భవిష్య నిధి అందేదెప్పుడు?.. ఆర్థిక శాఖ వద్దే పెండింగ్‌..   | Employees Provident Fund Money Is Not Received On Time | Sakshi
Sakshi News home page

భవిష్య నిధి అందేదెప్పుడు?.. ఆర్థిక శాఖ వద్దే పెండింగ్‌..  

Published Tue, Oct 4 2022 1:57 PM | Last Updated on Tue, Oct 4 2022 2:41 PM

Employees Provident Fund Money Is Not Received On Time - Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ జిల్లా కి చెందిన వారిద్దరే కాదు రాష్ట్రంలో జిల్లా పరిషత్‌ల పరిధిలో పనిచేసే ఉద్యోగులు భవిష్యత్తులో తమ అత్యవసరాల కోసం దాచుకున్న భవిష్య నిధి డబ్బులు సకాలంలో అందడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష మంది జెడ్పీ పాఠశాలల ఉపాధ్యాయులు, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ పరిధిలోని నాన్‌ ఇంజనీరింగ్‌ సిబ్బంది తమ వేతనంలో కొంత మొత్తాన్ని జిల్లా పరిషత్‌ జీపీఎఫ్‌ ఖాతాలో దాచుకుంటున్నారు. తమకు అవసరమైన సందర్భంలో దాచుకున్న దానిలో 50 శాతం వినియోగించుకోవచ్చు. కానీ ఉద్యోగులు తమ పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఇతర భవిష్యత్‌ అవసరాల కోసం దాచుకున్న తమ డబ్బులను తీసుకునేందుకు ఎదురు చూడక తప్పడంలేదు.
చదవండి: భర్తలేని సమయంలో మహిళా సీఐ ఇంట్లో మరో​ సీఐ.. అసలేం జరిగింది?

తగ్గించినా ఇవ్వని పరిస్థితి 
రాష్ట్రంలో 2004 సెప్టెంబరు 1వ తేదీ కంటే ముందు నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానం అమలవుతోంది. వారికి జీపీఎఫ్‌లో డబ్బులు దాచుకునే అవకాశం ఉంది. అలాంటి వారంతా తాము దాచుకున్న డబ్బులో వారి అత్యవసరాల కోసం అందులోని డబ్బును డ్రా చేసుకొని వాడుకునే వీలుంది. గతంలో ఇది 70 శాతం వరకు తీసుకునే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఆ తరువాత 50 శాతానికి తగ్గించింది. ఆ మొత్తాన్ని కూడా సకాలంలో ఇవ్వడం లేదు.

రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది ఉద్యోగులు 
రాష్ట్ర వ్యాప్తంగా జీపీఎఫ్‌ పరిధిలోకి వచ్చే ఉద్యోగులు దాదాపు లక్ష మంది ఉన్నారు. అన్ని జిల్లాల పరిధిలోని ఉద్యోగులు దాచుకున్న సొమ్ము రూ.వేయి కోట్ల వరకు భవిష్య నిధి కిందే ఉంది. ఆ మొత్తాన్ని దాచుకున్న వారిలో ఒక్క ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే 9వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఆ సొమ్ము దాదాపు రూ.200 కోట్లు ప్రభుత్వం వద్దే ఉంది. వారిలో 395 మంది తమ అవసరాల కోసం డబ్బును ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. వారికి దాదాపు రూ.20 కోట్లు చెల్లించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం గత మార్చి నాటికే డబ్బులను మంజూరు చేసింది. ఆ తరువాత ఏప్రిల్‌ నుంచి డబ్బులు మంజూరు చేయలేదు. దీంతో వారంతా జిల్లా పరిషత్‌ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు.

ఆర్థిక శాఖ వద్దే పెండింగ్‌.. 
ఉద్యోగులు భవిష్య నిధి పొందేందుకు ఉమ్మడి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్‌లో దరఖాస్తులు చేసుకున్నారు. సంబంధిత జిల్లా పరిషత్‌ జీపీఎఫ్‌ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆన్‌లైన్‌ చెక్కులను కూడా సిద్ధం చేసి ఆర్థిక శాఖ ఆమోదానికి çపంపించారు. అవన్నీ అక్కడే ఆగిపోయాయి. గతంలో జిల్లా స్థాయిలోనే మంజూరు చేసినా ‘ఈ కుబేర్‌’విధానం వచ్చాక ఆర్థిక శాఖ పరిధిలోకి వెళ్లిపోయింది. జిల్లాల నుంచి వచ్చే ప్రతిపాదనలను ఆర్థిక శాఖ అధికారులు పరిశీలించి సీరియల్‌ ప్రాతిపదికన మంజూరు చేస్తుండటంతో తీవ్ర జాప్యం తప్పడం లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement