విశ్రాంత ఉద్యోగులకు ఉచిత ప్రయాణం!
త్వరలో ప్రకటించనున్న ఆర్టీసీ యాజమాన్యం
సాక్షి, విజయవాడ బ్యూరో: ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు ఉచితంగా బస్సు ప్రయాణం అందించేలా యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఒకటి రెండు రోజుల్లో దీనిని అధికారికంగా ప్రకటించనున్నారు. దశాబ్దాల తరబడి ఆర్టీసీకి సేవలందించి ఉద్యోగ విరమణ చేసిన వారికి ఉచిత ప్రయాణ అవకాశం ఇవ్వాలని గత కొంతకాలంగా ఆర్టీసీ యూనియన్‌లు డిమాండ్‌చేస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తోంది. తెలంగాణ ఆర్టీసీలో పాసింజర్, ఎక్స్‌ప్రెస్ బస్సుల వరకు ఉచితంగా అనుమతిస్తున్నారు.
తెలంగాణ కంటే ఆలస్యంగా స్పందించిన ఏపీఎస్‌ఆర్టీసీ కొంచెం ముందడుగు వేసి పాసింజర్, ఎక్స్‌ప్రెస్‌లతోపాటు డీలక్స్ సర్వీసుల్లోనూ ఉచితంగా ప్రయాణం అందించే యోచన చేస్తోంది. ఇంద్ర, గరుడ వంటి ఏసీ బస్సుల్లోను 50 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు సమాచారం. దీని వల్ల రాష్ట్రంలో 25 వేల మందికిపైగా ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు మేలు కలుగుతుందని భావిస్తున్నారు.