
అంజయ్య
రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అంజయ్య (54) కరోనా కాటుకు బలయ్యారు.
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అంజయ్య (54) కరోనా కాటుకు బలయ్యారు. ఆయనకు ఈనెల 13న కరోనా పాజిటివ్ రాగా.. హైదరాబాద్‌లోని ఓమ్నీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు పరిస్థితి విషమించడంతో మంగళవారం తుదిశ్వాస విడిచారు.
అదనపు కలెక్టర్‌గా పనిచేసిన ఆయన అనతికాలంలోనే మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఈయన స్వగ్రామం సూర్యా పేట జిల్లా జాజిరెడ్డిగూడెం. అంజయ్య మృతిపై మంత్రి కేటీఆర్, కలెక్టర్ కృష్ణభాస్కర్, జెడ్పీ చైర్‌పర్సన్ అరుణ సంతాపం తెలిపారు.
కరోనాతో జేఎన్‌ఏఎఫ్‌ఏయూ మాజీ రిజిస్ట్రార్ మృతి
విజయనగర్‌కాలనీ (హైదరాబాద్): జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనార్ట్స్ యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ షేక్ రెహమాన్ పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో కరోనాకు చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు.
యూనివర్సిటీలో గతంలో ఫొటోగ్రఫీ హెచ్‌ఓడీగా విధులు నిర్వహించిన రెహమాన్ ప్రస్తుతం ప్లానింగ్ అకడమిక్ సేవలు అందిస్తున్నారు. రెహమాన్ మృతికి వర్సిటీ వీసీ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్. కవితా దరియాణిరావు, వర్సిటీ సిబ్బంది సంతాపం తెలిపారు.