
చెల్లెల్ని వేధిస్తున్నాడని..బావ కాళ్లను కత్తితో నరికి
బావ కాళ్లను కత్తితో నరికిన బావమరిది
పరిస్థితి విషమం
గుడ్లూరు : చెల్లెల్ని వేధిస్తున్నాడని బావను చెట్టుకు కట్టేసి బావమరిది కత్తితో కాళ్లు నరికి వేయడంతో తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని పూరేటిపల్లిలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..గ్రామంలోని ఎస్టీ కాలనీకి చెందిన వెంకటమ్మకు శింగరాయకొండకు చెందిన అంజయ్యతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. మద్యానికి బానిసైన అంజయ్య భార్య వెంకటమ్మను వేధిస్తున్నాడు. నాలుగు రోజులు క్రితం భార్యను కొట్టి పుట్టింటికి పంపించాడు. ఆదివారం ఉదయం శింగరాయకొండ నుంచి పూరేటిపల్లి వచ్చిన అంజయ్య బావమరుదులు చినకొండయ్య, శ్రీనివాసులుతో కలిసి మద్యం తాగి ఇంటికెళ్లాడు.
అక్కడ కొండయ్య..‘మా చెల్లెల్ని ఎందుకు వేధిస్తున్నావు’ అని అడగటంతో ముగ్గురి మధ్య మాట మాట పెరిగి గొడవ పెట్టుకున్నారు. దీంతో అంజయ్యను ఇంటి ముందున్న వేప చెట్టుకు కట్టేసిన కొండయ్య ఇంటిలో ఉన్న మొద్దు కత్తిని తీసుకొచ్చి ఒక కాలును పూర్తిగా నరికేశాడు. రెండో కాలిపై, చేతులపై విచక్షణా రహితంగా దాడిచేసి గాయపరిచాడు. అంజయ్య పెద్దగా కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు అక్కడికి చేరుకున్నారు. దీంతో చిన కొండయ్య, శ్రీనివాసులు అక్కడి నుంచి పారిపోయారు. ఇంత గొడవ జరుగుతున్నా ఇంట్లోవారెవరూ వారిని అడ్డుకోకపోవడం గమనార్హం. నెత్తుటి మడుగులో భయానక పరిస్థితిలో ఉన్న అంజయ్య దగ్గరికెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు.
స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై హుస్సేన్‌బాషాకు సిబ్బందితో కలిసి హుటాహుటిన గ్రామానికి చేరుకుని అప్పటికే అపస్మారక స్థితిలో రక్తపు మడుగులో పడి ఉన్న అంజయ్యను 108లో కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి నెల్లూరు తీసుకెళ్లారు. అక్కడ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. రక్తం ఎక్కువగా పోవడంతో బతకడం కష్టమే అని వైద్యులు చెప్పినట్లు బంధువులు తెలిపారు. ఘటనా స్థలాన్ని సీఐ మధుబాబు పరిశీలించారు. ఘటన వివరాలను అంజయ్య భార్య, అత్త, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హుస్సేన్‌బాషా తెలిపారు.