అభ్యర్థులు 5970 మంది
నిమిషం లేటైనా నో ఎంట్రీ
మెదక్, సిద్దిపేటలో పరీక్ష కేంద్రాలు
జిల్లా వ్యాప్తంగా బస్సు సౌకర్యం
సంగారెడ్డి క్రైం : జిల్లాలో గురువారం జరగనున్న ఎంసెట్‌కు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ బుధవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ రాహుల్ బొజ్జా మాట్లాడుతూ జిల్లాలోని మెదక్, సిద్దిపేటలో ఎంసెట్ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని సీఎస్‌కు వివరించారు. జిల్లాలో మొత్తం 5,970 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని చెప్పారు.
సీఎస్ రాజీవ్‌శర్మ మాట్లాడుతూ ఎంసెట్‌ను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. వరంగల్ నుంచి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని కలెక్టర్లకు ఎంసెట్ పరీక్ష నిర్వహణపై పలు సూచనలు చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్‌ఓ దయానంద్, అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, ఉప రవాణా కమిషనర్ మమతా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పరీక్షలకు గట్టి బందోబస్తు
మెదక్ : ఎంసెట్ నిర్వహణకు గట్టి బందోబస్తు చర్యలు తీసుకున్నట్టు మెదక్ ఆర్డీఓ మెంచునగేష్ తెలిపారు. గురువారం నిర్వహించే ప్రవేశపరీక్ష ఏర్పాట్లపై బుధవారం మెదక్ ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ మెంచు నగేష్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంసెట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేసినట్టు చెప్పారు. మెదక్ పరిధిలో మొత్తం 2,920 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్టు తెలిపారు.
పరీక్షల కోసం మెదక్ పట్టణంలో ఇంజినీరింగ్ విభాగానికి 5 కేంద్రాలు, మెడిసిన్, అగ్రికల్చర్ విభాగాలకు 4 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ బాలుర హైస్కూల్, ప్రభుత్వ బాలికల హైస్కూల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వైపీఆర్ ఇంజినీరింగ్ కళాశాల, సిద్ధార్థ హైస్కూల్‌లో సెంటర్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇంజినీరింగ్ పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మెడిసిన్, అగ్రికల్చర్ పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు ఉంటుందన్నారు.
ఫ్లైయింగ్ స్క్వాడ్‌గా జేఎన్‌టీయూ నుంచి వస్తారని తెలిపారు. ఇంజినీరింగ్ అభ్యర్థులు ఉదయం 9.15వరకు, మెడిసిన్, అగ్రికల్చర్‌వారు మధ్యాహ్నం 1.45 నిమిషాలలోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పరీక్ష సమయంలో కరెంట్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు.
అభ్యర్థులకు పరీక్ష కేంద్రాల వద్ద హెల్పడెస్క్‌లను, మంచినీరు, మజ్జిగ అందించనున్నట్టు సత్యసాయి సేవా సమితి కన్వీనర్ శిరిగ ప్రభాకర్ ఆర్డీఓకు తెలిపారు. సమావేశంలో జేఎన్‌టీయూ ప్రత్యేక పరిశీలకులు డాక్టర్ పి.వేణుగోపాల్, రూట్ ఆఫీసర్ డాక్టర్ కె.సుబ్రహ్మణ్యం, ఎంసెట్ మెదక్ కోఆర్డినేటర్ వెంకట్రాంరెడ్డి, అసిస్టెంట్ కోఆర్డినేటర్ పండిత్‌రావు, ఇన్‌చార్జి ఏబీసీడబ్ల్యుఓ హన్మంత్‌రెడ్డి, మెదక్ తహశీల్దార్ విజయలక్ష్మి, డిప్యూటీ తహశీల్దార్ ప్రవీణ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం వైపీఆర్ పరీక్ష కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లు పర్యవేక్షించారు.
ఎంసెట్‌కు సర్వం సిద్ధం
Published Thu, May 14 2015 12:50 AM | Last Updated on Mon, Feb 17 2020 5:11 PM
Advertisement