తాండూరు చేరువలో పల్లెల నుంచి బడికి నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థులు (ఫైల్)
సాక్షి, హైదరాబాద్: తాండూరు పట్టణానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాలుగైదు పల్లెల్లోని బాలికలకు చదువుకోవాలనే ఆసక్తి ఉంది. కానీ ఆ ఊళ్లలో సర్కారు బడులు లేకపోవటంతో బషీరాబాద్ మండల కేంద్రం ప్రధాన రహదారిపై ఉన్న గొట్టిగ ఖుర్ద్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నారు. సరే అంతదూరం వెళ్లయినా చదువుకుందామంటే.. అక్కడిదాకా వెళ్లేందుకు బస్సు సౌకర్యం లేదు. బడికి నడుచుకుంటూ వెళ్లాల్సిందే. దీంతో అంతంతదూరం నడుస్తూ వెళ్లి చదివించడం అవసరమా అని తల్లిదండ్రులు ఆడపిల్లలను బడులకు పంపించేందుకు సందేహిస్తున్నారు. చాలామంది పేరెంట్స్ ఈ కారణంతోనే బడులు మాన్పించారు కూడా. ఈ విషయాన్ని గుర్తించిన రోటరీ క్లబ్ సభ్యులు.. చదువుకోవాలని ఆసక్తి ఉన్న వారందరికీ గతేడాది 150 సైకిళ్లను పంపిణీ చేశారు. ఇప్పుడు వారు సైకిళ్లపై అంతా కలిసికట్టుగా బడికి వెళ్తున్నారు. చాలా మంచి పరిణామం ఇది. సరే.. మరి సైకిళ్లు కూడా లేని ఊళ్ల సంగతేంటనే సందేహానికి తల్లిదండ్రుల వద్ద నుంచి వచ్చే ఏకైక సమాధానం.. చదువు మాన్పించడమే. కొందరు నడుచుకుంటూనో, వాహనాలను లిఫ్ట్ అడిగో బడులకు వెళ్తున్నారు. ఇలాంటి ఊళ్లు వెయ్యికి పైగానే ఉన్నాయి. మరి ఆ గ్రామాల్లో పరిస్థితేంటి?
హాజీపూర్ ఘటన
పది రోజుల క్రితం.. హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న, యాదాద్రి జిల్లా హాజీపూర్ గ్రామంలో శ్రీనివాస్ రెడ్డి అనే కీచకుడి ఉదంతం వెలుగులోకి రావడంతో ఆడపిల్లల తల్లిదండ్రుల్లో భయం పెరిగింది. చదువు కోసమో, ఇతర పనుల కోసమో వేరే ఊళ్లకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఆడపిల్లలను బయటకు పంపాలంటే వణికిపోతున్నారు. ఇది ఒక గ్రామం సమస్యకాదు. వేయి గ్రామాల్లోని ఆడపిల్లల తల్లిదండ్రుల ఆవేదన. ఎందుకంటే ఈ గ్రామాలకు ఇప్పటికీ బస్సు వసతి లేదు. హాజీపూర్ గ్రామానికి నగరం నుంచి సిటీ బస్సు సౌకర్యం ఉన్నా, స్కూలుకెళ్లే సమయానికి బస్సులు లేకపోవటంతో పిల్లలు నడుచుకుంటూనో, ఆ దారిగుండా వెళ్లే వాహనాలను లిఫ్ట్ అడిగో వెళ్తుంటారు. వీరి ఈ నిస్సహాయతను ఆసరా చేసుకుని శ్రీనివాస్ రెడ్డి ‘హత్యా’చారాలకు పాల్పడ్డ తీరు నివ్వెరపరిచింది. ఇదే ఇప్పుడు బస్సు సౌకర్యం లేని ఊళ్లలో ఆడపిల్లలను అలా పంపాలంటే తల్లిదండ్రులు ఆవేదన చెందేందుకు కారణమవుతోంది.
ములుగు గణపురం సమీపంలోని బస్వరాజుపల్లెకు బస్సు వసతి లేక ప్రయాణికులు ఇలా వెళ్తున్నారు
ఎందుకీ దుస్థితి?
రాష్ట్రంలో 844 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదని ఆర్టీసీ అధికారులు అంకెల్లో చూపుతున్నా.. వాస్తవానికి ఆ సంఖ్య వెయ్యికిపైగానే ఉంటుందని సిబ్బందే పేర్కొంటున్నారు. ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఏకంగా 330 గ్రామాలకు బస్సులు నడవటం లేదు. ఇందులో జనాభా పరంగా పెద్ద గ్రామాలు 66 ఉన్నాయి. అనుబంధ గ్రామాలు కలిపితే వాటి సంఖ్య 1300కుపైనే ఉంది. దేశంలో ఎక్కడా లేనట్టుగా తెలంగాణలో 24 గంటల కరెంటు సరఫరా అవుతూ రికార్డు సృష్టిస్తున్న వేళ.. వెయ్యికి పైగా గ్రామాలు ఆర్టీసీ బస్సు మొహం చూడకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. బస్సులు లేకపోవటాన్ని ఆసరాగా చేసుకుని ఆటోవాలాలు రెచ్చిపోతున్నారు. కనీసం డ్రైవింగ్ కూడా సరిగా రాని యువకులు ఆటోలు నడుపుతూ జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇష్టమొచ్చినంత మందిని ఆటోల్లో కుక్కి తీసుకెళ్తూ.. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. ప్రతిరోజూ ఆటో చార్జీలు భరించలేని పేద విద్యార్థులకు నడిచి వెళ్లడమో, లిఫ్ట్ అడగడమో తప్ప వేరే మార్గమే లేదు. కానీ.. హాజీపూర్ ఉదంతంతో లిఫ్ట్ అడగాలంటేనే పదిసార్లు ఆలోచించే పరిస్థితి తలెత్తింది.
బస్సులెందుకు నడవటం లేదు
ప్రధాన రహదారులకు చేరువగా ఉన్నా.. కొన్ని ఊళ్లకు ఇప్పటికీ సరైన రోడ్డు వసతి లేదు. గతుకుల రోడ్డుపై ప్రయాణంతో బస్సులు తొందరగా పాడయ్యే అవకాశం ఉంది. దీంతో ఆ ఊళ్లకు బస్సును నడిపేందుకు ఆర్టీసీ అధికారులు నిరాకరిస్తున్నారు. గతంలో బస్సులు నడిచి, ఆ తర్వాత రోడ్డు బాగా పాడవటంతో సర్వీసులను ఆపేసిన సందర్భాలూ ఉన్నాయి. ఆర్టీసీ చెబుతున్న లెక్కల ప్రకారం 844 గ్రామాలకు బస్సులు నడవటం లేదు. వీటిల్లో 416 గ్రామాలకు రోడ్డు సరిగా లేకపోవడాన్నే కారణంగా చూపుతుండటం విశేషం. కొన్ని ఊళ్లకు బస్సు పట్టేంత రోడ్డు లేదు. మలుపులు, వంకలు, పురాతన బావులను దాటుకుని వెళ్లటం అసాధ్యమంటున్నారు. ఈ గ్రామాలకు యుద్ధప్రాతిపదికన రోడ్లను నిర్మించాల్సి ఉన్నా, అది జరగటం లేదు. ప్రభుత్వం జిల్లా కేంద్రాలకు, మండల కేంద్రాలకు డబుల్ రోడ్లను నిర్మిస్తున్నా.. గ్రామాల విషయంలో నిర్లక్ష్యం చూపిస్తోంది. ఇప్పటి వరకు రవాణాశాఖ – పంచాయతీరాజ్ శాఖల మధ్య అసలు సమన్వయమే కుదరలేదు. ఈ దిశగా చర్చలు జరగకపోవటమే అసలు ట్విస్టు.
ప్రధాన రోడ్లకు చేరువగా ఉంటే శాపమే
ఆర్టీసీ పరిభాషలో ‘టీ’ ఆపరేషన్ అని ఉంటుంది. అంటే ప్రధాన రోడ్డుకు నాలుగైదు కిలోమీటర్ల చేరువలో ఉన్న ఊళ్లకు బస్సులు వెళ్లవన్నమాట. ఆ మార్గంలో ఒకటి రెండు ఊళ్లు మాత్రమే ఉంటే, వాటి కోసం ప్రత్యేకంగా బస్సు తిప్పరు. ఆ ఊరి జనం ప్రధాన రోడ్డుమీదకు వచ్చి బస్సు ఎక్కాల్సిందే. ఆ మార్గంలో ఏడెనిమిది ఊళ్లుంటేనే ఓ సర్వీసు నడుపుతారు. అలా ప్రధాన రోడ్లకు చేరువగా ఉండి బస్సు తిరగని ఊళ్లు ఆర్టీసీ లెక్కల ప్రకారం 136 ఉన్నాయి.
ఇతర ‘అక్రమ’ వాహనాలతో..
బస్సు లేనప్పుడు ప్రత్యామ్నాయ రవాణావైపు చూడాల్సిందే. పల్లెల్లో చాలాచోట్ల బస్సులు రాకపోవటాన్ని ఆసరా చేసుకుని ఆటోలు, జీపులు, వ్యాన్లు, ఇతర వాహనాలు ప్రయాణికులను తరలిస్తున్నాయి. ఇప్పుడేమో అలాంటి వాహనాలు పెరిగినందువల్ల బస్సులు నడిపితే నష్టం వస్తుందంటూ ఆర్టీసీ కొన్ని గ్రామాలకు బస్సులు తిప్పటం లేదు. తన లెక్కల ప్రకారమే ఇలాంటి రూట్ల సంఖ్య 244.
తీవ్ర నష్టాల్లో ఉన్నా...
2018–19 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నెల వరకు ఆర్టీసీ తేల్చిన నష్టాల లెక్క రూ.680 కోట్లు. మార్చితో అది దాదాపు రూ.750 కోట్లకు చేరి రికార్డు నమోదు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇలాంటి దుస్థితి ఉన్నప్పుడు ఆర్టీసీ ఏం చేయాలి. వీలైనంత వరకు ప్రయాణికుల సంఖ్య పెంచుకుని ఆదాయాన్ని ఆర్జించాలి. కానీ కొత్త ప్రాంతాలకు తిప్పేందుకు ఆర్టీసీ వద్ద చాలినన్ని బస్సులు లేవు. ఒకవేళ తిప్పినా.. ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) తక్కువగా ఉంటోందన్న పేరుతో రద్దు చేస్తున్నారు. డిపో మేనేజర్లపై నిరంతరం ఓఆర్ కత్తి వేళ్లాడుతుండటంతో.. ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండే ఊళ్లకు బస్సులు నడిపేందుకు వారు వెనకడుగువేస్తున్నారు.
నష్టాలతో లింకెందుకు...
ప్రతి ఊరుకు రవాణా వసతి హక్కు లాంటిదే. కానీ వివిధ కారణాలతో వెయ్యి గ్రామాలకు బస్సు వెళ్లకపోవటం బాధాకరమే. నష్టాలతో లింకు పెట్టకుండా అన్ని ఊళ్లకు బస్సు నడపాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉంది. ఆ నష్టాలను ప్రభుత్వమే భరించి అన్ని గ్రామాలకు ప్రభుత్వ, సురక్షిత రవాణా వసతి కల్పించాలనే వాదన బలంగా ఉంది. కానీ అది అమలు కావటంలేదు. సామాజిక పింఛన్ల తరహాలో రవాణా వసతి లాంటి వాటికి కూడా ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఆ మేరకు ఆర్టీసీకి నిధులు కేటాయిస్తే ఈ సమస్య పరిష్కారమవుతుందని సూచిస్తున్నారు.
ప్రమాదాలూ తగ్గుముఖం
చాలా రోడ్డు ప్రమాదాల్లో నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణమవుతోంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చాలా వరకు సురక్షితమే. నలుగురు ఎక్కాల్సిన ఆటోల్లో పదిహేను మంది వరకు ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి తప్పిపోతుంది. కొన్ని చోట్ల లారీల్లో వెళ్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇక ఆర్టీసీ బస్సు ప్రయాణం బాలికలు, మహిళలకు కొంతవరకు రక్షణ ఇస్తుంది. ‘హాజీపూర్’లాంటి దురాగతాలకు బస్సు ద్వారా చెక్ చెప్పినట్టవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment