రఘునాథపురంలో పవర్‌లూమ్‌ను పరిశీలిస్తున్న కేంద్రమంత్రి దేవ్‌సిన్హా చౌహాన్ తదితరులు
సాక్షి, యాదాద్రి/ఆలేరు రూరల్: చేనేత వస్త్రాలపై జీఎస్టీ తగ్గింపు అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందని కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి దేవ్‌సిన్హా చౌహాన్ చెప్పారు. చేనేతపై 5 శాతం జీఎస్టీ విధింపు.. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి తీసుకున్న నిర్ణయమన్నారు. అయితే, నూలుపై గతంలో ఇచ్చే 10 శాతం ఇన్‌పుట్ సబ్సిడీని 15 శాతానికి కేంద్రం పెంచిందన్నారు.
కరోనా వల్ల చేనేత కార్మికులు నష్టపోయిన విషయం కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉందని, జీఎస్టీ తగ్గింపు విషయాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురంలో సోమవారం జరిగిన చేనేత కార్మికుల సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రపంచస్థాయి ఉత్పత్తులను తయారుచేసి ఎగుమతిచేసే నేతన్న రఘునాథపురంలో ఉండడం అభినందనీయమన్నారు.
చేనేతపై జీఎస్టీ ఎత్తివేయాలని స్థానిక చేనేత, పవర్‌లూమ్ ప్రతినిధులు మంత్రికి వినతిపత్రం సమర్పించారు. ముందుగా గ్రామంలో పవర్‌లూమ్‌లను మంత్రి పరిశీలించారు. ఉదయం యాదాద్రీశుని దర్శనం చేసుకున్న కేంద్ర మంత్రి ఆలేరులో వివిధ మోర్చాలతో సమావేశమయ్యారు. అనంతరం భువనగిరిలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
భువనగిరి పోస్టల్ కార్యాలయంలో యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి పోస్టల్ కవర్‌ను అధికారులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం వలిగొండ మండలం అర్రూర్‌లో రైతులతో సమావేశమయ్యారు. అంతకుముందు ఆలేరులో నిర్వహించిన వివిధ మోర్చా నాయకుల సమావేశంలో దేవ్‌సిన్హా మాట్లాడుతూ... కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment