పైకి పెదరాయుడు లోపల చంటిగాడు | nice dishes with capsicum | Sakshi
Sakshi News home page

పైకి పెదరాయుడు లోపల చంటిగాడు

Published Sat, Aug 31 2013 12:09 AM | Last Updated on Fri, Sep 1 2017 10:17 PM

nice dishes with capsicum

వంకాయ... పుచ్చులు ఏరేస్తాం.
 బెండ... వేళ్ల చివర్లు విరిచేస్తాం.
 ఆలూ... తిప్పితిప్పి చూస్తాం.
 చిక్కుళ్లు... విత్తనాల్ని ఒత్తుతాం.
 ఒక్కోదానికి ఒక్కో టెస్ట్.
 అలాగే క్యాప్సికమ్.
 కలర్ చూసి సెలక్ట్ చేసుకుంటాం.
 పచ్చిది గ్రీన్... పండింది రెడ్...
 మగ్గింది ఆరెంజ్... ఆఖర్న ఎల్లో.
 రంగు చూస్తే నోరూరుతుంది!
 ఊరితే ఓకే, మండితేనో...
 (అసలే మిర్చి కదా!).
 అంత లేదు!
 క్యాప్సికమ్... పైకి పెదరాయుడు.
 లోపల చంటిగాడు.
 సాఫ్ట్ అండ్ స్పైసీ!
 ఈ రెండూ కలిసిన ‘రుచులు’...
 ఇంచుమించు స్వర్గపుటంచులు!

 
 చాప్సీ నూడుల్స్ సూప్
 
 కావలసినవి
 నూనె - తగినంత; అల్లం పేస్ట్ - టీ స్పూను; ఉల్లితరుగు - పావు కప్పు; క్యాప్సికమ్ తురుము - కప్పు; క్యారట్ తురుము - పావు కప్పు; ఉప్పు - తగినంత; కారం - టీ స్పూను; టొమాటో సాస్ - రెండు టేబుల్ స్పూన్లు; చిల్లీసాస్ - అర టీ స్పూను; పంచదార - టీ స్పూను; వెనిగర్ - పావు టీ స్పూను; కార్న్ ఫ్లోర్ - రెండు టేబుల్ స్పూన్లు; నూడుల్స్ - కప్పు; సోయాసాస్ - అర టీ స్పూను; మిరియాలపొడి - అర టీ స్పూను
 
 తయారి
 ఒక పాన్‌లో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసి అందులో అల్లం పేస్ట్, ఉల్లితరుగు, క్యారట్ తురుము వేసి బాగా కలపాలి కారం, ఉప్పు జతచేయాలి
 
  మంట పెద్దది చేసి రెండు నిముషాలు కలుపుతుండాలి  
 
 టొమాటో సాస్, చిల్లీసాస్, పంచదార, వెనిగర్ వేసి కలపాలి  కొద్దిసేపు ఉడకనివ్వాలి  
 
 ఒక కప్పులో కొద్దిగా చల్లనీరు, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలిపి, ఉడుకుతున్న కూరల మిశ్రమంలో వేయాలి  
 
 మిశ్రమం చిక్కబడేవరకు కలపాలి  
 
 సోయాసాస్ వేసి బాగా కలిపితే గ్రేవీ తయారయినట్లే
 
 ఒక పాత్రలో తగినంత ఉప్పు, నీరు పోసి మరిగించాలి
 
 నూడుల్స్ వేసి రెండుమూడు నిముషాలు నూడుల్స్ మెత్తబడేవరకు ఉంచాలి  
 
 నీటిని ఒంపేసి, నూడుల్స్‌ని చన్నీటిలో రెండుమూడుసార్లు జాడించాలి
 
 కొద్దిగా నూనె జతచే యాలి (ఇలా చేయడం వల్ల నూడుల్స్ అతుక్కోకుండా ఉంటాయి)  
 
 ఒక పాన్‌లో నూనె కాగాక నూడుల్స్ వేసి వేయించి కిచెన్ టవల్ మీద ఉంచాలి (నూనె అంతా పోయి బాగా క్రిస్పీగా అవుతాయి)
 
 సర్వింగ్ బౌల్‌లో వీటిని వేయాలి. తయారుచేసి ఉంచుకున్న గ్రేవీని నూడుల్స్ మీద పోసి మిరియాలపొడి చల్లి సర్వ్ చేయాలి.
 
 స్టఫ్‌డ్ పెపర్స్ విత్ వెజిటబుల్ ఉప్మా
 
 కావలసినవి:
 నూనె - నాలుగు టేబుల్ స్పూన్లు; ఉల్లితరుగు - పావుకప్పు; బీరకాయ తరుగు - పావు కప్పు; పసుపురంగు క్యాప్సికమ్ తరుగు - పావు కప్పు; ఎరుపురంగు క్యాప్సికమ్ తరుగు - పావు కప్పు; గ్రీన్ క్యాప్సికమ్ - 10 (స్టఫ్ చేయడానికి అనువుగా పై భాగం జాగ్రత్తగా కట్ చేయాలి); పుదీనా తరుగు - పావుకప్పు; నీరు - ఒకటిన్నర కప్పులు; టొమాటో తరుగు - పావు కప్పు ; బియ్యపురవ్వ - కప్పు; టొమాటో పేస్ట్ - 4 టేబుల్ స్పూన్లు; ఉప్పు - తగినంత
 
 తయారి:
  ఒక పాత్రలో తగినంత నూనె వేసి కాగాక, ఉల్లితరుగు, బీర కాయ తరుగు, ఎరుపు + పసుపు క్యాప్సికం తరుగు, పుదీనా తరుగు, టొమాటో తరుగు వేసి బాగా కలపాలి. కొద్దిగా వేగాక, తగినంత నీరు పోసి మరిగించాలి. బాగా మరిగాక బియ్యపురవ్వ వేస్తూ కలుపుతుండాలి  
 
 టొమాటో పేస్ట్ వేసి మరోమారు కలపాలి  మంట తగ్గించి మూత పెట్టి, పది నిముషాలు ఉడికించాలి  
 
 మరొక పాత్రలో కొద్దిగా నూనె వేసి పై భాగం కట్ చేసిన క్యాప్సికమ్‌లను ఆ నూనెలో వేసి జాగ్రత్తగా కలపాలి  
 
 కొద్దిగా వేగగానే తీసేసి, అందులో పైన తయారుచేసి ఉంచుకున్న ఉప్మా మిశ్రమాన్ని స్టఫ్ చేసి మరో మారు బాణలిలో ఉన్న నూనెలో వేసి కాయ ఆకారం చెదరకుండా జాగ్రత్తగా కలిపి దించేయాలి  
 
 వాటిని అలాగే సర్వ్ చేయాలి.
 
 చీజ్ క్యాప్సికమ్ పరాఠా
 
 కావలసినవి:
 క్యాప్సికమ్ - 4 (పెద్దవి); పెరుగు - పావు కప్పు; గరంమసాలా - పావు టీ స్పూను; ఉప్పు - తగినంత; గోధుమపిండి - రెండుకప్పులు; చీజ్ స్లైసులు - తగినన్ని; నూనె - తగినంత
 
 తయారి:
 క్యాప్సికమ్‌ను శుభ్రంగా కడిగి, మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి  
 
 ఒకపాత్రలో క్యాప్సికమ్ పేస్ట్, పెరుగు, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి
 
 ఇందాకటి మిశ్రమంలో గోధుమపిండి జతచేసి చపాతీపిండి మాదిరిగా కలపాలి  
 
 పాత్ర మీద మూతగా తడి వస్త్రం వేసి పదినిముషాలు పక్కన ఉంచాలి  
 
 చపాతీలు ఒత్తుకుని పెనం మీద వేసి, చుట్టూ నూనె వేసి కాల్చి హాట్‌ప్యాక్‌లోకి తీసుకోవాలి  
 
 ఒక్కో చపాతీ మీద ఒక్కో చీజ్ స్లైస్ వేసి చపాతీలను రోల్ చేసి, సర్వ్ చేయాలి.
 
 క్యాప్సికమ్ పికిల్
 
 కావలసినవి
 క్యాప్సికమ్ - 3 (ఏ రంగు కావాలంటే వాటిని ఎంచుకోవచ్చు); పల్లీలు - అర కప్పు; ఎండుమిర్చి - 15; నూనె - 100 గ్రా.; లవంగాలు - 3; వెల్లుల్లి రేకలు - 4; పసుపు - చిటికెడు; ఉప్పు - తగినంత; చింతపండు రసం - మూడు టేబుల్ స్పూన్లు; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను
 
 తయారి
 ఒక పాత్రలో పల్లీలు, ఎండుమిర్చి వేసి బాగా కలిపి, దించి, చల్లారాక పొడి చేయాలి  
 
 మరొక పాత్రలో నూనె వేసి కాగాక లవంగాలు, వెల్లుల్లి రేకలు వేసి వేయించాలి  
 
 అందులో క్యాప్సికమ్ ముక్కలు వేసి ఒకసారి బాగా కలిపి మెత్తబడే వరకు ఉంచాలి  పసుపు, ఉప్పు జత చేయాలి  
 
 చింతపండు రసం వేసి బాగా కలిపి ఐదు నిముషాలు ఉడికించి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి  
 
 పల్లీల పొడి వేసి మరోమారు మిక్సీపట్టాలి
 
 బాణలిలో నూనె వేసి, కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించి తయారుచేసి ఉంచుకున్న పచ్చడిలో కలపాలి.
 
 ట్రై కలర్ పెపర్ సలాడ్
 
 కావలసినవి
 నూనె - పావు కప్పు; రెడ్ క్యాప్సికమ్ - 2 (నిలువుగా సన్నగా కట్ చేయాలి); గ్రీన్ క్యాప్సికమ్ -  2 (నిలువుగా సన్నగా కట్ చేయాలి); ఎల్లో క్యాప్సికమ్ -  2 (నిలువుగా సన్నగా కట్ చేయాలి); ఉప్పు - తగినంత; జీడిపప్పు ముక్కలు - టేబుల్ స్పూను; వెల్లుల్లి రేకలు - 6; నిమ్మరసం - టీ స్పూను; ధనియాల పొడి - పావు టీ స్పూను; జీలకర్ర పొడి - పావు టీ స్పూను; మిరియాల పొడి - పావు టీ స్పూను; కొత్తిమీర తరుగు - రెండు టేబుల్ స్పూన్లు
 
 తయారి
  ఒక పాత్రలో కొద్దిగా నూనె వేసి కాగాక అందులో... తరిగి ఉంచుకున్న కూరముక్కల (రెడ్, గ్రీన్, ఎల్లో క్యాప్సికమ్)ను వేసి దోరగా వేయించాలి  
 
 ఉప్పు, జీడిపప్పు వేసి బాగా కలిపి ఐదు నిముషాలు ఉంచాలి  
 
 వెల్లుల్లి రేకలు జతచేసి బాగా కలిపాక, నిమ్మరసం వేయాలి
 
 దనియాలపొడి, జీలకర్రపొడి, మిరియాల పొడి చల్లి బాగా కలపాలి  
 
 రెండు నిముషాలు ఉంచి దించేసి, కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి  
 
 ఇది సలాడ్‌లాగ తినచ్చు, లేదంటే చపాతీలోకి కూడా బాగుంటుంది.
 
 చికెన్ క్యాప్సికమ్

 
 కావలసినవి:

మారినేట్ చేయడానికి ... పెరుగు - టేబుల్ స్పూను; కారం - అర టీ స్పూను; మిరియాలపొడి - అర టీ స్పూను; ధనియాలపొడి - ఒకటిన్నర టీ స్పూన్లు; జీలకర్ర పొడి - అర టీ స్పూను; పసుపు - చిటికెడు; నిమ్మరసం - టీ స్పూను; సోయాసాస్ - టీ స్పూను; ఉప్పు - తగినంత; అల్లంవెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను; చికెన్ - అర కేజీ (మీడియం సైజు ముక్కలుగా కట్ చేయాలి); నూనె - తగినంత; ఉల్లితరుగు - అర కప్పు; క్యాప్సికమ్ ముక్కలు - కప్పు; టొమాటో తరుగు - అర కప్పు; గరం మసాలా పొడి - (దాల్చినచెక్క, ఏలకులు, లవంగాల పొడి); టొమాటో సాస్ - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; కొత్తిమీర తరుగు - టీ స్పూను.
 
 తయారి:
 ఒక పాత్రలో పెరుగు, కారం, మిరియాలపొడి, ధనియాలపొడి, జీలకర్ర పొడి, పసుపు, నిమ్మరసం, సోయా సాస్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి, ఈ మిశ్రమాన్ని చికెన్‌కి పట్టించి సుమారు రెండు గంటల సేపు మ్యారినేట్ చేయాలి  
 
 బాణలిలో సగం నూనె వేసి కాగాక, ఉల్లితరుగు వేసి వేయించాలి  
 
 క్యాప్సికమ్ తరుగు, టొమాటో తరుగు వేసి వేయించి పక్కన ఉంచాలి  
 
 అదే పాత్రలో మిగతా సగం నూనె వేసి, మ్యారినేట్ చేసిన చికెన్ వేసి సుమారు నాలుగైదు నిముషాలు ఉడికించి, పక్కన ఉంచిన కూరల మిశ్రమాన్ని జత చేయాలి   
 
 మంట తగ్గించి పది నిముషాలు ఉడకనివ్వాలి. మూత తీసి సుమారు పావు కప్పు నీరు పోసి, చికెన్ మెత్తబడేవరకు ఉడికించాలి  
 
 గరంమసాలా పొడి, టొమాటో సాస్ వేసి కలపాలి  
 
 వేయించి ఉంచుకున్న ఉల్లితరుగు, క్యాప్సికమ్, టొమాటోతరుగు వేసి కలిపి నిముషాలు ఉడికించాలి. (గ్రేవీ తక్కువగా ఉండేలా చూడాలి)
 
 సేకరణ:  డా.వైజయంతి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement