గోండుకు బ్రాండింగ్‌ | Akhila targets designed to make designs on handloom clothe | Sakshi
Sakshi News home page

గోండుకు బ్రాండింగ్‌

Published Fri, Aug 24 2018 12:13 AM | Last Updated on Fri, Aug 24 2018 12:13 AM

Akhila targets designed to make designs on handloom clothe - Sakshi

గోండు చేనేతలతో అఖిల చిరునవ్వులు

చేనేత వస్త్రాలు ఆయా ప్రాంతాలను ప్రతిబింబిస్తాయి. అక్కడి సంస్కృతులను ప్రపంచానికి పరిచయం చేస్తాయి. అందుకే ప్రాచీన కాలం నుంచీ వస్తున్న డిజైన్లతోనే నేటికీ వస్త్రాలు నేస్తుంటారు చేనేత కళాకారులు. ఈ క్రమంలో వాటిని మరింతగా ఆధునీకరించి, కొత్త కొత్త డిజైన్‌లతో నేటి తరానికి చేరవేయడం కోసం దేశమంతా పర్యటిస్తూ అక్కడి వారితో మమేకం అవుతున్నారు హైదరాబాద్‌కు చెందిన యువ సృజనశీలి అఖిల నూకల. చేనేతల్లో ప్రస్తుతం అందరూ కలంకారి వైపు మొగ్గు చూపుతున్నారు. అంటే సంప్రదాయానికి పెద్ద పీట వేస్తున్నారు. కాబట్టి కలంకారిలోనే మొదట ప్రయోగాలు చేయాలనుకున్నారు అఖిల. అందుకోసం తెలంగాణ, మహారాష్ట్రలోని గోండు తెగకు చెందిన  ప్రాంతాల్లో పర్యటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న గోండు విద్యార్థులతో కలిసి పనిచేశారు. అలాగే  అస్సాంలోని బక్సార్‌ జిల్లా బరామా ప్రాంతంలో చాలా రోజులు ఉన్నారు.  ఎక్కడికి వెళ్లినా అక్కడి గిరిజన జాతుల వారితో సన్నిహితంగా మెలిగి, వారికి సంబంధించిన సాంస్కృతిక అంశాలను తెలుసుకుని, అందుకు అనుగుణంగా వస్త్రాల మీద డిజైన్లు రూపొందించడాన్ని లక్ష్యంగా చేసుకున్న  అఖిల.. హైదరాబాద్‌ భవాన్స్‌ వివేకానంద కాలేజీలో  బి.ఎస్‌.సి. చదివారు. 

అస్సాంలో డిజైనింగ్‌
ఎస్‌.బి.ఐ ‘యూత్‌ ఫర్‌ ఇండియా’లో సభ్యురాలిగా ఉన్న 21 ఏళ్ల అఖిల, 2017 నుంచి అస్సామీ చేనేత వస్త్రాలను విస్తృతంగా ప్రాచుర్యం కల్పించే పనిలో ఉన్నారు. ఇంతకుముందే వేరొకరు ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టి మధ్యలోనే విరమించుకున్నారంటే.. అదంత సులువైన పనేమీ కాదని అర్థమౌతోంది. ప్రస్తుతం అఖిల తన ఈ ప్రణాళికకు మరో రెండు మాసాల్లో అనుకున్న ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నారు. చేనేత మగ్గాల మీద నేస్తున్న చీరలకు ఆర్డర్లు సంపాదించి, వాటిని తన సృజనాత్మకతతో అస్సాంలో డిజైన్‌ చేయించి, వాటిని దేశవ్యాప్తంగా అందరికీ అందేలా చేయడమే అఖిల ముఖ్యోద్దేశం.  

చెప్పి చేయించుకోవాలి
‘‘వస్త్రాలు నేయడం వారి వృత్తి మాత్రమే కాదు, వారి జీవన విధానం కూడా. వారు నేసిన వస్త్రాలే వారి జీవనాధారం. ఆ వస్త్రాల నుంచే వారికి ఆదాయం రావాలి’’ అంటారు అఖిల తరచు తను పర్యటించే అస్సామీ ప్రాంతాల వారిని ఉద్దేశించి. అక్కడి వారికి వ్యవసాయ భూమి, పశుసంపద రెండూ ఉంటాయి. వారిలో చేనేత కార్మికులు వస్త్రాలు నేయడం కంటె, కుటుంబ బాధ్యతల కోసం ఎక్కువ సమయం గడపవలసి వస్తోంది, అందువల్ల అనుకున్న సమయానికి ఆర్డరు ఇచ్చిన వారికి వస్త్రాలు అందించలేకపోతున్నారు. దీనిని గ్రహించిన అఖిల, అక్కడి చేనేత కార్మికులను పని దిశగా మళ్లిస్తూ, సకాలంలో ఆర్డర్లు పూర్తి చేయించేందుకు కృషి చేస్తున్నారు.

తరచు ప్రయాణాలు
అఖిల తనొక్కరే ఈ పని చేస్తున్నా.. హ్యాండ్స్‌ ఆఫ్‌ ఇండియా, వృందావన్, బీడ్‌ సోషల్‌ ఎంటర్‌ప్రైజ్‌ (బెంగళూరు) వారితో భాగస్వామి అయ్యారు. ఇందుకోసం ఆమె గువహాటికి అనేకసార్లు ప్రయాణించవలసి వస్తోంది. ఈ పని పెద్ద కష్టం కాకపోవచ్చు కాని, భాష సమస్యను తనింకా దాటవలసి ఉందని నవ్వుతూ అంటారు అఖిల. ‘‘కొందరైనా హిందీ అర్థం చేసుకోగలుగుతున్నారు, ఇందుకు సంతోషంగా ఉంది’’ అని చెబుతున్న  అఖిల, ఇతర స్థానిక భాషలు నేర్చుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. 
 – రోహిణి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement