RTC management
-
ఇదేం కారుణ్యం.. పెళ్లైన కుమార్తెపై వివక్ష ఎందుకు?
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగి మరణించిన తర్వాత.. అతని కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఇచ్చే కారుణ్య నియామక ఉద్యోగానికి వివాహిత అయిన కుమార్తె కూడా అర్హురాలేనంటూ హైకోర్టు తీర్పు వెలువరించింది. కారుణ్య నియామకానికి ‘అవివాహిత’ మాత్రమే అర్హురాలన్న ఏపీఎస్ ఆర్టీసీ యాజమాన్యం నిబంధనను హైకోర్టు రద్దు చేసింది. ఆ నిబంధనను రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా, ఏకపక్ష నిర్ణయంగా ప్రకటించింది. పెళ్లి అయ్యిందన్న కారణంతో దమయంతి అనే మహిళకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వలేమంటూ ఆర్టీసీ యాజమాన్యం ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను హైకోర్టు రద్దు చేసింది. తండ్రి మరణించిన నేపథ్యంలో తోబుట్టువులు ఎవరూ లేని, భర్తకు శాశ్వత ఆదాయమంటూ ఏదీ లేని పరిస్థితుల్లో కారుణ్య నియామకం కోసం దమయంతి చేస్తున్న అభ్యర్థనను ‘బ్రెడ్ విన్నర్ స్కీం’ కింద 6 వారాల్లో పరిగణనలోకి తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఇటీవల తీర్పు వెలువరించారు. కుమార్తెల విషయంలో వివక్ష ఎందుకు? ఆర్టీసీ తరఫు న్యాయవాది శ్రీహరి వాదనలు వినిపిస్తూ.. ‘బ్రెడ్ విన్నర్ స్కీం’ నిబంధనల కింద మృతుడి భార్య లేదా కుమారుడు, అవివాహిత కుమార్తెల్లో ఒక్కరు మాత్రమే కారుణ్య నియామకానికి అర్హులని తెలిపారు. దమయంతికి పెళ్లి అయినందున ఆమె దరఖాస్తును నిబంధనల ప్రకారం తిరస్కరించామని చెప్పారు. ఈ వాదనతో న్యాయమూర్తి విబేధించారు. ‘ప్రభుత్వం 1999లో జారీ చేసిన జీవో 350 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి మరణించినప్పుడు అతని భార్య కారుణ్య నియామకానికి ముందుకు రాకపోతే.. ఆ ఉద్యోగికి ఒకే కుమార్తె ఉండి.. ఆమెకు వివాహమైనా కూడా కారుణ్య నియామకానికి పరిగణనలోకి తీసుకోవచ్చు. 2003లో దీనికి సంబంధించి ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. అయితే 2000వ సంవత్సరంలో ఆర్టీసీ యాజమాన్యం జారీ చేసిన అర్హత నిబంధనల్లో మాత్రం మృతుడి భార్య, కుమారుడు, అవివాహిత కుమార్తెల్లో ఒకరు మాత్రమే కారుణ్య నియామకానికి అర్హులుగా పేర్కొన్నారు. నిబంధనల పేరుతో పెళ్లి అయిన కుమార్తెలపై వివక్ష చూపుతున్నారు. ఇది చట్ట విరుద్ధం. ఆర్టీసీ నిబంధనలను పరిశీలిస్తే.. కుమారుడికి పెళ్లైనా, పెళ్లి కాకపోయినా కారుణ్య నియామకానికి అర్హుడే. కానీ కుమార్తె మాత్రం అనర్హులంటూ వివక్ష చూపిస్తున్నారు’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. ‘కొడుకు, కుమార్తెలకు పెళ్లి అయినా, కాకున్నా.. తల్లిదండ్రుల కుటుంబంలో వాళ్లు భాగమే. పెళ్లి అయినంత మాత్రాన కుమార్తె తన తల్లిదండ్రుల కుటుంబంలో సభ్యురాలి హోదాను కోల్పోదు. తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత ఇద్దరిపైనా ఉంది’ అని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ‘ఈ కేసులో పిటిషనర్ దమయంతి ఒక్కరే కుమార్తె. తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత ఆమెపై ఉంది. ‘బ్రెడ్ విన్నర్ స్కీం’ కింద కారుణ్య నియామకానికి దమయంతి అర్హురాలే..’ అని న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ తన తీర్పులో స్పష్టం చేశారు. ఇదీ వివాదం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీహెచ్ పెంటయ్య ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేస్తూ 2009లో మరణించారు. భార్య చిన్నమ్మడు, కుమార్తె దమయంతి ఉన్నారు. అయితే దమయంతికి, ఆమె భర్తకు శాశ్వత ఆదాయమేదీ లేదు. ఈ నేపథ్యంలో తనకు కారుణ్య నియామకం కింద ఉద్యోగమివ్వాలంటూ చిన్నమ్మడు ఆర్టీసీ యాజమాన్యానికి దరఖాస్తు చేసుకున్నారు. కండక్టర్ లేదా శ్రామిక్ పోస్టుకు అవసరమైన అర్హతలు లేవంటూ ఆమె దరఖాస్తును అధికారులు తిరస్కరించారు. దీంతో కుమార్తె దమయంతి దరఖాస్తు చేసుకుంది. ఇందుకు చిన్నమ్మడు కూడా నిరభ్యంతర పత్రమిచ్చారు. కానీ ఆర్టీసీ అధికారులు.. కారుణ్య నియామకాలపై ప్రభుత్వ నిషేధముందంటూ దమయంతి దరఖాస్తును పక్కన పెట్టారు. దీనిపై ఆమె 2014లో హైకోర్టును ఆశ్రయించారు. దమయంతి దరఖాస్తును పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు అప్పట్లో ఆదేశించింది. కానీ పెళ్లి అయ్యిందన్న కారణంతో దమయంతి దరఖాస్తును ఆర్టీసీ అధికారులు తిరస్కరిస్తూ 2014లో ప్రొసీడింగ్స్ జారీ చేశారు. దీంతో దమయంతి అదే ఏడాది మరోసారి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఇటీవల తుది విచారణ జరిపారు. -
సర్వీసులో మృతిచెందిన వారి చివరి మొత్తాల చెల్లింపులు
సాక్షి, అమరావతి: సర్వీసులో చనిపోయిన ఆర్టీసీ ఉద్యోగుల చివరి మొత్తాల చెల్లింపులకు యాజమాన్యం అంగీకరిస్తూ సోమవారం ఉత్తర్వులిచ్చింది. దీంతో ఆర్టీసీ ఉద్యోగుల చివరి చెల్లింపులైన గ్రాట్యుటీ, ఆర్జిత లీవులు, చివరి నెల జీతాలను చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు ఇవ్వనున్నారు. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి అక్టోబర్ 30 వరకు సర్వీసులో చనిపోయిన ఉద్యోగుల చివరి మొత్తాలు ఆడిట్ చేసి నవంబర్ ఐదో తేదీలోగా కేంద్ర కార్యాలయానికి రికార్డులు పంపాలని ఉత్తర్వులిచ్చారు. సర్వీసులో చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు తమ ఆధార్, పాన్, బ్యాంకు అకౌంట్స్ వివరాలను సమీప బస్ డిపోలో అందించాలని ఉత్తర్వుల్లో కోరారు. -
అశ్వద్ధామ రెడ్డికి షోకాజ్ నోటీస్
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు అశ్వద్ధామ రెడ్డికి ఆర్టీసీ యాజమాన్యం షోకాజ్ నోటీస్ ఇచ్చింది. ఆర్టీసీ సమ్మె తర్వాత లాంగ్ లీవ్‌లో ఉన్న అశ్వద్ధామ రెడ్డి నెలలు గడుస్తున్నా విధులకు హాజరు కాకపోవటంతో ఆర్టీసీ యాజమాన్యం ఈ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. కాగా, సమ్మె ముగిసిన అనంతరం విధుల్లో చేరిన అశ్వత్థామరెడ్డి.. ఆ వెంటనే 6 నెలల కాలానికి సెలవులు కావాలని విజ్ఞప్తి చేసుకున్నారు. కానీ, దీర్ఘకాల సెలవుల అభ్యర్థనను ఆర్టీసీ తిరస్కరించింది. అయినప్పటికి మరోసారి ఎక్స్ట్రా ఆర్టనరీ లీవ్ (ఈఓఎల్) కోసం ఆయన దరఖాస్తు చేయగా రెండోసారి కూడా యాజమాన్యం తిరస్కరించింది. సంస్థ కష్టాల్లో ఉన్నందున అన్ని రోజులు సెలవు మంజూరు చేయలేమని, వెంటనే విధుల్లో చేరాలని అధికారులు సూచించారు. అయినప్పటికి ఆయన విధుల్లో చేరకపోవటంతో షోకాజ్ నోటీస్ జారీచేశారు. -
రెండో రోజూ అదే సీన్
సాక్షి, హైదరాబాద్: సమ్మె విరమించిన నేపథ్యంలో విధుల్లో చేరేందుకు పెద్ద సంఖ్యలో కార్మికులు డిపోల వద్దకు చేరుకుంటున్నారు. మంగళవారం ఉదయం తొలి డ్యూటీకి వస్తే అధికారులు నిరాకరించడంతో వెనుదిరిగిన కార్మికులు.. బుధవారం మళ్లీ వచ్చారు. పోలీసులు అడ్డుకున్నా, అరెస్టు చేసినా భయపడకుండా బుధవారం 6 గంటలకే సంబంధిత డిపోల వద్దకు చేరుకోవాలన్న జేఏసీ నేతల పిలుపుతో సూర్యోదయం కంటే ముందే వారు డిపోల వద్దకు చేరుకున్నారు. అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలున్న నేపథ్యంలో అప్పటికే పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చిన పోలీసులు కార్మికులను డిపోలోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. సమ్మె విరమించినా తమను ఎందుకు అనుమతించడంలేదని వారితో వాగ్వాదానికి దిగారు. 97 డిపోల వద్ద ఇదే పరిస్థితి కనిపించింది. కొన్ని ప్రాంతాల్లో కార్మికులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సమ్మె విరమించినా విధుల్లోకి తీసుకోకపోవడం చట్ట విరుద్ధమని పేర్కొంటూ ఇదే పరిస్థితి పునరావృతమైతే గురువారం కార్మికశాఖ కార్యాలయాల్లో ఫిర్యాదు చేయనున్నట్లు కార్మికులు తెలిపారు. మరోవైపు విధుల్లో చేరేందుకు పెద్ద సంఖ్యలో కార్మికులు డిపోల ముందు ఆందోళన చేస్తున్నా అధికారులు మాత్రం తాత్కాలిక సిబ్బందితో యథాప్రకారం బస్సులు నడిపించారు. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 73శాతం బస్సులు తిప్పినట్లు వారు పేర్కొన్నారు. 1,907 అద్దె బస్సులు సహా మొత్తం 6,564 బస్సులు తిప్పినట్లు తెలిపారు. 4,657 మంది తాత్కాలిక డ్రైవర్లు, 6,564 మంది తాత్కాలిక కండక్టర్లు విధులకు హాజరైనట్లు పేర్కొన్నారు. 6,488 బస్సుల్లో టిమ్ యంత్రాలు వాడారని, 68 బస్సుల్లో పాత పద్ధతిలో టికెట్లు జారీ చేశారని వెల్లడించారు. -
రూ. 400 కోట్ల పీఎఫ్.. ఉఫ్!
-
రూ. 400 కోట్ల పీఎఫ్.. ఉఫ్!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణరోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) మళ్లీ దారి తప్పింది. కార్మికుల వేతనాల నుంచి మినహాయించి వారి భావి అవసరాలకు వినియోగించాల్సిన భవిష్య నిధి (పీఎఫ్)ని స్వాహా చేసింది. ఆ నిధికి సంస్థపరంగా చెల్లించాల్సిన వాటాతోపాటు స్వయంగా కార్మికుల వేతనాల నుంచి మినహాయించిన మొత్తాన్ని కూడా వాడేసుకుంది. ఇప్పుడు ఈ అంశం పెద్ద వివాదంగా మారింది. గతంలో ఇదే తరహా తప్పిదంతో భవిష్య నిధి కమిషనర్ ఆగ్రహానికి గురైన సంస్థ మరోసారి ఆ కమిషనర్ నుంచి సమన్లు అందుకోవాల్సి వచ్చింది. పీఎఫ్ సొమ్ముపై కన్ను... ఆర్టీసీకి ఇటీవల 35 డిపోల్లో లాభాలు మొదలయ్యాయి. తెలంగాణ వచ్చిన తర్వాత తొలిసారి ఆర్టీసీ లాభాల రుచి చూసింది. దీంతో మిగతా డిపోలను కూడా లాభాల జాబితాలోకి తెచ్చేందుకు చర్యలు ప్రారంభించారు. కానీ కొండలా పేరుకుపోయిన అప్పు, దానికి ప్రతినెలా చెల్లించాల్సిన వడ్డీ, ఆర్టీసీ వేతన సవరణ తర్వాత భారీగా పెరిగిన వేతనాల భారం, డొక్కు బస్సులు పెరగటంతో తడిసిమోపెడవుతున్న వాటి నిర్వహణ వ్యయం... ఇలా ఖర్చుల పద్దు లాభాలను మింగేస్తున్నాయి. దీంతో నిర్వహణ కోసం దిక్కులు చూస్తున్న ఆర్టీసీ కన్ను కార్మికుల భవిష్య నిధిపై పడింది. ఏడాదిన్నర కిందట నుంచి... ప్రతి నెలా కార్మికుల వేతనాల నుంచి ఆర్టీసీ దాదాపు రూ. 13 కోట్ల వరకు సంస్థ మినహాయించడంతోపాటు అంతే మొత్తాన్ని దానికి జత చేసి భవిష్య నిధి ట్రస్టులో జమ చేయాలి. అయితే ఆర్టీసీకి ఉన్న ప్రత్యేక వెసులుబాటు దృష్ట్యా ఆర్టీసీ అధీనంలోనే ఎండీ చైర్మన్‌గా ఉండే భవిష్యనిధి ట్రస్టులో జమ చేసుకోవచ్చు. ఆ మొత్తాన్ని ఇతర సంస్థలకు వడ్డీలకు ఇచ్చి తిరిగి ఆదాయాన్ని పొందే వెసులుబాటు ఉంది. కార్మికులకు అవసరమైన రుణాలను ఈ మొత్తం నుంచి ఇస్తారు. అయితే ఆర్టీసీ 2016 జూన్ నుంచి సంస్థ వాటా నిధులను ట్రస్టుకు జమ చేయకుండా సొంతానికి వాడుకోవటం మొదలుపెట్టింది. ఆ తర్వాత కార్మికుల వాటా నిధులనూ దారి మళ్లించటం మొదలుపెట్టింది. నాలుగు నెలలుగా ఆ తంతు జరుగుతోంది. విషయం భవిష్య నిధి కమిషనర్ దృష్టికి చేరడంతో ఆర్టీసీ యాజమాన్యానికి సమన్లు జారీ చేశారు. సొంతంగా ట్రస్టు ఏర్పాటు చేసుకొని అందులోనే పీఎఫ్ మొత్తాన్ని జమ చేసే వెసులుబాటును ఎందుకు రద్దు చేయకూడదని కూడా ప్రశ్నించినట్టు తెలిసింది. సర్దుబాటు సమస్యే... భవిష్య నిధి నుంచి ఆర్టీసీ వాడుకున్న రూ. 400 కోట్లను తిరిగి సర్దుబాటు చేయడం పెద్ద సమస్యగా మారనుంది. దాదాపు రెండున్నరేళ్ల క్రితం ఇదే తరహాలో రూ. 160 కోట్లను వాడేసుకోగా అందులో 25 శాతాన్ని చెలించి మిగతా దాన్ని సర్దుబాటు చేయడం ఇప్పటివరకు పూర్తిగా కుదరలేదు. ప్రభుత్వ సాయం లేకపోవడం, జీహెచ్ఎంసీ నిధులు ఇస్తామని చెప్పినా ఆ సంస్థ కాదనడంతో ఇప్పుడు ఆర్టీసీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. దారి మళ్లించిన నిధుల్లో సంస్థ వాటా రూ. 335 కోట్లు ఉండగా కార్మికుల వేతనాల నుంచి మినహాయించిన మొత్తం రూ. 65 కోట్ల వరకు ఉన్నట్టు తెలిసింది. -
విజయవాడ బస్టాండులో ప్రయాణికుల ఆందోళన
విజయవాడ: విజయవాడలో పండిత్ నెహ్రూ బస్టాండు వద్ద ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఏలూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ బస్సులో సమస్య తలెత్తడంతో బస్సును అక్కడే నిలిపివేశారు. దాదాపు రెండు గంటల పాటు ప్రయాణికులు ఎదురుచూసిన ఆర్టీసీ యాజమాన్యం స్పందించలేదు. మరో బస్సును ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు ఆక్రోశం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారుల తీరుకు నిరసనగా విజయవాడ బస్టాండు ఎగ్జిట్ మెయిన్ గేట్ వద్ద బైఠాయించారు. బస్టాండులో నుంచి ఏ ఒక్క బస్సును కూడా బయటకు వెళ్లనీయకుండా ప్రయాణికులు అడ్డుకున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
3016 మంది ఉద్యోగుల క్రమబద్ధీకరణ
గుర్తింపు సంఘంతో ఆర్టీసీ యాజమాన్యం ఒప్పందం సాక్షి, విజయవాడ బ్యూరో/హైదరాబాద్: ఏపీఎస్ఆర్టీసీలో 3016 మంది కాంట్రాక్టు కార్మికుల్ని రెగ్యులరైజ్ చేసేలా యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు 2014లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన జీవోను అమలు చేసేందుకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 2014 డిసెంబర్ 31 ముందు జాయిన్ అయి సర్వీసులో ఉన్న 2261 మంది డ్రైవర్లు, 755 మంది కండక్టర్లను ఈ నెల 1 నుంచి రెగ్యులర్ కార్మికులుగా పరిగణించనున్నారు. కార్మికులకు రావాల్సిన కరువు భత్యం(డీఏ) మూడు నెలల బకాయిలను జూన్ 1న జీతంతోపాటు చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించింది. టెంపరరీ ట్రాన్స్ఫర్లో ఉన్న కార్మికులందరికీ ఇంకొక ఏడాది పాటు అవకాశం ఇస్తూ గడువు పొడిగించేలా ఉత్తర్వులు ఇచ్చేందుకు అంగీకరించారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఆసరా ఇచ్చేలా వారి పిల్లలకు ఉద్యోగం కల్పించే దిశగా సర్వీసు నిబంధనలు మార్పు చేసేందుకు యాజమాన్యం అంగీకరించింది. -
ఆర్టీసీ కార్మికులకు శుభవార్త
- పెండింగ్ బకాయిల చెల్లింపునకు యాజమాన్యం అంగీకారం సాక్షి, హైదరాబాద్: . దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించింది. ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్ఎంయూ నేతలు బుధవారం ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ఎన్.సాంబశివరావును కలసి చర్చించారు. దీంతో బకాయిలను ఏప్రిల్ 5లోగా చెల్లించేందుకు ఎండీ హామీనిచ్చారు. వేతన బకాయిలు(2013 నుంచి) ఒక నెల అరియర్స్, 2015లో జులై, ఆగస్టు, సెప్టెంబరుకు సంబంధించి డీఏ అరియర్స్‌ను వచ్చే నెల 5లోగా చెల్లించడానికి ఎండీ అంగీకరించినట్లు ఎన్ఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రయ్య, వర్కింగ్ అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి తెలిపారు. 2013 నుంచి పదవీ విరమణ చేసిన సిబ్బందికి రావాల్సిన వేతన బకాయిల్లో 50 శాతం ఏప్రిల్‌లో మంజూరు చేస్తామని చెప్పారన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళలకు ప్రత్యేక సెలవు, 2012కు ఇవ్వాల్సినలీవ్ ఎన్క్యాష్మెంటు ఈ ఏడాది మేలో ఇస్తామని ఎండీ తెలిపారని చెప్పారు. తిరుపతి, వైజాగ్, నెల్లూరు, కర్నూలులో స్టాఫ్ రెస్ట్ రూంలను ఏసీతో ఆధునికీకరించేందుకు, 126 డిపోల్లో ఆర్వో ప్లాంట్ల ద్వారా వాటర్ కూలర్స్ ఏర్పాటుకు ఆదేశాలిచ్చారని ఎన్ఎంయూ నేతలు తెలిపారు. అద్దె బస్సుల్లో డ్రైవర్లకు టిమ్స్ మిషన్లు ఇచ్చే విధానాన్ని విరమిస్తామని ఎండీ సాంబశివరావు అంగీకరించారని చెప్పారు. -
ఆర్టీసీ ఉద్యోగుల పీఎఫ్‌పై నీలినీడలు!
- వేతనం రూ.15 వేలు మించితే యాజమాన్యం తన వాటా చెల్లించదు సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో భవిష్య నిధి చెల్లింపు అంశంలో యాజమాన్యం నిర్ణయం కార్మికుల సంక్షేమం పాలిట గొడ్డలిపెట్టుగా మారనుంది. ఉద్యోగి మూల వేతనం(బేసిక్ పే), కరువు భత్యం(డీఏ) కలిపి రూ.15 వేలు దాటితే తన వాటా భవిష్య నిధి(పీఎఫ్)ని చెల్లించే బాధ్యత నుంచి వైదొలగాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 1.32 లక్షల మంది ఆర్టీసీ కార్మికులకు తీవ్ర అన్యాయం జరగనుంది. యాజమాన్యంపై భారాన్ని తగ్గించుకునేందుకు కార్మికుల పీఎఫ్‌లో కోత పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పెండింగ్‌లో వేలాది దరఖాస్తులు ఆర్టీసీలో సొంతంగా పీఎఫ్ ఖాతా నిర్వహించుకుంటున్నారు. లక్ష మంది, అంతకు మించి కార్మికులు ఏదైనా సంస్థలో పనిచేస్తుంటే, సొంతంగా ఆ సంస్థ పీఎఫ్ ఖాతా నిర్వహించుకునేందుకు గతంలో కేంద్రం అనుమతినిచ్చింది. దీంతో ఏపీఎస్ఆర్టీసీ పీఎఫ్ ట్రస్ట్ పేరిట కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఆర్టీసీ విభజన పూర్తికాకపోవడంతో రెండు రాష్ట్రాల ఆర్టీసీ కార్మికులకు ఇదే ట్రస్టు సేవలందిస్తోంది. గతంలో ఆర్టీసీ కార్మికుల పీఎఫ్ సొమ్ము రూ.250 కోట్లను యాజమాన్యం సొంత అవసరాలకు వాడుకుంది. దీంతో పీఎఫ్ సొమ్ము నుంచి రుణం కోసం కార్మికులు చేసుకున్న దరఖాస్తులు వేలాదిగా పెండింగ్‌లో ఉన్నాయి. ఆర్టీసీకి నెలకు రూ.60 కోట్లు ఆదా! ఉద్యోగి మూలవేతనం, డీఏ కలిపి రూ.15 వేల పరిమితి దాటితే తన వంతు వాటా మొత్తాన్ని చెల్లించాల్సిన బాధ్యత నుంచి వైదొలుగుతున్నట్లు పీఎఫ్ కమిషనర్‌కు ఆర్టీసీ యాజమాన్యం త్వరలో లేఖ రాయనుంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే కార్మిక సంఘాలకు నోటీసులివ్వాలని యాజమాన్యం నిర్ణయించినట్లు సమాచారం. తన వంతు పీఎఫ్ వాటాను చెల్లించకపోతే ఆర్టీసీకి నెలకు రూ.60 కోట్ల వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది. ‘‘పీఎఫ్ బాధ్యత నుంచి వైదొలగాలన్న నిర్ణయాన్ని ఆర్టీసీ యాజమాన్యం ఉపసంహరించుకోవాలి. ఇప్పటికే ఆర్టీసీ ఎండీ సాంబశివరావుకు వినతి పత్రం ఇచ్చాం. ఒకవేళ మొండిగా ముందుకెళితే కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదు’’ - జిలానీ బాషా, ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఫెడరేషన్ అధ్యక్షులు ‘‘ఆర్టీసీ యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోంది. దొడ్డిదారిన నిర్ణయాలను అమలు చేస్తోంది. పీఎఫ్ బాధ్యత నుంచి తప్పుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’’ - రాజారెడ్డి, వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు -
అద్దె బస్సులపై ‘వాణిజ్య’ కొరడా!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లా వ్యాప్తంగా ఐదు ఆర్టీ సీ డిపోల పరిధిలో సుమారు 124 అద్దెబస్సులు నడుస్తున్నా యి. కండక్టర్ ఆర్టీసీకి చెంది, డ్రైవర్ ప్రైవేట్ వ్యక్తిగా కిలోమీటర్‌కు రూ.11 చొప్పున అద్దె బస్సుల నిర్వహకులు ఆర్టీసీ యాజమాన్యం నుంచి ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. అయితే గూడ్స్ పర్సంటేజ్, హైర్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్స్ కింద అద్దెబస్సు యజమానులు వాణిజ్యపన్నుల శాఖకు నెలవారీ పన్ను చెల్లించాలి. ప్రభుత్వం నుంచి వసూలవుతున్న మొత్తంలో ఖర్చులు పోనూ టీడీఎస్ (టాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్) పేరిట లెక్కలు చూపించాలి. వ్యాట్ కింద ఇలా సుమారు రూ.11 లక్షల చొప్పున ఆరుగురు అద్దె బస్సుల నిర్వహకులు వాణిజ్యపన్నుల శాఖకు బకా యి పడ్డారు. మూడు ప్రాంతాల పరిధిలో సుమారు రూ.70 లక్షల మేర బకాయి పేరుకుపోవడంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆస్తుల జప్తునకు రంగం సిద్ధం చేశారు. అయినా నిర్వహకులు పట్టించుకోకపోవడంతో బస్సుల్ని సీజ్ చేసి పోలీసుల అధీనంలో ఉంచేశారు. దీంతో తమకు కొంత గడువిస్తే పన్ను మొత్తాల్ని చెల్లించేస్తామని ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహకులు కాళ్ల బేరానికి వస్తున్నారు. విచిత్రమేమిటంటే కొంతమంది నిర్వహకులు వాణిజ్యపన్నులశాఖకు బకాయి కట్టకుండానే ఆయా బస్సుల్ని ఇతరులకు అమ్మేయోచనలోకి వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు అప్రమత్తమై చట్ట ప్రకారం బస్సుల ఎటాచ్‌మెంట్‌కు దిగారు. -
విశ్రాంత ఉద్యోగులకు ఉచిత ప్రయాణం!
త్వరలో ప్రకటించనున్న ఆర్టీసీ యాజమాన్యం సాక్షి, విజయవాడ బ్యూరో: ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు ఉచితంగా బస్సు ప్రయాణం అందించేలా యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఒకటి రెండు రోజుల్లో దీనిని అధికారికంగా ప్రకటించనున్నారు. దశాబ్దాల తరబడి ఆర్టీసీకి సేవలందించి ఉద్యోగ విరమణ చేసిన వారికి ఉచిత ప్రయాణ అవకాశం ఇవ్వాలని గత కొంతకాలంగా ఆర్టీసీ యూనియన్లు డిమాండ్చేస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తోంది. తెలంగాణ ఆర్టీసీలో పాసింజర్, ఎక్స్‌ప్రెస్ బస్సుల వరకు ఉచితంగా అనుమతిస్తున్నారు. తెలంగాణ కంటే ఆలస్యంగా స్పందించిన ఏపీఎస్ఆర్టీసీ కొంచెం ముందడుగు వేసి పాసింజర్, ఎక్స్‌ప్రెస్‌లతోపాటు డీలక్స్ సర్వీసుల్లోనూ ఉచితంగా ప్రయాణం అందించే యోచన చేస్తోంది. ఇంద్ర, గరుడ వంటి ఏసీ బస్సుల్లోను 50 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు సమాచారం. దీని వల్ల రాష్ట్రంలో 25 వేల మందికిపైగా ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు మేలు కలుగుతుందని భావిస్తున్నారు. -
కార్మిక నిధిని కొల్లగొట్టిన ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్: జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్న ఆర్టీసీ యాజమాన్యం కార్మికుల సంక్షేమ నిధులను సొంతానికి వినియోగించుకుంది. దాదాపు రూ.60 కోట్లు మింగేసింది. దీంతో రుణాలు లేక ఆర్టీసీ కార్మికులు అల్లాడుతున్నారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఆరోగ్య అవసరాలు, ఇంటి నిర్మాణం... ఇలా అతిముఖ్యమైన అవసరాలకు రుణాలు మంజూరు చేయాలంటూ పెట్టుకున్న నాలుగువేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆదాయాన్ని మించి ఖర్చు వచ్చిపడటం, ఉద్యోగుల ఫిట్‌మెంట్‌కు సంబంధించి ప్రభుత్వం తనవంతుగా చిల్లి గవ్వ కూడా ఇవ్వకపోవ టంతో ఆర్టీసీ యాజమాన్యానికి దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. దీంతో కనిపించిన నిధులనల్లా వాడేసుకుంటోంది. ఆ క్రమంలో ఆర్టీసీ కార్మికుల కుటుంబ అవసరాలకు రుణాలు అందించే కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ(సీసీఎస్) నిధులను యాజమాన్యం సొంతానికి వినియోగించుకుంది. ఇదీ సంగతి: ఆర్టీసీ యాజమాన్యం ప్రతినెలా కార్మికుల మూలవేతనంపై 5 శాతం మొత్తాన్ని మినహాయించుకుని దాన్ని సీసీఎస్‌కు జమ చేస్తుంది. సీసీఎస్‌ను గుర్తింపు కార్మిక సంఘం నిర్వహిస్తుంది. ఇలా టీఎస్ఆర్టీసీ పరిధిలో ప్రతినెలా దాదాపు రూ.25 కోట్ల మొత్తం జమ అవుతోంది. వాటిని కార్మికుల కుటుంబ అవసరాలకు రుణంగా అందజేస్తారు. సీసీఎస్‌కు చెందిన రూ.60 కోట్ల మొత్తాన్ని వాడేసుకున్న ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు రుణాలు లేకుండా చేసింది. తమకు ప్రభుత్వ ఉద్యోగులతో సమంగా 43 శాతం ఫిట్మెంట్ కావాలని కార్మికులు సమ్మె చేయగా విచిత్రంగా ప్రభుత్వం 44 శాతం ప్రకటించింది. ఆర్టీసీపై తీవ్ర భారం పడుతుందని యాజమాన్యం పేర్కొనటంతో ఆదుకుంటానని హామీ ఇచ్చింది. కానీ ఒక్క పైసా కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. అవి వస్తేకాని కార్మికులకు రుణాలందే పరిస్థితి లేదు. భవిష్యత్తులో సీసీఎస్ నిధులను సొంత అవసరాలకు వినియోగించుకోనంటూ ఇటీవల సమ్మె సమయంలో ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు హామీ కూడా ఇచ్చింది. గతంలో ఈ నిధులను స్వాహా చేయటంతో కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయి. సీసీఎస్ నిధులను వాడుకోవద్దంటూ సమ్మెకాలంలో కార్మికులు డిమాండ్ చేశారు. దీనిపై యాజమాన్యం స్పష్టమైన హామీ ఇచ్చి మళ్లీ విస్మరించి ఆ నిధులను కొల్లగొట్టడంపట్ల కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఆర్టీసీ కార్మికుల రాస్తారోకో
పాల్గొన్న విపక్ష రాజకీయపార్టీలు, కార్మిక సంఘాలు ఆందోళనకారుల అరెస్టు, విడుదల పట్నంబజారు (గుంటూరు) : న్యాయమైన కోర్కెలు తీర్చాలని కోరతున్నా.. .సమస్యలు పట్టకుండా వ్యవహరిస్తున్న రాష్ట్రప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యంపై కార్మికులు కన్నెర్ర జేశారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఆదివారంతో ఐదో రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల నేతలతో కలిసి ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట పట్టారు. బస్టాండ్ ఎదుట రాస్తారోకో దిగారు. కార్మికులు చేపట్టిన రాస్తారోకో కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, సీపీఐ. సీపీఎం పార్టీలు, ఏఐటీయూసీ, సీఐటీయూ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ సంఘాలు మద్దతుగా పాల్గొన్నాయి. బస్టాండ్ ఎదుట ఉదయం పది గంటలకు రాస్తారోకో చేపట్టారు. పెద్దఎత్తున ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు, కార్మికులు తరలివచ్చి రోడ్డుపై బైఠాయించడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. బస్టాండ్‌లో నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఈస్ట్ డీఎస్పీ సంతోష్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవే క్షించి పోలీసు బలగాలను మోహరించారు. రాస్తారోకో చేస్తున్న రాజకీయ, కార్మిక సంఘాల నేతలను బలవంతంగా అక్కడ నుంచి పక్కకు తొలగించే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేతలను అదుపులోకి తీసుకుంటున్న క్రమంలో కార్యకర్తలు, కార్మికులు అడ్డుపడడంతో తోపులాట చోటుచేసుకుంది. నేతలతో పాటుగా 23మందిని అరెస్ట్ చేసి పాతగుంటూరు పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ కనీస కనికరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. 43 శాతం ఫిట్మెంట్, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సౌకర్యాలు కల్పించాలన్న కనీస కోర్కెలను తీర్చకుండా ఒంటెద్దు పోకడలు పోతోందని మండిపడ్డారు. కార్మికుల హక్కులు సాధించేవరకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ పోలీసులను అడ్డం పెట్టుకుని అరెస్టులు చేయించినంత మాత్రాన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాల వలనే తెలుగుదేశం పార్టీ పాతాళానికి దిగజారిపోయిందన్నారు. మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్‌వలి మాట్లాడుతూ ఆర్టీసీ ఎండీ సాంబశివరావు అధికార టీడీపీ నేతలా వ్యవహరిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ కార్మికుల హక్కులను కాలరాయాలని చూస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ ఐదు రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొహమూద్, కొట్టె కవిత, ఝాన్సీ, షేక్ ముస్తఫా, పూనూరి నాగేశ్వరరావు, గుండు శ్రీను, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ అధ్యక్షుడు ఎం.హనుమంతరావు, రీజయన్ అధ్యక్షుడు ఎన్వీకే రావు, శివరాత్రి శ్రీనివాసరావు, ఎన్ఎంయూ రీజయన్ కార్యర్శి నరసింహారావు, సీపీఎం నగర కార్యదర్శి కోటా మాల్యాద్రి, పలు కార్మిక సంఘాల నాయకులు నేతాజీ, వెలుగూరి రాధాకృష్ణమూరి, సుబ్బారావు, భగవాన్‌దాస్ తదితరులు పాల్గొన్నారు. ఐదో రోజుకు చేరిన సమ్మె పట్నంబజార్ (గుంటూరు): సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఆదివారంతో ఐదో రోజుకు చేరుకుంది. గుంటూరు రీజియన్ పరిధిలోని అన్ని డిపోల నుంచి ఓ మోస్తరుగా బస్సులు నడిచాయి. అయితే కార్మికులు పూర్తిస్థాయిలో సమ్మెకు దిగడంతో తాత్కాలిక కార్మికులచే ఆర్టీసీ అధికారులు బస్సులు నడిపించారు. డీఎస్సీని దృష్టిలో పెట్టుకుని తాత్కాలిక సిబ్బంది అధికంగా విధుల్లోకి తీసుకుని బస్సులు నడిపించారు. రీజియన్ పరిధిలో విపక్ష రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు రాస్తారోకోకు పిలుపులు నివ్వడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకులేదు. రీజియన్పరిధిలో సుమారు 952 బస్సులు తిరగాల్సి ఉండగా, 450 బస్సులు మాత్రమే తిరిగాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. విద్యార్థులు, ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని సర్వీసులు నడిపేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమ్మె కారణంగా ఈ ఐదు రోజుల్లో ఆర్టీసీ రీజియన్‌కు రూ. 6 కోట్ల మేర నష్టం వాటిల్లి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. డీఎస్సీకి తెల్లవారుజాము నుంచి బస్సులు అధికారులు అందుబాటులో ఉంచారని తెలిపారు. ఆర్టీసీ సమ్మె దృష్ట్యా ప్రత్యేక రైళ్లు.. సంగడిగుంట: ఆర్టీసీ కార్మికుల సమ్మె దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కొన్ని ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయించినట్లు గుంటూరు రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం జి.శ్రీరాములు ఆదివారం తెలిపారు. సోమవారం.. 07623 నంబరు ప్యాసెంజరు రైలు గుంటూరులో ఉదయం 9.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 14.30 గంటలకు గిద్దలూరు చేరుతుంది. 07624 నంబరు ప్యాసెంజరు రైలు గిద్దలూరులో 15.00 గంటలకు బయలుదేరి 21.00 గంటలకు గుంటూరు చేరుతుంది.ఈ రైళ్లు మార్గం మధ్యలోని అన్ని స్టేషన్లలో ఆగనున్నాయి. 07053 నంబరు ఎక్స్‌ప్రెస్ రైలు హైదరాబాదలో 21.40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 13.55 గంటలకు కాకినాడ పోర్ట్ చేరుతుంది. మంగళవారం.. 07054 నంబరు ఎక్స్‌ప్రెస్ రైలు కాకినాడ పోర్ట్‌లో 15.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 05.15 గంటలకు హైదరాబాదు చేరుతుంది. ఈ రైలు మార్గంమధ్యలోని నల్లగొండ, మిర్గాలగూడ, నడికుడి, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి, గుంటూరు, మంగళగిరి, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, కొవ్వూరు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుంది. -
ఆర్టీసీ కార్మిక సంఘాల చర్చలు మరోసారి విఫలం
హైదరాబాద్: ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో శుక్రవారం సాయంత్రం ఆర్టీసీ యాజమాన్యం జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలను ఆర్టీసీ యాజమాన్యం మరోసారి చర్చలకు ఆహ్వానించినా.. ఆ చర్చలు ఫలించలేదు. బస్ భవన్ లో కార్మిక సంఘాల నేతలతో ఆర్టీసీ యాజమాన్యం చర్చలు జరిపింది. తొలుత ఆర్టీసీ కార్మికులు చర్చలకు వస్తే ఆహ్వానిస్తామని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు ప్రకటించడంతో కార్మికులు చర్చలకు వచ్చారు. అయితే కార్మికుల డిమాండ్లపై యాజమాన్యం వెనక్కి తగ్గకపోవడంతో చర్చలు విఫలం కాక తప్పలేదు. 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామని ఆర్టీసీ కార్మికులు స్పష్టం చేస్తున్నారు. మళ్లీ చర్చలకు పిలిచినా.. అందుకు వచ్చే ప్రసక్తే లేదని కార్మిక సంఘాలు తేల్చిచెప్పాయి. ఈ నేపథ్యంలో చర్చలు మరో కొద్ది రోజులు జరిగే అవకాశం ఉంది. గత మూడు రోజుల నుంచి కార్మికులు సమ్మె హారన్ మోగించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు ప్రైవేటు వాహన దారులు ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటూ అందినకాడికి దోచుకుంటున్నారు. -
ఆర్టీసీ యాజమాన్యంతో కార్మిక నేతల చర్చలు
హైదరాబాద్: ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలను ఆర్టీసీ యాజమాన్యం చర్చలకు ఆహ్వానించింది. కాసేపట్లో బస్ భవన్ లో కార్మిక సంఘాల నేతలతో ఆర్టీసీ యాజమాన్యం చర్చలు జరపనుంది. తమ డిమాండ్ల సాధన కోసం మూడు రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. కాగా ఆర్టీసీ కార్మికులు చర్చలకు వస్తే ఆహ్వానిస్తామని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు ప్రకటించారు. కాగా, ఆర్టీసీ కార్మికుల అణచివేతకు నిరసనగా ఆర్టీసీ బోర్డు పదవికి ఎంప్లాయిస్ యూనియన్(ఈయూ) నేత పద్మాకర్ రాజీనామా చేశారు. ఆర్టీసీ ఎండీ మొండి వైఖరి విడనాడాలని, సానుకూల వాతావరణంలో చర్చలు జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామని అన్నారు. -
నానా హైరానా
సంగారెడ్డి మున్సిపాలిటీ : ప్రగతి రథ చక్రం రోడ్డెక్కలేదు. జిల్లాలోని ఏడు డిపోల నుంచి 750 బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. తొలి రోజు రూ.కోటి మేరకు నష్టం వాటిల్లింది. మరోపక్క ప్రయాణికులు బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో విఫలమైంది. 43 శాతం ఫిట్మెంట్ చెల్లిం చాలనే డిమాండ్‌తో తెలంగాణ మజ్దూర్ యూని యన్, ఎంప్లాయీస్ యూనియన్ సంయుక్తంగా నిర్వహించిన సమ్మె జనజీవనంపై ప్రభావం చూపింది. సమ్మె వల్ల ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులు నడపాలని ఆర్టీసీ యాజమాన్యం చేసిన ప్రయత్నాలు కార్మిక సంఘాల ప్రతిఘటనతో ఫలించలేదు. ఫలితంగా ఒక్క బస్సూ కదల్లేదు. గజ్వేల్ డిపో పరిధిలో ఒక ప్రైవేట్ బస్సును మాత్రం తూప్రాన్ వరకు నడిపించారు. మొత్తంగా కార్మికుల సమ్మె కారణంగా ఆర్టీసీకి బుధవారం ఒక్కరోజే సుమారు రూ. కోటి మేర నష్టం వాటిల్లినట్టు అధికారుల అంచనా. తమ సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని యూనియన్ నాయకులు స్పష్టం చేయడంతో గురువారం కూడా బస్సుల రాకపోకలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం తెల్లవారుజామున 4 గంటల నుంచే కార్మికులు ఆయా డిపోల వద్దకు చేరుకుని బస్సులను కదలనివ్వలేదు. సంగారెడ్డి డిపోకు తాత్కాలిక పద్ధతిన డ్రైవర్, కండక్టర్లుగా పనిచేయడానికి వచ్చిన వారి అర్హత పత్రాలను చించివేస్తామని కార్మికులు బెదిరించడంతో వారంతా వెనక్కితగ్గారు. సమ్మె తమ కోసం చేయట్లేదని, తమకు సహకరించాలని కార్మికులు కోరడంతో వారంతా సంఘీభావం తెలపడం విశేషం. సమ్మెలో జిల్లా వ్యాప్తంగా 2,900 మంది కార్మికులు పాల్గొనడంతో 750 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆయా డిపోల వద్ద కార్మికులు ఆందోళనలు నిర్వహించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లేవీ? సమ్మె.. పైగా శుభకార్యాల సీజన్.. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా తాత్కాలిక సిబ్బందిని నియమించుకోవాలని ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ఆయా రీజనల్ మేనేజర్లను ఆదేశించింది. కానీ అటువంటి ప్రయత్నాలను కార్మిక యూనియన్లు అడ్డుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇక్కట్ల పాలయ్యారు. అసలే పెళ్లిళ్ల సీజన్ కావడంతో ప్రయాణం సాగక రవాణా సదుపాయాల్లేక వ్యయప్రయాసలు పడి గమ్యాలను చేరుకున్నారు. బస్సులు తిరగవనే విషయం తెలియక పలువురు పిల్లాపాపలతో బస్సు స్టేషన్లకు చేరుకుని.. తీరా విషయం తెలిశాక యాతన పడ్డారు. ఇదే అదనుగా ఆటోలు, ఇతర రవాణా సాధనాల చార్జీలకు రెక్కలొచ్చాయి. దూరంతో నిమిత్తం లేకుండా ప్రయాణికుల అవసరాన్ని బట్టి డబ్బులు డిమాండ్ చేశారు. డిమాండ్ల నెరవేర్చే వరకు.. ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణ ఇంక్రిమెంట్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు 43 శాతం ఫిట్మెంట్ ఇస్తామని హామీ ఇచ్చారని, దానిని నెరవేర్చాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ రీజనల్ కన్వీనర్ పీరయ్య డిమాండ్ చేశారు. అప్పటి వరకు ఆందోళన కొనసాగుతుందన్నారు. తాత్కాలిక సిబ్బందితో బస్సులు నడపాలని చూసినా జరిగే పరిణామాలకు ప్రభుత్వమే భాధ్యత వహించాలని హెచ్చరించారు. విధులకు రాకుంటే తొలగిస్తాం రోడ్డు రవాణా సంస్థలో పనిచేస్తున్న క్యాజువల్ కండక్టర్లు, డ్రైవర్లు, కాంట్రాక్ట్ డ్రైవర్లు వెంటనే విధుల్లో చేరకుంటే సర్వీస్ నుంచి తొలగిస్తామని ఇన్చార్జి రీజనల్ మేనేజర్ రాజు ఒక ప్రకటనలో హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా 97 మంది క్యాజువల్ కండక్టర్లు, కాంట్రాక్ట్ కండక్టర్లు, 74 మంది కాంట్రాక్ట్ డ్రైవర్లు బుధవారం మూకుమ్మడిగా విధులకు హాజరుకాకపోవడంతో ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగిందన్నారు. వెంటనే విధుల్లో చేరకుంటే సర్వీస్ నుండి తొలగిస్తామన్నారు. బస్సును అడ్డుకున్న కార్మికులు సంగారెడ్డి మున్సిపాలిటీ : ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ఉదయం నుంచి డీపోలకే పరిమితమైన బస్సులను రాత్రి 7 గంటల ప్రాంతంలో సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న ఆర్టీసీ అధికారులతో చర్చలు జరిపి ప్రైవేట్ డ్రైవర్‌తో బస్సును డీపోనుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా కార్మికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, కార్మికుల మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. దీంతో కార్మికులు ఎంతకూ వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు చేసేదేమి లేక బస్సును డిపోలోకి పంపించారు. దీంతో కొద్దిసేపు బస్సుడిపో ఆవరణలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. -
కార్మికులతో చర్చల్లో ప్రతిష్టంభన
వేతన సవరణపై హామీ ఇవ్వని ఆర్టీసీ ఎండీ ఉద్యమబాట తప్పదన్న కార్మికులు సాక్షి, హైదరాబాద్: వేతన సవరణ విషయంలో కార్మికులతో ఆర్టీసీ యాజమాన్యం జరిపిన చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. బుధవారం గుర్తింపు పొందిన కార్మిక సంఘాల నేతలతో ఆర్టీసీ అధికారులు చర్చిం చారు. దాదాపు 274 అంశాలతో కూడిన సర్వీస్ కండిషన్స్‌పై సమగ్రంగా చర్చించినప్పటికీ వేతన సవరణపై ఏకాభిప్రాయం కుదరలేదు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతన సవరణ చేస్తే ఆర్టీసీపై రూ.1,800 కోట్ల భారం పడుతుందని, దాన్ని మోసే శక్తి ఆర్టీసీకి లేనందున ప్రభుత్వంతో చర్చిస్తానని సంస్థ ఎండీ సాంబశివరావు కార్మిక సంఘాల ప్రతినిధులకు స్పష్టం చేశారు. ఇందుకు కనీసం ఏప్రిల్ చివరి నాటికి గడువు అవసరమవుతుందన్నారు. ఇప్పటికే వేతన సవరణ గడువు దాటి రెండేళ్లు అయ్యిందని, ఇంకా జాప్యం సరికాదని కార్మిక సంఘాల నేతలు పేర్కొన్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుంటే తప్ప ఇందులో స్పష్టత రాదని ఎండీ తేల్చిచెప్పారు. దీంతో ముందుగా ప్రకటించిన విధంగా గురువారం నాటి బస్‌భవన్ ముట్టడిని కొనసాగించి తీరుతామని కార్మిక సంఘాలు ప్రకటించాయి. -
ఆర్టీసీ సమ్మె విరమణ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ యాజమాన్యంతో జరిపిన చర్చలు సఫలం కావటంతో పండుగ తరువాత చేపట్టనున్న సమ్మెను విరమించుకుంటున్నట్లు ఎంప్లాయీస్ యూనియన్ ప్రకటించింది. గత రెండు రోజుల నుంచి వాయిదా పడుతున్న చర్చలు బుధవారం ఓ కొలిక్కి రావటంతో ఈయూ నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు.ఆర్టీసీ కార్మికుల సమస్యలు, డీఏ బకాయిలు, సీసీఎస్ సొమ్ము చెల్లింపు తదితర అంశాలపై తమ డిమాండ్ల పట్ల యాజమాన్యం సానుకూలంగా వ్యవహరించడంతో సమ్మెకు వెళ్లరాదని నిర్ణయించారు. దీంతో సమ్మెను విరమించుకుంటున్నామని ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖరరెడ్డి, ఇన్చార్జి ప్రధాన కార్యదర్శి దామోదరరావు మీడియాకు తెలిపారు. అంగీకరించిన ముఖ్య డిమాండ్లు ఇవే.. క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ (సీసీఎస్)కి యాజమాన్యం నుంచి ఏపీ వాటాగా రావాల్సిన రూ.వంద కోట్ల బకాయిల్లో గురువారం రూ.30 కోట్లు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. వచ్చే నెలాఖరు నాటికి మొత్తం డబ్బు చెల్లింపు. ఇకపై సీసీఎస్ డబ్బులు యాజమాన్యం వాడుకోకుండా ప్రతి నెలా 10న చెల్లిస్తారు. ఏడు నెలల డీఏ బకాయిల్లో ఈనెల 12న సగం ఇచ్చి మిగిలిన 50 శాతం మార్చి నెల జీతంలో కలుపుతారు. కొత్త డీఏ ప్రకటన రాగానే అదే నెలలో బకాయిలతో ఇస్తారు. ఎస్ఆర్బీసీ, ఎస్బీటీల్లో రుణాలకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఫిబ్రవరి నెలాఖరులోగా మంజూరు. 2011 ఏప్రిల్ 1 నుంచి వర్క్‌షాపు కార్మికుల కు మ్యాన్ అవర్ రేటు బకాయిలను జనవరి, ఫిబ్రవరి ఇన్సెంటివ్‌లు రెండు విడతలుగా ఇస్తారు. ఆర్టీసీ విలీనంపై అధ్యయన కమిటీ ఇచ్చిన నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తారు. విభజన ప్రక్రియ త్వరలో అమలు చేస్తారు. ఆ తర్వాత అన్ని విభాగాల్లో ఖాళీల భర్తీ. పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలకు సంబంధించిన సర్క్యులర్ జారీకి అంగీకారం. హైదరాబాద్‌లోని తార్నాక స్థాయి ఆస్పత్రి విజయవాడలో ఏర్పాటుకు ఈడీల కమిటీ పరిశీలనలో ఉంది. 2012 డిసెంబరు 31కి ముందు నియమించి న కాంట్రాక్టు కండక్టర్లు, డ్రైవర్లలో మిగిలిన వారందరినీ రెగ్యులర్ చేస్తారు. 2013 జనవరి 1 తర్వాత నియమించిన కాంట్రాక్టు కార్మికులను త్వరలో రెగ్యులర్ చేస్తారు. డ్రైవర్లు టిమ్స్ మిషన్ల నిర్వహణకు సంబంధించి ఇచ్చే కమిషన్‌లో యాజమాన్యం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని సవరిస్తారు. -
ఆర్టీసీ విభజనలో కుట్ర జరుగుతోంది!
రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డికి తెలంగాణ అధికారుల ఫిర్యాదు ఆంధ్రాప్రాంత కన్సల్టెన్సీతో నివేదిక రూపొందించారు.. 10న జరగాల్సిన బోర్డు మీటింగును వాయిదా వేయించాలని వినతి అంతా చట్టప్రకారమే జరుగుతోందన్న ఆర్టీసీ యాజమాన్యం సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ విభజన వ్యవహారం పీటముడిగా మారుతోంది. సామరస్యపూర్వకంగా రెండు కార్పొరేషన్లు ఏర్పడే తరుణంలో అక్కడ జరుగుతున్న పరిణామాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఆర్టీసీ సహా ఇతర కార్పొరేషన్ల విభజన వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు కేంద్రం నియుమించిన షీలాభిడే కమిటీ ప్రైవేటు కన్సల్టెన్సీకి నివేదిక తయారీ బాధ్యత అప్పగించటాన్ని తెలంగాణ ప్రాంత ఆర్టీసీ అధికారులు, కార్మిక సంఘాల నేతలు తప్పు పడుతున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆర్టీసీ తెలంగాణ అధికారుల సంఘం, టీఎంయూ నేతలు మంగళవారం సాయంత్రం రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డితో సచివాలయంలో భేటీ అయ్యారు. ఆంధ్రాప్రాంతానికి చెందిన కన్సల్టెన్సీకి బాధ్యత అప్పగించటం వెనక కుట్ర జరిగిందని, ఆ కన్సల్టెన్సీ ఇష్టానుసారంగా నివేదిక తయారు చేసి తెలంగాణను దెబ్బతీసేలా వ్యవహరించినందున ఆ నివేదికకు ఆమోదముద్ర పడకుండా చూడాలని మంత్రి దృష్టికి తెచ్చారు. పదో తేదీన బోర్డు సమావేశం జరగకుండా వాయిదావేరుుంచాలని వారు కోరారు. వుంత్రి ఆర్టీసీ ఎండీతో మాట్లాడేందుకు యత్నించినా ఆయన ఫోన్లో అందుబాటులోకి రాకపోవటంతో ఆర్టీసీ జేఎండీ రమణరావుతో మాట్లాడారు. పదోతేదీన బోర్డు సమావేశం వద్దని, తెలంగాణకు ప్రత్యేక బోర్డు ఏర్పాడ్డాక సమావేశం నిర్వహించటం మంచిదని సూచించారు. నష్టాలను రూ.700 కోట్లు పెంచారు... గతంలో ఆర్టీసీ అధికారులతో కూడిన విభజన కమిటీ తెలంగాణ ఆర్టీసీ నష్టాలను రూ.1100 కోట్లు, ఆంధ్రప్రదేశ్ ప్రాంత నష్టాలను రూ.2,700 కోట్లుగా చూపితే... దాన్ని ప్రైవేటు కన్సల్టెన్సీ మార్చివేసి తెలంగాణ నష్టాలను రూ.1,800కు పెంచి ఆంధ్రాప్రాంత నష్టాలను అంతమేర తగ్గించిందని కార్మిక నేతలు మంత్రికి ఫిర్యాదు చేశారు. దీనివల్ల మొత్తం అప్పుల్లో తెలంగాణ వాటా పెంచే కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని తార్నాకలో ఉన్న ఆర్టీసీ వైద్యశాల ఆస్తిని లెక్కగట్టే క్రమంలో గజం ధరను రూ.38 వేలుగా పరిగణించి దాని విలువను భారీగా పెంచారని, పంపకం సమయంలో అంతమేర పరిహారం తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుందని, ఇది పెద్ద భారంగా మారుతుందని వివరించారు. అంతా విభజన చట్టం ప్రకారమే.. ఈ ఆరోపణలను ఆర్టీసీ యాజమాన్యం ఖండిస్తోంది. విభజన చట్టంలో పేర్కొన్న విధంగానే కసరత్తు జరుగుతోందని ఓ సీనియర్ అధికారి ‘సాక్షి’కి వెల్లడించారు. హెడ్‌క్వార్టర్‌లోని ఆస్తులను ఉమ్మడి ఆస్తులుగా పరిగణించాలని చట్టం లో ఉందని, ఆమేరకే ఆస్తుల లెక్కగట్టి కన్సల్టెన్సీ నివేదిక సిద్ధం చేసిందన్నారు. అంతిమంగా రెండు ప్రభుత్వాల నిర్ణయం ఆధారంగానే విభజన జరుగుతుందని, ఈ నివేదికలేవీ ప్రావూణికం కావని ముక్తాయించారు. -
పీఎఫ్ మింగేశారు!
రూ.160 కోట్లు వాడేసుకున్న ఆర్టీసీ యాజమాన్యం సాక్షి, హైదరాబాద్: పిల్ల పెళ్లి చేయాలన్నా.. బిడ్డను చదివించాలన్నా.. ఆపద నుంచి గట్టెక్కాలన్నా పీఎఫ్ సొమ్ముపైనే కార్మికులకు భరోసా. మరి ఆ సొమ్మే మాయమవుతుంటే వారికి దిక్కేది? పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఆర్టీసీలో యాజమాన్యం చేసిన నిర్వాకంతో ఈ దుస్థితి ఏర్పడింది. నిధులు వట్టిపోవడంతో కార్మికుల భవిష్య నిధినే ఆర్టీసీ తన అవసరాలకు వినియోగిస్తోంది. సంస్థ సిబ్బంది నెలనెలా దాచుకుంటున్న సొమ్మును యాజమాన్యమే గుటుక్కుమనిపిస్తోంది. ఇప్పటికే దాదాపు రూ. 160 కోట్ల పీఎఫ్ మొత్తాన్ని కార్మికులకు తెలియకుండా దర్జాగా వాడేసుకుంది. అత్యవసరాల కోసం డబ్బులడిగిన వారికి ఉత్త చేతులు చూపుతూ వేలాది కుటుంబాల్లో కల్లోలం సృష్టించింది. ఏకంగా 6500 మంది కార్మికులకు ఈ చేదు అనుభవం ఎదురైంది. దీంతో ప్రస్తుతం ఈ వ్యవహారం పెద్ద దుమారం సృష్టిస్తోంది. ఇతర సంస్థలతో పోల్చితే ఆర్టీసీలో పీఎఫ్ నిర్వహణ భిన్నంగా ఉంటుంది. సాధారణ సంస్థల్లో ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించిన నిర్దేశిత మొత్తంతో పాటు అంతే మొత్తం సొమ్మును యాజ మాన్యం తన వాటాగా కలిపి రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయంలో జమ చేస్తారు. కానీ ఆర్టీసీలో అలా కాకుండా ప్రత్యేకంగా ఓ ట్రస్టును ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ఎండీ చైర్మన్‌గా ఉండే ఈ ట్రస్టులో అధికారులతోపాటు గుర్తింపు కార్మిక సంఘం సభ్యులకు కూడా ప్రాతినిధ్యం ఉంటుంది. అందులో జమ అయ్యే పీఎఫ్ మొత్తాన్ని ఇతర సంస్థల్లో పెట్టుబడులుగా పెట్టి ఆ మేరకు వడ్డీ రూపంలో ఆదాయాన్ని ఆర్టీసీ పొందుతుంది. ఆ మొత్తాన్ని కార్మికుల సంక్షేమం కోసం వినియోగిస్తారు. కార్మికులెవరైనా అత్యవసరాల కోసం తమ పీఎఫ్ మొత్తం కావాలని దరఖాస్తు చేస్తే నిర్ధారిత సమయంలో వారికి అందిస్తారు. కానీ మూడు నెలలుగా ఇలా దరఖాస్తు చేసుకుంటున్న కార్మికులకు సకాలంలో పీఎఫ్ మొత్తం అందడం లేదు. రకరకాల కారణాలు చెబుతూ యాజమాన్యం కాలయాపన చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో గత నెల నుంచి ఈ ప్రక్రియను పూర్తిగా నిలిపివేశారు. అధికారులు మాత్రం సాంకేతిక కారణాలను పేర్కొంటూ ఇదిగో ఇస్తాం.. అదిగో ఇస్తామంటూ నెట్టుకొస్తున్నారు. దీంతో అనుమానం వచ్చిన కార్మికులు వారం క్రితం అధికారులను గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. ప్రస్తుతం ఆర్టీసీలో నిధులకు తీవ్ర కొరత ఉండటం, ప్రభుత్వపరంగా అందాల్సిన రీయింబర్స్మెంట్లు రాకపోవడంతో భవిష్య నిధిలోని డబ్బును వాడుకున్నట్లు అధికారులు గుట్టు విప్పేసరికి విస్తుపోవడం కార్మికుల వంతైంది. లోతుగా ఆరాతీస్తే మే నెల నుంచే పీఎఫ్ మొత్తాన్ని అసలు భవిష్య నిధి ట్రస్టుకు జమ చేయడం లేదని తేలింది. ప్రతి నెలా అందులో జమచేయాల్సిన రూ. 40 కోట్లను (ఇందులో కార్మికుల వాటా రూ. 20 కోట్లు) దారి మళ్లించినట్టు స్పష్టమైంది. ఆగస్టు నెల తాలూకు మొత్తాన్ని కూడా ఇలా ఇతర అవసరాలకు వాడుకునేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో నిబంధనలను తుంగలో తొక్కి దారి మళ్లించిన నిధుల మొత్తం రూ. 160 కోట్లకు చేరుకోనుంది. తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీకి చేతిలో చిల్లిగవ్వలేకపోవడంతో పీఎఫ్ సొమ్మును వాడుకున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాకపోవడం.. సంస్థ నిర్వహణకు అవసరమైన సొమ్ము ఖజానాలో లేకపోవడంతో కార్మికుల భవిష్య నిధిని పక్కదారి పట్టించినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారం బయటపడటంతో కార్మికులు, వారి కుటుంబ సభ్యులు అయోమయంలో పడ్డారు. మూడు నెలలుగా ఒకరిద్దరికి మినహా మిగతా వారందరికీ రిక్తహస్తం చూపుతుండటంతో ఆయా కుటుంబాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనాల్సి వస్తోంది. ఇప్పటికే కార్మికుల దరఖాస్తులు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. ఇప్పటి వరకు 6500 దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. పీఎఫ్ సొమ్ము అవసరానికి అందకుండాపోయేసరికి అత్యవసర పరిస్థితుల్లో కార్మికులు అప్పులపాలు కావాల్సి వస్తోంది. ఉద్యోగుల భవిష్యత్తు అవ సరాలకు ఉద్దేశించిన మొత్తాన్ని దుర్వినియోగం చేస్తే శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు. సాధారణ ఉద్యోగి పీఎఫ్‌ను కాజేస్తే చట్టప్రకారం శిక్షిస్తారు. కానీ కార్మికుల అనుమతి లేకుండా వారి కష్టార్జితాన్ని ఆర్టీసీ యాజమాన్యం దర్జాగా వాడేసి చోద్యం చూస్తోంది. ఈ విషయంపై ఆర్టీసీ ఉన్నతాధికారులను ‘సాక్షి’ వివరణ కోరగా సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. ఇంత దారుణమా?: నాగేశ్వరరావు, ఎన్ఎంయూ అధ్యక్షుడు కార్మికులు దాచుకున్న సొమ్మును ఆర్టీసీ వాడుకోవటం దారుణం. కేంద్రం కల్పించిన హక్కును కాలరాసినట్టే. దీన్ని మేం తీవ్రంగా పరిగణిస్తున్నాం. వెంటనే ఆర్జీసీ యాజమాన్యం ఆ మొత్తాన్ని భవిష్య నిధి ట్రస్టుకు జమ చేయాలి. తాము దాచుకున్న మొత్తాన్ని కూడా కార్మికులు పొందలేని పరిస్థితిని కల్పించడం క్షమార్హం కాదు. కార్మికులను దగా చేయడమే: దామోదర్ రావు, ఈయూ నేత భవిష్యత్తు అవసరాల కోసం దాచుకున్న సొమ్మును వాడుకోవడమంటే కార్మికులను దగా చేయడమే. ప్రభుత్వం రీయింబర్స్ చేయాల్సిన రూ. 750 కోట్లను విడుదల చేయకపోవడమే దీనికి కారణమని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి కార్మికులను అప్పుల పాలు చేసే ఈ పరిస్థితిని చక్కదిద్దాలి. లేకుంటే ఉద్యమిస్తాం. ఇదీ ఆర్టీసీ దుస్థితి! - 2013-14 ఆర్థిక సంవత్సరంలో సంస్థ రికార్డు స్థాయిలో రూ. 902 కోట్ల నష్టాలను చవిచూసింది. ఇందులో తెలంగాణ వాటా రూ. 212 కోట్లు. - ఆర్టీసీ ప్రారంభమైన ఈ ఎనిమిది దశాబ్దాల కాలంలో ఇంత భారీ నష్టాలు రావడం ఇదే ప్రథమం. - గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ఆర్టీసీ రూ. 3742 కోట్ల ఆదాయాన్ని పొందింది. ఇది అంతకుముందు ఏడాది కంటే రూ. 335 కోట్లు మాత్రమే ఎక్కువ. కాగా, ఖర్చు పద్దు కింద రూ. 3950 కోట్లను చూపారు. ఇది అంతకుముందు సంవత్సరం కంటే రూ. 537 కోట్లు అధికం. - ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే భారీ నష్టాలు మొదలయ్యాయి. ఏప్రిల్ నెలలోనే రూ. 14.50 కోట్ల నష్టం వచ్చింది. - బస్సు పాస్‌లకు సంబంధించి ఆర్టీసీ ఇచ్చే రాయితీ మొత్తాన్ని ప్రభుత్వం రీయింబర్స్ చేయాల్సి ఉంటుంది. రూ. 775 కోట్ల మేర ఈ బకాయిలు పేరుకుపోయాయి. - డీజిల్ ధరలు కూడా ఆర్టీసీకి భారంగా మారాయి. ప్రస్తుతం సంవత్సరానికి రూ. 1150 కోట్లు డీజిల్‌కే ఖర్చవుతోంది. - కార్మికుల కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి ఆర్టీసీ ఇప్పటికే రూ. 243 కోట్లు బకాయిపడింది. - ఇక ఇప్పటి వరకు ఆర్టీసీ చేసిన అప్పులురూ. 4800 కోట్లకు చేరుకున్నాయి. ‘‘కరీంనగర్‌కు చెందిన ఆర్టీసీ కార్మికుడు లక్ష్మణ్ తన కూతురి పెళ్లి కోసం పీఎఫ్ డబ్బులు కోరుతూ దరఖాస్తు చేశాడు. కానీ అవి చేతికి అందకపోయేసరికి అప్పు చేసి పెళ్లి తంతు ముగించాడు. హైదరాబాద్‌కు చెందిన ముజీబ్ తండ్రి అనార్యోగానికి గురికావడంతో ఆసుపత్రి ఖర్చు కోసం పీఎఫ్‌కు దరఖాస్తు చేశాడు. కానీ నయాపైసా రాకపోవ డంతో బంగారం తాకట్టుపెట్టి ఆసుపత్రి బిల్లు చెల్లించాడు. ఈ పరిస్థితి వీరిద్దరికే పరిమితం కాలేదు. దాదాపు 6,500 మంది ఆర్టీసీ కార్మికులు.. పీఎఫ్ డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. వారి భవిష్య నిధిని ఆర్టీసీ యాజమాన్యం అక్రమం గా వాడుకోవడమే ఈ పరిస్థితికి కారణం’’. -
ఆర్టీసీ ఉద్యోగుల జీతభత్యాలను సవరించాలి
పరిగి: ఆర్టీసీ యాజమాన్యం మొండివైఖరిని విడనాడాలని, ఉద్యోగుల జీతభత్యాల సవరణ వెంటనే చేపట్టాలని టీఎన్‌ఎంయూ రాష్ట్ర కార్యదర్శి సిద్దిఖి, పరిగి డిపో అధ్యక్షుడు సత్తయ్య, గ్యారేజ్ కార్యదర్శి ఖుద్బుద్దీన్ అన్నారు. టీఎన్‌ఎంయూ పిలుపు మేరకు గురువారం కార్మికులు పరిగి డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్టీసీ యాజమాన్యం మొండి వైఖరిపై మండిపడ్డారు. కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామంటూ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించటం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. జీతభత్యాల సవరణ పూర్తి చేయకుండా కేవలం ఐఆర్‌తో సరిపెట్టడం సరికాదని పేర్కొన్నారు. జనవరి నుంచి డీఏ ఎరియర్స్ చెల్లించని కారణంగా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇంత జరుగుతున్నా గుర్తింపు సంఘం ప్రేక్షక పాత్ర వహిస్తూ యాజమాన్యానికి వత్తాసు పలుకుతోందని వారు విమర్శించారు. కాలం చెల్లిన బస్సులతో గ్యారేజి ఉద్యోగులపై అధిక పనిభారం పడుతోందని దుయ్యబట్టారు. కార్యక్రమంలో టీఎన్‌ఎంయూ సంఘం నాయకులు వెంకటయ్య, షరీఫ్, రమేష్, ఖదీర్, షర్భలింగం, రాంచందర్ పాల్గొన్నారు.