
పేదరికం పేగు తెంచుకొని పుట్టినందుకు
పూటకుపూట అన్నం కోసం దేవులాడుకుంటున్నాం
ఏం చేస్తాం! మా రాత అట్టా రాసుందయ్యా
మీ ప్రచార ఆర్భాట గాలానికి గుచ్చిన
రూపాయి ఎరకు ఆశపడి
కష్టాల కొక్కెను గొంతులో ఇరికించుకున్నాం
ఏం చేస్తాం! మా రాత అట్టా రాసుందయ్యా
మీ మోచేతి మత్తు కోసం
గుటకలు మింగే మా మొగోళ్ళు
మా బాధలను గాలికొదిలేసి
మీ చెప్పులతో స్నేహం చేస్తున్నారు
ఏం చేస్తాం! మా రాత అట్టా రాసుందయ్యా
జనమంతా మీతోనే ఉన్నారని నమ్మించడానికి
మీరు చల్లిన నూకలు
ఆకలి గుంపును అదిమి పట్టడానికే అని తెలిసికూడా
మీ మాయల ఉచ్చులోపడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నాం
ఏం చేస్తాం! మా రాత అట్టా రాసుందయ్యా
మీరు విదిలించే కానుకల కిట్లు
మా ఇంట్లో కొత్త సంవత్సర శోభ తెస్తాయని
ఇంటిల్లిపాది పనులు మానుకొని బారులు తీరి
మీ కుతంత్రం కాళ్ళకింద పడి ఊపిరి వదిలేశాం
ఏం చేస్తాం! మా రాత అట్టా రాసుందయ్యా
ఈ ప్రపంచాన్ని నోటు నడిపించినంత కాలం...
ఈ నోట్లు పెద్దోళ్ళ పెరట్లో కాస్తున్నంత కాలం...
మా కూలి బతుకుల్లో విచ్చుకున్న ఆకలి గాయాలు
నిత్యం ఏడుస్తూనే ఉంటాయి
ఏం చేస్తాం! మా రాత అట్టా రాసుందయ్యా
– డాక్టర్ ఎన్. ఈశ్వర రెడ్డి,
ప్రొఫెసర్, యోగివేమన యూనివర్సిటీ, వైస్సార్ కడప జిల్లా
(గుంటూరు తొక్కిసలాటలో కూతురును కోల్పోయిన ఒక తల్లి రోదిస్తూ... ‘మా రాత అట్టా రాసుందయ్యా’ అన్న వాక్యం విన్న బాధతో)
Comments
Please login to add a commentAdd a comment