
విలక్షణ నటుడు కమల్‌హాసన్ ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. ఒక మంచి ఉద్దేశ్యంతోనే ఆయన ఈ ప్రయాణం ఆరంభిస్తున్నారు. యువతకు ఖాదీని దగ్గర చేయాలని, నేత కార్మికులకు చేయూత అందించాలని ‘హౌస్ ఆఫ్ ఖద్దర్’ ఫ్యాషన్ బ్రాండ్‌ను లాంచ్ చేయనున్నారు. ‘‘మన దేశానికి ఖాదీ ఓ గర్వకారణం. అన్ని వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉంటుంది.
చలికాలంలో ఉండే అసౌకర్యాన్ని, వేసవి కాలంలో ఉండే వేడి నుంచి మనకు ఉపశమనం ఇస్తుంది. యువతకు ఖాదీని మరింత చేరువ చేయాలని, చేనేత కళాకారుల స్థితిగతులను మెరుగుపరచాలన్నది నా ఆలోచన’’ అన్నారు కమల్‌హాసన్. కాగా వచ్చే నెల కమల్ అమెరికా వెళ్లాలనుకుంటున్నారట. అక్కడి చికాగో నగరంలో తన బ్రాండ్‌ని ఆవిష్కరించాలనుకుంటున్నారని సమాచారం.
నవంబరు 7న కమల్ పుట్టినరోజు. ఆ రోజే ‘హౌస్ ఆఫ్ ఖద్దర్’ ఆవిష్కరణ ఉంటుందని టాక్. కమల్, ఆయన కుమార్తె శ్రుతీహాసన్‌కి కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న అమృతా రామ్ ఆధ్వర్యంలో ఈ ఫ్యాషన్ బ్రాండ్ దుస్తుల డిజైనింగ్ జరుగుతోందని తెలిసింది.