తంగళ్లపల్లి (సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన ముత్తంగి శ్రీనివాస్‌రెడ్డి (45)ది వ్యవసాయ కుటుంబం. నాలుగెకరాల పొలం ఉంది. వ్యవసాయం చేస్తూనే భార్య లత, కూతురు రేఖ, కొడుకు శివరామకృష్ణను పోషించుకుంటున్నాడు. కూతురు డిగ్రీ పూర్తిచేసింది. కొడుకు ఇంటర్ చదువుతున్నాడు. సాఫీగా సాగుతున్న వారి జీవితాల్లో కరోనా భూతం కల్లోలం సృష్టించింది.
మే మొదటివారంలో శ్రీనివాస్‌రెడ్డి కరోనా బారినపడ్డాడు. మొదట లక్షణాలు తెలియలేదు. కరోనా అని గుర్తించడంలో ఆలస్యమైంది. ఐదు ఆస్పత్రుల చుట్టూ తిరిగినా.. చేరిన ప్రతి ఆస్పత్రిలో రూ.లక్షల బిల్లు వేశారే కానీ, ప్రాణాలు మాత్రం దక్కలేదు. శ్రీనివాస్‌రెడ్డి గత నెల 30న ప్రాణాలు వదిలాడు. మొత్తం 27 రోజుల చికిత్సకు రూ.29 లక్షల వరకు ఖర్చయ్యాయి. ఇందులో రూ.2 లక్షలు మంత్రి కేటీఆర్ సాయం చేశారు. ప్రస్తుతం శ్రీనివాస్ భార్య, పిల్లలు కరోనా పాజిటివ్‌తో ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు.
శ్రీనివాస్‌రెడ్డిని బతికించుకునే ప్రయత్నంలో బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు ఇలా.. అన్ని చోట్లా లత అప్పు తెచ్చింది. వైద్య ఖర్చులు దాదాపు రూ.23 లక్షలు కాగా, అతడిని ఆసుపత్రులకు తరలించేందుకు అంబులెన్స్‌లు, రవాణా ఖర్చులకు మరో రూ.4 లక్షల వరకు అయ్యాయి. రూ.27 లక్షల అప్పు తెచి్చనా శ్రీనివాస్‌రెడ్డి మాత్రం దక్కలేదు. ప్రస్తుతం ఆ కుటుంబం తమకున్న నాలుగెకరాలు అమ్ముకునే దుస్థితి నెలకొంది. ఇంటి పెద్ద మరణం ఓవైపు.. అప్పుల బాధలు మరోవైపు వారిని కుంగదీస్తున్నాయి. భూమి అమ్మితేనే అప్పు తీరేది. అది అమ్మితే.. బిడ్డ పెళ్లి చేసేదెలా అని లత కన్నీరుమున్నీరవుతోంది.
ఇదీ చికిత్సకైన ఖర్చుల లెక్క..
- శ్రీనివాస్‌రెడ్డికి పాజిటివ్ అని నిర్ధారణ అయ్యాక మొదట సిరిసిల్లలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఒకరోజు చికిత్స చేసి రూ.లక్ష బిల్లు వేశారు.
- అక్కడ పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో కుటుంబసభ్యులు హైదరాబాద్ తరలించి, కొంపల్లిలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ మూడు రోజులు చికిత్స చేసి రూ.1.50 లక్షల బిల్లువేశారు. తమ వల్ల కాదని వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని చేతులెత్తేశారు.
- తర్వాత అల్వాల్‌లో ఉన్న మరో కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, ఏడు రోజులు చికిత్స చేసి రూ.7 లక్షల బిల్లువేశారు. మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు.
- చావుబతుకుల మధ్య ఉన్న శ్రీనివాస్‌రెడ్డిని ఉప్పల్‌లో ఉన్న ఇంకో కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ 11 రోజులు చికిత్స అందించి రూ.12 లక్షల బిల్లువేసి చేతులెత్తేసింది ఆసుపత్రి.
- ఎలాగైనా ప్రాణాలు దక్కించుకోవాలనే తపనతో శ్రీనివాస్‌రెడ్డిని మరో కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఐదురోజులు చికిత్స అందించినా ప్రాణం దక్కలేదు. సదరు ఆస్పత్రి రూ.3.50 లక్షలు బిల్లు చెల్లిస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామని చెప్పగా కుటుంబసభ్యులు దిక్కుతోచని స్థితిలో మంత్రి కేటీఆర్‌ను వేడుకున్నారు. రూ.2 లక్షలు తాను చెల్లిస్తానని కేటీఆర్ హామీ ఇవ్వగా.. కుటుంబసభ్యులు మిగతా రూ.1.50 లక్షలు కట్టి మృతదేహాన్ని తీసుకెళ్లారు.
‘‘మాయదారి కరోనా మా ఇల్లును ఆగం చేసింది. మా ఆయనను రోజుకో ఆస్పత్రి తిప్పిండ్రు. తమ వళ్ల కాదన్నరు. దినాం లక్షకు పైగా ఖర్చు చేసినం. అంబులెన్సుల్లో తిప్పినందుకే నాలుగు లక్షలు ఒడిసినయ్. అప్పు ఎలా తీర్చేది.. బిడ్డ పెళ్లి ఎలా చేసేది’’
–శ్రీనివాస్‌రెడ్డి భార్య లత
Comments
Please login to add a commentAdd a comment