
న్యూఢిల్లీ : ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) వాట్సాప్ హెల్ప్ లైన్ సేవను ప్రారంభించింది. చందాదారుల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించే లక్ష్యంతో ఈ సేవను తీసుకొచ్చినట్టు కార్మిక శాఖ తన ప్రకటనలో తెలిపింది. ఈపీఎఫ్ఓ ఇప్పటికే ఫిర్యాదుల పరిష్కారానికి ఈపీఎఫ్ ఐజీఎంఎస్ పోర్టల్, సీపీజీఆర్ఏఎంఎస్, సామాజిక మాధ్యమ వేదికలైన ఫేస్ బుక్, ట్విటర్ ద్వారా సేవలు అందిస్తుండడం గమనార్హం. వాట్సాప్ సేవలు వీటికి అదనం. వారంలో అన్నిరోజులు, రోజులో 24 గంటల పాటు సేవలు అందించే కాల్ సెంటర్ కూడా అందుబాటులో ఉంది.
‘‘సభ్యులకు మరింత సౌకర్యార్థం ఈపీఎఫ్ఓ తాజాగా వాట్సాప్ ఆధారిత హెల్ప్ లైన్, ఫిర్యాదుల పరిష్కార విభాగాన్ని ఏర్పాటు చేసింది. కరోనా సమయంలో సభ్యులకు ఎటువంటి ఆటంకాల్లేని సేవలు అందించడమే దీని లక్ష్యం’’ అని కార్మిక శాఖా తన ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న 138 ఈపీఎఫ్‌ఓ ప్రాంతీయ కార్యాయాల పరిధిలో వాట్సాప్ హెల్ప్ లైన్ పనిచేస్తుంది. సభ్యులు ఈపీఎఫ్ఓ సేవకు సంబంధించి ఏ విచారణ అయినా వాట్సాప్ నంబర్‌కు మెస్సేజ్ పంపించడం ద్వారా వివరాలు, సాయం పొందొచ్చు. ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్ పోర్టల్ లో ప్రాంతీయ కార్యాలయాల వారీగా వాట్సాప్ నంబర్ల వివరాలను పేర్కొన్నట్టు ఈపీఎఫ్ఓ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment