చేతులెలా వచ్చాయో? | A boy killed for women | Sakshi
Sakshi News home page

చేతులెలా వచ్చాయో?

Published Wed, Sep 2 2015 4:16 AM | Last Updated on Fri, Jul 12 2019 3:29 PM

చేతులెలా వచ్చాయో? - Sakshi

చేతులెలా వచ్చాయో?

అమ్మతోపాటు ఉంటే.. ఆప్తుడనుకున్నాడు.. అప్పుడప్పుడూ ఇంటికొస్తుంటే  బంధువని భావించాడు. కానీ వాడు ఆప్తుడు రూపంలో ఉన్న క్రూరుడని... బంధువులా దగ్గరయ్యే రాబందని గుర్తించలేకపోయాడు. తనను నిలువునా చిదిమేస్తాడని గ్రహించలేకపోయాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ విషాదమంతా... కురబల కోట బీసీ కాలనీకి చెందిన  చిన్నారి ఇమ్రాన్ గురించే.  తనకు సన్నిహితంగా ఉండే స్నేహితురాలు తనను వదిలి విదేశానికి వెళ్లిందన్న ఆక్రోశంతో ఆమె బిడ్డనే పొట్టన పెట్టుకున్న దుర్మార్గుడు మస్తాన్‌వలీ చేతులు పడిపోనంటూ... శపించని స్వరం లేదు.. చిన్నారి ఇమ్రాన్ కోసం తపించని హృదయం లేదు...
 
- కురబలకోటలో బాలుడి హత్య ఉదంతంపై సర్వత్రా విస్మయం
- ఇమ్రాన్ మృతితో శోకసంద్రమైన కురబలకోట బీసీ కాలనీ
- బిడ్డతో అనుబంధం తలుచుకుని తపించిపోయిన స్థానిక మహిళలు
కురబలకోట :
బుడిబుడి అడుగులు వేసుకుంటూ ఇళ్ల మధ్య తిరిగే ఇమ్రాన్ దూరమయ్యాడంటూ... మహిళలు చేసిన రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. పాపం.. పసిబిడ్డ ఎంత నరకం అనుభవించి ఉంటాడో..ఎంతగా విలవిలలాడాడో నని బాలుడిని చూసి ఏడ్వని వారు లేరు. సభ్యసమాజం భరించలేని ఈ బాధంతా... కురబలకోటలో హత్యకు గురైన బీసీ కాలనీకి చెందిన చిన్నారి ఇమ్రాన్ (5) గురించే. ఆలస్యంగా వెలుగు చూసిన ఉదంతం తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. స్థానికంగా నివాసం ఉండే హబీబ్(26), షబీనా (25)కు ఆరేళ్ల క్రితం పెళ్లయ్యింది. వీరికి ఓ కూతురు, కుమారుడు మహమ్మద్ ఇమ్రాన్ (5) ఉన్నారు.

భార్యాభర్యల మధ్య మనస్పర్థలు రావడంతో ఏడాదిగా అదే కాలనీలోని పుట్టింటిలో షబీనా ఉంటోంది. అదే కాలనీలోని మస్తాన్‌వల్లీ (27)తో ఆమెకు స్నేహం పెరిగింది. ఇదిలా ఉండగా 20 రోజుల క్రితం బతుకుదెరువు కోసం షబీనా కువైట్ వెళ్లింది. అంతకుముందు నుంచి  మస్తాన్‌వల్లి ఆమెను కువైట్ వెళ్లవద్దని హెచ్చరించాడు. ఆమె దూరమవడంతో కక్ష పెంచుకున్న మస్తాన్‌వల్లీ వారం క్రితం కువైట్‌లోని షబీనాకు ఫోన్‌చేసి నిన్ను ఎలా రప్పించుకోవాలో తెలుసంటూ బెదిరించాడు. ఆ మరుసటి రోజే శుక్రవారం ఇంటి దగ్గర ఆడుకుంటున్న షబీనా కుమారుడు  మహమ్మద్ ఇమ్రాన్ (5) కన్పించకుండా పోయాడు. ఎంత వెతికినా ఆచూకీ లేదు.  మంగళవారం ఆ బాలుడు శవమై కన్పించాడు.

దీంతో ఆ గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. కుటుంబసభ్యుల, బంధువుల రోద నలు మిన్నంటాయి. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బీసీ కాలనీకి తీసుకురాగా స్థానికులు తీవ్ర ఆవేదన చెందారు.  తీవ్ర ఆశ్రునయనాల నడుమ  మంగళవారం రాత్రి బాలుడికి అంత్యక్రియలు  నిర్వహించారు. పసివాడి తండ్రి ఊరిలోనే చిన్న టీ కొట్టు నిర్వహిస్తున్నారు. తల్లి కువైట్ వెళ్లింది. ఇంతలో పిల్లాడి ప్రాణాలు కడతేరి పోవడంతో బంధుమిత్రులంతా గొల్లుమంటున్నారు. మరోవైపు శుక్రవారం అదృశ్యమైన బాలుడిని అదే రోజు గొంతు నులిమి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. బాలుడి తల్లికి స్నేహితుడైన మస్తాన్ వలీ ఈ దారుణానికి పాల్పడ్డట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉండడంతో అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement