అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్టు వ్యవస్థను తెచ్చారు
బాబొస్తే 15వ తేదీకి కూడా జీతాలు రావు
ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థ కనుమరుగు ఖాయం
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఉద్యోగులందరికీ న్యాయం
‘ప్రజలు–ప్రభుత్వం–ఉద్యోగులు’ అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు
తోకలు కత్తిరించాలంటూ ఉద్యోగుల ఆత్మాభిమానంపై కొట్టారు
సాక్షి, అమరావతి: అధికారంలో ఉన్నన్నాళ్లూ ప్రభుత్వ ఉద్యోగులను ముప్పతిప్పలు పెట్టిన చంద్రబాబును మరోసారి నమ్మవద్దని పలువురు విశ్రాంత ఉద్యోగులు, మేధావులు, విద్యావేత్తలు కోరారు. సమస్యలపై ప్రశ్నిస్తే ఉద్యోగుల తోకలు కత్తిరించాలంటూ వారి ఆత్మాభిమానంపై దెబ్బకొట్టారని గుర్తు చేశారు. ‘ప్రజలు–ప్రభుత్వం–ఉద్యోగులు’ అనే అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు విజయవాడలో మంగళవారం జరిగింది.
ఓపెన్ మైండ్స్ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఉద్యోగుల మద్దతు వారికి మేలు చేసిన వైఎస్సార్‌సీపీకే ఉంటుందని తేల్చిచెప్పారు. ఉద్యోగులు, సీఎం వైఎస్ జగన్ మధ్య అన్నదమ్ముల అనుబంధం ఉందని వెల్లడించారు. సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగుల డిమాండ్లు ఉంటే బాగుంటుందన్నారు.
వారు కూడా ప్రభుత్వంలో అంతర్భాగం కాబట్టి ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని హితవు పలికారు. పొరపాటున చంద్రబాబు అధికారంలోకి వస్తే 15వ తేదీకి కూడా జీతాలు అందవని హెచ్చరించారు. అసలు ప్రభుత్వ ఉద్యోగులనే వ్యవస్థే కనుమరుగయినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. కార్యక్రమంలో మెజర్ కిరణ్ కుమార్, లెక్చరర్ కళ్యాణి, సమాజిక కార్యకర్త శాంతమూర్తి, సాఫ్ట్‌వేర్ ప్రొఫెçషనల్ జగన్‌మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు ఏమన్నారంటే..
3రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది చంద్రబాబే..
రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చి, రాష్ట్రాన్ని చంద్రబాబు ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారు. జగన్ అధికారంలోకి వచ్చాక దానికి కాయకల్ప చికిత్స చేయడం మొదలుపెట్టారు. కానీ కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ మళ్లీ దెబ్బతింది. రూ.60 వేల కోట్లను ప్రభుత్వం నష్టపోయింది. రాష్ట్ర బడ్జెట్‌లో సగం ఉద్యోగుల జీతభత్యాలకే పోతోంది. మిగిలిన సగం నాలుగున్నర కోట్ల మంది ప్రజలకు ఖర్చు చేయాల్సి ఉంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్టు వ్యవస్థను ప్రవేశపెట్టారు.
కొత్త ఉద్యోగాలివ్వలేదు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక నియామకాల విప్లవం తెచ్చారు. కాంట్రాక్టు ఉద్యోగులకు సైతం 1వ తేదీనే నేరుగా జీతాలందేలా చేశారు. దశాబ్దాలుగా పదోన్నతులు లేని వారికి పదోన్నతులిచ్చారు. చైల్డ్ కేర్ సెలవులను 180 రోజులకి పెంచారు. సచివాలయ ఉద్యోగులను రెగ్యులర్ చేశారు. తాజా మేనిఫెస్టోలో మరికొన్ని హామీలిచ్చి నెరవేరుస్తాననే నమ్మకమిచ్చారు. అదే చంద్రబాబు హామీలు నెరవేర్చాలంటే పీఆర్సీ, జీతాలు ఎగ్గొట్టాలి. లేదంటే రాష్ట్ర బడ్జెట్ సరిపోదు. –డాక్టర్ ఎన్.రాజశేఖర్‌రెడ్డి, అధ్యక్షుడు, ఓపెన్ మైండ్స్
చంద్రబాబు వస్తే జీతాలు కష్టమే..
అడగకుండానే సీఎం జగన్ క్లాస్ 4 ఉద్యోగుల జీతాలను పెంచారు. అదే చంద్రబాబు ‘ఉద్యోగుల తోకలు కత్తిరించాలి’ అన్నమాటను నేటికీ ఎవరూ మర్చిపోలేదు. ఇప్పుడు రూ.లక్ష కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తానని అంటున్నారు. అంటే అప్పుడు 15వ తేదీకి కూడా జీతాలు రావు. పోనీ ఉద్యోగులకు ఏదైనా చేస్తానని మేనిఫెస్టోలో చెప్పారా అంటే లేదు. గతంలో ఉద్యోగుల ఆత్మాభిమానాన్ని చంద్రబాబు దెబ్బతీశారు. ప్రభుత్వ ఉద్యోగులు అనే వ్యవస్థనే లేకుండా చేయాలనుకున్నారు. –పి.విజయబాబు, అధ్యక్షుడు, ఏపీ ఇంటలెక్చువల్ ఫోరం
చంద్రబాబు ఉద్యోగులకు డీఏ అవసరం లేదన్నారు..
ప్రభుత్వ ఉద్యోగులు ఈ ప్రభుత్వానికి సహకరించాలి. ఎందుకంటే గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సచివాలయాల ద్వారా సీఎం జగన్ తీసుకువచ్చారు. విద్యకు ఆయన అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్‌దారులకు డీఏ అవసరం లేదన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగుల గురించి ఎంత దారుణంగా మాట్లాడారో చూశాం. –ప్రొఫెసర్ జి. రామచంద్రారెడ్డి, విద్యావేత్త
ఆర్టీసీని ఆదుకుంది జగన్ ప్రభుత్వమే..
అప్పుల్లో ఉన్న ఆర్టీసీని సీఎం వైఎస్ జగన్ తమ ప్రభుత్వంలో విలీనం చేశారు. గతంలో జీతాల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అప్పుచేసి జీతాలిచ్చేవారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రతి నెలా రూ.300 కోట్లు ఇస్తోంది. రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకూ ఉద్యోగుల జీతాలు పెరిగాయి. ప్రభుత్వ సహకారంతో అప్పులు రూ.6 వేల కోట్ల నుంచి రూ.2 వేల కోట్లకు ఆర్టీసీ తగ్గించగలిగింది. –కోటేశ్వరరావు, విశ్రాంత ఆర్టీసీ అధికారి
మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి
వైఎస్ జగన్ ప్రభుత్వం ఉద్యోగులకు మేలు చేసింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసింది. వేతన సవరణ అడగకుండానే ఇచ్చింది. మళ్లీ అధికారంలోకి రాగానే ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇస్తామంటోంది. ఇంత మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని అందరం కాపాడుకోవాలి. –ప్రొ.వి.నారాయణరెడ్డి, మాజీ రిజిస్ట్రార్
ప్రభుత్వానికి ఉద్యోగులు మద్దతు ఇవ్వాలి
ప్రభుత్వాన్ని ఉద్యోగులు విమర్శించడం సరికాదు. అన్నదమ్ముల్లా ఉద్యోగులు, ప్రభుత్వం కలిసుండాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏం కావాలో అవన్నీ చేస్తోంది. సంక్షేమ పథకాలను ఇంటి వద్దే అందిస్తోంది. ఉద్యోగులు కూడా ప్రజా సంక్షేమాన్ని పట్టించుకునే ప్రభుత్వానికే మద్దతివ్వాలి. –పి.సుశీలరెడ్డి, సామాజిక కార్యకర్త
Comments
Please login to add a commentAdd a comment