జియోట్యాగింగ్ చేసిన ఇళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా హోంక్వారంటైన్లలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. విదేశాల నుంచి వచ్చినవారు, ప్రభుత్వ ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందినవారు, హోంక్వారంటైన్లలో ఉన్న వారిపై సాంకేతిక సాయంతో ప్రత్యేక నిఘా ఉంచుతున్నారు. ముఖ్యంగా కరోనా కేసులు అధికంగా వెలుగుచూస్తున్న కంటైన్‌మెంట్ క్లస్టర్లలో ఈ నిఘాను మరింత పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఇందుకోసం ‘టీఎస్‌కాప్’లో ప్రత్యేక ఫీచర్‌ను చేర్చారు. ఎవరైతే హోంక్వారంటైన్లలో ఉంటారో.. వారి మొబైల్‌లో ప్రత్యేక యాప్‌ను పోలీసులు ఇన్‌స్టాల్ చేస్తారు. వారి ఇళ్లను ఇప్పటికే జియోట్యాగింగ్ చేశారు. ఈ తరహాలో జియోట్యాగింగ్ చేసిన ఇళ్లు దాదాపు 70 వేల వరకుంటాయి. అతని మొబైల్‌కు పోలీసుల వద్ద ఉండే టీఎస్‌కాప్ ట్యాబ్‌లకు కనెక్షన్ ఏర్పడుతుంది. దీంతో సదరు వ్యక్తి గడప దాటినా టీఎస్ కాప్‌లో అలర్ట్ వచ్చేస్తుంది.
కొందరు డిలీట్ చేస్తున్నారు..
కొందరు ఫారిన్ రిటర్నీస్, కరోనా అనుమానితులు యాప్ ఉంటే తమ ఉనికిని పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నార న్న అసహనంతో యాప్ లను అన్ ఇన్‌స్టాల్ చేస్తున్నారు. అయితే, వారు అన్ ఇన్‌స్టాల్ చేసినా.. వారి కదలికలను టీఎస్‌కాప్ ఎప్పటికపుడు పర్యవేక్షిస్తూనే ఉంటుందని డీజీపీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. కాబట్టి, హోంక్వారంటైన్లంతా ఖాకీ కన్నుగప్పి పోలేరని స్పష్టం చేశాయి. ముఖ్యంగా ప్రభుత్వం గుర్తించిన 130 కరోనా కంటైన్‌మెంట్ క్లస్టర్లలో ఈ నిఘాను పోలీసులు మరింత సమర్థంగా కొనసాగిస్తున్నారు.
వయొలేషన్ ట్రాకింగ్ యాప్..
లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించి 3 కిలోమీటర్ల నిబంధనలను పట్టించుకోకుండా బయటికి వస్తున్న పౌరులపై కేసులు పెట్టేందుకు పోలీసుశాఖ సరికొత్త యాప్‌ను అభివృద్ధి చేసింది. బయటికి వచ్చిన పౌరుల ఆధార్/ఫోన్ నంబరు/ ఇతర గుర్తింపు కార్డులను సేకరిస్తారు. జీపీఎస్ ద్వారా పనిచేసే ఈ యాప్‌లో సదరు వాహనదారుడు 3 కిలోమీటర్లు దాటి ప్రయాణం చేస్తే.. పోలీసులను వెంటనే అప్రమత్తం చేస్తుంది. వెంటనే అతని వాహనాన్ని స్వాధీనం చేసుకుని, సదరు వ్యక్తిపై కేసులు పెడతారు. పోలీసులు ఇప్పటికే సీసీ కెమెరాల ద్వారా ఆటోమేటిక్ నంబర్‌ప్లేట్ రికగ్నిషన్ ద్వారా 3 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించిన వాహనాలపై కేసులు నమోదు చేస్తోన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment