సంగారెడ్డి మున్సిపాలిటీ : ప్రగతి రథ చక్రం రోడ్డెక్కలేదు. జిల్లాలోని ఏడు డిపోల నుంచి 750 బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. తొలి రోజు రూ.కోటి మేరకు నష్టం వాటిల్లింది. మరోపక్క ప్రయాణికులు బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో విఫలమైంది. 43 శాతం ఫిట్‌మెంట్ చెల్లిం చాలనే డిమాండ్‌తో తెలంగాణ మజ్దూర్ యూని యన్, ఎంప్లాయీస్ యూనియన్ సంయుక్తంగా నిర్వహించిన సమ్మె జనజీవనంపై ప్రభావం చూపింది.
సమ్మె వల్ల ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులు నడపాలని ఆర్టీసీ యాజమాన్యం చేసిన ప్రయత్నాలు కార్మిక సంఘాల ప్రతిఘటనతో ఫలించలేదు. ఫలితంగా ఒక్క బస్సూ కదల్లేదు. గజ్వేల్ డిపో పరిధిలో ఒక ప్రైవేట్ బస్సును మాత్రం తూప్రాన్ వరకు నడిపించారు. మొత్తంగా కార్మికుల సమ్మె కారణంగా ఆర్టీసీకి బుధవారం ఒక్కరోజే సుమారు రూ. కోటి మేర నష్టం వాటిల్లినట్టు అధికారుల అంచనా.
తమ సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని యూనియన్ నాయకులు స్పష్టం చేయడంతో గురువారం కూడా బస్సుల రాకపోకలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం తెల్లవారుజామున 4 గంటల నుంచే కార్మికులు ఆయా డిపోల వద్దకు చేరుకుని బస్సులను కదలనివ్వలేదు. సంగారెడ్డి డిపోకు తాత్కాలిక పద్ధతిన డ్రైవర్, కండక్టర్లుగా పనిచేయడానికి వచ్చిన వారి అర్హత పత్రాలను చించివేస్తామని కార్మికులు బెదిరించడంతో వారంతా వెనక్కితగ్గారు.
సమ్మె తమ కోసం చేయట్లేదని, తమకు సహకరించాలని కార్మికులు కోరడంతో వారంతా సంఘీభావం తెలపడం విశేషం. సమ్మెలో జిల్లా వ్యాప్తంగా 2,900 మంది కార్మికులు పాల్గొనడంతో 750 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆయా డిపోల వద్ద కార్మికులు ఆందోళనలు నిర్వహించారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లేవీ?
సమ్మె.. పైగా శుభకార్యాల సీజన్.. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా తాత్కాలిక సిబ్బందిని నియమించుకోవాలని ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ఆయా రీజనల్ మేనేజర్లను ఆదేశించింది. కానీ అటువంటి ప్రయత్నాలను కార్మిక యూనియన్లు అడ్డుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇక్కట్ల పాలయ్యారు. అసలే పెళ్లిళ్ల సీజన్ కావడంతో ప్రయాణం సాగక రవాణా సదుపాయాల్లేక వ్యయప్రయాసలు పడి గమ్యాలను చేరుకున్నారు.
బస్సులు తిరగవనే విషయం తెలియక పలువురు పిల్లాపాపలతో బస్సు స్టేషన్లకు చేరుకుని.. తీరా విషయం తెలిశాక యాతన పడ్డారు. ఇదే అదనుగా ఆటోలు, ఇతర రవాణా సాధనాల చార్జీలకు రెక్కలొచ్చాయి. దూరంతో నిమిత్తం లేకుండా ప్రయాణికుల అవసరాన్ని బట్టి డబ్బులు డిమాండ్ చేశారు.
డిమాండ్ల నెరవేర్చే వరకు..
ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణ ఇంక్రిమెంట్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇస్తామని హామీ ఇచ్చారని, దానిని నెరవేర్చాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ రీజనల్ కన్వీనర్ పీరయ్య డిమాండ్ చేశారు. అప్పటి వరకు ఆందోళన కొనసాగుతుందన్నారు. తాత్కాలిక సిబ్బందితో బస్సులు నడపాలని చూసినా జరిగే పరిణామాలకు ప్రభుత్వమే భాధ్యత వహించాలని హెచ్చరించారు.
విధులకు రాకుంటే తొలగిస్తాం
రోడ్డు రవాణా సంస్థలో పనిచేస్తున్న క్యాజువల్ కండక్టర్లు, డ్రైవర్లు, కాంట్రాక్ట్ డ్రైవర్లు వెంటనే విధుల్లో చేరకుంటే సర్వీస్ నుంచి తొలగిస్తామని ఇన్‌చార్జి రీజనల్ మేనేజర్ రాజు ఒక ప్రకటనలో హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా 97 మంది క్యాజువల్ కండక్టర్లు, కాంట్రాక్ట్ కండక్టర్లు, 74 మంది కాంట్రాక్ట్ డ్రైవర్లు బుధవారం మూకుమ్మడిగా విధులకు హాజరుకాకపోవడంతో ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగిందన్నారు. వెంటనే విధుల్లో చేరకుంటే సర్వీస్ నుండి తొలగిస్తామన్నారు.
బస్సును అడ్డుకున్న కార్మికులు
సంగారెడ్డి మున్సిపాలిటీ : ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ఉదయం నుంచి డీపోలకే పరిమితమైన బస్సులను రాత్రి 7 గంటల ప్రాంతంలో సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న ఆర్టీసీ అధికారులతో చర్చలు జరిపి ప్రైవేట్ డ్రైవర్‌తో బస్సును డీపోనుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా కార్మికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, కార్మికుల మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. దీంతో కార్మికులు ఎంతకూ వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు చేసేదేమి లేక బస్సును డిపోలోకి పంపించారు. దీంతో కొద్దిసేపు బస్సుడిపో ఆవరణలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
నానా హైరానా
Published Wed, May 6 2015 11:48 PM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM
Advertisement
Advertisement