నేతన్నకు దన్ను
తెలంగాణ టెక్స్‌టైల్, అపెరల్ విధానానికి రూపకల్పన
- ముసాయిదాకు తుది మెరుగులు దిద్దుతున్న ప్రభుత్వం
- ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలను ఆకర్షించడమే ధ్యేయం
- రాష్ట్రంలో కొత్తగా ఐదు టెక్స్‌టైల్ పార్కులు
- 3 లక్షల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యం
- చేనేత, పవర్‌లూమ్ కార్మికుల వేతనాలు పెరిగేలా చర్యలు
సాక్షి, హైదరాబాద్: చేనేత, మరమగ్గాల కార్మి కులకు అండగా నిలవడంతోపాటు అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ టెక్స్‌టైల్, అపెరల్ పాలసీ–2017 రూపొందిస్తోంది. టెక్స్‌టైల్స్, అపెరల్ రంగాల్లోని ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలకు రాష్ట్రాన్ని గమ్యస్థానంగా మార్చే లక్ష్యంతో పాలసీ ముసాయిదాకు తుది మెరుగులు దిద్దుతోంది. ప్రధానంగా స్పి న్నింగ్, వీవింగ్, ప్రాసెసింగ్, గార్మెంట్ రంగా ల్లో భారీగా పెట్టుబడులు ఆకర్షించేలా పాలసీ కి రూపకల్పన చేస్తోంది. రానున్న ఐదేళ్లలో సాధించాల్సిన లక్ష్యాలను ఇందులో పొందు పరిచారు.
రాష్ట్రంలో కొత్తగా ఐదు టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు చేయటం, కనీసం 5 అంతర్జాతీయ, 50 దేశీయ కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకర్షించాలనేది ప్రధాన లక్ష్యంగా ఎంచుకున్నారు. 3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని, అందులో కనీసం 60 శాతం మంది మహిళలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. చేనేత కార్మికుని నెలసరి వేతనం 50 శాతం, పవర్‌లూమ్‌లోని కార్మికుని ఆదాయం 30 శాతం పెరిగేలా చూడాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఉత్పత్త య్యే వస్త్రాల్లో కనీసం 20 శాతం ఎగుమతి చేయాలన్నది మరో లక్ష్యం. ప్రస్తుతమున్న పరిశ్రమకు అత్యాధునిక సాంకేతికతను జోడించడంతోపాటు శిక్షణ, నైపుణ్యాభివృద్ధికి కొత్త విధానంలో ప్రాధాన్యం కల్పిస్తోంది. చేనేత కళాకారుల ఉత్పత్తులకు ప్రపంచంలో ప్రత్యేక ఆకర్షణను (బెస్ట్ బ్రాండ్) కల్పించా లన్నది లక్ష్యంగా ఎంచుకుంది. చేనేత వస్త్రాలకు అందుకు అనువైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని నిర్ణయించింది.
నేతన్న కష్టాలను తీర్చేలా..
కొత్త పాలసీ కింద చేనేత కార్మికులకు పావలా వడ్డీ రుణాలతోపాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పది శాతం రాయితీకి అదనంగా నూలుపై 40 శాతం రాయితీని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. కెమికల్స్, కలర్ డైలపై కూడా ఇదే తరహా రాయితీ అందుతుంది. చేనేత వ్యక్తిగత రుణాలకు రుణమాఫీ పథకాన్ని అమలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. యువతకు ఉపాధి అవకాశాలు ఉండేలా చేనేత వస్త్రాల డిజైనింగ్, ఫ్యాషన్ ఇంజ నీరింగ్ లో డిగ్రీ, డిప్లమో కోర్సులతో చేనేత శిక్షణా సంస్థ ఏర్పాటు చేయనుంది.
మార్కెటింగ్‌పై ఫోకస్..
చేనేత వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేయనుంది. మరమగ్గాల ఆధునీకరణకు ఆర్థిక సాయం అందించడంతో పాటు ప్రభు త్వం ఇచ్చే ఆర్డర్లకు నూలుపై 20 శాతం రాయితీ ఇస్తారు. మరమగ్గాలకు విద్యుత్ రాయితీ కల్పి స్తారు. ప్రభుత్వానికి, ప్రభుత్వ అవసరాలకు వినియోగించే వస్త్రాలను మరమగ్గాల నుంచే కొనుగోలు చేస్తారు. చేనేత బ్రాండ్ అంబాసిడర్లుగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల సేవలు వినియోగిం చుకుంటారు. చేనేత దుస్తులకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం, ఫ్యాషన్ డిజైనర్లు, సంస్థల సహకారంతో చేనేతలో కొత్త నమూనాలు తీసుకురావడంపై దృష్టి సారిస్తారు. చేనేత వస్త్రాల విక్రయాలకు రిటైల్ దుకాణాలతో ఒప్పందం, ప్రభుత్వ షోరూం లను బొటిక్‌లుగా తీర్చిదిద్దుతారు.
పరిశ్రమలకు బాసట..
నూతన పాలసీ ద్వారా కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ప్రోత్సాహకాలు ఇవ్వడంతోపాటు ఇప్పటికే ఉన్న పరిశ్రమల ఆధునీకరణ, విస్తరణకు ప్రభుత్వం సాయం అందిస్తుంది. పెట్టుబడులు, నిర్వహణతోపాటు మౌలిక వసతులను కల్పించేందుకు అవసరమైన ఆర్థిక సాయం, రాయితీలు ఇస్తుంది. అవసరమైన భూమిని టీఎస్‌ఐఐసీ ద్వారా సమకూర్చుస్తుంది. వ్యర్థాల నిర్వహణ, పరిశోధన అభివృద్ధికి సౌకర్యాలు కల్పిస్తారు. టెక్స్‌టైల్ పార్కుల్లోనే కార్మికులు, సిబ్బందికి అవసరమైన నివాసాలకు స్థలాలు కేటాయిస్తారు. శిక్షణ సంస్థలకు ప్రభుత్వం నుంచి ఒక్కో ఉద్యోగికి రూ.3,000 చొప్పున శిక్షణ రాయితీగా ఇస్తారు.
శిక్షణ పొందిన ఉద్యోగి కనీసం ఏడాది పాటు సంబంధిత సంస్థలోనే పని చేయాల్సి ఉంటుంది. వలస వెళ్లిన చేనేత కార్మికులు రాష్ట్రానికి తిరిగి వస్తే వాళ్లకు పని కల్పించేందుకు ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేస్తారు. 2 వేల ఎకరాల విస్తీర్ణంలో వరంగల్లో తలపెట్టిన కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ మొదటి దశను 1,250 ఎకరాల్లో అభివృద్ధి చేస్తారు. సిరిసిల్లలో వంద ఎకరాల విస్తీర్ణంలో టెక్స్‌టైల్, అపెరల్ పార్క్ అభివృద్ధి చేస్తారు. కొత్తగా గోదాములు నిర్మిస్తారు. ప్రైవేట్ టెక్స్‌టైల్ పార్క్‌ల ఏర్పాటును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు అందించనుంది.