రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు 50 శాతం రిబేటుపై చేనేత వ్రస్తాలు  | 50 percent rebate on handloom garments for state secretariat employees | Sakshi
Sakshi News home page

రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు 50 శాతం రిబేటుపై చేనేత వ్రస్తాలు 

Published Tue, Aug 8 2023 4:41 AM | Last Updated on Tue, Aug 8 2023 4:41 AM

50 percent rebate on handloom garments for state secretariat employees - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు 50 శాతం రిబేటుపై చేనేత వ్రస్తాలను సచివాలయంలోని ఆప్కో విక్రయశాల ద్వారా ఈ నెలాఖరు వరకు విక్రయించనున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత ప్రకటించారు. సోమవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర దివంగత  ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు ఉద్యోగులు ప్రతి శనివారం చేనేత వ్రస్తాలను తప్పనిసరిగా ధరించాలనే విధానాన్ని అమలు పరిచారని గుర్తు చేశారు.

అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇకపై ప్రతి శుక్రవారం ఉద్యోగులు అంతా చేనేత వ్రస్తాలను ధరించాలని ఆమె పిలుపునిచ్చారు.  రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్‌ ఎంఎం నాయక్, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి మాట్లాడారు. చేనేత వ్రస్తాలు ధరించేందుకు ఉద్యోగులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చేనేత వ్రస్తాలు ధరించిన మహిళా, పురుష ఉద్యోగులను లాటరీ ద్వారా ఎంపిక చేసి సరళ, కనకదుర్గ, సునీత, ఇమామ్‌ వలీ, మోహనరావు, ప్రసాద్‌కు బహుమతులను అందజేశారు.

నేతన్నలను ఆదుకున్న ప్రభుత్వం
రాష్ట్రంలో చేనేత రంగాన్ని ఆదుకునేలా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని.. ప్రధానంగా ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’ పథకం ద్వారా  సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌­రెడ్డి మరింత ఊతమిచ్చారని చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత స్పష్టం చేశారు. చేనేత జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ స్టెల్లా కాలేజీ ఆడిటోరియంలో చేనేత వారోత్సవాలను సోమవారం ఘనంగా ప్రారంభించారు.

ముఖ్యఅతిథిగా హాజరైన సునీత మాట్లాడుతూ.. సేంద్రియ పద్ధతుల్లో తయారైన చేనేత వస్త్రాలకు విదేశాల్లో సైతం మంచి ఆదరణ ఉండటంతో ఆ దిశగా పత్తి రైతులు, చేనేత కార్మికులను సన్నద్ధం చేస్తున్నామన్నారు. ప్రపంచంలో వినియోగిస్తున్న చేనేత వస్త్రాల్లో 95 శాతం మన దేశంలోనే తయారైనవేనని, చేనేతలో దేశంలో ఆంధ్రప్రదేశ్‌ 6వ స్థానంలో ఉందని వెల్లడించారు. చేనేత వస్త్రాలకు జీఎస్టీ మినహాయించేలా కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందన్నారు. ఈ నెల 12 వరకు నిర్వహిస్తున్న చేనేత ప్రదర్శన, సబ్సిడీపై విక్రయాలను ప్రజలు ఉపయోగించుకోవాలని సునీత కోరారు. 

1.75 లక్షల మందికి ఉపాధి
ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ..రాష్ట్రంలో చేనేత రంగం 1.75 లక్షల మందికి ఉపాధి చూపుతోందన్నారు. ఈ రంగాన్ని ఆదుకోవడంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేపట్టిన చర్యలు మంచి ఫలితాలిచ్చాయన్నారు. చేనేత, జౌళి శాఖ కమిషనర్‌ ఎంఎం నాయక్‌ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేతకు ఎంతో మద్దతునిస్తూ ప్రతి జిల్లాలో ఒక ముఖ్యమైన ఉత్పత్తిని గుర్తిస్తూ వన్‌ డిస్ట్రిక్‌ వన్‌ ప్రొడక్ట్‌ అనే కార్యక్రమాన్ని చేపట్టాయన్నారు. ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌ చైర్మన్‌ పి.గౌతంరెడ్డి, ఆప్కో మాజీ చైర్మన్లు గంజి చిరంజీవి, చిల్లపల్లి మోహనరావు, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఢిల్లీరావు, ఆప్కో జీఎం తనూజారాణి మాట్లాడారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement