ponduru khadi
-
సమ్మర్లో హాయినిచ్చే పొందూరు చీరలు..అందుకు చేపముల్లు తప్పనిసరి!
75 ఏళ్ల చరిత్ర ఉన్న పొందూరు ఖాదీని మహాత్మాగాంధీని వెలుగులోకి తీసుకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం నగరానికి సుమారు 30 కిలోమీటర్లు దూరంలో ఉన్న పొందూరు అనే గ్రామంలో ఈ మృదువైన ఖాదీని నేస్తారు. ఆ గ్రామం పేరు మీదుగానే ఈ ఖాదీకి పేరు వచ్చింది. ఇప్పటికీ ఆ గ్రామం పత్తి వడకడానికి గాంధీ చరఖా స్పిన్నర్లనే ఉపయోగించడం విశేషం. అందువల్లే ఈ నేత చీరలు ఎక్కడలేని ప్రత్యేకతనూ చాటుకుంటున్నాయి. స్వాతంత్య్రోద్యమ సమయంలో వెలుగొందిన ఈ నూరుకౌంట్ చీర మళ్లీ స్పెషల్ ఎట్రాక్షన్గా ట్రెండ్ అవుతోంది. పొందూరు చీరలనే ఎలా నేస్తారు? వాటి విశేషాలు సవివరంగా తెలుసుకుందామా..!మండుటెండలో ఈ చీర చల్లగా హాయిగా ఉంటుంది. ఎముకలు కొరికే చలిలో వెచ్చదనాన్ని ఇచ్చే పొందికైన చీరలివి. స్వదేశీ ఉద్యమ సమయంలో పొందూరు ఖద్దరు గొప్పతనం గురించి తెలుసుకున్న గాంధీజీ మరిన్ని విషయాలు తెలుసుకోవడానికని స్వయంగా తన కొడుకు దేవదాస్ గాంధీని పొందూరుకు పంపించారట. ఇక్కడి వస్త్రాల తయారీ, నాణ్యతను చూసి దేవదాస్ ఎంతో ముచ్చటపడ్డారట. ఆయన చెప్పిన వివరాలతో మహాత్మ తన ‘యంగ్ ఇండియా’ పత్రికలో అద్భుతమైన వ్యాసం రాశారు. దీంతో ఒక్కసారిగా నాయకులు, ఉద్యమకారులు పొందూరు గ్రామానికి క్యూ కట్టారు. అలా మొదలైంది పొందూరు చేనేత వైభవం. ఆచార్య వినోభాబావే 1955లో శంకుస్థాపన చేసిన పొందూరు చేనేత సంఘ భవనమే... నేడు ఆంధ్రా ఫైన్ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘంగా మారింది. దీని పరిధిలో సుమారు 26 గ్రామాల ప్రజలు జీవనం సాగిస్తుంటే వీరిలో 200మంది నేత కార్మికులు, 1500 మంది నూలు వడికేవారు ఉన్నారు. వీరిలో అత్యధికులు మహిళలే. ఈ గ్రామాల్లో ఏ ఇంటికి వెళ్లినా సున్నితమైన చేతులతో పత్తిని శుద్ధి చేసి వడుకుతోన్న స్త్రీలే ఎక్కువగా కనిపిస్తారు. చేపముల్లుతో పత్తిని శుద్ది చేసి..?పొందూరు నేత కోసం మొదట చేసే పని... చేప ముల్లుతో పత్తిని శుద్ధి చేయడం. అందుకోసం వారు వాలుగ చేప దవడని ఉపయోగిస్తారు. ఇదే వారి ప్రధాన పరికరం. రాజమహేంద్రవరం పరిసరాల్లో మాత్రమే దొరికే ఈ చేపముల్లుని జాలర్లు వారికి ప్రేమగా ఇస్తారు. ఈ ముల్లును స్థానికంగా, ఒక్కోటి ఇరవై రూపాయలకు కొంటారు. దీంతో దూదిని ఏకడం వల్ల పత్తిలోని మలినాలు పోయి, వస్త్రం దృఢంగా ఉంటుందనేది చేనేత కార్మికుల నమ్మకంఅక్కినేని, సినారే బ్రాండ్ అంబాసిడర్లుగా..తెల్లని దుస్తులు ధరించాలనుకునే చాలామంది నిరాశ పడే విషయం... ఒక్క ఉతుకు తరవాత అవి మెరుపు పోవడం, నల్లగా మారడం. కానీ ఈ పొందూరు చీరలు, పంచెలు ఉతికేకొద్దీ ఇంకా ఇంకా వన్నెలీనుతాయి. వేసవిలో చల్లగా, తెల్లగా ఉండే ఈ పంచెల్ని అక్కినేని, సినారే వంటివారు ఎంతగానో ప్రేమించారు. బ్రాండ్ అంబాసిడర్లుగానూ మారారు. ఇప్పటికీ ‘అక్కినేని అంచు పంచెలు’ ఇక్కడ బాగా అమ్ముడవుతాయి. ‘నూరు కౌంట్ మా ప్రత్యేకం. వాలుగ చేప దవడతో దూదిని ఏకిన తరవాత... మగ్గానికి చేరే ముందు వివిధ దశల్లో శుద్ధిచేస్తాం. నూరు కౌంట్ అనడానికి రీజన్..ఏరటం, నిడవటం, ఏకటం, పొల్లు తియ్యటం, మెత్తబరచటం, ఏకు చుట్టడం, వడకటం, చిలక చుట్టడం ఇలా ఎనిమిది దశలు ఉంటాయి. మేమే పత్తి కొనుక్కుని ప్రత్యేక పనిముట్లను ఉపయోగించి పైన చెప్పిన పద్ధతుల్లో సన్నని, స్వచ్ఛమైన నూలుపోగులు తయారు చేస్తాం. అందుకే దీన్ని నూరు కౌంట్ అంటారు. ఆ స్వచ్ఛమైన నూలుపోగులతోనే చీరలు రూపొందిస్తాం. మా దగ్గర తయారయ్యే జాందానీ చీరలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. పూర్తిగా చేతులతోనే నేస్తాం. ఒక్కో చీర ధర రూ.4000 నుంచి రూ.15000 వరకూ ఉంటుంది. తయారీకి 15-20 రోజులు పడుతుంది. ధరతో సంబంధం లేకుండా ఈ చీరలకు ఇప్పటికీ డిమాండ్ ఉండటం విశేషం. మాజీ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్, గాంధీజీ మనవరాలు తారాగాంధీ వంటివారకి ఈ పొందూరు చీరలనే ఎంతోగానో ఇష్టంగా ధరించేవారట.మోదీకి సైతం బహుకరించేందుకు.. 75 ఏళ్ల జల్లేపల్లి కాంతమ్మ... ఆరేళ్ల ప్రాయం నుంచీ ఈ నేత పనిలోనే ఉన్నారు. నూలును నాణ్యంగా వడికే నైపుణ్యం ఉన్న అతి కొద్దిమందిలో కాంతమ్మ ఒకరు. గాంధీజీ సిద్ధాంతాల్ని ఇప్పటికీ ఆచరిస్తోన్న కాంతమ్మని కలవడానికి దేశం నలుమూలల నుంచి చేనేత ప్రేమికులు వస్తూనే ఉంటారు. 2013లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రావాల్సిందిగా ఎర్రకోట నుంచి ఆహ్వానం అందుకున్నారు కాంతమ్మ. అప్పుడే ప్రధాని మోదీకి ఖాదీ గొప్పతనం వివరించి, తన చేతులతో వడికిన నూలును బహుకరించారు. ఇక్కడ తయారవుతున్న వస్త్రాలు గుంటూరు, వావిలాల, మెట్టుపల్లి, తుని తదితర ప్రాంతాలకు పంపుతున్నారు. బెంగుళూరు, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, మచిలిపట్నం తదితర ప్రాంతాల నుంచి వచ్చి మరీ ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. అలాగే ఈ పొందూరు నేతన్నలకు ప్రస్తుత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నేతన్న నేస్తం కింద రూ 48 వేలు అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతుంది. అయితే తర్వాత తరాలు ఈ విద్యపై ఆసక్తి చూపించడం లేదని నేత కార్మికులు బాధపడుతున్నారు. (చదవండి: ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!) -
పొందూరు చేనేతపై నిర్మలా సీతారామన్ ప్రశంసలు
పొందూరు/ఎచ్చెర్ల క్యాంపస్: శ్రీకాకుళం జిల్లాలోని పొందూరులో మెగా చేనేత, ఖద్దరు క్లస్టర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పొందూరు చేనేత, ఖాదీ వస్త్రాలు దేశానికే ఆదర్శమని ఆమె ప్రశంసించారు. శనివారం పొందూరులో జరిగిన జాతీయ చేనేత దినోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘం భవన ప్రాంగణంలో ఖాదీ నేత ప్రక్రియ, వస్త్రాల తయారీ ప్రక్రియలను పరిశీలించారు. రూ.18 లక్షల చెక్కును ఆంధ్రా ఫైన్ ఖాదీ కార్మికాభివృద్ధి సంఘానికి అందజేశారు. భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖాదీ తయారీ విధానం తెలుసుకునేందుకు కొన్ని రోజులుగా ఆసక్తిగా ఉన్నానని చెప్పారు. అనంతరం చేనేత వస్త్రాల స్టాళ్లు, బ్యాంక్ల స్టాళ్లను పరిశీలించారు. బ్యాంకు స్టాళ్ల వల్ల ప్రయోజనం లేదని, రుణాలు అర్హులందరికీ కచ్చితంగా ఇవ్వాలని సూచించారు. స్టాళ్ల ముందు లోన్ల వివరాలు ఉంచాలని ఆదేశించారు. చేనేత కార్మికుల కుటుంబాలకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల యూనిట్లు మంజూరు చేయనున్నట్లు వివరించారు. జేమ్–ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ ద్వారా కొనుగోలు, అమ్మకాలకు ముందుకు రావాలన్నారు. తర్వాత నిర్వహించిన బహిరంగ సభలో ఆమె బ్యాంకులు అందించిన లోన్లను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం సభలో మాట్లాడుతూ, పొందూరు, చుట్టు పక్కల ప్రాంతాల్లో మగ్గం ఉన్న మూడు వేల మందితో మెగా ఖద్దరు, చేనేత క్లస్టర్ ఏర్పాటు చేయాలని సూచించారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజుకి 50 శాతం పనులు పూర్తి కావాలని చెప్పారు. మళ్లీ ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తానని తెలిపారు. జాతీయ స్థాయిలో 2014లో రూ.9,400 కోట్లు ఉన్న ఖాదీ ఉత్పాదకత 2021 నాటికి రూ.18,000 కోట్లకు పెరిగిందని వివరించారు. నేతన్న నేస్తంతో ఆదుకుంటున్నాం.. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మగ్గం ఉన్న ప్రతి ఒక్కరికీ నేతన్న నేస్తం కింద ఏడాదికి రూ.24,000 అందజేస్తోందని తెలిపారు. స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఖద్దరు.. మహాత్మా గాంధీ, మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ వంటి వారి దృష్టిని ఆకర్షించిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్, కింజరాపు రామ్మోహన్నాయుడు, జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్, కేంద్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కౌశిక్, రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్ఎస్ రావత్, కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ పాల్గొన్నారు. -
పొందూరు చేనేతలు.. అద్భుతాల ఆనవాళ్లు!
చుట్టుకుంటే సోయగం.. కట్టుకుంటే సౌందర్యం.. చేతపట్టుకుంటే చేజారిపోయే గుణం. మదిలో పెట్టుకుంటే మరిచిపోలేని మనోహర లావణ్యం. ఇవేవీ పూలమాలల వర్ణనలు కావు. వస్త్ర విశేషాల ప్రత్యేకతలు! అవును నిజం. ఈరోజున ప్రత్యేకించి పరిచయం అవసరం లేని మధురానుభూతులు. అవి పొందూరు చేనేతలు. తరతరాలుగా మాన్యుల, సామాన్యులను అలరించి.. నేతల నుంచి జీతగాళ్ల వరకు అందరి శరీరాలను మెరిపించే అసలు సిసలు అందాల ఇంద్రధనసులు.. నిపుణులైన నేతగాళ్లు సృజించిన అద్భుతాల ఆనవాళ్లు. మామూలు పత్తిదారాలు అద్భుతాల తారాహారాల్లా పెనవేసుకుని ఎవరి దేహానికైనా కొత్తకాంతులు ఇచ్చే ఇంద్రజాల విశేషాలు.. పొందూరు ఖద్దరు సిత్రాలు. కాలానికి తగ్గట్టు శరీరానికి సౌకర్యమిచ్చే.. తరాలకు తగ్గట్టు అందరినీ ఆకట్టుకునే ఈ ఖద్దరు అద్భుతాలు.. మన ఒంటిపై చేనేతల గిలిగింతలు. స్థాయితో సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో ఉన్న పొందూరు వస్త్రాలు ఔరా అనిపించే హస్తకళా చిత్రాలు. పొందూరు (శ్రీకాకుళం జిల్లా): వేసవిలో చల్లగా.. శీతాకాలంలో వెచ్చగా ఇదీ పొందూరు ఖాదీ వస్త్రాల ప్రత్యేకత. ఈ వస్త్రాలను ధరిస్తే ఎంతో హుందాగా, సౌకర్యవంతంగా ఉంటాయి. అతి సామాన్యుల నుంచి అసామాన్యుల వరకు ధరించేందుకు వీలుగా వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి. మహాత్మా గాంధీ నుంచి ప్రస్తుత రాజకీయ నాయకులు వరకు పొందూరు ఖాదీకి అభిమానులే. ఇదీ పొందూరు ఏఎఫ్కేకే సంఘంలో తయారవుతున్న ఖాదీ ప్రత్యేకత. అందుబాటు ధరల్లోనే... ఖాదీలో షర్టులు, పంచెలు, లుంగీలు, తువ్వాళ్లు, రుమాల్లు, చీరలు లభ్యమవుతున్నాయి. ఖాదీ షర్టు క్లాతు మీటరు ఖరీదు రూ. 216 నుంచి రూ. 1585 వరకు పలుకుతోంది. ఖాదీ రడీమేడ్ షర్టులు రూ. 550 నుంచి రూ.1000 వరకు ధరలు ఉన్నాయి. పంచెలు రూ.1300 నుంచి రూ.10 వేలు(ఏఎన్ఆర్ అంచు), లుంగీలు రూ.250 నుంచి రూ.400, టవల్స్ రూ.200 నుంచి రూ.350 వరకు, చీరలు రూ. 3వేలు నుంచి రూ.12 వేలు వరకు ధర పలుకుతున్నాయి. ఇక్కడ లభిస్తున్న ఫ్యాంట్ క్లాత్ వావిలాలలో తయారవుతుంది. పొందూరు ఏఎఫ్కెకె సంఘం కేవీఐసీ(ముంబై) పరిధిలో పనిచేస్తుంది. ఇక్కడ తయారవుతున్న వస్త్రాలు గుంటూరు, వావిలాల, మెట్టుపల్లి, తుని తదితర ప్రాంతాలకు పంపుతున్నారు. బెంగుళూరు, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, మచిలిపట్నం తదితర ప్రాంతాల నుంచి వచ్చి కొనుగోలు చేస్తున్నారు. సౌకర్యవంతంగా ఉంటాయి... చాలా ఏళ్లుగా ఖాదీ వస్త్రాలను ధరిస్తున్నాను. వీటిని ధరిస్తే ఎంతో సుఖంగా, సౌకర్యవంతంగా ఉంటాయి. హుందాతనం ఉట్టిపడుతుంది. వేసవిలో చల్లగా.. శీతాకాలంలో వెచ్చగా ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో మంచిది. – వాండ్రంగి కొండలరావు, ఖాదీ వస్త్ర ప్రేమికుడు, పొందూరు ఊహ తెలిసినప్పటి నుంచీ... నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇదే వృత్తిని నమ్మి జీవిస్తున్నాం. నలుగురు పిల్లలకు పెళ్లిళ్లు చేశాను. ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ ఎంతో మక్కువగా పని చేస్తున్నాం. గత రెండేళ్లుగా నేతన్న నేస్తం రూ. 48 వేలు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించారు. దీంతో ఎంతో ఊరటగా ఉంది. – బస్వా మోహనరావు, ఖాదీ కార్మికుడు, పొందూరు వ్యాపారం బాగుంది... మా సంస్ధ దుకాణాల్లో వ్యాపారం బాగానే జరుగుతోంది. ఆన్లైన్ మార్కెటింగ్ సౌకర్యం అందుబాటులోకి రావడంతో వ్యాపారం ఊపందుకుంది. యువత కూడా ఖాదీ వస్త్రాలపై మొగ్గుచూపుతూ కొనుగోలు చేస్తున్నారు. జీన్ ఫ్యాంట్పై మా ఖాదీ షర్టును ధరిస్తున్నారు. – దండా వెంకటరమణ, కార్యదర్శి, ఏఎఫ్కేకే సంఘం, పొందూరు -
పొందూరు ఖాదీకి విశిష్ట గుర్తింపు
• పొందూరు ఖాదీకి పేటెంట్ హక్కును కల్పించిన కేంద్ర ప్రభుత్వం • వారసత్వ, సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నంగా గుర్తింపు • ఖాదీ కార్మికులను ఆదుకునేందుకు హెరిటేజ్ క్లస్టర్ ఏర్పాటుకు సన్నాహాలు పొందూరు: పొందూరు ఖాదీకి భారత ప్రభుత్వం విశిష్ట గుర్తింపునిచ్చింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఖాదీ విలేజ్ ఇండ్రస్ర్ కమిషన్(కేవీఐసీ) చైర్మెన్ సక్సేనాలు పొందూరు ఖాదీని వారసత్వ, సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నంగా గుర్తించారు. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం పొందూరు ఖాదీకి పేటెంట్ హక్కును ప్రకటించింది. దీనిక సంబంధించిన వస్త్రాలపై ముద్రించేందుకు ఖాదీ లోగో ( చిహ్నం)ను ఏర్పాటు చేశారు. ఫైన్ ఖాదీ వస్త్రాలు నేసిన కార్మికులకు సంబంధించి నేత పనివారికి 10 శాతం, వడుకు పనివారికి 20 శాతం మజూరీలు పెంచేందుకు సమాలోచనలు చేస్తున్నట్టు ఇటీవల సందర్శించిన కేవీఐసీ డివిజనల్ డైరెక్టర్ ఎం.భూమయ్య వెల్లడించారు. స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించిన ఖాదీ... విదేశీ వస్తు బహిష్కరణలో భాగంగా ఖాదీ వస్త్రాలు దేశ ప్రజల్లో స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించాయి. ఉప్పు సత్యాగ్రహానికి తోడుగా మన ఖాదీ వస్త్రాలను మనమే ధరించాలనే నినాదం తారాస్థాయికి చేరుకోవడంతో ఖాదీ ఉద్యమానికి నాంది పలికింది. ఆ నేపధ్యంలో పొందూరు ఖాదీపై గాంధీ దృష్టి కేంద్రీకరించి, అతని మనుమడు దేవదాస్ గాంధీని 1921లో పొందూరుకు పంపించారు. అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా పొందూరు ఖాదీ వస్త్రాలు చలామనీ అయ్యాయి. భూదాన ఉద్యమంలో భాగంగా ఆచార్య వినోభాబావే పొందూరు గ్రామాన్ని సందర్శించినప్పుడు 1955 అక్టోబర్ 13న చేనేత సంఘ భవనానికి శంకుస్థాపన చేశారు. కేవీఐసీ (ఖాదీ గ్రామోద్యోగ కమిషన్) ఆధ్వర్యంలో ఏఎఫ్కేకే (ఆంధ్రాపైన్ ఖాధీ కార్మిక అభివృద్ధి సంఘం)గా నామకరణం చేసింది. ఈ సంఘం పరిధిలో సుమారు 26 గ్రామాల ప్రజలు జీవనం సాగిస్తున్నారు. వందమంది నేతకార్మికులు, 900 మంది నూలు వడుకువారు ఎనిమిది మండలాల్లో విస్తరించి ఉన్నారు. ఖాదీ ఉత్పత్తుల అమ్మకాలకు జిల్లాలో ఒక ఉత్పత్తి విక్రయశాల, 4 ఉత్పత్తి కేంద్రాలు, 9 విక్రయాల ఖాధీ బాండాగారాలు ఏర్పాటు చేశారు. చేపముల్లే సాధనంగా... నాణ్యమైన పత్తి నుంచి దారం తీసి ఖద్దరు వస్త్రాన్ని తయారుచేయడం ఇక్కడ నేత కార్మికుల ప్రత్యేకత. ఖద్దరు ఉత్పత్తుల తయారీకి చేపముల్లే సాధనంగా ఉపయోగించడం విశేషం. చేపముల్లుతో శుభ్రం చేసిన పత్తిని చేతితో వడికి నూలును తీసి చేమగ్గంపై వస్త్రం నేస్తారు. ఇదే అసలైన పొందూరు ఖాదీ. మిషన్మీద నూలును తీసి వస్త్రాన్ని తయారు చేసి నకిలీ ఖాదీని విక్రయిస్తూ కార్మికుల పొట్టకొట్టేయడం వ్యాపారుల చేస్తున్న దుర్మార్గం. దీనిని నియంత్రించేందుకే కేంద్ర ప్రభుత్వం పొందూరు ఖాదీకి పేటేంట్ హక్కును కల్పించింది. వాస్తవానికి ఖాదీ కార్మికులు అర్ధాకలితో జీవిస్తున్నారు. పేటెంట్ హక్కుతో పాటు మజూరీలు పెంచితేనే వారు మనుగడ సాగించేందుకు అవకాశం ఉంటుంది.