పీఎఫ్ మింగేశారు! | RTC management misuses 160 crore rupees PF amount of employees | Sakshi
Sakshi News home page

పీఎఫ్ మింగేశారు!

Published Sun, Aug 24 2014 1:27 AM | Last Updated on Sun, Sep 2 2018 3:34 PM

పీఎఫ్ మింగేశారు! - Sakshi

పీఎఫ్ మింగేశారు!

రూ.160 కోట్లు వాడేసుకున్న ఆర్టీసీ యాజమాన్యం
 
 సాక్షి, హైదరాబాద్: పిల్ల పెళ్లి చేయాలన్నా.. బిడ్డను చదివించాలన్నా.. ఆపద నుంచి గట్టెక్కాలన్నా పీఎఫ్ సొమ్ముపైనే కార్మికులకు భరోసా. మరి ఆ సొమ్మే మాయమవుతుంటే వారికి దిక్కేది? పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఆర్టీసీలో యాజమాన్యం చేసిన నిర్వాకంతో ఈ దుస్థితి ఏర్పడింది. నిధులు వట్టిపోవడంతో కార్మికుల భవిష్య నిధినే ఆర్టీసీ తన అవసరాలకు వినియోగిస్తోంది. సంస్థ సిబ్బంది నెలనెలా దాచుకుంటున్న సొమ్మును యాజమాన్యమే గుటుక్కుమనిపిస్తోంది. ఇప్పటికే దాదాపు రూ. 160 కోట్ల పీఎఫ్ మొత్తాన్ని కార్మికులకు తెలియకుండా దర్జాగా వాడేసుకుంది. అత్యవసరాల కోసం డబ్బులడిగిన వారికి ఉత్త చేతులు చూపుతూ వేలాది కుటుంబాల్లో కల్లోలం సృష్టించింది. ఏకంగా 6500 మంది కార్మికులకు ఈ చేదు అనుభవం ఎదురైంది. దీంతో ప్రస్తుతం ఈ వ్యవహారం పెద్ద దుమారం సృష్టిస్తోంది. ఇతర సంస్థలతో పోల్చితే ఆర్టీసీలో పీఎఫ్ నిర్వహణ భిన్నంగా ఉంటుంది. సాధారణ సంస్థల్లో ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించిన నిర్దేశిత మొత్తంతో పాటు అంతే మొత్తం సొమ్మును యాజ మాన్యం తన వాటాగా కలిపి రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయంలో జమ చేస్తారు. కానీ ఆర్టీసీలో అలా కాకుండా ప్రత్యేకంగా ఓ ట్రస్టును ఏర్పాటు చేశారు.
 
  ఆర్టీసీ ఎండీ చైర్మన్‌గా ఉండే ఈ ట్రస్టులో అధికారులతోపాటు గుర్తింపు కార్మిక సంఘం సభ్యులకు కూడా ప్రాతినిధ్యం ఉంటుంది. అందులో జమ అయ్యే పీఎఫ్ మొత్తాన్ని ఇతర సంస్థల్లో పెట్టుబడులుగా పెట్టి ఆ మేరకు వడ్డీ రూపంలో ఆదాయాన్ని ఆర్టీసీ పొందుతుంది. ఆ మొత్తాన్ని కార్మికుల సంక్షేమం కోసం వినియోగిస్తారు. కార్మికులెవరైనా అత్యవసరాల కోసం తమ పీఎఫ్ మొత్తం కావాలని దరఖాస్తు చేస్తే నిర్ధారిత సమయంలో వారికి అందిస్తారు. కానీ మూడు నెలలుగా ఇలా దరఖాస్తు చేసుకుంటున్న కార్మికులకు సకాలంలో పీఎఫ్ మొత్తం అందడం లేదు. రకరకాల కారణాలు చెబుతూ యాజమాన్యం కాలయాపన చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో గత నెల నుంచి ఈ ప్రక్రియను పూర్తిగా నిలిపివేశారు. అధికారులు మాత్రం సాంకేతిక కారణాలను పేర్కొంటూ ఇదిగో ఇస్తాం.. అదిగో ఇస్తామంటూ నెట్టుకొస్తున్నారు. దీంతో అనుమానం వచ్చిన కార్మికులు వారం క్రితం అధికారులను గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బయటపడింది.
 
 ప్రస్తుతం ఆర్టీసీలో నిధులకు తీవ్ర కొరత ఉండటం, ప్రభుత్వపరంగా అందాల్సిన రీయింబర్స్‌మెంట్లు రాకపోవడంతో భవిష్య నిధిలోని డబ్బును వాడుకున్నట్లు అధికారులు గుట్టు విప్పేసరికి విస్తుపోవడం కార్మికుల వంతైంది. లోతుగా ఆరాతీస్తే మే నెల నుంచే పీఎఫ్ మొత్తాన్ని అసలు భవిష్య నిధి ట్రస్టుకు జమ చేయడం లేదని తేలింది. ప్రతి నెలా అందులో జమచేయాల్సిన రూ. 40 కోట్లను (ఇందులో కార్మికుల వాటా రూ. 20 కోట్లు) దారి మళ్లించినట్టు స్పష్టమైంది. ఆగస్టు నెల తాలూకు మొత్తాన్ని కూడా ఇలా ఇతర అవసరాలకు వాడుకునేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో నిబంధనలను తుంగలో తొక్కి దారి మళ్లించిన నిధుల మొత్తం రూ. 160 కోట్లకు చేరుకోనుంది. తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీకి చేతిలో చిల్లిగవ్వలేకపోవడంతో పీఎఫ్ సొమ్మును వాడుకున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాకపోవడం.. సంస్థ నిర్వహణకు అవసరమైన సొమ్ము ఖజానాలో లేకపోవడంతో కార్మికుల భవిష్య నిధిని పక్కదారి పట్టించినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.
 
 తాజాగా ఈ వ్యవహారం బయటపడటంతో కార్మికులు, వారి కుటుంబ సభ్యులు అయోమయంలో పడ్డారు. మూడు నెలలుగా ఒకరిద్దరికి మినహా మిగతా వారందరికీ రిక్తహస్తం చూపుతుండటంతో ఆయా కుటుంబాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనాల్సి వస్తోంది. ఇప్పటికే కార్మికుల దరఖాస్తులు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. ఇప్పటి వరకు 6500 దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. పీఎఫ్ సొమ్ము అవసరానికి అందకుండాపోయేసరికి అత్యవసర పరిస్థితుల్లో కార్మికులు అప్పులపాలు కావాల్సి వస్తోంది. ఉద్యోగుల భవిష్యత్తు అవ సరాలకు ఉద్దేశించిన మొత్తాన్ని దుర్వినియోగం చేస్తే శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు. సాధారణ ఉద్యోగి పీఎఫ్‌ను కాజేస్తే చట్టప్రకారం శిక్షిస్తారు. కానీ కార్మికుల అనుమతి లేకుండా వారి కష్టార్జితాన్ని ఆర్టీసీ యాజమాన్యం దర్జాగా వాడేసి చోద్యం చూస్తోంది. ఈ విషయంపై ఆర్టీసీ ఉన్నతాధికారులను ‘సాక్షి’ వివరణ కోరగా సమాధానం చెప్పేందుకు నిరాకరించారు.
 
 ఇంత దారుణమా?: నాగేశ్వరరావు, ఎన్‌ఎంయూ అధ్యక్షుడు
 
 కార్మికులు దాచుకున్న సొమ్మును ఆర్టీసీ వాడుకోవటం దారుణం. కేంద్రం కల్పించిన హక్కును కాలరాసినట్టే. దీన్ని మేం తీవ్రంగా పరిగణిస్తున్నాం. వెంటనే ఆర్జీసీ యాజమాన్యం ఆ మొత్తాన్ని భవిష్య నిధి ట్రస్టుకు జమ చేయాలి. తాము దాచుకున్న మొత్తాన్ని కూడా కార్మికులు పొందలేని పరిస్థితిని కల్పించడం క్షమార్హం కాదు.
 
 కార్మికులను దగా చేయడమే: దామోదర్ రావు, ఈయూ నేత
 
 భవిష్యత్తు అవసరాల కోసం దాచుకున్న సొమ్మును వాడుకోవడమంటే కార్మికులను దగా చేయడమే. ప్రభుత్వం రీయింబర్స్ చేయాల్సిన రూ. 750 కోట్లను విడుదల చేయకపోవడమే దీనికి కారణమని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి కార్మికులను అప్పుల పాలు చేసే ఈ పరిస్థితిని చక్కదిద్దాలి. లేకుంటే ఉద్యమిస్తాం.
 
 ఇదీ ఆర్టీసీ దుస్థితి!
 
 - 2013-14 ఆర్థిక సంవత్సరంలో సంస్థ రికార్డు స్థాయిలో రూ. 902 కోట్ల నష్టాలను చవిచూసింది. ఇందులో తెలంగాణ వాటా రూ. 212 కోట్లు.
 - ఆర్టీసీ ప్రారంభమైన ఈ ఎనిమిది దశాబ్దాల కాలంలో ఇంత భారీ నష్టాలు రావడం ఇదే ప్రథమం.
 - గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ఆర్టీసీ రూ. 3742 కోట్ల ఆదాయాన్ని పొందింది. ఇది అంతకుముందు ఏడాది కంటే రూ. 335 కోట్లు మాత్రమే ఎక్కువ. కాగా, ఖర్చు పద్దు కింద రూ. 3950 కోట్లను చూపారు. ఇది అంతకుముందు సంవత్సరం కంటే రూ. 537 కోట్లు అధికం.
 - ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే భారీ నష్టాలు మొదలయ్యాయి. ఏప్రిల్ నెలలోనే రూ. 14.50 కోట్ల నష్టం వచ్చింది.
 - బస్సు పాస్‌లకు సంబంధించి ఆర్టీసీ ఇచ్చే రాయితీ మొత్తాన్ని ప్రభుత్వం రీయింబర్స్ చేయాల్సి ఉంటుంది. రూ. 775 కోట్ల మేర ఈ బకాయిలు పేరుకుపోయాయి.
 - డీజిల్ ధరలు కూడా ఆర్టీసీకి భారంగా మారాయి. ప్రస్తుతం సంవత్సరానికి రూ. 1150 కోట్లు డీజిల్‌కే ఖర్చవుతోంది.
 - కార్మికుల కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి ఆర్టీసీ ఇప్పటికే రూ. 243 కోట్లు బకాయిపడింది.
 - ఇక ఇప్పటి వరకు ఆర్టీసీ చేసిన అప్పులురూ. 4800 కోట్లకు చేరుకున్నాయి.
 
 
 ‘‘కరీంనగర్‌కు చెందిన ఆర్టీసీ కార్మికుడు లక్ష్మణ్ తన కూతురి పెళ్లి కోసం పీఎఫ్ డబ్బులు కోరుతూ దరఖాస్తు చేశాడు. కానీ అవి చేతికి అందకపోయేసరికి అప్పు చేసి పెళ్లి తంతు ముగించాడు. హైదరాబాద్‌కు చెందిన ముజీబ్ తండ్రి అనార్యోగానికి గురికావడంతో ఆసుపత్రి ఖర్చు కోసం పీఎఫ్‌కు దరఖాస్తు చేశాడు. కానీ నయాపైసా రాకపోవ డంతో బంగారం తాకట్టుపెట్టి ఆసుపత్రి బిల్లు చెల్లించాడు. ఈ పరిస్థితి వీరిద్దరికే పరిమితం కాలేదు. దాదాపు 6,500 మంది ఆర్టీసీ కార్మికులు.. పీఎఫ్ డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. వారి భవిష్య నిధిని ఆర్టీసీ యాజమాన్యం అక్రమం గా వాడుకోవడమే ఈ పరిస్థితికి కారణం’’.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement