పేరున్న ఊరు పుట్టపాక  | Awards to the village of Puttapaka | Sakshi
Sakshi News home page

పేరున్న ఊరు పుట్టపాక 

Published Mon, Jan 7 2019 12:35 AM | Last Updated on Mon, Jan 7 2019 4:12 AM

Awards to the village of Puttapaka - Sakshi

పోగు, పోగు కలిపి వస్త్రం నేస్తారు. నైపుణ్యం ఉన్నవారు చేసే పనే. అయితే ఆ వస్త్రాన్ని తయారుచేయడంలో తమదైన ప్రత్యేకతను ఏళ్లుగా చాటుతూ వస్తున్నారు పుట్టపాక గ్రామ చేనేత కళాకారులు. తమ కళా నైపుణ్యానికి పదును పెడుతూ, తమలోని సృజనాత్మకతను వెలికి తీస్తూ, పోటీతత్వంతో కొత్త కొత్త డిజైన్లను రూపొందిస్తున్నారు. ఆ కళానైపుణ్యం పుట్టపాక గ్రామానికి అవార్డులు కురిపిస్తోంది.

యాదాద్రి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలంలోని పుట్టపాక అనే మారుమూల పల్లె.. చేనేతల పరంగా విశ్వవిఖ్యాతి గాంచింది. ఇక్కడి కళాకారులు తమ కళా నైపుణ్యంతో మరుగున పడిన ప్రాచీన కళ ‘తేలియా రుమాల్‌’ను ఏనాడో వెలుగులోకి తెచ్చారు. ఆ వెలుగులోని ప్రతిభను చూసి వస్త్ర ప్రపంచం పుట్టపాకను కీర్తించడం మొదలైంది. తేలియా రుమాల్‌ ఒక్కటే కాదు, ఇక్కడి కళాకారులు చేనేత వస్త్రతయారీనే ఒక ప్రయోగశాలగా మార్చారు! నూతన ఒరవడి సృష్టించారు. తేలియా రుమాల్‌ను, ఖతాల్‌ చీరలను నిలువు దారంపై డిజైన్‌ చేయడంలో వీరు విలక్షణమైన శైలిని ప్రదర్శిస్తున్నారు. అసలు నిలువు దారం డిజైన్‌లు చేసి రంగులు అద్దడం ప్రపంచానికి పరిచయం చేసింది పుట్టపాక కళాకారులే. ఏ ప్రాంత ప్రజల అభిరుచికి తగినట్లుగా ఆ ప్రాంతం వారి కోసం వస్త్రాలు రూపొందించడంలో వీరు ఘటికులు. వీరి చేనేత కళా నైపుణ్యానికి ఇంతవరకు రెండు పద్మశ్రీ అవార్డులతో పాటు ఎన్నో జాతీయ అవార్డులు వరించాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పట్టు వస్త్రం తయారీ మొదలైందీ ఇక్కడే. ఆ గుర్తింపు కూడా గ్రామంలో చేనేత కార్మికులు తయారు చేసిన చేనేత వస్త్రాలు ప్రపంచ దేశాలకు ఎగుమతి అవడానికి ఒక కారణం. ఈ గ్రామ జనాభా 4,550 ఉంటే, అందులో 3 వేల జనాభా చేనేత కళాకారులదే!

ఎండలో చల్లగా, చలిలో వెచ్చగా
తేలియా రుమాలు అనేది ఒక రకమైన వస్త్రం. ఇది అతి ప్రాచీన కళావిశేషం. గజం నర్సింహ అనే పుట్టపాక చేనేత కళాకారుడు ఆ ప్రాచీన తేలియా రుమాలుకు పునరుజ్జీవం పోశారు. 21 రోజుల పాటు సాగే ‘యజ్ఞం’ అది. మొదట ఆముదపు పొట్టును కాల్చి బూడిద చేస్తారు. నువ్వుల నూనెతో బూడిదను కలిపి, నూలును అందులో ఉంచుతారు. రోజంతా నీటితో కలిపిన గొర్రె పేడలో నానబెడతారు. ఉదయం, సాయంత్రం వేళల్లో నూలును ఉతికి శుభ్రపరుస్తారు. ఆరబెడతారు. మళ్లీ అందులోనే పెడతారు. ఇలా ఇరవై ఒక్క రోజులు చేస్తారు. ఆ తర్వాత  వస్త్రం అవసరాన్ని బట్టి వార్పుపై అవసరమైనంత పొడవులో దారాలను తీస్తారు. మగ్గంపై కావాల్సిన తీరులో డిజైన్లతో కూడిన వస్త్రాన్ని రూపొందిస్తారు. ఇలా తేలియా రుమాలు వస్త్రంతో తలపాగాలు, చీరలు, దుపట్టాలతో పాటు ఇతర దుస్తులను తయారు చేస్తారు. ఇవి ఎండాకాలం చల్లగా, చలికాలం వెచ్చగా ఉండడమే కాక çసువాసనలు వెదజల్లుతాయి. ఇలా తయారు చేసే చీరలైతే డిజైన్లను బట్టి ముప్పై వేల నుంచి లక్షా యాభై వేల రూపాయల వరకు ధర పలుకుతున్నాయి. ఒక చీర నేయడానికి కనీసం మూడు నెలల సమయం పడుతుంది.   

ప్రకృతి రంగులే ఆయువు, ఆధారం
పుట్టపాకలో నేసే ప్రాచీన తేలియా రుమాల్‌ వస్త్రాలకు ప్రకృతి రంగులే ఆయువు, ఆధారం. తెల్ల దారానికి ప్రకృతి రంగులైన గుమ్మడి రంగు, తేలియా రంగు, ఇండిగో, నల్ల రంగులను ఉపయోగిస్తారు. మొదటగా తెల్ల దారాన్ని జిగురు తొలగించేందుకు గానూ ఒక రోజు నీళ్లలో నానబెట్టి నీడలో ఆరబెడతారు. వారం రోజులు అయ్యాక  జిగురు తొలగిస్తారు. ఆ తర్వాత దారాన్ని శుద్ధి చేయడం కోసం కిలో దారానికి 150 కరక్కాయ పిందె పొడి, అల్లం 10 గ్రాములు కలిపి శుద్ధి చేస్తారు.

ప్రకృతి రంగులు ఎలా వస్తాయి?
గుమ్మడి రంగు: గుమ్మడి రంగు వేయడానికి అడవి పసుపు, తేయాకు, కత్తాకు కలిపి గుమ్మడి రంగును రూపొందిస్తారు.
తేలియా రంగు : సున్నపు రాయి (కుంకుమ రాళ్లు), అడవి పసుపు, నువ్వుల నూనె, నిమ్మకాయతో కలిపి తయారు చేస్తారు.
ఇండిగో రంగు : ఇండిగో కేక్, కాస్టిక్, కుంకుడు రసం, నిమ్మరసం కలిపి తయారు చేస్తారు.
నల్ల రంగు : పాత ఇనుప సామాను 25 రోజులు నీటిలో నానబెట్టి తుప్పు పట్టిస్తారు. తాటిబెల్లం, ఇనుప తుప్పు, నల్ల కరక్కాయ పొడి, కుంకుడు రసం, నిమ్మ రసం కలిపి నల్లటి రంగుగా తయారు చేస్తారు.
ఇలా తయారు చేసిన రంగులతోనే ప్రాచీన తేలియా రుమాల్‌ అనే వస్త్రానికి రంగులు అద్దుతారు. ఈ రంగులతోనే పుట్టపాక ప్రపంచ ఖ్యాతి సాధించింది.

తొలి ççసహకార సంఘం  
ఓసారి ఏడుగురు చేనేత కళాకారులు కలిసి ఓ డిజైన్‌ రూపొందించి, చేనేత వస్త్రాలు తయారు చేశారు. ఆ సమయంలో ‘ఆప్కో’ సంస్థ చేనేత సహకార సంఘాల ద్వారా వస్త్రాలను తయారు చేయిస్తూ కొనుగోలు చేస్తోంది. ఇక్కడ కార్మికులు తయారు చేసిన డిజైన్లు కొయ్యలగూడెం సహకార సంఘం ద్వారా ఆప్కోకు పంపాలనుకున్నారు. కానీ, కొయ్యలగూడెం చేనేత సహకారసంఘం సభ్యులు వస్త్రాన్ని ఆప్కోకు పంపలేదు. దీంతో మనకు కూడా ఒక సంఘం కావాలని చేనేత సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇలా ఏర్పాటైన సంఘంలో నాలుగు వందల కుటుంబాలు ఉండేవి. వాళ్లంతా వెయ్యి మగ్గాల ద్వారా చేనేత వస్త్రాలు తయారు చేసేవారు. ప్రాచీన తేలియా రుమాల్‌ వస్త్రాలతో పాటు పట్టుచీరలు, స్పన్, సిల్క్‌ చీరలు తయారు చేసేవారు. ఆ రోజుల్లో స్పన్‌ సిల్క్‌ చీర ధర రూ. 200 ఉండేది. ప్రస్తుతం దాని ధర రూ.10 వేలకు పైగా ఉంటుంది.

అప్పట్లో గజం గోవర్థన్, గజం అంజయ్య, రాపోలు అంజయ్య, గుండు జగన్నాథం, గజం రాములు, గజం నర్సింహులు అనే వారు మాస్టర్‌ వీవర్స్‌గా మారి చేనేత కళాకారులకు ముడి సరుకులు ఇస్తూ, తయారు చేయించేవారు. ఆ క్రమంలోనే తేలియా రుమాల్‌ను ఆధునిక డిజైన్లతో తయారుచేయించడం మొదలు పెట్టారు. పట్టు చీరలు, మస్‌రే చీరలు, తలపాగా, దుపట్టా (చున్నీ)లను తయారు చేసేవారు. డబల్‌ ఇక్కత్‌ తేలియా రుమాల్‌ వస్త్రంతో ప్రపంచ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆధునిక సాంకేతికతకు కూడా అందని డిజైనింగ్‌ పుట్టపాక చేనేత కళాకారుల సృజనాత్మకతలో కనిపిస్తుంది. ఇక్కడ తయారు చేసిన వస్త్రాలు లండన్‌ మ్యూజియం, అమెరికా అధ్యక్షుడి భవనంతో పాటు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, సోనియాగాంధీలు సహా ఎందరో ప్రముఖులకు చేరాయి. వారి ప్రశంసలకు నోచుకున్నాయి. దాంతో పుట్టపాక చేనేత కళాకారులు తమ కళా నైపుణ్యానికి పదును పెడుతూ, పోటీతత్వంతో అనేక కొత్త కొత్త డిజైన్లను రూపొందించడం మొదలు పెట్టారు. 

అవార్డుల వెల్లువ
చేనేత కార్మికుడు గజం నర్సింహ కుమారుడు అంజయ్య తన తండ్రి చేసిన తేలియా రుమాళ్ల వస్త్రాలను ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త డిజైన్లను రూపొందించాడు. ఆయనతో పాటు గజం గోవర్థన్, అంజయ్య, గోలి సాంబయ్య తదితరులు తమ హస్తకళా నైపుణ్యంతో వస్త్రాలను తయారు చేస్తూ వస్తున్నారు. వీరి ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం గజం గోవర్ధన్‌ (2011), గజం అంజయ్య (2013) లకు పద్మశ్రీ అవార్డు ప్రదానం చేసింది. 2009 సంతు కబీర్‌ అవార్డును చేనేత దిగ్గజం గజం రాములుకు ప్రకటించగా, అప్పటికే ఆయన మృతి చెందడంతో ఆయన భార్య రాంబాయమ్మ అవార్డును అందుకున్నారు. 2010 సంవత్సరానికి సంతు కబీర్‌ అవార్డును గజం అంజయ్య అందుకున్నారు.

ముందు ఏడాది జాతీయ చేనేత అవార్డును గజం భావనాఋషి అందుకున్నారు. 2010 జాతీయ చేనేత అవార్డును ఐదుగురు కళాకారులు గూడ శ్రీను, గజం భద్రయ్య, పున్న కష్ణయ్య,  ఏ.నాగరాజు, గజం యాదగిరిలు అందుకున్నారు. రాంబాయమ్మ కూడా  వ్యక్తిగతంగా చేనేత కళానైపుణ్యంతో ఎన్నో జాతీయ స్థాయి అవార్డులను అందుకున్నారు. చేనేత జాతీయ అవార్డు  కొలను బుచ్చిరాములు, పిల్లలమర్రి రాధాకృష్ణమూర్తి సంయుక్తంగా అందుకున్నారు. 2016 చేనేత జాతీయ అవార్డు పుట్టపాక గ్రామానికి చెందిన గజం శ్రీనివాస్‌కు రాగా, ఇదే గ్రామానికి చెందిన చెరుపల్లి భావనాఋషికి నేషనల్‌ మెరిట్‌ అవార్డు లభించింది. వీరే కాక ఈ గ్రామానికి చెందిన చాలామంది చేనేత కార్మికులు రాష్ట్రపతి సంతు కబీర్‌ అవార్డు, కమలా అవార్డు, అష్టకళా నైపుణ్య అవార్డు, జాతీయ అవార్డులతో పాటు పలు ప్రశంసలు అందుకున్నారు. 

వస్తు మార్పిడి నుంచి విదేశీ ఎగుమతుల వరకు!
వందేళ్ల క్రితం పుట్టపాకలో కొద్దిమంది చేనేత కళాకారులు ఉండేవారు. చేనేత వస్త్రాలను తయారు చేసి, ప్రజలకు అందజేసి, వారివద్ద నుంచి ధాన్యం, ఇతర ఆహార పదార్థాలు, వస్తువులను తీసుకునేవారు. అప్పట్లో సాదా బట్టలు, టవల్స్, దోతులు, అంచు చీరలు అమ్మేవారు. ఏమైనా శుభకార్యాలప్పుడు వస్త్రాలు కావాలని చెబితే, నేసి ఇచ్చేవారు. రానురాను తయారు చేసిన వస్త్రా లను మూట కట్టుకొని, భుజాన వేసుకొని, పరిసర ప్రాంత గ్రామాలతో పాటు ఉమ్మడి జిల్లా చుట్టుపక్కల కూడా తిరుగుతూ అమ్మేవారు. అప్పుడు నేసిన వస్త్రాలన్నీ వస్తు మార్పిడి కిందే చేసేవారు. 1950 కి ముందు నాటికి ఇక్కడి చేనేత కళాకారుల సంఖ్య 200 లకు చేరుకుంది. వారు షావుకారుల వద్ద మగ్గాలు నేసేవారు. షావుకార్లు కళాకారులకు నూలు, రంగులు, ముడి సరుకులు ఇచ్చి తయారు చేయించేవారు.

ఇలా కార్మికులు తయారు చేసిన వస్త్రాలను దేశంలోనే కాకుండా అరబ్‌ దేశాలకు ఎగుమతి చేసేవారు. అప్పట్లో గజం నర్సింహ ప్రాచీన తేలియా రుమాల్‌ వస్త్ర తయారీలో సిద్ధహస్తుడు. గ్రామంలో ఐదారుగురు షావుకారులు ఉండేవారు. ఇక్కడ నేసిన చేనేత వస్త్రాలకు పేరు ప్రఖ్యాతులు రావడంతో.. శ్రీకాకుళం, గుంటూరు, మహబూబ్‌నగర్, కృష్ణా జిల్లాలకు చెందిన చేనేత కుటుంబాలు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డాయి. గజం నర్సింహ ముంబయి, సోలాపూర్‌ ప్రాంతాలకు మొట్టమొదటగా ఎగుమతి చేశారు. తర్వాత్తర్వాత కలకత్తా, చెన్నై, గుజరాత్, బెంగళూరులతో పాటు సింగపూర్, అమెరికా, జర్మనీ, జపాన్, నెదర్లాండ్, అరబ్‌ దేశాలకు ఎగుమతులు జరిగాయి. 

నైపుణ్యానికే ఈ గుర్తింపు
పుట్టపాకలోని చేనేత కళాకారులను నైపుణ్యవంతులుగా తయారు చేయడమే నా లక్ష్యం. అందుకోసమే చేనేతను అభివృద్ధి చేసి, కళాకారులను ప్రోత్సహిస్తున్నా. చేనేతకు చేసిన సేవకు గుర్తింపుగా ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చింది. చేనేత కళాకారుల సంక్షేమం కోసం కృషి చేస్తూనే ఉంటా. 
– గజం గోవర్ధన్,
 పద్మశ్రీ అవార్డు గ్రహీత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement