుడు, పొందూరు వ్యాపారం బాగుంది... మా సంస్ధ దుకాణాల్లో వ్యాపారం బాగానే జరుగుతోంది. ఆన్లైన్ మార్కెటింగ్ సౌకర్యం అందుబాటులోకి రావడంతో వ్యాపారం ఊపందుకుంది. యువత కూడా ఖాదీ వస్త్రాలపై మొగ్గుచూపుతూ కొనుగోలు చేస్తున్నారు. జీన్ ఫ్యాంట్‌పై మా ఖాదీ షర్టును ధరిస్తున్నారు. – దండా వెంకటరమణ, కార్యదర్శి, ఏఎఫ్‌కేకే సంఘం, పొందూరు -
ఖద్దరుకే ఓటు
కొత్త డ్రెస్ కోడ్‌లో అభ్యర్థులు ఎన్నికలు వచ్చాయంటే నేతల డ్రెస్ కోడ్ మారిపోతుంది. ఖద్దరు ఒంటిమీద పడిందంటే ‘పెద్దరికం’ వచ్చినట్టు భావిస్తారు. తెల్లని దుస్తుల్లో మెరిసిపోతూ హుందాగా తయారై.. ఓటర్లను ఆక ట్టుకునేందుకు ఉత్సాహంతో ఉరకలేస్తారు. అదే సందడి ఇప్పుడు నగరంలోని ఖద్దరు దుకాణాల వద్ద కనిపిస్తోంది. అదును చూసుకుని షాపుల యజమానులు ‘స్పెషల్’ అంటూ అమ్మకాల జోరు పెంచారు. రాజకీయాలకు.. ఖద్దరుకు విడదీయరాని అనుబంధం. ఢిల్లీ నుంచి గల్లీ దాకా.. ఈ బంధం తరతరాలుగా కొనసాగుతోంది. అందుకే నాయకులు, నాయకులమని భావించేవారు.. నేతలు కావాలనుకునేవారు ఖద్దరుకే ఓటేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల సీజన్ కావడంతో గిరాకీ పెరిగింది. నిన్నటివరకు టీ షర్ట్స్, జీన్స్‌లో కన్పించినవారు డివిజన్ అభ్యర్థిగా ఖరారవడంతో నిమిషాల్లో డ్రెస్ మార్చేసి ఖాదీకి షిఫ్టవుతున్నారు. అడుగు బయటపెట్టగానే వారి వెంట తిరిగే చోటా నాయకులు, కార్యకర్తలు కూడా అభ్యర్థి రూట్లోనే ఖద్దరులో కనిపిస్తున్నారు. రోజంతా ఎండలో తిరిగినా ఈ దుస్తుల వల్ల ఇబ్బంది ఉండడం లేదని, ఎక్కువ మందిని కలిసేందుకు వీలవుతుందనేది నేతల అభిప్రాయం. ఖద్దరు టోపీలు, కండువాలకు సైతం డిమాండ్ బాగానే పెరిగింది. సీజన్లో లుక్ మారాల్సిందే.. ఎప్పుడూ టోర్న్ జీన్స్, టైట్ ఫిట్స్.. టీషర్ట్స్‌లో ఉండేవారు కూడా ఇప్పుడు ఖాదీకే ఓటేస్తున్నారు. ఇటీవల రాజకీయ నేతలు కొత్త ఫ్యాషన్‌కు షిఫ్ట్ అయ్యారు. సీనియర్ నేతలతో పాటు వారి వారసులు సైతం ఎన్నికలు రాగానే లుక్ మార్చేశారు. వీరు ఫ్యాషన్‌గా కనబడేందుకు ఖద్దరునే నచ్చిన డిజైన్‌లో కుట్టించుకుంటున్నారు. ఈ దుస్తుల్లో పొలిటికల్ స్టేటస్ వస్తుందనే భావనతో యంగ్ జనరేషన్ కూడా ఆ రూట్లోనే నడుస్తోంది. వారి అభిరుచుల మేరకు కొత్త డిజైన్లను షాపు యజమానులు అందుబాటులో ఉంచుతున్నారు. ఎన్నికలొస్తే పండగే.. హైదరాబాద్‌లో దాదాపు 150కి పైగా ఖద్దరు షాపులున్నాయి. వేసవిలో వ్యాపారం ఫుల్ జోష్‌గా సాగుతోంది. సీజన్లో రోజుకు సుమారు రూ. 50 లక్షల వ్యాపారం జరుగుతుందని అంచనా. ముఖ్యమైన పండగలప్పుడు కొంత పర్వాలేదు. తర్వాత ఎన్నికలు వచ్చాయంటే నేతలు, వారి వెంట ఉండేవారు ఈ షాపుల వైపే చూస్తున్నారు. దీంతో సీజన్‌ను మించి వ్యాపారం సాగుతుంది. ఆ రకాలకే ఓటు.. పొందూరు (ఆంధ్రప్రదేశ్), సేలం, తిరువూర్ (తమిళనాడు), భాగల్పూర్ (బీహార్), మస్లిన్ (బెంగాల్) ఖద్దరుకు ఎక్కువ డిమాండ్ ఉంటుందని భాగ్యనగర్ ఖాదీ బండార్ యజమాని బొప్పన నర్సింహారావు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి తమ దుకాణం నుంచే పొందూరు పంచెలు కొనేవారని గుర్తుచేసుకున్నారు. తమిళనాడు గవర్నర్ రోశయ్య, ఏపీ శాసన మండలి చైర్మన్ చక్రపాణి, రాయపాటి సాంబశివరావు, నిర్మాత డి.సురేష్‌బాబు తమవద్దే ఖద్దరు కొంటారని చెప్పారు. ఈ దుస్తులు కట్టుకుని మండే ఎండలో తిరిగినా ఏ ఇబ్బందులు ఉండవని స్వరాజ్ ఖాదీ వీవర్స్ అధినేత కె. వెంకట్రావు తెలిపారు. యువతరంగం ‘ఓటె’త్తాలి ⇒ఓటు ప్రజాస్వామ్యంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం. ⇒ఒక్క క్షణం ఆలోచిస్తే దేశ భవిష్యత్‌ను, ప్రజల మనుగడను నిర్ణయించేది. ⇒ఓటు ఉండటం కాదు.. ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. ⇒ఐదేళ్లకోసారి మీకు దక్కే ఈ అవకాశాన్ని వినియోగించుకొని సరైన నాయకుడ్ని ఎంచుకోండి. ⇒నగర భవితను మార్చేది మీ ఓటే. ఓటు వేయడం నిర్బంధ బాధ్యతని గుర్తుంచుకోండి. ⇒ప్రజాస్వామ్యంలో మీ గొంతు వినిపించేది ఈ ఓటే. ⇒అందరూ వినియోగించుకుంటేనే మంచి ప్రభుత్వానికి పట్టం కట్టగలరు. ⇒యువత కదలివస్తే నగర భవిత మారుతుంది. యువతరంగం ఓటు కోసం తరలిరావాలి. సీవీ ఆనంద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్