ఎస్సీ, ఎస్టీ వాడల్లో శ్రీవారి ఆలయాలు
టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం
సాక్షి,తిరుమల: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏజెన్సీ, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు రూ.8 లక్షలు(ఒక్కో ఆలయానికి) కేటాయిస్తూ టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదించింది. గతంలో ఉండే మ్యాచింగ్ గ్రాంట్ పద్దతి రద్దు చేస్తూ, ఆలయాల నిర్మాణానికి అయ్యే ఖర్చు వందశాతాన్ని ధార్మిక సంస్థే భరించేలా మంగళవారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశం తీర్మానం చేసినట్టు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు వెల్లడించారు. తిరుపతి రైల్వే స్టేషన్ విస్తరణ, అభివృద్ధి కోసం టీటీడీకి చెందిన 2.19 ఎకరాల స్థలాన్ని రైల్వే విభాగానికి గతంలో కేటాయించారు.
దీనికి అదనంగా 74 సెంట్ల స్థలాన్ని తక్షణమే మార్కెట్ ధర కింద రైల్వే విభాగానికి ఇవ్వాలని నిర్ణయించారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సౌకర్యం కోసం ఏడాదిలోపే పనులు పూర్తి చేసే నిబంధనతో దీనికి ఆమోదం తెలిపారు. టీటీడీలోని సెక్యూరిటీ, విజిలెన్స్ గార్డులుగా పునర్ నియామకం పొందిన సైనిక పింఛను దారుల భార్యలకు ఏపీ ప్రభుత్వం సవరించిన పింఛను ఉత్తర్వులను అమలు చేయాలని నిర్ణయించారు.