‘జన్మభూమి’లో జలజగడం
దేవరాపల్లి : మండలంలోని వాకపల్లిలో సోమవారం జన్మభూమి-మాఊరు కార్యక్రమ నిర్వహణకు వచ్చిన అధికారులకు ప్రజల నుంచి చుక్కెదురైంది. తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ కొన్నేళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా ఎవ్వరూ పట్టించుకోలేదని, ఇప్పుడు గ్రామంలోకి వచ్చి ఏం సాధిస్తారంటూ బీసీ కాలనీ వాసులు అధికారులను రానీయకుండా గ్రామ శివారులోనే రోడ్డుపై ఖాళీ బిందెలతో బైఠాయించారు.
గ్రామస్తులను ఎంత నచ్చజేప్పినా వినకపోవడంతో గత్యంతరం లేక వెనుదిరిగారు. కానీ వెళ్లినట్టే వెళ్లి చోడవరం మీదుగా వాకపల్లి గ్రామానికి సుమారు 40 కిలోమీటర్లు దాటి అడ్డదారిలో ముప్పుతిప్పలు పడుతూ వచ్చి గ్రామస్తుల ఆగ్రహానికి గురయ్యారు. జన్మభూమి సభ వద్దకు గ్రామస్తులంతా వచ్చి అధికారులను చుట్టుముట్టి నినాదాలు చేశారు. తాగునీటి సమస్యను తక్షణం పరిష్కరించాల్సిందేనని, లేకుంటే ఇక్కడి నుంచి కదలనీయబోమని వారితో వాగ్వాదానికి దిగారు.
దీనిపై తహశీల్దార్ వై.ఎస్.వి.వి.ప్రసాదరావు స్పందిస్తూ త్వరలోనే తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హమీ ఇచ్చి వారి నుంచి వినతిపత్రం తీసుకున్నారు. దీంతో గ్రామస్తులు శాంతించారు. కార్యక్రమంలో వేచలం వైద్యాధికారి జి.అనీషా, పశు వైద్యాధికారి కె.వి.వరప్రసాద్, వ్యవసాయాధికారి డి.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.