Paddy cultivate
-
వరితో పోలిస్తే చిరుధాన్యాల సాగుకు తక్కువ పెట్టుబడి
-
దమ్ము రేపుతున్న పవర్ టిల్లర్
పాలకొల్లు సెంట్రల్: జిల్లాలో సార్వా పంట దమ్ము పనులు జోరుగా సాగుతున్నాయి. అడపాదడపా వర్షాలు, కాల్వల నుంచి వదులుతున్న నీటితో డెల్టాలో పనులు జోరందుకున్నాయి. రైతులు దమ్ము పనులు వేగవంతం చేశారు. గతంలో నాగళ్లకు ఎడ్లను కట్టి దమ్ము పనులు చేసేవారు. ఆ తరువాత ట్రాక్టర్లు రావడంతో పని సులవైంది. అయితే ఇప్పుడు రైతులు పవర్ టిల్లర్‌తో దమ్ము పనులు చేస్తున్నాడు. వరి సాగు అనగానే దమ్ము పనులు ఎంతో కీలకం. గతంలో ఇంత ఆయకట్టుకు ఒక ట్రాక్టర్‌ను మాట్లాడుకుని దమ్ము పనులు చేసేవారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి ట్రాక్టర్లు ప్రకాశం, గుంటూరు జిల్లాలకు వెళ్లి సుమారు నెల రోజులు అక్కడే ఉండి పనులు చేసుకునేవారు. నేడు వ్యవసాయ శాఖ సబ్సిడీపై ఇచ్చే పవర్ టిల్లర్లతో రైతులు సొంతంగానే దమ్ము పనులు చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో పవర్ టిల్లర్ ప్రయోజనాలపై రైతులకు అవగాహన పెరగడంతో వాటి వైపు మొగ్గుచూపుతున్నారు. ఎకరాకు ఐదారు లీటర్ల ఆయిల్ ఖర్చు పవర్ టిల్లర్‌తో దమ్ము చేస్తే ఎకరాకు సుమారు ఐదు లేక ఆరు లీటర్లు ఆయిల్ ఖర్చవుతుంది. ఇలా రోజుకు దాదాపుగా ఐదారు ఎకరాల్లో దమ్ము చేయవచ్చని రైతులు చెబుతున్నారు. ఈ యంత్రంతో దమ్ము చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని వ్యవసాయ అధికారులు అంటున్నారు. ట్రాక్టర్లతో చేస్తే సుమారు రెండు అడుగులు లోతు వరకూ దిగిపోతుంది. దీనివల్ల పంట దిగుబడుల్లో ఇబ్భందులు ఎదురవుతున్నాయి. అదీ కాక ట్రాక్టర్లతో దమ్ము చేసే సమయంలో ఒక్కోసారి ట్రాక్టర్లు పైకి లేచిపోవడం తిరగబడడంతో ట్రాక్టర్ డ్రైవర్లుకు ప్రాణనష్టం జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పవర్‌టిల్లర్‌తో అలాంటి ప్రమాదాలకు చెక్‌పెట్టవచ్చు. మరో మనిషి అవసరం లేకుండా దమ్ము చేసుకునే వెసులుబాటు ఉంది. పొలం పనులకు కావలసిన సామగ్రిని దీనిపై తీసుకెళ్లిపోవచ్చు. ఈ పవర్టిల్లర్పై కూర్చుని చేయడానికి సీటు కూడా ఏర్పాటుచేసుకునే అవకాశం ఉంటుంది. పవర్‌టిల్లర్‌తో ప్రయోజనాలు పవర్‌టిల్లర్‌తో దమ్ము 15 అంగుళాల లోతు వరకే జరగడంతో వరినాట్లు పైపైన వేయడానికి అనుకూలంగా ఉంటుంది. వరిపంట వేర్ల వ్యవస్థ ఆరు అంగుళాలు ఉంటుంది. పవర్‌టిల్లర్ దమ్ముతో వరి మొక్క వేగంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎరువులు కూడా బాగా అందుతాయి. పవర్‌టిల్లర్ దమ్ము చేయడానికే కాకుండా బావులు, కాలువల నుండి పొలాలకు నీరు తోడుకోవడానికి ఉపయోగపడుతుంది. దీనికి పంకాలు ఏర్పాటుచేసి ధాన్యం ఎగరబోతకు ఉపయోగించుకోవచ్చు. 1.5 టన్నుల వరకూ బరువును తీసుకువెళ్లే వెసులుబాటు కలుగుతుంది. పవర్‌టిల్లర్‌కు 13 హెచ్‌పీ సామర్థ్యం గల ఇంజిన్ ఉంటుంది. -
‘పెట్టుబడి’కి జియో ట్యాగింగ్
సాక్షి, హైదరాబాద్: రెండో విడత ‘పెట్టుబడి’సాయం కోసం వచ్చే ఏడాది రబీ పంటలను జియోట్యాగింగ్ ద్వారా గుర్తించాలని సర్కార్ యోచిస్తోంది. రాబోయే ఖరీఫ్ నుంచి రైతులకు పెట్టుబడి పథకం కింద ఎకరానికి రూ.4 వేలు ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. సర్కారు ఇటీవల వేసిన అంచనా ప్రకారం 1.42 కోట్ల ఎకరాలకు ఖరీఫ్‌లో రూ.5,680 కోట్ల పెట్టుబడి పథకం కింద సాయం చేస్తారు. ఏప్రిల్ 20 నుంచే రైతులకు ఖరీఫ్ పెట్టుబడి సాయం కింద చెక్కులను అందజేస్తారు. రబీలో మాత్రం కేవలం ఆ సీజన్లో సాగు చేసే పంట భూములకే నవంబర్ 18 నాటికి పెట్టుబడి సాయం అందజేస్తారు. రబీలో బోర్లు, బావులు, ఇతర సాగునీటి వనరులు ఉన్నచోట్ల మాత్రమే పంటలు సాగవుతాయి. ఖరీఫ్‌లో వేసిన పత్తి, పసుపు, మిర్చి వంటి పంటలు రబీలోనూ కొనసాగుతాయి. ఈ పంటలకు రెండో విడత పెట్టుబడి సాయం అందదు. రబీ సీజన్లో ఇతర పంటల సాగు ఎంతనేది గుర్తించడం కష్టం. కచ్చితత్వం లేకుండా పెట్టుబడి పథకం కింద సాయం చేస్తే రైతుల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదముందని అంటున్నారు. అందుకే జియోట్యాగింగ్ ద్వారా పంటల వివరాలను గుర్తించాలని భావిస్తున్నారు. సర్వే నంబర్ల వారీగా వివరాలు... శాటిలైట్ ద్వారా జియోట్యాగింగ్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి పంటల వివరాలను కచ్చితంగా గుర్తించవచ్చు. ప్రభుత్వం వద్ద ఉన్న భూసర్వే వివరాలను గ్రామం, రైతు పేర్లతో సహా జియో సాంకేతిక పరిజ్ఞానానికి అనుసంధానం చేస్తారు. ఏ సర్వే నంబర్లో ఏ పంట వేశారన్నది జియోట్యాగింగ్ ద్వారా గుర్తిస్తారు. అంటే ఏ రైతు ఏ పంట వేశాడు? ఎన్నెకరాల్లో వేశాడన్న సమాచారం సేకరించవచ్చు. ఇటీవల హైదరాబాద్ వచ్చిన కర్ణాటక ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి జియోట్యాగింగ్ పద్ధతి గురించి రాష్ట్ర అధికారులకు వివరించారు. కర్ణాటకలో మాదిరి గా మన దగ్గర కూడా జియోట్యాగింగ్ పద్ధతి అమలు చేయాలన్న ఆలోచనలో అధికారులున్నారు. అయితే, అమలు సాధ్యాసాధ్యాలపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. రబీ పెట్టుబడి పంపిణీ తేదీకి... పంటల సాగు కాలానికి తేడా నవంబర్ 18 నాటికే రబీలో రెండో విడత పెట్టుబడి సాయం చేస్తానని సర్కారు ప్రకటించింది. వాస్తవంగా రబీ సీజన్ అక్టోబర్ ఒకటో తేదీ నుంచే మొదలవుతుంది. వరి నాట్లు మాత్రం ఫిబ్రవరి వరకూ కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో ఆయా రైతులకు పెట్టుబడి సాయం ఎలా అందిస్తారనేది సమస్య. దీనిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. -
ఆకుపచ్చని బంగారం మన మాగాణం!
* వరి సాగుతో పర్యావరణానికి కీడు లేదు.. మేలే! * భూతాపోన్నతికి దోహదపడే కర్బన ఉద్గారాలను పీల్చుకుంటున్న మాగాణి భూములు * సీఆర్ఆర్ఐ శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడైన వాస్తవం అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు పెద్దలు. మన దేశంలోనే కాదు.. దక్షిణాసియా దేశాల ప్రజలకు వరి అన్నమే అత్యంత ముఖ్యమైన ఆహారం. మనకు ఇంత ముఖ్యమైన వరి పంటను 80% మేరకు నీటిని నిల్వగట్టే పద్ధతిలో, 20% విస్తీర్ణంలో ఆరుతడి పద్ధతిలో సాగు చేస్తున్నారు. నీటిని నిల్వగట్టే పద్ధతి వల్ల పర్యావరణానికి తీరని హాని కలుగుతున్నదన్న నింద ఎప్పటి నుంచో ఉంది. మనిషి చేసే పనుల వల్ల అత్యంత ప్రమాదకరమైన మిథేన్ వాయువు వాతావరణంలోకి విడుదలవుతున్నది. ఇది 11% మేరకు చైనా, భారత్ తదితర దేశాల్లో వరి పొలాల నుంచే వెలువడుతోందని చెబుతున్నారు. వాతావరణ మార్పులపై అంతర్జాతీయ చర్చల్లో ఇది తరచూ ప్రస్తావనకొస్తుంటుంది. వరి పొలాల వల్ల జరుగుతున్నదని భావిస్తున్న పర్యావరణ నష్టాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిందేనన్న డిమాండ్ ముందుకొస్తున్నది. అయితే, తాజా పరిశోధన తేల్చిందేమంటే.. వరి పొలాల వల్ల పర్యావరణానికి జరుగుతున్నది హాని కాదు.. మేలని! సంప్రదాయ వరి పొలాలు వాతావరణంలోని కర్బన ఉద్గారాలను పీల్చుకుంటూ కాలుష్యాన్ని, భూతాపాన్ని తగ్గిస్తున్నాయని ఈ పరిశోధన తేల్చింది. పచ్చని తివాచీలా విస్తారంగా పరచుకున్న వరి మాగాణులు భూతాపాన్ని పెంచకపోగా.. తగ్గించేందుకు దోహదపడు తున్నాయని తేల్చిన ఈ అపూర్వ పరిశోధనకు కటక్ (ఒడిశా)లోని ప్రతిష్టాత్మక కేంద్రీయ వరి పరిశోధనా సంస్థ(సీఆర్ఆర్ఐ) వేదికైంది. దేశంలోనే అతిముఖ్యమైన వరి పరిశోధనా సంస్థ సీఆర్ఆర్ఐ. 2009 అక్టోబర్ నుంచి అక్కడి శాస్త్రవేత్తలు ఈ పరిశోధనపై దృష్టి పెట్టారు. రెండున్నర ఎకరాల మాగాణి పొలం చుట్టూ పకడ్బందీగా ఇనుప తీగల కంచె వేసి.. నడి మధ్యన ఒక యంత్ర పరికరాన్ని ఏర్పాటు చేశారు. అత్యంత ముఖ్యమైన ఆహార పంటయిన వరిని మడుల్లో నీటిని నిల్వగట్టి సాగు చేయడం వల్ల పర్యావరణానికి జరుగుతున్న కీడేమిటో, మేలేమిటో కొత్త కోణంలో అర్థం చేసుకోవడానికి ఈ విశేష పరిశోధన ఎంతగానో దోహదపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తల మన్నన పొందిన అధునాతన ఎడ్డీ కొవారియన్స్(ఈసీ) సాంకేతిక వ్యవస్థను ఉపయోగించి ఈ పరిశోధన జరిపారు. నేల - వాతావరణం మధ్య వివిధ పర్యావరణ వ్యవస్థల్లో బొగ్గుపులుసు వాయువు, నీటి ఆవిరి, మిథేన్, అనేక ఇతర వాయువుల మార్పిడి తీరు ఎలా ఉందో కచ్చితంగా లెక్కగట్టడానికి ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలంతా ఈసీ వ్యవస్థపైనే ఆధారపడుతున్నారు. సీఆర్ఆర్ఐలో సీనియర్ క్రాప్ సైంటిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ ప్రతాప్ భట్టాచార్య కూడా ఈసీ టెక్నిక్‌నే ఉపయోగించారు. వరి పొలాల వల్ల భూతాపం పెరిగిపోతోందనడం శుద్ధ తప్పని, నిజానికి వరి పొలాలు కర్బన ఉద్గారాలను పీల్చుకొని భూతాపాన్ని తగ్గిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. 2012-13 సంవత్సరంలో ఏడాది పొడవునా డా. ప్రతాప్ భట్టాచార్య, ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఏకే నాయక్‌లతో కూడిన బృందం పూర్తిస్థాయి పరిశోధన చేసింది. నీటిని నిల్వగట్టి వరి సాగైన మాగాణి భూముల్లో బొగ్గుపులుసు వాయువు(సీవో2), మిథేన్(సీహెచ్4)ల నిల్వలు తగ్గుతున్నట్లు వారు గుర్తించారు. ఈ పొలాల్లో నేలకు భూతాపోన్నతికి దోహదపడుతున్న ఈ రెండు వాయువులను భూస్థాపితం చేస్తూ, భూ ఉపరితల వాతావరణం అమితంగా వేడెక్కకుండా అడ్డుకుంటున్నాయని ఈ అధ్యయనం తేల్చింది. హెక్టారు(సుమారు రెండున్నర ఎకరాల) మాగాణి భూమి వర్షాకాలంలో 910 కిలోలు, ఇతర కాలాల్లో 590 కిలోల కర్బనాన్ని వాతావరణం నుంచి పీల్చుకుంటున్నదని ఈ బృందం గుర్తించింది. అయితే, ఫిలిప్పీన్స్‌లోని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థకు చెందిన డా. రీనర్ వాస్మన్ విభేది స్తున్నారు. డా. భట్టాచార్య బృందం మిథేన్‌ను పట్టించుకోలేదన్నారు. డా. భట్టాచార్య స్పందిస్తూ, (మిథేన్ సహా) కర్బనాన్ని మాగాణి భూములు పీల్చుకుంటున్నాయని గుర్తించామని.. విడిగా మిథేన్‌ను పరిగణనలోకి తీసుకోలేదన్నారు. - లతా జిష్ణు (‘డౌన్ టు ఎర్త్’ సౌజన్యంతో..) మాగాణులతో మేలు.. వరి మాగాణుల నుంచి వెలువడే ఉద్గారాల కంటే అవి వాతావరణంలో నుంచి పీల్చుకుంటున్నవే ఎక్కువన్న నిర్ణయానికొచ్చాం. ఇందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాం. మాగాణులు సాధారణంగా కోస్తా తీర ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటాయి. వరి కుంటలకు చుట్టూ 50 నుంచి 100 సెం.మీ.ల ఎత్తున కట్టలు వేస్తుంటారు. ఈ కుంటల్లో వరిసాగు చేస్తూ ఎక్కువ రోజులు నీటిని నిల్వగట్టడం వల్ల నీటి సంరక్షణ జరిగి భూగర్భ జలమట్టం పెరుగుతోంది. కోస్తా ప్రాంతాల్లో భూగర్భంలోకి సముద్రపు నీరు చొచ్చుకురావడాన్ని కూడా ఇవి అడ్డుకుంటున్నాయి. పర్యావరణం, పంటల సాగు వ్యవస్థల ప్రాతిపదికన కర్బన ఉద్గారాలపై జాతీయస్థాయి డేటాబ్యాంక్‌ను రూపొందించడం మన దేశానికి ఉపయుక్తంగా ఉంటుంది. - డా. ప్రతాప్ భట్టాచార్య, కేంద్రీయ వరి పరిశోధనా సంస్థ, కటక్, ఒడిశా