BC colony
-
చేతులెలా వచ్చాయో?
అమ్మతోపాటు ఉంటే.. ఆప్తుడనుకున్నాడు.. అప్పుడప్పుడూ ఇంటికొస్తుంటే బంధువని భావించాడు. కానీ వాడు ఆప్తుడు రూపంలో ఉన్న క్రూరుడని... బంధువులా దగ్గరయ్యే రాబందని గుర్తించలేకపోయాడు. తనను నిలువునా చిదిమేస్తాడని గ్రహించలేకపోయాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ విషాదమంతా... కురబల కోట బీసీ కాలనీకి చెందిన చిన్నారి ఇమ్రాన్ గురించే. తనకు సన్నిహితంగా ఉండే స్నేహితురాలు తనను వదిలి విదేశానికి వెళ్లిందన్న ఆక్రోశంతో ఆమె బిడ్డనే పొట్టన పెట్టుకున్న దుర్మార్గుడు మస్తాన్‌వలీ చేతులు పడిపోనంటూ... శపించని స్వరం లేదు.. చిన్నారి ఇమ్రాన్ కోసం తపించని హృదయం లేదు... - కురబలకోటలో బాలుడి హత్య ఉదంతంపై సర్వత్రా విస్మయం - ఇమ్రాన్ మృతితో శోకసంద్రమైన కురబలకోట బీసీ కాలనీ - బిడ్డతో అనుబంధం తలుచుకుని తపించిపోయిన స్థానిక మహిళలు కురబలకోట : బుడిబుడి అడుగులు వేసుకుంటూ ఇళ్ల మధ్య తిరిగే ఇమ్రాన్ దూరమయ్యాడంటూ... మహిళలు చేసిన రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. పాపం.. పసిబిడ్డ ఎంత నరకం అనుభవించి ఉంటాడో..ఎంతగా విలవిలలాడాడో నని బాలుడిని చూసి ఏడ్వని వారు లేరు. సభ్యసమాజం భరించలేని ఈ బాధంతా... కురబలకోటలో హత్యకు గురైన బీసీ కాలనీకి చెందిన చిన్నారి ఇమ్రాన్ (5) గురించే. ఆలస్యంగా వెలుగు చూసిన ఉదంతం తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. స్థానికంగా నివాసం ఉండే హబీబ్(26), షబీనా (25)కు ఆరేళ్ల క్రితం పెళ్లయ్యింది. వీరికి ఓ కూతురు, కుమారుడు మహమ్మద్ ఇమ్రాన్ (5) ఉన్నారు. భార్యాభర్యల మధ్య మనస్పర్థలు రావడంతో ఏడాదిగా అదే కాలనీలోని పుట్టింటిలో షబీనా ఉంటోంది. అదే కాలనీలోని మస్తాన్‌వల్లీ (27)తో ఆమెకు స్నేహం పెరిగింది. ఇదిలా ఉండగా 20 రోజుల క్రితం బతుకుదెరువు కోసం షబీనా కువైట్ వెళ్లింది. అంతకుముందు నుంచి మస్తాన్‌వల్లి ఆమెను కువైట్ వెళ్లవద్దని హెచ్చరించాడు. ఆమె దూరమవడంతో కక్ష పెంచుకున్న మస్తాన్‌వల్లీ వారం క్రితం కువైట్‌లోని షబీనాకు ఫోన్‌చేసి నిన్ను ఎలా రప్పించుకోవాలో తెలుసంటూ బెదిరించాడు. ఆ మరుసటి రోజే శుక్రవారం ఇంటి దగ్గర ఆడుకుంటున్న షబీనా కుమారుడు మహమ్మద్ ఇమ్రాన్ (5) కన్పించకుండా పోయాడు. ఎంత వెతికినా ఆచూకీ లేదు. మంగళవారం ఆ బాలుడు శవమై కన్పించాడు. దీంతో ఆ గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. కుటుంబసభ్యుల, బంధువుల రోద నలు మిన్నంటాయి. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బీసీ కాలనీకి తీసుకురాగా స్థానికులు తీవ్ర ఆవేదన చెందారు. తీవ్ర ఆశ్రునయనాల నడుమ మంగళవారం రాత్రి బాలుడికి అంత్యక్రియలు నిర్వహించారు. పసివాడి తండ్రి ఊరిలోనే చిన్న టీ కొట్టు నిర్వహిస్తున్నారు. తల్లి కువైట్ వెళ్లింది. ఇంతలో పిల్లాడి ప్రాణాలు కడతేరి పోవడంతో బంధుమిత్రులంతా గొల్లుమంటున్నారు. మరోవైపు శుక్రవారం అదృశ్యమైన బాలుడిని అదే రోజు గొంతు నులిమి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. బాలుడి తల్లికి స్నేహితుడైన మస్తాన్ వలీ ఈ దారుణానికి పాల్పడ్డట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉండడంతో అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇద్దరిని కాటేసిన విద్యుదాఘాతం
విద్యుదాఘాతం రూపంలో మృత్యువు రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. వేర్వేరు ప్రాంతాల్లో శనివారం జరిగిన ఈ దుర్ఘటనలతో రెండు కుటుంబాలు మగ దిక్కును కోల్పోయాయి. కురుపాం మండలం రస్తాకుంటుబాయి సమీపంలో 33 కేవీ విద్యుత్ లైన్‌కు మరమ్మతులు చేస్తుండగా సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా విద్యుత్ సరఫరా కావటంతో కాంట్రాక్ట్ లైన్మెన్ ఒకరు మరణించారు. చీపురుపల్లిలోని ఓ ఇంటిలో స్వీపర్‌గా పనిచేస్తున్న వ్యక్తి విద్యుత్ మోటార్ వద్ద షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు ఆడపిల్లల తండ్రి మృతి చీపురుపల్లి: స్థానిక ఆంజనేయపురంలోని ఓ ఇంటిలో స్వీపర్‌గా పనిచేస్తున్న వ్యక్తి విద్యుదాఘాతంతో కన్నుమూశారు. నాలుగు పదుల వయసులోనే మృత్యువాత పడటంతో కట్టుకున్న భార్య, ముగ్గురు కుమార్తెలు అనాధలయ్యారు. ఇకపై తమను పోషించే ది ఎవరని, ముగ్గురు కూతుళ్లకు వివాహం ఎలా చేయాలంటూ భార్య, బంధువులు బోరున విల పించారు. పరిహారం చెల్లించాలంటూ ఘటన జరిగిన ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. స్థానిక వైఎస్ఆర్సీపీ, టీడీపీ నేతలు జోక్యంతో ఇంటి ప్రస్తుత, గత యజమానులు రూ.6 లక్షలు చెల్లించేందుకు అంగీకరించారు. ఇదీ జరిగింది: గరివిడి బీసీ కాలనీకి చెందిన దన్నాన శ్రీను అలియాస్ రాజు(40) ఆంజనేయపురంలోని ఇంటిలో స్వీపర్‌గా పనిచేస్తున్నారు. ఈ ఇంటిని ఎ.ఎస్.వి.ప్రసాద్ అనే మైనింగ్ పరిశ్రమ యజమాని ప్రముఖ వ్యాపారి గుడ్ల నర్శింహమూర్తికి ఇటీవల విక్రయించారు. ఈ నెల 15న రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది. శ్రీను మూడు రోజులకు ఒకసారి వచ్చి ఇంటిని, ఆవరణను శుభ్రం చేసి వెళుతుంటారు. శనివారం ఉదయం 6.30 గంటలకు వచ్చిన శ్రీను నీటి మోటారు వద్ద విద్యుదాఘాతం తగలటంతో మరణించాడు. అదే భవనంలో పని చేస్తున్నవారు మృతుడి ఇంటికి సమాచారమిచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. శ్రీను మృతదేహాన్ని చూసి భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. శ్రీను కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు, స్థానికులు ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేవరకు మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదని భీష్మించారు. వారి ఆందోళనతో మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గరివిడి ఎస్ఐ కృష్ణవర్మ, చీపురుపల్లి ఏఎస్ఐలు ప్రసాద్, సురేష్, సిబ్బంది వచ్చి పరిస్థితిని అదుపు చేశారు. పెద్దల జోక్యంతో బాధితులకు న్యాయం గరివిడి పట్టణ పెద్దలతోపాటు వైఎస్సార్సీపీ, టీడీపీలకు చెందిన ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, బమ్మిడి అప్పలస్వామి, భీంపల్లి వెంకటరావు, సివుకు కాంతారావు, మీ సాల వరహాలనాయుడు, పైల బలరాం తదితరులు మృతుని కుటుంబానికి బాసటగా నిలి చారు. ఇంటి యజమానులు ప్రసాద్, నర్సింహమూర్తులతో చర్చలు జరిపారు. ఇంటిని విక్రయించిన ప్రసాద్ ఇంకా ఖాళీ చేయనందున తనకు సంబంధం లేదని నర్సింహమూర్తి చెప్పా రు. ఇద్దరూ నష్టపరిహారం ఇవ్వాల్సిందేనని పెద్ద లు స్పష్టం చేశారు. దీంతో మృతుని ముగ్గురు కుమార్తెల పేరిట రూ.6 లక్షలను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వా రు అంగీకరించారు. మృతుని పెద్ద కు మార్తె కావ్య డిగ్రీ, మిగిలిన ఇద్దరు ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని సీఐ ఎస్.రాఘవు లు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి కురుపాం: విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. మండలంలోని ఉదయపురానికి చెందిన కాంట్రాక్ట్ బేసిక్ లైన్మెన్ ఊయక మురళీకృష్ణ(24)విద్యుదాఘాతానికి గురై శనివారం మధ్యాహ్నం మృతి చెందా రు. వివరాలిలా ఉన్నాయి. రస్తాకుంటుబాయి సమీపంలో 33 కేవీ లైన్‌కు గుమ్మలక్ష్మీపురం మండలం కేదారిపురం, మొండెంఖల్ ఫీడర్లకు చెందిన లైన్మెన్లు మరమ్మతులు చే స్తున్నారు. మొండెంఖల్ ఫీడర్‌కు చెందిన మురళీకృష్ణ అధికారుల పర్యవేక్షణలో విద్యుత్ స్తంభం ఎక్కి వైర్లను కలుపుతుండగా విద్యుత్ సరఫరా కావడంతో షాక్ తిని కిందపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికుల సహాయంతో విద్యుత్ సిబ్బంది ఆటోలో కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అప్పటికే అతడు మరణించాడని డాక్టర్ రవికుమార్ చెప్పారు. కురుపాం హెచ్‌సీ పరసన్న కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన తీరు గురించి ట్రాన్స్‌కో ఏడీఏ ఆర్.సతీష్‌కుమార్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎల్సీ తీసుకున్నా జరిగిన ప్రమాదం విద్యుత్ లైన్ మరమ్మతులు చేపట్టిన సిబ్బంది కురుపాం, పి.లేవిడి సబ్స్టేషన్ల నుంచి లైన్ క్లియరెన్స్(ఎల్సీ) తీసుకున్నా విద్యుత్ సరఫరా జరగటంతో ఈ ప్రమాదం జరిగింది. దీనికి బాధ్యులెవరన్నది విచారణలో తేలాల్సి ఉంది. గతంలో కూడా ఇక్కడ ఇలాంటి ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్పారు. బాధ్యులపై చర్య తీసుకోండి: ఎమ్మెల్యే శ్రీవాణి లైన్మెన్ మురళీకృష్ణ మృతికి బాధ్యులైనవారిపై చర్య తీసుకోవాలని కురుపాం ఎ మ్మెల్యే పాముల పు ష్పశ్రీవాణి ట్రాన్స్‌కో ఏడీఏ ఆర్.సతీష్‌కుమార్‌కు చెప్పారు. ఘ టన గురించి తెలిసిన వెంటనే ఎమ్మెల్యే ట్రా న్స్‌కో అధికారులతో ఫోన్లో మాట్లాడారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని మందలించారు. -
టెన్త్ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య
ప్రకాశం(జరుగుమల్లి): పదో తరగతి విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా జరుగుమల్లి బీసీ కాలనీలో సోమవారం జరిగింది. వివరాలు కాలనీకి చెందిన ఘడియపూడి సుధాకర్, వెంకాయమ్మ దంపతుల కుమార్తె కావ్య జరుగుమల్లిలో తాత వద్ద ఉంటూ పదో తరగతి చదువుతోంది. కావ్య చదువులో ఎప్పుడూ ముందుంటూ తెలివిగల విద్యార్థినిగా పేరు తెచ్చుకుంది. సోమవారం ఒంటిపూట బడి కావడంతో మధ్యాహ్నం ఇంటికి వచ్చింది. పనికి వెళ్లి వచ్చిన తాత ఇంటి తీసి చూడగా ఎదురుగా మనుమరాలు కావ్య(15) చున్నీతో దూలానికి వేలాడుతూ కనిపించింది. దీంతో భయపడి పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు వచ్చి వెంటనే కిందికి దించారు. అప్పటికే విద్యార్థిని మృతిచెందింది. కావ్య ఆత్మహత్య చేసుకోడానికి కారణాలు తెలియలేదు. సమాచారం అందుకున్న సింగరాయకొండ సీఐ సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. -
మౌనంగానే ఎదగమని..
అతడు ఎవరితోనూ మాట్లాడడు... ఎవరి మాటనూ వినడు. అలాగని.. అతడు ఎవరి మాట వినని మొండిఘటమేమీ కాదు. విధి అలా మార్చిందంతే. పుట్టుకతోనే అతడికి మూగతో పాటు వినికిడి లోపం. అయినా తన లోకంలోనే ఉండిపోలేదు. ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంలా మల్చుకున్నాడు. వైకల్యాన్ని జయించి అందరిలా.. అందరివాడిలా ముందుకు సాగుతున్నాడు. సంజ్ఞలతోనే పనులన్నీ చక్కబెడుతున్నాడు. వైరాకు చెందిన యువకుడు మొలా శరత్రాహుల్ విజయగాథ ఇది. వైరాలోని బీసీకాలనీకి చెందిన మొలా సుందర్రావు, విజయకుమారి దంపతుల కుమారుడు శరత్ రాహుల్(24)కి పుట్టకతోనే రుగ్మతలు ఆవరించాయి. చిన్నప్పటి నుంచి అతడు మాట్లాడలేడూ వినలేడు. అయినా అతడు ఆత్మస్థైర్యాన్ని చిరుప్రాయం నుంచే అలవర్చుకున్నాడు. స్థానిక అజరయ్య శ్రీనికేతన్ విద్యాలయంలో పదో తరగతి పూర్తి చేశాడు. పాఠ్యాంశాలు వినిపించకపోయినా సజ్ఞలతోనే అర్థం చేసుకున్నాడు. మంచి మార్కులతోనే ఉత్తీర్ణత సాధించాడు. ఆత్మవిశ్వాసమే ఆసరా తన వైకల్యాన్ని చూసుకుని మదనపడడం కన్నా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడమే మేలని భావించాడు శరత్ రాహుల్. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి అయినా (ఇప్పుడు రిటైర్డ్) ఆయనపై ఆధార పడలేదు. ఏదో పనిచేసి తన కాళ్లపై తాను నిలబడాలని సంకల్పించాడు. లక్ష్యసాధన కోసం ముందడుగు వేశాడు.మేకానిజంపై ఉన్న మక్కువతో వైరాలోని ఓ ఇంజనీరింగ్ షాపులో పనికి కుదరాడు. ఏ వస్తువునైనా తన మేధస్సుతో ఇట్టే రిపేర్ చేసే సహజత్వం కలిగిన రాహుల్ వెల్డింగ్ పనిని కొద్దికాలంలోనే సమగ్రంగా నేర్చుకున్నాడు. ఇప్పుడు అతడి వేతనం రూ. 7 వేలు. అంతేకాదు.. ఎలాంటి శిక్షణ లేకుండానే ద్విచక్రవాహనాలు, విద్యుత్ మోటార్లు రిపేర్, హౌస్వైరింగ్ చేయడంలో అతడు పట్టుసాధించాడు. మాటలు రాకపోయినా... మాట్లాడడం రాకపోయినా శరత్ రాహుల్ సోషల్ మీడియా ద్వారా యావత్ ప్రపంచంతో సంభాషిస్తున్నాడు. ఫేస్బుక్ ద్వారా మిత్రులతో తన భావాలు పంచుకుంటున్నాడు. అంతేకాదు... సెల్‌ఫోన్ వినియోగంలోనూ రాహుల్ శైలి వినూత్నమే. సంభాషిచడం సాధ్యం కాదు కనుక ఎస్ఎంఎస్ల ద్వారా తన భావాలను అవతలి వారికి తెలియజేస్తున్నాడు. పని ఒత్తిడి వల్ల ఇంటికి వెళ్లడం ఆలస్యమైతే ఎస్ఎంఎస్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం ఇస్తుంటాడు. నాలుగేళ్లుగా శరత్ రాహుల్‌కు ఇది మంచి సాధనంగా మారింది. ఇంతటి ఆత్మస్థైర్యం కలిగిన ఈ యువకుడిని చూసి స్థానికులు ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. -
‘జన్మభూమి’లో జలజగడం
దేవరాపల్లి : మండలంలోని వాకపల్లిలో సోమవారం జన్మభూమి-మాఊరు కార్యక్రమ నిర్వహణకు వచ్చిన అధికారులకు ప్రజల నుంచి చుక్కెదురైంది. తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ కొన్నేళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా ఎవ్వరూ పట్టించుకోలేదని, ఇప్పుడు గ్రామంలోకి వచ్చి ఏం సాధిస్తారంటూ బీసీ కాలనీ వాసులు అధికారులను రానీయకుండా గ్రామ శివారులోనే రోడ్డుపై ఖాళీ బిందెలతో బైఠాయించారు. గ్రామస్తులను ఎంత నచ్చజేప్పినా వినకపోవడంతో గత్యంతరం లేక వెనుదిరిగారు. కానీ వెళ్లినట్టే వెళ్లి చోడవరం మీదుగా వాకపల్లి గ్రామానికి సుమారు 40 కిలోమీటర్లు దాటి అడ్డదారిలో ముప్పుతిప్పలు పడుతూ వచ్చి గ్రామస్తుల ఆగ్రహానికి గురయ్యారు. జన్మభూమి సభ వద్దకు గ్రామస్తులంతా వచ్చి అధికారులను చుట్టుముట్టి నినాదాలు చేశారు. తాగునీటి సమస్యను తక్షణం పరిష్కరించాల్సిందేనని, లేకుంటే ఇక్కడి నుంచి కదలనీయబోమని వారితో వాగ్వాదానికి దిగారు. దీనిపై తహశీల్దార్ వై.ఎస్.వి.వి.ప్రసాదరావు స్పందిస్తూ త్వరలోనే తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హమీ ఇచ్చి వారి నుంచి వినతిపత్రం తీసుకున్నారు. దీంతో గ్రామస్తులు శాంతించారు. కార్యక్రమంలో వేచలం వైద్యాధికారి జి.అనీషా, పశు వైద్యాధికారి కె.వి.వరప్రసాద్, వ్యవసాయాధికారి డి.అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
ఆ ఊరికి పెళ్లి సంబంధమా.. వద్దు బాబోయ్
ఆ గ్రామంతో వియ్యమందేందుకు కూడా ఇతర ప్రాంతాల ప్రజలు జంకుతారు. అలాగని గ్రామంలో కక్షలూ, కార్పణ్యాలూ ఉన్నాయా? అంటే అదీ కాదు. ఆ గ్రామం అభివృద్ధికి నోచుకోలేదంతే. ఎంతగా అంటే.. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లైనా ఆ గ్రామానికి రోడ్డు మార్గం లేదు. కూడేరు మండలం పి.నారాయణపురం పంచాయతీ పరిధిలోని ఈ గ్రామం పేరు ఎంఎం హళ్లి. మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. 1100 మంది జనాభా గ్రామంలోని బీసీ కాలనీలో 265 కుటుంబాలు, ఎస్టీ కాలనీలో 60 కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామంలో మొత్తం 1100 దాకా జనాభా ఉంటుంది. వీరిలో వాల్మీకి, ఎరుకల సామాజిక వర్గాల ప్రజలే అధికం. వీరిలో ఎక్కువ మంది వ్యవసాయ కూలీలే. కొందరికి భూములున్నా నీరు లేక బీళ్లుగా వదిలేశారు. మరి కొందరు అరకొరగా ఉన్న నీటితో పంటలు సాగు చేసుకుంటున్నారు. చాలామంది స్థానికంగా పనులు లేక బెళుగుప్ప మండలంలోని జీడిపల్లి రిజర్వాయర్ కింద ఉన్న పొలాల్లోకి కూలిపనులకు వెళ్లి కుటుంబాలను పోషించుకుంటున్నారు. మేనరికపు వివాహాలే అధికం ఇప్పటిదాకా గ్రామానికి ఎర్రబస్సు వచ్చిన దాఖలాలే లేవంటే, ఈ గ్రామానికి బాహ్య ప్రపంచంతో ఏ మాత్రం సంబంధాలున్నాయో అర్థమవుతుంది. గ్రామానికి వెళ్లే రహదారి గులకరాళ్లు, ముళ్ల పొదలతో అధ్వానంగా ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో ఆదుకునే 108 వాహనం కూడా ఈ గ్రామానికి వెళ్లదు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో, ప్రసవ సమయాల్లో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. అలాంటి పరిస్థితుల్లో గ్రామంలోని రెండు ఆటోలే వారికి దిక్కు. అందువల్లే ఈ గ్రామానికి స్థానికుల బంధువులు గానీ, అధికారులు గానీ వెళ్లాలంటే వెనుకంజ వేస్తారు. ఇక ఈ గ్రామస్తుతో వియ్యమందేందుకు ఎవరూ ముందుకు రారు. వాహన సౌకర్యం లేని గ్రామంలోని అబ్బాయికి, అమ్మాయిని ఇవ్వాలన్నా, గ్రామంలో అమ్మాయిని చేసుకోవాలన్నా ఆలోచిస్తున్నారు. దీంతో, గ్రామంలోని వారే, తమ బంధువుల కుటుంబాల్లోనే వివాహాలు చేసుకుంటున్నారు. చదువు మానేసిన విద్యార్థులు బీసీ, ఎస్టీ కాలనీల్లో ప్రాథమిక పాఠశాలలున్నాయి. దాదాపు 90 మంది దాకా పిల్లలు చదువుకుంటున్నారు. 50 మంది దాకా 8 నుంచి డిగ్రీ వరకు ఆత్మకూరు, అనంతపురంలోని పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్నారు. బస్సు సౌకర్యం లేక, ఆర్థిక సమస్యలు సహకరించక చదువు మానేశారు. అభివృద్ధికి కృషి చేయండి అన్ని విధాల వెనుకబడిన తమ గ్రామానికి రోడ్డు ఏర్పాటు చేసి, బస్సు సౌకర్యం కల్పించాలని సర్పంచ్ కృష్ణమ్మ, గ్రామస్తులు కృష్ణప్ప, నారాయణ స్వామి, రామస్వామి, ప్రసాద్ తదితరులు ప్రభుత్వాన్ని, ప్రజా ప్రతినిధులను కోరుతున్నారు. ఎగుడుదిగుడు వీధులు గ్రామంలోని కాలనీల్లో ప్రభుత్వం మంజూరు చేసిన వాటికన్నా, ఆర్డీటీ నిర్మించిన ఇళ్లే అధికంగా ఉన్నాయి. సిమెంటు రోడ్డు లేకపోవడంతో వీధులన్నీ ఎగుడుదిగుడుగా మారాయి. వీటన్నింటితో పాటు తాగునీటి సమస్య కూడా గ్రామస్తులను వేధిస్తోంది.