రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డికి తెలంగాణ అధికారుల ఫిర్యాదు
ఆంధ్రాప్రాంత కన్సల్టెన్సీతో నివేదిక రూపొందించారు..
10న జరగాల్సిన బోర్డు మీటింగును వాయిదా వేయించాలని వినతి
అంతా చట్టప్రకారమే జరుగుతోందన్న ఆర్టీసీ యాజమాన్యం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ విభజన వ్యవహారం పీటముడిగా మారుతోంది. సామరస్యపూర్వకంగా రెండు కార్పొరేషన్లు ఏర్పడే తరుణంలో అక్కడ జరుగుతున్న పరిణామాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఆర్టీసీ సహా ఇతర కార్పొరేషన్ల విభజన వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు కేంద్రం నియుమించిన షీలాభిడే కమిటీ ప్రైవేటు కన్సల్టెన్సీకి నివేదిక తయారీ బాధ్యత అప్పగించటాన్ని తెలంగాణ ప్రాంత ఆర్టీసీ అధికారులు, కార్మిక సంఘాల నేతలు తప్పు పడుతున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆర్టీసీ తెలంగాణ అధికారుల సంఘం, టీఎంయూ నేతలు మంగళవారం సాయంత్రం రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డితో సచివాలయంలో భేటీ అయ్యారు.
ఆంధ్రాప్రాంతానికి చెందిన కన్సల్టెన్సీకి బాధ్యత అప్పగించటం వెనక కుట్ర జరిగిందని, ఆ కన్సల్టెన్సీ ఇష్టానుసారంగా నివేదిక తయారు చేసి తెలంగాణను దెబ్బతీసేలా వ్యవహరించినందున ఆ నివేదికకు ఆమోదముద్ర పడకుండా చూడాలని మంత్రి దృష్టికి తెచ్చారు. పదో తేదీన బోర్డు సమావేశం జరగకుండా వాయిదావేరుుంచాలని వారు కోరారు. వుంత్రి ఆర్టీసీ ఎండీతో మాట్లాడేందుకు యత్నించినా ఆయన ఫోన్‌లో అందుబాటులోకి రాకపోవటంతో ఆర్టీసీ జేఎండీ రమణరావుతో మాట్లాడారు. పదోతేదీన బోర్డు సమావేశం వద్దని, తెలంగాణకు ప్రత్యేక బోర్డు ఏర్పాడ్డాక సమావేశం నిర్వహించటం మంచిదని సూచించారు.
నష్టాలను రూ.700 కోట్లు పెంచారు...
గతంలో ఆర్టీసీ అధికారులతో కూడిన విభజన కమిటీ తెలంగాణ ఆర్టీసీ నష్టాలను రూ.1100 కోట్లు, ఆంధ్రప్రదేశ్ ప్రాంత నష్టాలను రూ.2,700 కోట్లుగా చూపితే... దాన్ని ప్రైవేటు కన్సల్టెన్సీ మార్చివేసి తెలంగాణ నష్టాలను రూ.1,800కు పెంచి ఆంధ్రాప్రాంత నష్టాలను అంతమేర తగ్గించిందని కార్మిక నేతలు మంత్రికి ఫిర్యాదు చేశారు. దీనివల్ల మొత్తం అప్పుల్లో తెలంగాణ వాటా పెంచే కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని తార్నాకలో ఉన్న ఆర్టీసీ వైద్యశాల ఆస్తిని లెక్కగట్టే క్రమంలో గజం ధరను రూ.38 వేలుగా పరిగణించి దాని విలువను భారీగా పెంచారని, పంపకం సమయంలో అంతమేర పరిహారం తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుందని, ఇది పెద్ద భారంగా మారుతుందని వివరించారు.
అంతా విభజన చట్టం ప్రకారమే..
ఈ ఆరోపణలను ఆర్టీసీ యాజమాన్యం ఖండిస్తోంది. విభజన చట్టంలో పేర్కొన్న విధంగానే కసరత్తు జరుగుతోందని ఓ సీనియర్ అధికారి ‘సాక్షి’కి వెల్లడించారు. హెడ్‌క్వార్టర్‌లోని ఆస్తులను ఉమ్మడి ఆస్తులుగా పరిగణించాలని చట్టం లో ఉందని, ఆమేరకే ఆస్తుల లెక్కగట్టి కన్సల్టెన్సీ నివేదిక సిద్ధం చేసిందన్నారు. అంతిమంగా రెండు ప్రభుత్వాల నిర్ణయం ఆధారంగానే విభజన జరుగుతుందని, ఈ నివేదికలేవీ ప్రావూణికం కావని ముక్తాయించారు.
ఆర్టీసీ విభజనలో కుట్ర జరుగుతోంది!
Published Wed, Oct 8 2014 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 PM
Advertisement